ఏ అబల చరిత్ర చూసినా ఏమున్నది? గర్వకారణం…
ఆమె ముందు పశుబలం బలాదూర్!
మగాడి సంతోషానికామె సమిధేనోయ్!
కొండొకచో దౌష్ట్యానికామె బలిపశువేనోయ్!
వైద్యురాలిగా సేవలు చేసే చేతుల కన్నా ఆమె లోనున్న అవయవాలే కనపడితే?
ఎక్కడ దాచుకోవాలి వాటినామె?
సాటి మగాళ్ళ ముఖాలెక్కడ దాచుకున్నారు?
ఇదేనా? నాగరికత?
ఇదేనా? ఈ శతాబ్దపు ఉన్నతి?
ఎందరు దిశలు? ఎందరు నిర్భయ్ లైతే కామదాహం తీరుతుందీ? పురుష లోకానికి?
కరుకు గుండెలకు తల్లులే లేరా?
రోగుల ఆర్తనాదం వింటూనే…
హుటాహుటిన పరిగెత్తే వైద్యురాలి ఆర్తా నాదమే వినపడలేదా?
ఆమె కంటిలో గుచ్చుకున్న అద్దపు బాధ కంటే…గుండెల్లో గుచ్చుకున్న పర పీడనం ఎంత బాధించిందో?
అంతా జరిగాక అన్నీ కోల్పోయాక మా పళ్ళు పటపట లాడిస్తే ఆమె కొరిగేదేమీ లేదు!
ఎందరికో ప్రాణాలు పోసిన
ఆమె మెడలోని స్టెతస్కోప్ వాడి పాలిట యమపాశమైతే ఎంత బాగుండు?
ఊరికే ఊకదంపుడు నాకవిత
ఆమె ఊపిరి కాపాడలేకపోయినా…
మరో చెల్లెలికీ ఇలా కావొద్దని ప్రార్ధిస్తున్నా…
నా ఊపిరి భారంగా తీస్తూ
అశ్రు తర్పణం విడుస్తున్నా!
ఆమె కంటి నీటిని ఆపలేకపోయాననే నా కంటినీటిని ఆపలేకపోతున్నా…