మేము శానా నీటు…!!

రమక్క తో ముచ్చట్లు -6

       రమాదేవి కులకర్ణి

శనార్థులు.
మన దేశం 78వ జెండా పండుగ జేసుకుంటుంది. మనకు స్వతంత్రం వచ్చి 78 ఏండ్లు అయింది ఇంకా మనం నేర్వాల్సింది. దేశం గురించి పట్టించుకోవాల్సింది, ఫికర్ జెయ్యాల్సింది చాన ఉంది. ఔను అంటరా..! లేదంటరా..!
నాకైతే మనకి లాపర్వ ఎక్కువ అనిపిస్తది. రేపట్కి ఏంది అన్న సోయి జర తక్కువ మనకు. ఈ పొద్దు గట్ట గడిస్తే సాలు, పూర్తిగా ఎట్లుంటరంటే కొందరు
” ఉన్ననాడు వైకుంఠం లేనినాడు ఊకుంటం ” తీరు. 2020ల గత్తర లేసి దునియా మొత్తం లబ్బ లబ్బలాడింది.
అప్పుడు కొన్ని రోజులు అందరూ మస్తు ఆగమాగం చేసిండ్రు. ఓ.. చేతులు కడిగిన్రు, మూతులు కడిగిండ్రు, గిన్నెలు కడిగిండ్రు,కూరగాయలు కడిగిండ్రు, ఉప్పు సుత కడిగిన్రు.
కతం ఇగ, దునియా సల్ల వడ్డది. మనం గుడ సల్లవడ్డం. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్ననంటే… మా కాలనీల పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నయి. మస్తు సదువుకున్నోళ్లు పెద్దపెద్ద నౌక్రీల్ శెసేటోల్లే ఉన్నరు. రాత్రి అయిందంటే సాలు, చెత్తనంత మంచిగ ప్లాస్టిక్ కవర్లల్ల సుట్టి యాడ ఖాళీ ఉంటే ఆడ ఇసిరిపోతరు. ఇగ ఏదన్న ప్లాటు ఖాళీగా ఉందనుకోండి.. డంపు యార్డ్ జేసి వడేస్తరు. ఒక పెద్ద మేడం ను అడిగిన నేను “ఎందుకు మేడం గట్ల వడేస్తరు దోమలు వస్తయి, బీమార్లు అయితయి, చెత్త తీసుకపోయేటోల్లకి ఇయొచ్చు కదా ” అంటే ఆ మేడము నా బేజ తిరిగిపోయే జవాబు ఇచ్చింది. ” ఒక 300 వేస్ట్ ఆలకిచ్చుడు ఎందుకు ఖాళీగానే ఉంది గదా పడేస్తే వాయే, అంత అవుస్రమైతే. కార్పొరేటర్ క్లీన్ చేపిత్తడు అది ఆయన బాధ్యత” అన్నది. ‘ రాతిరి యాళ్ళ మా ఇంటాయన పడేత్తడు తీయ్, ఆయనకు వెట్టిన ఆ డూటి అన్నది. గట్టిగ కాన్ బైరి ఇద్దామన్నంత కోపం అచ్చింది నాకు, గాని అన్సుకున్న. క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అని పెద్ద పెద్ద మాటల్ జెప్పి, ఫోటోలు దిగుడు స్టేటస్లు వెట్టుకొనుడు గాదు. నిజంగా మన బాధ్యత ఏంది? మన శుభ్రత ఏంది? మనమేం జెయ్యాలి అనే సోయి ఉండాలి. ” మురికి తీసుడు మున్సిపాలిటీ వాల్ల బాధ్యత అని ఊకోని మనం ఏడంటే ఆడ మురికి నింపుకుంటా పోవద్దు. “చెత్త, చెత్త కుండీలు ఉండాలె, మన దిమాక్ల గాదు. ”
సోకు తయారయ్యి ఇస్త్రీ బట్టలేస్కోని, సెంటు కొట్టుకొని పోతే అయిపోదు, చుట్టుపక్కల పరిసరాలు గూడ సుభ్రంగ వెట్టాలె, మన చెత్త తీసుకపోయి అండ్ల కల్పకపోతే సాలు అదే పెద్ద మేలు. సుట్టుపొంటి సుబ్రం పెట్టుకునుడు మన బాధ్యత.
అన్ని సర్కార్ మీద నూకొద్దు. నా ఇల్లు నా ఆకిలి సుబ్రం ఉంటే సాల్ తీ అయిపోతది అనుకోవద్దు. ఈగలు దోమలు డెంగు రోగాలు అన్ని దేనికెల్లస్తయి.. శెత్త నుంచెల్లె గద..!
ఒక ముచ్చట అనుకుందాం.. నువ్వు బస్టాండ్ లో కూసున్నవ్ అనుకో.. ఆడ అప్పటికే మస్తు శెత్తాచెదారం పడిందనుకో.. “ఏ గింత శెత్త ఉంది నాకేంది అని నువ్వు సుత పల్లీలు దిని, అవి దిని.. ఇవి దిని ఆడ పొట్లాలు వడేశి ఇంకింత గలీజు జెయ్యకు తమ్మీ..!” మన పొట్టేగాండ్లకు సుత గిదే నేర్పాలే మనం. ఉన్న చెత్త ఊడ్వాలే కానీ ఇంకింత ఖరాబ్ జెయ్యొద్దు. మన భారత దేశంల చెత్త ఊడ్సుడు శాన పెద్ద కతనే ఉన్నది.
రోడ్లు, నదులు, గల్లీ లల్ల,న పబ్లిక్ ప్లేస్ లల్ల, పర్యాటక స్థలాలల్ల, గిట్ల ఏడ వడ్ ఆడ…గుడి లేదు, గుండారం లేదు మనోల్లకు.సూడ నీకే శీపతి. సమాజం మీద సోయి ఉండదు.

భారతదేశంల పరిసరాల శుభ్రతను కాపాడనీకి, రక్షణకు వివిధ చట్టాలు అమల్ల ఉన్నయనిఎందరికి ఎరుక యారో..!!??ఇవి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, మరియు ప్రజల ఆరోగ్యంను కాపాడనీకి పనిజెస్తయంట.
పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 (Environment Protection Act, 1986)
ఈ చట్టం ప్రకారం, పర్యావరణ కాలుష్యం తగ్గియ్యనికి మరియు పరిసరాలను సుభ్రంగ ఉంచనీకి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకోవాలే అంట..!

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలు, 2016 (Plastic Waste Management Rules, 2016)
ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించుడు,ప్రాసెసింగ్ చేసుడు,, మల్ల ఇంగ వ్యర్థాల నిర్వహణకు సుత నిబంధనల అమలు ఉందంట శెల్లె..!

ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 (Solid Waste Management Rules, 2016)
వ్యర్థాలను ఎట్ల సేకరించాలే, ఆటిని దేనికది ఎట్ల తియ్యాలె వంటివి నేర్పుతదంట.

ప్రజా ఆరోగ్య చట్టం (Public Health Act)సూసిన్రా గిట్ల మన ప్రజలందరి ఆరోగ్యం కోసం సుత చట్టం ఉంది. అది శానా మందికి ఎరుకనే లేదు.
స్వచ్ఛ భారత్ అభియాన్ (Swachh Bharat Abhiyan). ఇది దేశం ల ఉన్న అందరు ఈ చట్టము అందరూ తందురుస్తు ఎట్లుండాల్నొ నేర్పుతదంట అందరికి. ఇది భారత ప్రభుత్వం దేశవ్యాప్త శుభ్రతా అభియానం. ప్రభుత్వాలు మల్ల పౌరుల భాగస్వామ్యంతోని పరిసరాలను శుభ్రంగా ఉంచుడు ఇంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుడు జేస్తది.

ప్రకృతి రక్షణ చట్టం, 1972 (Wildlife Protection Act, 1972) :- ప్రకృతిని కాపాడుతేనె మనకు దిక్కు దివాణం ఉంటది. దానీ మీదనే మనకు మస్తు
లాపర్వా ఉంటది. ఈ చట్టం జెర గట్టిగ అమలు జేయ్యాలి అంట నేను..!
దీని పని ప్రకృతిలో ఉన్న సుచి, సుభ్రతను మల్ల జీవవైవిధ్యాన్ని
కాపాడుడు లక్ష్యం.
జలాల పరిరక్షణ చట్టం, 1974 (Water (Prevention and Control of Pollution) Act, 1974). ఇగ ఈ చట్టం సూడుండి ఎంత ఇంపార్టెంట్ మనకి, మంచినీళ్లు కరువై కొంటున్నము. వాగులు,నదులు, సముద్రాలు అన్నింటిని ఖరాబ్ జేయ్యనీకే మనం పుట్టినం. అస్సలు సోయి లేని జన్మ మనిషిది. పూర్తాగ ప్లాస్టిక్ చెత్త చెదారము, ఇంకా ఫ్యాక్టరీల కాలుష్యం మొత్తం నదులల్ల ఇడుస్తము. సుబ్రమైన నీల్లు యాడికెల్లి అస్తయి మనకు.

నీటి కలుషితంను నియంత్రించనీకి ఈ చట్టం అమల్ల ఉందంట.
చట్టాలు అయితే మస్తుగనే ఉన్నయి
కానీ వాటిని అమలు లోకి తెచ్చుడే చానా కష్టం దునియాల అనిపిస్తుంది నాకు.
అతిక్రమణ చేసినోళ్ళకి శిక్షలు సుత ఏస్తరట. ఎవల్లకు ఏసిండ్రు తెలియదు గాని ఎయ్యాలె, ఏస్తేనే మనుషులు మారుతరు.
చట్టాల సంగతి పక్కన వెడితే,
ప్రతి ఒక్కల్లు పరిసరాలను పరిశుభ్రంగ ఉంచుకునుడు సమాజాసేవ, అనుకోవాలే..! దేవుని పూజ కన్న గొప్పది ఇది. . ఇంట్ల, ఆఫీసులల్ల,, బడులు హోటల్లు బస్టాండ్లు పార్కులు ఏడైనా సరే మనం గలీజ్ చేయని కాదు అవి ఉన్నయి. వాటిని కాపాడుకోవాలి అవన్నీ మనకోసమే ఉన్నయి కదా..! , చుట్టుపక్కల సుభ్రంగ ఉంటే మన జీవిత ప్రమాణం పెరుగుతది.
సుభ్రత, అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ప్రశాంతతను తెస్తది. అందుకే, పరిసరాల సుభ్రత మనందరి బాధ్యత మనందరం కూడా తందరుస్తూ ఉండాలె కదమ్మ.
నిజంగ మీకు నా ముచ్చట గిట నచ్చితే… ఉన్న చెత్తను సాఫ్ చేయకున్న సరే గానీ, ఇంట్ల చెత్త తీసుకపొయ్యి బయట పారఒయ్యకుండి.గదే పదివేలకు బరాబర్ అయితది. నేను శానా నీట్ అనుకునేటోళ్లు సుట్టుపక్కల సుత నీట్ వెట్టుండి.
ఉంటమరి అయిదింపులు అత్తున్నయ్.

పైలం మరి

మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దేశభక్తిపాట

ఎడారి కొలను