మంగళ పాండే ధిక్కారం
తొలి అడుగై
దారి చూపింది !
భగత్ సింగ్ చైతన్యం
అగ్ని కెరటమై ఎగిసింది!
నేతాజీ పౌరుషం
అజాద్ ఫౌజై రగిలింది!
వల్లభాయ్ స్థైర్యం
ఉక్కు నరమై బిగిసింది!
లజపతిరాయ్ ధైర్యం
కండ బలమై ఉరిమింది!
మాన్య తిలక్ స్వరాజ్యం
జన్మహక్కై చాటింది!
ఝాన్సీ లక్ష్మీ పరాక్రమం
తిరుగుబాటై ఎగిసింది!
గాంధీజీ శాంతి వచనం
సత్యాగ్రహమై నినదించింది !
నెహ్రూజీ లౌక్య వర్తనం
శాంతి కపోతమై ఎగిరింది!
అంబేద్కర్ దౌత్య వర్తనం
భారత ప్రజ్ఞను చాటింది!
బంకింగ్ చంద్ర అక్షరగళం
వందేమాతరమై సాగింది!
రవీంద్రుని దేశభక్తి
జాతీయ గీతమై నిలిచింది!
అల్లూరి మన్య విప్లవం
అగ్గిబరాటై జ్వలించింది!
టంగుటూరి
గుండె నిబ్బరం
తిరస్కారమై ఉరిమింది !
భరత మాత విముక్తి కోసం
బానిసత్వం అంతం కోసం
సహాయ నిరాకరణ
చట్టాల తిరస్కారం
విదేశీ వస్తు బహిష్కరణ
క్విట్ ఇండియా
ఎన్నెన్నో ఘట్టాలు
మరెన్నో త్యాగాలు!
స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని
నరనరాల్లో నింపుకుందాం
సమర యోధుల పోరాటాన్ని
అణువణువునా జీర్ణించుకుందాం!
భారత మాతాకీ జై
స్వేచ్ఛా భారత్ కీ జై