నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం – 8వ భాగం

జరిగిన కథ…

అర్జున్, సుభద్ర పిల్లల కోరిక మీద అమెరికాకు వస్తారు. ముందుగా కొడుకు అభిమన్యు దగ్గరకు మినియాపోలీస్ వస్తారు. అక్కడ సీనియర్ సెంటర్ ఉందని, అందులో చాలా కార్యక్రమాలు సీయర్ సిటిజెన్ కోసం నిర్వహిస్తుంటారని వాకింగ్ ఫ్రెండ్ పటేల్ ద్వారా తెలుసుకొని అందులో చేరుతారు. ఇంటికి వచ్చిన హాండీమాన్ బిల్ తో కబుర్లు చెపుతూ అతని గురించి తెలుసుకుంటారు.ఆ వీకెండ్ మినటొంకా లేక్ లో క్రూజ్ కు బుక్ చేస్తుంది కోడలు శశి. కూతురు స్పూర్తి తండ్రికి మినియాపోలీస్ చరిత్ర చెప్పి, ఇంకా అక్కడ ఏమేమి చూడాలో చెపుతుంది. మినటొంకా లేక్ మీద క్రూజ్ కు వెళతారు. అక్కడ శశి అత్తగారికి సర్ప్రైజ్ పుట్టినరోజు పార్టీ ఇస్తుంది.

ఇక చదవండి…

అర్జున్ లేచి, ఇంకా మత్తుగా మెసులుతున్న సుభద్ర, మీది కంఫర్టర్ తీసాడు. ఒక్కసారిగా లేచింది సుభద్ర. నిద్ర మత్తు, గాభరాతో తూలుతున్న సుభద్రను పట్టుకొని, నడిపిస్తూ, “డాడీ బయటకు పదండి” అన్నాడు అభి.

“ఏమైయిందిరా?” గాభరాగా అడిగారు ఇద్దరూ!

“ఫైర్ అలారం మ్రోగుతోంది. లోపల ఎక్కడోఅంటుకుందో, వైర్ లూజ్ అయ్యిందో ఏమో మరి. ముందు తొందరగా బయటకు వచ్చేయండి” అన్నాడు గాభరాగా.

అప్పటికే పిల్లలిద్దరూ బయట వేసి ఉన్న కుర్చీలలో ముడుచుకొని, నిద్రకళ్ళతో కూర్చున్నారు.  శశి సెల్ లో ఎవరితోనో మాట్లాడుతోంది. వాళ్ళ హడావిడి చూసి, ఇంక ఏమీ ప్రశ్నించకుండా అక్కడే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుంది సుభద్ర. అర్జున్ మౌనంగా నిలబడి వాళ్ళను చూస్తున్నాడు. ఇంతలో గణగణా అంటూ ఫైర్ ఇంజన్ వచ్చింది. అభి, శశి వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో లోపలికి వెళ్ళారు. అర్జున్ కూడా వాళ్ళ వెనుకే వెళ్ళాడు. వాళ్ళు పక్క గదిలోకి వెళ్ళారు. అర్జున్ బెడ్ రూం లో నుంచి రెండు కంఫర్టర్స్ తెచ్చి, చలికి వణుకుతూ ముడుచుకొని కూర్చొని ఉన్న పిల్లలకు,సుభద్రకు ఇచ్చి, మళ్ళీ లోపలికి వెళ్ళాడు. సుభద్ర లేచి పిల్లలకు కప్పి, తనూ కప్పుకుంటూ చుట్టూ చూసింది. కొంచం చీకటిగా, కొంచం వెలుతురు వస్తూ, ఆకాశం నలుపు, నీలం బూడిద కలగలుపు రంగులో మసకమసకగా ఉంది. సన్నగా వీస్తున్న చలిగాలికిపక్కన ఉన్న పొదలు  గాలికి కదిలినప్పుడల్లా గాలి చల్లగా తగిలి కొద్దిగా వణికిస్తోంది.

ఆకాశ్, సుభద్ర దగ్గరగా కంఫర్టర్లోకి జరిగి, సుభద్ర భుజం మీద తలానించుకొని, “ఏమయింది బామ్మా?” అడిగాడు.

“ఏమో కన్నా, నాకూ తెలియటం లేదు” అంది సుభద్ర ఆవలిస్తూ.

“ఫైర్ అలారం మ్రోగింది. లోపల ఎక్కడో ఫైర్ అంటుకుంది” జవాబిచ్చింది ఆరాధ్య.

“ఏమిటీ మంటనా? అంటుకుందా? అమ్మో” అప్పటి వరకూ అదేమిటో పూర్తిగా అర్ధంకాకుండా ఉన్న సుభద్ర గుండెల మీద చేయి వేసుకొని భయంగా అంది సుభద్ర.

“ఎక్కడా ఏమీ అంటుకున్నట్లు లేదు. ఏమయిందో చెక్  చేస్తున్నారు. భయపడకండి” అప్పుడే బయటకు వచ్చి అన్నాడు అభి.

“మరి ఫైర్ అలారం ఎందుకు మ్రోగిందిరా? అయినా అలారం మ్రోగుతే భయపడనవసరం లేదన్నావుగా?” అడిగింది సుభద్ర.

“ఎందుకు మ్రోగిందో చెక్ చేస్తున్నారు. నువ్వు వంట చేసేటప్పుడు మ్రోగితే, అప్పుడు పోపులో నుంచి వచ్చే పొగకు మ్రోగిందని మనకు తెలుసు కాబట్టి భయపడవద్దన్నాను. మనం పడుకున్నప్పుడు మ్రోగితే ఏమయిందో తెలియదు కదా? ఇప్పుడేమీ భయం లేదు. మొత్తం ఇల్లు చెక్ చేయటానికి టైం పడుతుంది. ఎందుకైనా మంచిది ఇక్కడే కూర్చోండి” అని చెప్పి లోపలికి వెళ్ళాడు.

చలిగాలికి వణుకుతున్న మనవడిని దగ్గరగా  పొదుపుకొని, చుట్టూ కంఫర్టర్ కప్పింది సుభద్ర. దాదాపు రెండుగంటల పైననే ఇల్లంతా సోదా చేసారు అగ్నిమాపకదళం వారు. అంతసేపూ వారి వెనకాతలే అర్జున్, శశి, అభి తిరిగారు. బయట కూర్చున్న సుభద్రకు, పిల్లలకు బై అని చేయి ఊపివాళ్ళు వెళ్ళిపోయారు.అప్పటికి తెల్లగా తెల్లారిపోయింది.

“ఇంక లోపలికి రండి. ఫైర్ ఏమీ లేదు” అన్నాడు అభి వచ్చి.

“మరి ఇంతసేపు ఏమి చేసారు? డాడీ, శశి ఏరీ?” మనవడిని లేపుతూ అడిగింది సుభద్ర.

“అలారంలలోనే బ్యాటరీలు అయిపోయాయట. ఎందులో అయిపోయాయోనని అన్నీ తీసి చూసారు. అందుకే ఇంత సేపు పట్టింది. అసలు ప్రాబ్లం ఏమిటో తెలియకుండా లోపలికి ఎందుకని మిమ్మలిని లోపలికి పిలవలేదు. ఇక వచ్చి ఫ్రెషప్ అవండి. డాడీ, శశీ వాష్ రూం లోకి వెళ్ళారు” అన్నాడు అభి.

“ఏమిటో బాబూ! ఈ అలారంలేమిటో, ఏమో?మరి బాటరీలు వేసారా?” అనుకుంటూ లేచింది.

“మన దగ్గర ఉన్నవి వేసారు. ఇంకా కొన్ని వేయాలి.పెద్దసైజ్ వి లేవు. తెచ్చి వేస్తాను. మధ్యమధ్య కుయ్… కుయ్… అని చప్పుడు వస్తుంది కానీ భయపడకు” అమ్మకు సమాధానమిస్తూఅభి ఆకాశ్ ను లోపలకు నడిపించుకెళ్ళాడు. ఆరాధ్యను లేపి,పట్టుకొని, చిన్నగా లోపలికి నడిపించింది సుభద్ర.

సుభద్ర ఫ్రెషప్ అయివచ్చేసరికి, అభి, అర్జున్ కాఫీ తాగుతున్నారు. “మామ్ నీకూ ఇస్తాను. నువ్వు ఇటు కూర్చో” అని అభి సుభద్రకు కూడా కాఫీ తీసుకొచ్చాడు. కాఫీ తాగుతూ, గ్లాస్ తలుపు దగ్గర నిలబడి, బాక్ యార్డ్ లోకి చూస్తోంది సుభద్ర.

“ఏమిటోయ్ నీ ఫ్రెండ్స్ వచ్చాయా?” అడిగాడు అర్జున్.

“ఏదీ ఇంకా రాలేదు” అంటూ కప్ సింక్ లో పెట్టి చుట్టూ చూసింది. నిన్న రాత్రి వచ్చేసరికే ఆలశ్యం అయిపోయింది. ఇక ఎవరికీ ఓపిక లేక డిష్ వాషర్ అన్ లోడ్ చేయలేదు. తిన్న ప్లేట్స్, గిన్నెలన్నీ సింక్ లో అలాగే ఉన్నాయి. పొద్దుటి హడావిడికి అందరూ నీరసించి, ఆకలితో ఉన్నారు. ముందు ఏదైనా బ్రేక్ ఫాస్ట్ చేసి గిన్నెలు సద్దుదామనుకొని కిచన్ లోకి వెళ్ళింది. అభి, అర్జున్ స్నానం చేసి వస్తామని వెళ్ళారు. తొందరగా అవుతుందని ఉప్మా చేసి టేబుల్ మీద సద్ది, తనూ స్నానానికి వెళ్ళింది.

శశి తల తుడుచుకుంటూ వచ్చి, “ఓ ఉప్మా చేసేసారా? ఆరీ, చింటూ బామ్మ ఉప్మా చేసింది. వేడివేడి ఉప్మా తిందురుగాని రండి” పిల్లలనుపిలిచింది.

సుభద్ర స్నానం, ధ్యానం చేసుకుని వచ్చేసరికి, అభి, అర్జున్, పిల్లలు టిఫిన్ తినేసారు. అర్జున్ ముందు రూం లో కూర్చుని సెల్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. శశి స్టవ్ దగ్గర ఉంది. ఆకాశ్ డిష్ వాషర్ లో నుంచి గిన్నెలు ధనాధడ్ అని చప్పుడు చేస్తూ తీసి కబొర్డ్స్ లలో పెడుతున్నాడు.

“అరే చిన్నూ, నువ్వు తీస్తున్నావెందుకమ్మా? జరుగు కన్నా, నేను తీస్తాను” అంది.

ఆకాశ్ బామ్మ వైపు, అమ్మ వైపు చూసి మళ్ళీ డిష్ వాషర్ లోకి తల దించేసాడు.

“మీరుండండి ఆంటీ. ఈరోజు డిష్ వాషర్ అన్ లోడ్ చేసే డ్యూటీ వాడిది” అంది.

“మనం ఉన్నాము కదా! వాడెందుకమ్మా తీయటం. నేను తీస్తానులే!” అంటూ ఆకాశ్ దగ్గరగా వెళ్ళింది సుభద్ర.

“లేదు బామ్మా, వాడిని తీయని. ఎప్పుడూ తప్పించుకుంటాడు” అంది ఆరాధ్య.

“ఎప్పుడు తప్పించుకున్నాను? తీస్తున్నాను కదా!” కోపంగా, ఉక్రోశంగా అరిచాడు ఆకాశ్.

ముడుచుకున్న మొహం, బుంగ మూతి, కోపం చూసి వాడు తెగ ముద్దు వచ్చేసాడు సుభద్రకు. “బుజ్జిగాడా” అంటూ వాడి దగ్గరకు వెళ్ళి ముద్దు పెట్టుకోబోయింది.

“డోంట్ కాల్ మీ బుజ్జిగాడు. ఐ యాం నాట్ అ కిడ్” అని కోపంగా బామ్మ చేయి తోసేసాడు.

“వదిలేయండి ఆంటీ. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. మీరు వాడిని గారాబం చేయకండి” అంది శశి.

ఆ హడావిడికి లోపలికి వచ్చిన అర్జున్ కు కూడా వాడిని చూస్తే ముద్దు వచ్చాడు.”ఈసారికి వదిలేయ్ అమ్మా” కోడలితో అన్నాడు.

“అంకుల్…”

“తాతా లాస్ట్ వీక్ కూడా వాడి డ్యూటీ అప్పుడు ఫ్రెండ్ వచ్చాడని వెళ్ళిపోతే నేను చేసాను. మరి ఈ వీక్ నా డ్యూటీ వాడు చేయాలావద్దా? కానీ మీరు వచ్చారని చేయలేదు. ఇప్పుడు చేయనీ” ఆవేశంగా అంది ఆరాధ్య.

“నువ్వు కూడా బామ్మాతాతా వచ్చారని చేయలేదు” అన్నాడు ఆకాశ్.

“అరీ… చింటూ…” శశి పిలుపు వినగానే ఇద్దరూ వాదన ఆపేసారు. అందరి వైపు కోపంగా చూసి గిన్నెలు తీయటం మొదలుపెట్టాడు.

“తల్లీపిల్లల మధ్య మనమెందుకోయ్! పదపద”పిల్లలిద్దరి వాదనను ముచ్చటగా చూస్తున్న సుభద్రతో నవ్వుతూ అన్నాడు అర్జున్.

“వంట నేను చేయనా శశీ?” అడిగింది సుభద్ర.

“లేదాంటీ. మీ మనవడు ఊరికెనే చేస్తున్నాడనుకున్నారా ఆపని? మాల్ ఆఫ్ అమెరికాకు తీసుకెళ్ళి రైడ్స్ ఎక్కిస్తానని వాళ్ళ డాడీ ప్రామిస్ చేసాడు. అందుకే చేస్తున్నాడు. మీరు టిఫిన్ తిని రెడీ అవండి. లంచ్ అక్కడే చేద్దాము” అంది శశి.

ఒక గంటలో పని ముగించుకొని అందరూ బయలుదేరారు.మాల్ ఆఫ్ అమెరికా చాలా పెద్దగా ఉంది. కాసేపు షాప్స్ చూసాక “లంచ్ ఏమి తింటారు?” అడిగాడు అభి.

“మీ ఇష్టం” అన్నాడు అర్జున్.

“మామ్,డాడ్ఇండియన్ తింటారా? లేకపోతే ఏదైనా వెరీటీ ట్రై చేస్తారా?” అడిగాడు.

సుభద్ర జవాబు చెప్పేలోపలే,”నాకయితే ఏదైనా పరవాలేదు. మనం ఏ స్థలం లో ఉన్నప్పుడు అక్కడి భోజనం రుచి చూడటం ఇష్టం. ఏం భద్రా నీకు ఇండియన్ ఫుడ్ కావాలా?” అడిగాడు.

“అలా ఏమీ లేదు. ఏదైనా వెజిటేరియన్” జవాబిచ్చింది.

“ఈ రెస్టారెంట్ లో జపనీస్ ఫుడ్ బాగుంటుంది. రుచి చూడండి ఆంటీ. మసాలా అవీ ఏమీ ఉండవు. మీకు నచ్చుతుంది” అంది శశి.

పొడవాటి డిష్ లో ఆకుపచ్చని ఆకులలో చుట్టి, చామాకు పొట్లాలకూరలా ఉన్న తెల్లని వాటిని చూపించి, “వీటిని ‘టెంపోరా’ అంటారు బాగుంటాయి తిను మమ్మీ. ఇవి ఇక్కడి స్పెషల్. ఇదో ఈ చట్నీలో అద్దుకొని తినాలి” అంటూ సుభద్ర ప్లేట్ లో వేసాడు అభి.

కొంచం నోట్లో పెట్టుకొని “ఓరినీ ఇవి అన్నం పకోడీలలా ఉన్నాయి కదరా! అబ్బో ఈ చట్నీ మహా ఘాటుగా ఉంది. అది వద్దులే” అని టెంపోరాలు తిన్నది సుభద్ర.

అందరూ లంచ్ చేసాక, పిల్లలను రైడ్స్ వైపు తీసుకెళ్ళారు. రకరకాల రంగులరాట్నం లాంటివి, ట్రేన్, ఇలా చాలా ఉన్నాయి. అక్కడ చాలా మంది పిల్లలతో ఉన్నారు. పిల్లల అరుపులు, కేకలతో, గోలగోలగా, బాగా రష్గా ఉంది.ఆ హడావిడి చూస్తూ, “నేను ఎక్కను. మీరు వెళ్ళండి. ఇక్కడెక్కడైనా కూర్చుంటాను”అందిసుభద్ర. శశి, ఆరాధ్య వేరేగా మాములుగా చిన్నగా తిరిగేవి ఎక్కుతామన్నారు. అర్జున్, అభి, ఆకాశ్ పెద్దవి ఎక్కుదామనుకున్నారు. టికెట్స్ కోసం క్యూ లో  చాలా సేపు పట్టింది. హైద్రాబాద్ లో ఎగ్జిబిషన్ లో ఉన్నట్లు ఉన్న ఆ రంగులరాట్నాలను, పిల్లల,పెద్దల సందడిని చూస్తూ అక్కడే ఉన్న  ఫౌంటెన్ దగ్గర బెంచ్ మీద కూర్చుంటూ చుట్టూ చూసింది సుభద్ర. పిల్లల అరుపులు కేరింతలతో ఆ ప్రదేశం సందడిగా ఉంది. ప్రపంచములోని సంతోషమంతా ఇక్కడే ప్రోది చేసుకున్నట్లుంది అనుకుంది సుభద్ర.”హేయ్ బామ్మా” కేక వినిపించిన వైపు చూసింది. గిర్రున తిరుగుతున్న పెద్ద రైలు లో కూర్చొన్న ఆకాశ్ చేయి ఊపాడు. బాబోయ్ చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఎట్లా ఎక్కారో అనుకుంది.దాదాపు రెండుగంటల తరువాత తాత, తండ్రి, మనవడు వచ్చారు. చాలా ఎక్సైట్ అయిపోయి, మొహమంతా సంతోషం పులుముకొని వచ్చిన మనవడిని దగ్గరకు తీసుకుంది. బాగా అరిచినట్లున్నాడు. మొహమంతా ఎర్రగా అయిపోయి, గసతీస్తున్న మనవడి మొహం కొంగుతో తుడిచింది. అప్పటికే వాళ్ళ రైడ్స్ పూర్తి చేసుకొని కాసేపు షాప్స్ చూసి వస్తామని వెళ్ళారు శశి, ఆరాధ్య. సుభద్ర నాకు ఓపికలేదు, నడవలేను అని అక్కడే కూర్చుండిపోయింది. వాళ్ళ కోసం కాసేపు ఎదురు చూసారు.

“హెలో ఎక్కడా?” అభి శశినిసెల్ లో అడిగాడు.

ఇక్కడా అంటూ అప్పుడే అటువైపు వచ్చిన శశి, ఆరాధ్యా వచ్చారు.

“ఇక వెళుదామా?” అడిగింది సుభద్ర అలిసిన అందరి మొహాలు చూస్తూ. ఏదైనా రెస్టారెంట్ లో తిందామన్నా, ఆర్డర్ చేసి, అవి వచ్చేదాకా కూర్చునే ఓపిక కూడా లేక, వేలాడబడిపోతున్నారు పిల్లలూ, పెద్దలు కూడా! అయినా ఇంటికి వెళ్ళగానే ఏమి వండుతాము అని రెస్టారెంట్ వైపు దారి తీస్తున్న అభి వైపు చూస్తూ…

“నేను వచ్చేటప్పుడు ఇన్స్టాపాట్ లో అన్నం పెట్టి వచ్చాను. ఇంట్లో ఉన్న కూరలతో  తినేద్దాము. ఈ వీకెండ్  అంతా ఈ రెండు రోజులు  బాగా తిరిగాము. అలసిసొలసిపోయాము. ఇక చాలు పదండి” అంది సుభద్ర.

(ఇంకా ఉంది)

 

 

 

 

 

 

 

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

బోనాల జాతర