నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం 7వ భాగం

జరిగిన కథ…

అర్జున్, సుభద్ర పిల్లల కోరిక మీద అమెరికాకు వస్తారు. ముందుగా కొడుకు అభిమన్యు దగ్గరకు మినియాపోలీస్ వస్తారు. అక్కడ సీనియర్ సెంటర్ ఉందని, అందులో చాలా కార్యక్రమాలు సీయర్ సిటిజెన్ కోసం నిర్వహిస్తుంటారని వాకింగ్ ఫ్రెండ్ పటేల్ ద్వారా తెలుసుకొని అందులో చేరుతారు. ఇంటికి వచ్చిన హాండీమాన్ బిల్ తో కబుర్లు చెపుతూ అతని గురించి తెలుసుకుంటారు.ఆ వీకెండ్ మినటొంకా లేక్ లో క్రూజ్ కు బుక్ చేస్తుంది కోడలు శశి. కూతురు స్పూర్తి తండ్రికి మినియాపోలీస్ చరిత్ర చెప్పి, ఇంకా అక్కడ ఏమేమి చూడాలో చెపుతుంది.

ఇక చదవండి…

సూర్యకిరణాలు నీళ్ళ మీదపడి తళతళా మెరుస్తున్నాయి. నౌక డుక్…డుక్… మని చిన్నగా శబ్ధం చేసుకుంటూ వెళుతోంది. దూరంగా గట్టుమీద పాతకాలం నాటి ఇళ్ళు, దట్టమైన పచ్చని చెట్ల మధ్య కనిపిస్తున్నాయి.ఆకాశం లో లేత నీలి రంగు వివిధ వర్ణాలతో శోభిల్లుతోంది. తెల్లని మబ్బులు గుంపులు గుంపులుగా ఏదో సమావేశానికి వెళుతున్నట్లుగా తరలిపోతున్నాయి. ప్రకృతి మనోహరమైన, మైమరిపించే అందాలతో  హరిత, నీలి, తెలుపు వివిధవర్ణాలతో శోభితమైన అందాల హరివిల్లులా మనోహరంగా ఉంది. డెక్ మీద వేసి ఉన్న కుర్చీలో కూర్చొని ప్రకృతి రమణీయత, ప్రశాంత వాతావరణంను పరవశంగా ఆస్వాదిస్తున్న సుభద్ర మీదకు సన్నని నీటి తుంపెరలు సుతారంగా పడి పలుకరించాయి. ఒక్కసారిగా చిరుచలిగా అనిపించి, కొంగును భుజాల చుట్టూ కప్పుకుంటూ “ఎచటి నుండి వీచెనో ఈ గాలి” అని కూనిరాగం తీసింది.

ఉదయం ఆరుగంటలకే తయ్యారై “మినటొంకా లేక్” దగ్గరకు వచ్చేసరికి పదిగంటల సమయం అయ్యింది. ఆరాధ్య అర్జున్ చేయి పట్టుకొని హడావిడిగా, ఉత్షాహంగా మాట్లాడుతోంది. మనవరాలితో ముచ్చట్లు చెపుతూ సరదాగా నడుస్తున్నాడు అర్జున్.  అభి, సుభద్ర కబుర్లు చెప్పుకుంటూ అక్కడే గడ్డిలో తిరుగుతున్నారు.ఆకాశ్, శశి వీళ్ళందరినీ వాళ్ళకు తెలియకుండా ఫొటోలు తీస్తూ నవ్వుకుంటున్నారు. ఒకరొకరే క్రూజ్ వెళ్ళే ప్రయాణికులు వస్తున్నారు. పదకొండు కాగానే నౌకలో నుంచి గంట మ్రోగి, అందరినీ ఎక్కమని అనౌన్స్మెంట్ వచ్చింది. ఒడ్డు నుంచి వేసి ఉన్న చిన్న వంతెన మీదుగా అందరూ ఎక్కారు.తలుపు దగ్గర ఒక అమ్మాయి, ఒక అబ్బాయి నిలబడి, విమానంలోలా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ నౌకలోకి ఎక్కాక టికెట్స్ చెక్ చేసి, లెక్క చూసుకున్నారు సిబ్బంది. లోపలంతా విశాలంగా ఉంది. చిన్నచిన్నకాబిన్స్ లా కట్టి ఉన్నాయి. హోటల్ లో బల్లలు కుర్చీలు వేసి ఉన్నాయి. డెక్ మీద గుండ్రటి బల్లలు, వాటికి నలుపక్కలా కుర్చీలు ఉన్నాయి. అందరికీ వెల్కం డ్రింక్ షిప్ పేరు ఉన్న, డిస్పోజబుల్ ప్లాస్టిక్ గ్లాస్ లలో పోసి ఇచ్చారు. ఆ గ్లాస్ నచ్చి, తన గ్లాస్ తాగాక, బాగ్ లో దాచుకుంది సుభద్ర.

“ఏమిటీ ఆ గ్లాస్ దొంగతనం చేస్తున్నావా?” నవ్వుతూ వెక్కిరించాడు అర్జున్.

“దొంగతనమేముంది?  క్రూజ్ గుర్తుగా దాచుకున్నాను. దొంగతనమేమీ కాదు” దబాయించింది సుభద్ర.

“పరవాలేదు డాడీ. ఇది డిస్పోజబుల్ గ్లాస్. వాళ్ళైనా పారేసేదే! కడిగి తెచ్చిస్తాను ఇటివ్వు మమ్మీ” అని కడిగి, తుడిచి తీసుకొచ్చాడు అభి. అది భద్రంగా బాగ్ లో దాచుకుంది.

“అన్నీ పిల్ల చేష్టలు” అన్నాడు అర్జున్.

వెల్కం స్పీచ్, పరిచయాలు అయ్యాక గంట తరువాత లంచ్ ఉంటుందని అనౌన్స్ చేసారు.

షిప్ డుక్…డుక్… అంటూ బయలు దేరింది. సుభద్ర, అర్జున్ డెక్ మీదకు వచ్చారు.అక్కడ ఉన్న కుర్చీలల్లో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తోంది సుభద్ర.

డెక్ రేయిలింగ్ ఆనుకొని నిలబడ్డ అర్జున్ సుభద్ర వైపు చూసాడు. సరస్సు నీటి మీద పడిన సూర్యకిరణాల వెలుగు సుభద్ర చెంపలమీద పడి, చెంపలు మెరుస్తున్నాయి. భుజాల వరకు ఉన్న వత్తైన నల్లని జడ, లేతగులాబి రంగు కోటా చీర, చామనఛాయలో సన్నగా నాజుకుగా ఉంది. సన్నగా కూనిరాగం తీస్తూ ప్రకృతిని పరవశంగా చూస్తూ, సెల్ లో ఫొటోలు తీసుకుంటున్న సుభద్రను అలాగే చూస్తున్నాడు అర్జున్. “బామ్మా…తాతా…” ఆరాధ్య పిలుపుతో ఇద్దరూఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చారు.

కాస్త సద్దుకొని, “రారా తల్లీ” పిలిచాడు అర్జున్.

“ఇక్కడ చాలా బాగుంది కదూ తాతా!బామ్మా ఇటురా” అని బామ్మను పిలుస్తూ,“మమ్మీ నన్నూ, తాతను, బామ్మను ఒక ఫొటో తీయి” అటుగా వచ్చిన శశిని అడిగింది ఆరాధ్య.

“నేనూ” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆకాశ్. నలుగురిని రేయిలింగ్ దగ్గర, టేబుల్ దగ్గర ఫొటోలు తీసింది శశి. అందరూ విడివిడిగా, కలిసి రకరకాలుగా ఫోజ్ లు పెట్టిస్తూ తీస్తూ, “అభీ నువ్వురా” పిలిచింది. డెక్ మీద కొన్ని ఫొటోలు తీసుకున్నాక, ముందు వైపుకు వెళ్ళారు అందరూ. అక్కడ నీళ్ళను అర్ధచంద్రాకారంలో తోసుకుంటూ ముందుకు పోతోంది నౌక. ముందుకు వెళ్ళి, గుండ్రంగా తిరిగి మళ్ళీ వెనకకు, పక్కలకు నురుగును చిమ్ముతూ పోతున్న నీళ్ళు భలేగా అనిపించాయి! ఎండ తీవ్రత పెరిగింది. ఓ పక్క చెమటలు, ఇంకో పక్క నీళ్ళ తుంపరలు పడుతూ, సరస్సు మీద నుంచి వచ్చే గాలికి చిరుచలి. విభిన్నమైన వాతావరణం!

“లంచ్ కు పిలుస్తున్నారు పదండి” అన్నాడు అభి.

ఆ ఎండలో ఫొటోల సెషన్ తో అలిసిపోయారు అందరూ.

ఆకాశ్, ఆరాధ్యా సుభద్ర చేయి పట్టుకొని  ఒక టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళారు. ఆ బల్ల మీద ఒక పెద్ద బెలూన్ మీద “Happy Birthday” అని వ్రాసి ఉంది. ఒక కేక్ పెట్టి ఉంది. ఇదేమిటి? అన్నట్లు పిల్లల వైపు చూసింది సుభద్ర.

“రేపు మీ పుట్టినరోజు కదా ఆంటీ. అందుకే పిల్లలు  ఈ సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసారు” నవ్వుతూ అంది శశి.

ఒక్క క్షణం మాట రానట్టుగా మౌనంగా ఉండిపోయింది సుభద్ర.

“పిల్లలా? నువ్వా అరేంజ్ చేసింది?” నవ్వుతూ అడిగాడు అర్జున్.

నౌకలోని ఇతర ప్రయాణికులు, నౌక సిబ్బంది, పిల్లల కరతాళధ్వనుల మధ్య, అందరూ హాపీ బర్త్ డే అని పాట పాడుతుంటే కొద్దిగా మొహమాటంగా కేక్ కట్ చేసింది సుభద్ర. కేక్ ను చిన్నముక్కలుగా చేసి లంచ్ బల్ల దగ్గర పెట్టాడు అభి. అంతా వెజిటేరియన్ అని ఉన్న చోటకు వెళ్ళారు.  అవి అన్నీ వెజిటేరియన్ అని ఉన్నా సుభద్ర మాత్రం కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్,  బ్రెడ్ టోస్ట్, గుండ్రంగా కట్ చేసిన ఆరెంజ్ ముక్కలు, ఇంకా సీజనల్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంది. పిల్లలు, అర్జున్ ఆ భోజనం ఎంజాయ్ చేసారు. రెండు గంటల తరువాత, వివిధరకాల బిస్కెట్స్, కాఫీ సర్వ్ చేసారు. మొత్తం మూడు గంటలు సరస్సులో తిప్పి తీసుకొచ్చారు.

నౌకలోని సిబ్బంది అందరి దగ్గరకూ వెళ్ళి “చాలా బాగా జరిగింది. ఎంజాయ్ చేసాము. థాంక్యూ వెరీ మచ్” అని చెప్పి వచ్చాడు అర్జున్.

బయటకు వచ్చాక అక్కడే చెట్ల కింద ఉన్న బెంచీల మీద కాసేపు కూర్చున్నారు. “ఇంక ఇంటికేనా?” అడిగింది సుభద్ర.

“అటు వైపు కొంచం వెళుతేఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు ఎక్సల్సియర్. చాలా పాతకాలంది.అక్కడ బజార్, ఇళ్ళు అన్నీ అలాగే మెంటేయిన్ చేస్తున్నారు.  నీకు పాతవి అంటే ఇష్టం కదా! వెళుదామా? నడవగలవా?” అడిగాడు అభి.

“ఎందుకు నడవను, నడుస్తాను. మళ్ళీమళ్ళీ వస్తామా ఏమన్నానా? చూద్దాం పదండి” ఉత్సాహంగా లేచింది సుభద్ర.

కొద్ది దూరం నడిచి వెళ్ళగానే పెద్దబజార్ లా కనిపించింది. ఆ బజార్ మొదట్లోనే ఒక చిన్న బంగళా 1935 అని వేసి ఉన్నది ముద్దుగా కనిపించింది. దానిని చూడగానే “ఇది 1935 లో కట్టారా? ఎంత చక్కగా ఉంది” ఆశ్చర్యంగా అంది సుభద్ర. అప్పటికే పక్కన ఉన్న ఒక షాప్ లోకి వెళ్ళాడు అర్జున్. బయటకు వచ్చి “నీ కోడలు నీ పుట్టినరోజుకు క్రూస్ ఎక్కిస్తే నేను ఐస్క్రీం తినిపిస్తాను రా” అని పిలిచాడు. అందరూ లోపలికి వెళ్ళారు. ఐస్క్రీం షాప్ అంతా పాత పద్దతిలో అలంకరించారు. ఒక చెక్క ఐస్క్రీం డబ్బాలో పాలు పోసి తిప్పుతున్నారు. అది జస్ట్ షో కోసం పెట్టారట. దానిని చూడగానే తన చిన్నప్పుడు అమ్మ ఇలాంటి చెక్క డబ్బాలోనే ఐస్క్రీం చేయటము గుర్తు వచ్చింది సుభద్రకు. కౌంటర్ లో ఉన్న అమెరికన్ లేడీ తో కబుర్లు చెపుతూ, ఐస్క్రీం ఆర్డర్ చేసాడు అర్జున్. ఆ ఐస్క్రీం రుచి కాస్త వేరుగా అనిపినంచింది. ఐస్క్రీం తినటం అయ్యాక బజార్ లోని షాప్స్ చూసుకుంటూ నడిచారు. అన్ని షాప్స్ పాత పద్దతిలో అలంకరించారు. అప్పటి టోపీలు, బట్టలు స్టైల్ లో కొన్ని అమ్మకానికి పెట్టారు.

ఒకచోట పాత, నల్ల కార్ కనిపించింది. “అండీ ఇది చూడండి. పాత సినిమాలోని జమిందార్ ల కార్ లా ఉంది కదా” అర్జున్ ను పిలిచింది సుభద్ర.

“మీరిద్దరూ దాని ముందు నిలబడండి. మీకు ఫొటో తీస్తాను” అని వారిద్దరినీ నిలబెట్టి ఫొటో తీసాడు అభి.

కొద్ది దూరం వెళ్ళగానే ఒక ఇంటి గేట్ ముందుతెల్లటి స్తంబం మీద రెండు అంతస్తులతో  చిన్న ఇల్లులా ఉన్న బాక్స్ లాంటిది కనిపించింది. అది ఉత్తరాలు వేసే బాక్స్ ఏమో అనుకుంటూ దాని దగ్గరకు వెళ్ళి చూసింది సుభద్ర. దాని మీద “Little Free Library” అని రాసి ఉంది. దాని తలుపు తీసి ఉంది. అందులో కొన్ని పుస్తకాలు సద్దిపెట్టి ఉన్నాయి. లైబ్రరీ అని చూడగానే దాని ముందు ఆగిపోయి, ఆ పుస్తకాలు తీసి చూసింది సుభద్ర. అవి కొన్ని నవలలు, కొన్ని ఏవో పుస్తకాలు. “ఇదేమిటి?” ఆశ్చర్యంగా అభిని అడిగింది.

“ఇది ఓపెన్ ఫ్రీ లైబ్రరీ అమ్మా. నీకు కావాలంటే నువ్వు తీసుకెళ్ళి చదువుకొని, చదువుకున్నాక తెచ్చి పెట్టేయవచ్చు. నువ్వు ఏమైనా పుస్తకాలు కూడా తెచ్చి ఇక్కడ పెట్టవచ్చు” వివరించాడు అభి.

“మరి ఇంత ఓపెన్ గా పెడితే ఎవరూ దొంగలించరా?” అడిగాడు అర్జున్.

“లేదు డాడీ. ఇలాంటివి అక్కడక్కడ పార్క్ లలో కూడా పెడతారు. ఎవరైనా పెట్టవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. ఎప్పుడో తప్ప ఈ పుస్తకాలు దొంగతనం కావు” జవాబిచ్చాడు అభి.

“భలేగా ఉందే! ఇట్లా మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా!” ముచ్చటపడిపోయింది సుభద్ర.

చాలా సేపు ఆ బజార్ అంతా తిరిగారు. పిల్లలు ఏవో కొనాలని ముచ్చటపడ్డారు కానీ మళ్ళీ నచ్చక తీసుకోలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి అందరూ అలసిపోయారు. ఆకాశ్ కార్ లోనే తాత భుజం మీద తలపెట్టి నిద్రపోయాడు. ఇంట్లోకి రాగానే పిల్లలు వాళ్ళ గదిలోకి వెళ్ళి, బట్టలు కూడా మార్చకుండా మంచాలకు అడ్డం పడ్డారు. వాళ్ళను సరిగ్గా పడుకోబెట్టి కిందికి వచ్చింది శశి. అర్జున్, సుభద్ర గోరు వెచ్చటినీటితో స్నానం చేసి, నైట్ డ్రెస్ వేసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి వేడిగా అన్నం, రసం వండింది శశి. అభి ప్లేట్స్, గ్లాసెస్ పెడుతున్నాడు.

“ఇంత అలిసిపోయి ఇప్పుడెందుకు వంట చేసావు శశీ. ఉన్నదేదో తినేవాళ్ళం కదా” మందలింపుగా అంది సుభద్ర.

“ఏమీ లేదాంటీ, రసం, అన్నమే” జవాబిచ్చింది శశి. ఇంక ఎక్కువ మాట్లాడకుండా తినేసి వెళ్ళి పడుకున్నారు అందరూ!

అలసిపోయి, స్నానం చేసి, వేడి అన్నం తినగానే నిద్ర ముంచుకొచ్చింది అందరికీ. గదిలోకి వస్తూనే మంచం మీద వాలిపోయారు. వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నారు. మంచి నిద్రలో ఉన్న అర్జున్ కు ఎక్కడి నుంచో గణగణ మని గంటలు వినిపిస్తున్నట్లుగా అనిపించింది. పట్టించుకోలేదు. అవి అంతకంతకూ పెద్దవి అవుతున్నాయి. కళ్ళు బలవంతాన తెరిచి పక్కకు చూసాడు. సుభద్ర ఆ చప్పుడుకు లేవలేక, పడుకోలేక అటూ ఇటూ కదులుతోంది.  అంతలో అభీ గబగబా  వచ్చి “మమ్మీ… డాడీ… లేవండి. బయటకు పరిగెత్తండి” …

(ఇంకా ఉంది)

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గోరింటాకు

దొరసాని