(ఇప్పటివరకు : కాంతమ్మ గారి భర్త ప్రభాకర్ గారి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టు కుంటుంది. మైత్రేయి కి ధైర్యం చెప్పాలని ప్రభాకర్ ప్రసాద్ కి సూచిస్తాడు. కాంతమ్మ గారితో మైత్రేయి చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ కి వెళుతుంది. అక్కడ జ్యోతి ని కలిసాక మైత్రేయి కి చాలా ప్రశ్నలు మనసులో మెదులుతాయి. తిరుగు ప్రయాణం లో కాంతమ్మ గారిని అడగాలని కూడా అనుకుంటుంది. )
మైత్రేయి అడగగానే డ్రైవరు జానీ పెద్దగా నవుతూ, “అదే మ్యాజిక్ మా అమ్మ గారి చేతులో. ఎలాటి వారయిన మా అమ్మ గారి మాట వినాల్సిందే. మరి అంత ప్రేమతో అధికారం చూపిస్తే ఎవరు మాత్రం కాదంటారు. ఆ ప్రేమ లో తాను ఆమెకి స్వంత మనిషి అన్న భావన కలిగిస్తారు మా అమ్మ గారు ఎవరికయినా! అంతే కదు అమ్మ?” అంటూ ముగించాడు.
“ చాల్లే రా, ముందు చూసి బండి నడుపు. ప్రేమ తో కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయమాకు, మనందరం ఆ దేవుని ప్రేమ పొందాల్సి ఉంటుంది అంటూ,” ఆమె కూడా పెద్దగా నవ్వేసింది.
“ జానీ మాటల్లో తప్పేముందమ్మా! నిజమే చెప్పాడు కదా ,” అంది మైత్రేయి .
“ థాంక్స్ మేడమ్! !” అన్నాడు జానీ.
“ మేడమ్! ఈ జ్యోతి ఎక్కడి నుండి వచ్చింది. అసలా అమ్మాయి కేమయింది,” అడిగింది.
“ జ్యోతి రెండు నెలల క్రితం గుంటూర్ రైలు స్టేషన్ లో స్పృహ లేకుండా పడి కనిపించింది. ఆ అమ్మాయిని రైల్వే పోలీసులు గుంటూర్ జనరల్ హాస్పిటల్లో చేర్చారు. అమ్మాయి దగ్గర వివరాలు దొరక లేదు. డాక్టర్స్ చెక్ చేశాక చెప్పారు , ఈ అమ్మాయి కడుపుతో ఉన్నది అని. అప్పటి కి ఇంకా రెండో నేలే. ఆ విషయం ఆ పిల్లకి తెలియదు. పెద్దగా వయసేమి లేదు. సెలైన్ పెట్టి రెండు రోజులు జనరల్ వార్డ్ లో ఉంచారు. సిటీ పోలీసులకి అప్పగించారు ఆ అమ్మాయిని. వాళ్ళు ఆ అమ్మాయిని మా సంస్థలో చేర్పించారు. అప్పుడంత అయోమయం గా ఉండడంతో ఏమి మాట్లాడలేదా పిల్ల. అందరినీ పిచ్చి చూపులు చూస్తుండేది. ఇక్కడ చేర్చిన కొద్ది రోజులకి మన లోకం లోకి వచ్చింది. అప్పటి నుండి వసంత ని తిట్టడం, అందరితో గొడవ పడడం, తిండి తినకుండా మారాం చేయడం చేస్తున్నది. అందరూ ఓపికగా ఆ అమ్మాయిని సంభాలిస్తున్నారు. వీళ్ళే ఆ అమ్మాయికి జ్యోతి అని పేరు పెట్టారు,” అని చెప్పింది.
కారు విజయ వాడ చేరుకోవడం తో కాంతమ్మ గారు, “హల్లో ప్రభాకర్! పనైపోయింద? అటువైపుగా రమ్మంటావా?” అంటూ ఫోన్ లో అడిగింది . “పనింక ఉన్నది కాంతా! గురుదీప్ కూడా వస్తానన్నాడు. నేను ఇవాళ రాను. నువ్వెళ్ళి పో,” అని ఆయన ఫోన్ పెట్టేశాడు.
మైత్రేయి కాస్త ఈజీ మూడ్ లో అడిగింది,” మేడమ్! మీది పెద్దలు కుదిరించిన వివాహమా? లేక ప్రేమ వివాహమా?” “నీకె ల అనిపిస్తుంది?” ఎదురు ప్రశ్న వేసింది.
“ మీది ప్రేమ వివాహమేమో అనిపిస్తుంది.”
“ కొంత వరుకు మాది ప్రేమ వివాహం కూడా! పెద్దలు కూడా ఉన్నారు మా పెళ్ళిలో,” అని అన్నది నవ్వుతూ. “అదెలా?” వింతగా చూసింది.
“మా నాన్న గారు మిలిటరీ లో చేశారు.నేను ఒక్క దాన్నే. నా కెవ్వరు తోబుట్టువులు లేరు. ఆయన శ్రీనగర్ లో డ్యూటి లో ఉన్నప్పుడు మేము అక్కడే ఉండే వాళ్ళం. మా నాన్న గారు కలనల్ ( గ్రూప్ కాప్టన్) ఆయన గ్రూప్ లో మావారు కూడా ట్రైనింగ్ లో ఉండేవారు. తెలుగు అబ్బాయి కావడం తో తరచూ మా ఇంటికి వస్తుండే వారు. అలా మా పరిచయం మొదలయింది. కాశ్మీర్ లో చాలా టెర్రరిస్ట్ ఆక్టివిటీస్ జరుగుతుందడేవి. అందుకని మా నాన్న గారు ఎప్పుడు డ్యూటి లోనే ఉండేవారు. అందుకని ప్రభాకర్ మాకు తోడుగా ఉండే వాడు అవసరమయినప్పుడల్లా. అలా మా స్నేహం బాగా బల పడింది.
మార్కెట్ కెళ్లినప్పుడు అక్కడ అనుకోకుండా జరిగిన కాల్పులలో మా అమ్మగారు చనిపోయారు. మా నాన్నగారు నన్నుఅక్కడి నుండి తెనాలి పంపించేశారు. మేముంటున్న ఇల్లు అప్పట్లో మా తాత గారిది. ఆయన దగ్గర నన్ను వదిలి పెటాడు మా నాన్న. ఇక్కడే నేను డిగ్రీ దాకా చదివాను. అప్పట్లో మా నాన్న గారి తో అప్పుడప్పుడు మా వారు కూడా వచ్చేవారు.
ప్రభాకర్ కి లాండ్ మైన్ యాక్సిడెంట్ లో అనుకోని చోట దెబ్బలు తగిలాయి. ఆ సమయం లో ఆయనికి తోడుగా నేను ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను కూడా ఆయన తో కలిసి సికిందరాబాద్ ఆర్మీ హాస్పిటల్లో ఉన్నాను. అలా ఆయన కోసం నేను వెళ్లడం మా తాత గారికి నచ్చలేదు, ముందు వప్పుకోలేదు కూడా . ప్రభాకర్ మా అమ్మ గారు పోయినప్పుడెంత సాయం చేశారో చెప్పటం తో వప్పుకోక తప్పలేదు ఆయనకి.
అప్పుడే మా ఇద్దరి మధ్య స్నేహం బల పడింది. ప్రేమ గా మారింది. కానీ ఆయన ముందు వొప్పుకోలేదు పెళ్లి చేసు కోవటానికి. ఆర్ధికం గా ముందు స్థిర పడాలని అన్నారు. అప్పుడే గురు దీప్ కూడా కలిశాడు. వ్యాపారం మొదలు పెట్టారు. రెండు మూడేళ్లలో మంచి గా ట్రాన్స పోర్ట్ బిజినెస్ ని పెంచారు. అప్పుడు మా తాత గారు ప్రభాకర్ నాన్నగారి ని కలిసి మాట్లాడారు. అప్పుడు మా మావ గారు వాళ్ళు కూడా విజయవాడ లోనే ఉండే వారు, కానీ ఆయనకి మా కులం నచ్చలేదు. కానీ ప్రభాకర్ తన నిర్ణయం నుండి వెనక అడుగు వేయ లేదు. అయిష్టం గా మా పెళ్ళికి వప్పుకున్నారు ఆయన.
మా పెళ్లి తరువాత, ఒక విధం గా చెప్పాలంటే ప్రభాకర్ ని వెలి వేశాడు ఆయన. ప్రభాకర్ కి ఇద్దరు అన్నలు. ఒక అక్క ఉన్నారు. చాలా సంవత్సరాలు రాక పోకలు కూడా లేవు. ఈ మధ్యనే మా వారి అక్క మా తోటి మాట్లాడుతుంటుంది. ఇప్పుడు మా ఇద్దరికీ తల్లితండ్రులు కాలం చేసి చాలా కాలమయింది. ఆయన కోసం నేను, నా కోసం ఆయన,” అంటూ చెప్పడం ముగించింది.
కారు వారి ఇంటి వీధిలోకి మలుపు తిరిగింది.
( ఇంకాఉంది)