చెట్టు నేస్తం

“లహరీ! ఓలహరి, వర్షంలో ఆడొద్దని చెప్పానా? చినుకులు వస్తే చాలు నీళ్లలో తడుస్తూనే ఉంటావు. ఆ తర్వాత జలుబు చేస్తే నీకు అవస్థ నాకు అవస్థ. తొందరగా లోపలికి వచ్చేయ్” అని గట్టిగా అరిచింది సువర్ణ.

“ఎప్పుడూ ఇలాగే కోప్పడతావు. ఏం కాదు వర్షంలో తడిస్తే .ఎంత హాయిగా ఉందో! ఇంకా కొంచెం సేపు ఆడుకొని వస్తానమ్మా”అన్నది లహరి.

వర్షంలో తడవడం అంటే ఎంతో ఇష్టం లహరికి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత కోప్పడ్డా కూడా పురివిప్పిన నెమలిలా వర్షంలో తడుస్తూనే ఉంటుంది.

ఇంటి ముందు విరగబోసిన రాధా మాధవ చెట్టు సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. వర్షంలో తడిసి. వాకిలంతా ఆ పరిమళం వ్యాపించి ఉంటే, ఆ చినుకుల్లో తడుస్తూ ఎంతో ఆనందం పొందేది లహరి.

ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే తల్లి వచ్చి తిడుతుందేమో అని భయపడి లోపలికి వచ్చేసింది. అప్పటికే కొంచెం తుమ్ములు మొదలయ్యాయి.

“అసలు నా మాటే వినవు నువ్వు. చూడు జలుబు మొదలయ్యింది. ఏం చేయాలే నీతో” అన్నది కొంచెం కోపం కొంచెం బాధ మేళవించి సువర్ణ.

అదేమీ పట్టించుకోకుండా అక్కడే కూర్చుంది లహరి. తల్లి వచ్చి తలంతా తుడిచేసి, వేరే బట్టలు మార్చుకోవడానికి ఇచ్చి “గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకో” అని చెప్పింది.

గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకొని వచ్చి, వరండాలో రాధా మాధవ చెట్టు దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది.

అలా బోరున కురుస్తున్న ఆకాశం కేసు చూస్తూ తడుస్తున్న చెట్లనుండి నీళ్లు కారుతుంటే అవన్నీ బిందువులుగా నేలపై రాలుతుంటే ఎంతో అందంగా కనపడ్డ ప్రకృతి అందాన్ని చూడడమంటే లహరికి ఎంతో ఇష్టం. చిన్నప్పటినుండి ప్రకృతి ప్రేమికురాలు.

ఇంతలో సువర్ణ ప్లేట్లో వేడి వేడి పకోడీ ఇచ్చి “ఇప్పుడు కూడా నీకు వర్షమే కావాలా? సరే, తడవకుండా కూర్చొని తిను” అంటూ లహరి చేతిలో ప్లేటు పెట్టి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.

లహరి తండ్రి ఇదంతా గమనిస్తూ లోపలికి వస్తున్న సువర్ణ కేసు చూస్తూ”దానికి ఇలా ప్రకృతిని చూస్తూ గడపడం అంటే ఎంతో ఇష్టం. ఎందుకు దాన్ని ఇబ్బంది పెడతావు” అన్నాడు.

“ఇబ్బంది పెట్టడం ఏంటండీ వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది కదా, ఆ తర్వాత బాధపడేది మీరు కాదు మేమిద్దరమే” అంటూ అతని చేతిలో కూడా ఒక ప్లేట్ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది.

లహరి జీవితమంతా పల్లెటూరులోనే గడిచింది. పెద్ద పెంకుటిల్లు, ఇంటి ముందు బయట స్థలము. బోలెడన్ని చెట్లు, ఆటలకు స్థలము బయటకు వెళ్లే అవసరం లేనంత టైంపాస్ జరిగేది.

వర్షం పడగానే లహరి కేమో ఇలాంటి కోరికలు. లహరి తల్లికి, నాయనమ్మకు మరొకరకంగా ఉత్సాహం. గూనదారల నుండి వచ్చే నీళ్ళని బకెట్లలో, బిందెలలో అన్ని నింపి పెట్టే వాళ్ళు. వాటితో బట్టలు ఉతుక్కోవడము వంటకు ఉపయోగించుకోవడం చేసుకునేవాళ్ళు.

రాత్రి కాగానే లహరికి తమ్ముడు హరికి అమ్మ వేడివేడి టమాటా చారు, అన్నం కలిపి పెడుతుంటే ఇద్దరు చక్కగా తినేవాళ్లు. ఒకపక్క బొగ్గుల పొయ్యి మీద పాలను కాచి, చివరగా పాలన్నం తినిపించేది లహరి తల్లి సువర్ణ.

భోజనాలు కాగానే చతుషాల భవంతి లో ఒక పక్కన అందరికీ పరుపులు వేస్తే, పడుకునే వాళ్ళు. అలా వర్షం కురుస్తుంటే ఆ నీటిని చూస్తూ నిద్రపోయేది లహరి.

ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద గొట్టమల్లె చెట్టు ఉండేది. చెట్టు నిండా పూలు పూసేది. లేవగానే లహరికి పెద్ద పనే దొరికేది. గుడిలోకి వెళ్లి పూలన్నీ బుట్టలో ఏరుకొని తెచ్చి పెట్టేది .ఆపూలంటే ఎంత సంతోషమో.

అప్పుడప్పుడు ఆ చెట్టుతో ముచ్చట్లు పెట్టేది.

“నువ్వు రెండు నెలలే పూస్తావ్ ఎందుకు? మిగతా నెలలంతా బోసిగా ఉంటావు” అంటూ చెట్టును అడిగింది లహరి.

గాలికి చెట్టుకొమ్మలు కదిలాయి. చెట్టు భాష అర్థమైనట్టుగా”రెండు నెలలే పూస్తావా”మరి నా కోసం నువ్వు ఎక్కువ పూలను రాల్చాలి. నువ్వు నా ఫ్రెండ్వి కదా!” అన్నది లహరి

గాలికి టపటప పూలన్నీ రాలిపోయాయి.

సంతోషంతో లహరి”థాంక్యూ, నేను అడగగానే బోలెడన్ని పూలు ఇచ్చావు .అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అని చెట్టుకాండాన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది లహరి.

ఇలా ప్రకృతితో ఎంతో అనుబంధం ఉండేది లహరికి. వర్షాకాలంలోనే పూసే గొట్టమల్లె చెట్టు లహరికి ప్రాణమే.

అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ పై చదువులు పట్టణంలో చదువుకుంటూ, సెలవులకి వచ్చినప్పుడు గొట్టమల్లె చెట్టుతో తన సంతోషాన్ని పంచుకుంటూ తనకు ఏదైనా సమస్య వస్తే అది అడిగి తృప్తిపడేది. అలా గొట్టమల్లే చెట్టుతో దోస్తీ పెరుగుతూనే ఉంది లహరికి.

వయసొచ్చిన లహరికి పెళ్లిచూపులు జరిగాయి.

లహరిని చూసిన పెళ్ళివారు మొదటి చూపులోనే నచ్చారు. మల్లె పువ్వుల స్వచ్ఛంగా ఉన్న లహరిని చూస్తే ఎవరు నచ్చకుండా ఉంటారు?

పెద్దవాళ్లు అందరూ మాట్లాడుకున్న తర్వాత, పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురుని అడిగారు.

“మీరు ఏమైనా మాట్లాడుకుంటారా? టైం తీసుకుని ఒకరికొకరు నచ్చితేనే ఈ పెళ్లి చేస్తాం” అన్నారు.

“నేను అమ్మాయితో మాట్లాడతాను, మేము మాట్లాడుకోవచ్చా”? అని కొంచెం బిడియంగా అడిగాడు పెళ్లి కొడుకు నరేష్.

లహరి తల్లి తండ్రి వెంటనే
“అమ్మాయితో ఒంటరి గానా”? అన్నారు కొంచెం టెన్షన్ గా.

“వాళ్లు ఒకరికొకరు మాట్లాడుతుంటేనే కదండీ, వారికి ఒకరి గురించి ఒకరికి తెలిసేది. ఏం పరవాలేదు మాట్లాడుకోనీయండి” అన్నాడు నరేష్ తండ్రి” రామభద్రయ్య.

సరే నని, ఒప్పుకున్నారు లహరి తల్లిదండ్రులు.

పెరట్లోకి వెళ్లి మాట్లాడుకోమన్నారు. కానీ లహరి “ఆంజనేయ స్వామి గుడిలో మాట్లాడుకుంటాము “అని చెప్పింది.

ఇద్దరూ గుడిలోకి వెళ్లారు. ముందుగా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని, అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయి పైన కూర్చున్నారు .

తలవంచుకొని కూర్చున్న లహరిని చూసి నరేష్ కూడా కొంచెం బిడియంగా,
“ఇద్దరము ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే ఎప్పుడు మాట్లాడుకుంటాము? లహరీ, ఒకసారి తలెత్తి చూడు”. అన్నాడు.

లహరి తన అందమైన కళ్ళతో మెల్లిగా కళ్ళు పైకెత్తి నరేష్ ని చూసింది. అప్పటివరకు అందరిలో కూర్చున్న నరేష్ ని సరిగా గమనించలేదు.

“అందంగానే ఉన్నాడు” అని అనుకున్నది లహరి.

“లహరి! నీకు నేను నచ్చానా? నువ్వు నాకు బాగా నచ్చావు”. అని అడిగాడు.

మౌనంగా కూర్చున్న లహరిని చూసి,
“మాట్లాడాలి లహరి. మన ముందు ఎంతో జీవితం ఉంది. ఇప్పుడు మనం ఒకరికొకరం సరిపోతామా? లేదా? నిర్ణయించుకోవాలి. మరొక విషయం చెప్పాలి పెళ్లయ్యాక కూడా అందరం కలిసే ఉంటాము. ఎందుకంటే నేను ఒక్కడినే కొడుకును. అంతే కాకుండా నానమ్మ, తాతయ్య కూడా మనతోనే ఉంటారు . నీకు ఇది సమ్మతమెనా?”అది అడిగాడు.

చిన్నగా నవ్విన లహరి తలెత్తి నరేష్ ని చూసింది.

“మీరు వచ్చారో లేదో నేను మా మల్లె చెట్టును అడుగుతాను”అన్నది లహరి.

“మల్లె చెట్టు అడగడం ఏంటి? మల్లె చెట్టు ఏమైనా మాట్లాడుతుందా?”అన్నాడు నరేష్ ఆశ్చర్యంగా.

“అవును, ఈ గొట్టమల్లె చెట్టు నా చిన్నప్పటినుండి నా నేస్తం. ఏదైనా ఈ మల్లె చెట్టును అడుగుతాను. నాకు సమాధానం వస్తుంది. అన్నింటికీ పరిష్కారం చెప్తుంది”అని చెప్పింది.

“అయితే అడుగు చూద్దాం”అన్నాడు నరేష్.

వెంటనే లహరి వెళ్లి మల్లె చెట్టును రెండు చేతులతో చుట్టి ఒకసారి పైకి చూసింది. అశ్విజ మాసం కావడం వల్ల చెట్టు అంతా పూలతో నిండి ఉంది. సమాధానం ఇచ్చినట్టుగా చెట్టు పూల వర్షం కురిపించింది. ఇద్దరి తలలు పూలతో నిండిపోయి, చాలా అందంగా కనిపించారు. ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు.

“ఏం చెప్పింది నీ చెట్టు?”
అని అడిగాడు నరేష్.

“అడిగాను కదా, సమాధానం కూడా ఇచ్చింది .అది ఎవరికి కనిపించదులే”అని నవ్వింది లహరి.

“ఏం చెప్పింది మరి?”అన్నాడు నరేష్.

“పెళ్ళికొడుకు మంచివాడు అని చెప్పింది. అందుకే దీవెనలు ఇచ్చి పూలను కురిపించింది”అన్నది సిగ్గుపడుతూ లహరి.

లహరిని చూస్తే అతనికి చాలా ఇష్టంగా అనిపించింది.” ఇలా చెట్లను స్నేహంగా భావించి, ప్రకృతి ప్రేమికురాలైన లహరి సున్నిత మనస్కురాలై ఉంటుందని అర్థమైంది తన జీవితమే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు” అనిపించింది.

“సరే ఇంకా, లోపలికి వెళ్దాం చాలాసేపు ఇక్కడే ఉంటే బాగుండదు. ఇంటికి వెళ్ళాక రాత్రి కిఫోన్ చేస్తాను. లిఫ్ట్ చేస్తావా? నీ నెంబర్ చెప్పు నోట్ చేసుకుంటాను”అన్నాడు మొబైల్ తీసి.

లహరి నెంబర్ నోట్ చేసుకొని, ఇద్దరూ లోపలికి వెళ్లారు.

వీరిద్దరి ముఖాలను చూస్తేనే అందరికీ అర్థమైంది, ఇద్దరికీ ఒకరి కి ఒకరు నచ్చారని.

“ఇది చాలా చిన్న పల్లెటూరు కదా మరి పెళ్లి ఎక్కడ చేస్తారు?”అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి.

“ఇది చిన్న ఊరైన ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. బస్సు సౌకర్యం మొదలుకొని ప్రతిదీ మాకు అందుబాటులో ఉంది. మీకు ఏ ఇబ్బంది కాకుండా ఇక్కడే పెళ్లి చేస్తాము”అన్నాడు లహరి తండ్రి.

మాట ముచ్చట్లు అయ్యాక పెళ్లి వాళ్ళు వెళ్లిపోయారు.

పెళ్లికి కొన్ని రోజుల సమయం ఉన్నందువల్ల ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు. ఇద్దరి మనస్తత్వాలు కలిసాయి. ఇద్దరూ ఒకరి ఇష్టాలను, అష్టాలను గౌరవించుకొని, ఏడడుగులు నడవడానికి సిద్ధపడ్డారు.

తాను పుట్టి పెరిగిన పల్లెటూరులోననే లహరి పెళ్లి వైభవంగా జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసిన లహరి తల్లిదండ్రులను అందరూ ప్రశంసించారు.

అత్తవారింట్లో కాలుపెట్టిన లహరి అక్కడ అందరి మన్ననలను అందుకున్నది.

ఒకరోజు కళ్ళు తిరుగుతున్నాయని పడుకున్న లహరినీ చూసి కంగారుపడ్డాడు నరేష్. “అంత కంగారు పడనవసరం లేదు కాబోయే తండ్రిగారూ”అన్నది నవ్వుతూ లహరి.

విషయం అర్థం చేసుకున్న నరేష్ ఆనందానికి అవధులు లేవు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొన్నది.

పుట్టింట్లో శ్రీమంతం జరుపుకొని ,తర్వాత అత్తవారింట్లో శ్రీమంతం జరుపుకొని, పురిటి కోసం పుట్టినింటికి వెళ్ళింది లహరి.

పండంటి పాపకు జన్మనిచ్చిన లహరికి ఎంతో సంతోషంగా ఉంది. అదే రోజు రాత్రి గాలి వాన వచ్చి గుడిలోని గొట్టమల్లె చెట్టు నేల కూలింది.

విషయం తెలుసుకున్న లహరి ఏడ్చింది. తన కష్టం సుఖం పంచుకున్న మల్లె చెట్టు లేదని ఏడుస్తూనే ఉంది. ఆమె బాధ వర్ణనాతీతం.

పురిటి స్నానం తర్వాత మెల్లిగా తన బిడ్డను తీసుకొని చెట్టు దగ్గరికి తీసుకెళ్లింది. “ఈ చెట్టు నా నేస్తం నాన్న”అని చెప్పింది.

తన వెంట వచ్చిన నరేష్ మరియు తల్లిదండ్రులతో ,

“అమ్మా, ఈ చెట్టుతో నా బిడ్డకు ఊయల చేయించు. అప్పుడు నా నేస్తం నాతోనే ఉన్నట్లుంటుంది నాకు”అని చెప్పింది.

తల్లితండ్రులు సరేనన్నారు.

బిడ్డను తీసుకొని ఇంట్లోకి వెళదామని వెనుతిరిగిన లహరికి ,కొంచెం దూరంలో మల్లె మొక్క ఏపుగా పెరుగుతూ కనిపించింది.

సంతోషంతో ఆ వైపు చూసి
“అదిగో నా నేస్తం మళ్లీ పుట్టింది. ఇప్పుడు ఈ బుజ్జి మల్లె చెట్టు నా బిడ్డకు దోస్తు అవుతుంది”అంటూ చిన్న పిల్లలా మురిసిపోయింది.

ఆమె బాధను విడిచి పెట్టినందుకు ఇంట్లో అందరూ సంతోషించారు ముఖ్యంగా నరేష్ ఎక్కువగా సంతోషపడ్డాడు.

చెట్లతో మాట్లాడి చూస్తే, నిజంగానే అవి స్పందిస్తాయి .ప్రేమగా నీళ్లు పోస్తే ,ఆ మనిషి కోసం ఎదురుచూస్తాయి ఇది సత్యం.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మౌన పరిమళం

ఎడారి కొలను