(ఇప్పటివరకు : మైత్రేయిది ఆత్మా హత్య ప్రయత్నం కాదని తెలియడంతో ప్రసాద్ ఊపిరిపీల్చుకున్నాడు. అమ్మ నాన్న ల దగ్గరికి వేళ్ళటానికి విముఖత చూపెట్టడంతో, కాంతమ్మ గారు మైత్రేయిని తన ఇంటికి తీసుకెళుతుంది. కాంతమ్మ గారి భర్త ప్రభాకర్ గారి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టు కుంటుంది. మైత్రేయి కి ధైర్యం చెప్పాలని ప్రభాకర్ ప్రసాద్ కి సూచిస్తాడు. కాంతమ్మ గారితో మైత్రేయి చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ కి వెళుతుంది. )
ఎదురుగా వసంత, పక్కనే పెద్దరికం తో కూడిన గంభీరం తో నిలబడి ఉన్న కాంతమ్మ గారిని చూసి గతుక్కుమన్నది జ్యోతి.
“ భయపడకు జ్యోతి! ఈమే మన సంస్థ స్థాపకురాలు కాంతమ్మ గారు,” అంటూ పరిచయం చేసింది. అనుకోకుండానే జ్యోతి కాంతమ్మ గారికి నమస్కారం చేసి లోపలకి వెళ్ళడానికి దారిచ్చింది.
లోపలికెళ్ళి బెడ్ మీద కూర్చుంటూ వసంతను వేళ్ళ మని సైగ చేసింది ఆమె.
“మేడం, నాకు కొంచం ఆఫీస్ పనుంది మీరు మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే వస్తాను,” అంటూ వెళ్ళిపోయింది. మైత్రేయి కూడా వేళ్ళపోయింది, “పర్లేదు, నువ్వు కూర్చో,” అంటూ మైత్రేయి ని ఆపింది కాంతమ్మ గారు.
“నీ పేరు జ్యోతి కదూ!” అడిగింది.
“ ఏమో! వీళ్ళం దరు నన్ను అలాగే పిలుస్తున్నారు,” అని అన్నది.
“అలాగా! నీకు నీపేరు గుర్తు లేదన్న మాట, మరయితే ఏ ఊరునుండి వచ్చావో కూడా గుర్తులేదోమో ?” అంటూ కాస్త అనుమానంగ అడిగింది.
“ నాకు గుర్తుంది. నేను హైదరాబాద్ నుండి వచ్చాను.“
“ హైదరాబాదు నుండి ఎందుకొచ్చావు ఇక్కడికి? ఈ ఊరిపేరు తెలుసా?” అంటూ కాస్త అరాగా అడిగింది.
“ఏమో తెలియదు. వసంత చెప్పింది నన్ను పోలీసువాళ్ళు ఇక్కడ చేర్చారని చెప్పింది ,”
“పోలీసుల దగ్గరికి నువ్వెలా చేరావు, అదయినా నీకు గుర్తుందా?” అడిగింది ఆమె. “ ఏమో, వాళ్ళు నన్ను గుంటూరు రైలు స్టేషన్ లో చూసారని చెప్పింది వసంత. అక్కడి నుండి నన్ను గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేర్చారు. ఆ తరువాత నన్నిక్కడకు పంపించారనయితే తెలుసు. నాకేమయింది. నన్నిక్కడకెందుకు తెచ్చారు? నన్ను మా ఊరు పంపించగలుగుతారా ,” అంటూ ఏంతో ఆశతో కాంతమ్మ గారిని పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది.
వెక్కుతూ,” మిమ్మల్ని చుస్తే నాకు మా అమ్మ యాదోస్తున్నది. బిడ్డ బిడ్డ అని పిలుస్తున్నట్టే అనిపిస్తున్నది,” అంది.
“నువ్వేడవకు. నిన్ను మీ అమ్మ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తాను. నన్ను అమ్మలాగే అనుకో. నీకేం బాగాలేకున్నా నాకు చెప్పు.” అంటూ ఆ పిల్ల ను దగ్గరికి తీసుకొని ఓదార్చింది.
అలా ఆమె దగ్గరికి తీసుకోవడంతో జ్యోతి కాస్త కుదుట పడినట్లయింది. ఏడుపు ఆపేసింది.
“మైత్రేయి ,కార్లో కొన్ని బట్టలున్నాయి తీసుకురా. జానీ ని అడిగితె ఇస్తాడు,” అని అన్నది. మైత్రేయి బయటికి వెళ్ళింది.
“ జ్యోతి, నీకు తెలుసా నువ్వు తల్లివి కాబితున్నావని. నీలో మరొక చిన్న ప్రాణి ప్రాణం పోసుకుంటున్నది,”
“ఏమో!” అంది అమాయకంగా.
“నువ్విలా మొండి కేసి పెట్టింది తినక పొతే ఎలా చెప్పు? ఇవాళ నువ్వు నాతో పాటు అన్నం తింటానికి వస్తున్నావు. అక్కడ నిన్ను చూసుకోవడానికి ఆంటీలను నీకు పరిచయం చేస్తాను. వాళ్లతో ఉంటె నీకు మనసు కుదుటపడి అన్ని జ్ఞాపకం రావచ్చు. అప్పుడు నిన్ను మీ వాళ్ళ దగ్గరికి పంపించ గలుగుతాను,” అంటూ అనునయంగ చెప్పింది.
ఆమె మాటలకూ మంత్రించినట్లు తలూపింది. మైత్రేయి కొన్ని లంగా వోణి జాకెట్లున్న సంచి తెచ్చి అక్కడ పెట్టింది. “ఇవన్నీ నీకోసమే తెచ్చాను. త్వరగా తయారయి ఆఫీస్ లోకి రా, మనం అన్నం తింటూ మాట్లాడుకుందాం,” అంటూ రూమ్ బయటికొచ్చి ఆఫీస్ వైపుగా వెళ్ళింది.
ఆఫీసులో వసంత కాంతమ్మ గారి కోసం టీ తెప్పించి పెట్టింది. ఆ తరువాత కొన్ని రికార్డ్స్ చెక్ చేస్తుండగా జ్యోతి తయారయి వచ్చింది.
అమ్మాయిని చూస్తుంటే చాలా ముచ్చట గ అనిపించింది అందరికి. పసుపు రంగు ఆకు పచ్చపూలున్న లంగా అదే డిజైన్ జాకెట్టు, ప్లైన్ నిమ్మరంగు రంగు ఓణిలో అందంగా కనిపించింది, కానీ మొహం కాస్త నలిగినట్లుగా ఉంది. ‘ఈ అమ్మాయికి వేసుకోవటంలో మంచి టెస్ట్ ఉన్నట్లుందే’ అనుకోంది మనసులోనే మైత్రేయి.
“వచ్చావా జ్యోతి, పద డైనింగ్ హాల్ కెళదాం,” అంటూ “వసంత అందరిని రమ్మని చెప్పు,” అంటూ మైత్రేయిని కూడా రమ్మంటు ఆఫీస్ వెనకాతల ఉన్న కిచెన్ లో కెళ్ళి ఒక సారి పరికించి చూసి, దానికి అనుకోని ఉన్న చిన్నహాలు లో డైనింగ్ టేబుల్ పెట్టబడి ఉన్నది. అక్కడి కెళ్ళి కూర్చుంది కాంతమ్మ మైత్రేయి,వసంతల తో పాటు.
‘చేయూత’ ఇన్మేట్స్ అందరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసారు. వాళ్లలో కొందరు వంటగది నుండి వండిన వంటకాలన్ని తెచ్చి పెట్టారు. కాంతమ్మ గారు స్వయంగ దగ్గరిగా కూర్చున్న వాళ్లందరికీ వడ్డించింది.
“క్యాబేజి కూర చాలా బాగా చేసారు రమణమ్మగారు,” అంది ఇంకొంచం వడ్డించుకుంటూ. ఆమె మొహమాటంగా, ‘మా బొట్లవారు వండిన వంటకం మీరు మనః స్ఫూర్తిగా తింటారమ్మ. అదే సంతోషం,” అంది ఏంతో ఆనందంగా.
“ సాంబార్ కూడా చాల బాగున్నది,” అన్నది మైత్రేయి.
“మరి నేను తెచ్చిన పెరుగు ఎలా ఉందమ్మ గారు,” అని అమాయకంగా అడిగింది ఒక వైపుగా కూర్చున్న కమలమ్మ గారు. “చాల కమ్మగా ఉన్నది ఆంటీ,అచ్చు మా అమ్మ చేతి పెరుగల్లే,” జ్యోతి అమాయకంగా అంటూ జుర్రుకుంటూ తినేసింది.
వసంత కాంతమ్మ గారి చెవిలో,”నేనీ రోజే చుస్తున్నానమ్మా ఈ పిల్ల ఇలా ఏ గొడవ లేకుండా తినడం,” అంటూ గుస గుస గ చెప్పింది. కాంతమ్మగారు నవ్వుతూ తినటం ముగించేసింది.
మిగిలిన ఇన్ మేట్స్ రమణమ్మ గారికి, కమలమ్మ గారికి మిగిలిన వాటిని సర్దడం లో సాయం చేసారు. మరో ఇద్దరు టేబుల్ తుడిచి గిన్నెలు,పళ్ళాలు కడగడానికి తీసుకెళ్లారు. అప్పటికి 2;30 అయింది.
“మైత్రేయి! జానీ కూడా తింటాడేమో అడుగు,” అని అన్నది కాంతమ్మ గారు.
వసంత కల్పించు కుంటూ, “అతనికి రమణమ్మ గారు ముందే పెట్టారమ్మా,” అని చెప్పింది.
కాంతమ్మ గారు ఎప్పుడొచ్చిన జాని కి పక్కనే కూర్చొని అన్నపెట్టడం రమణమ్మ గారికి చాలా ఇష్టం. అదే విషయం వసంత ఆమెనే అడిగింది.
దానికి జవాబుగా, “అవునమ్మ! జానిని చూస్తే నాకు నా సొంత బిడ్డని చూసి నట్లుగా ఉంటుంది. ఆ పిల్లగాడు కూడా వచ్చిన ప్పుడల్లా నన్ను ‘అమ్మ, అమ్మ, అంటూ పిలుస్తాడు. నేను ఏది పెట్టిన వద్దన కుండ తింటాడు. ఎంతో ప్రేమ గా,” అంటూ చెప్పుకొచ్చింది. ‘మాతృ ప్రేమకు కులం గోత్రం అవసరం లేదు. ఆ ప్రేమ కలగాలంతే’ అని అనుకుంది వసంత.
అదే ప్రేమ మళ్ళీ రోజు జ్యోతి కి కాంతమ్మ గారి పట్ల కలిగింది. ఒక బిడ్డకుండే ప్రేమ.
జ్యోతి కాంతమ్మ గారి చెయ్యి పట్టుకొని ,”నాతొ రండమ్మా, నా రూముకి వెళదాము, “ అని లాగింది. “ అలాగే! “ అంటూ, ”రమణమ్మ గారు, కమలమ్మ గారు,” అని పిలిచింది. పరుగు లాటి నడకతో కిచెన్ నుండి వచ్చారు.
వాళ్ళని చూపిస్తూ,”చూడు జ్యోతి, ఈ రోజు నుండి నువ్వు ఈ అంటీల తోటి ఉండాలి. వాళ్ళతోటి కాస్త పనులు చేస్తూ ఉంటె, మనసు నీకు కుదుట పడుతుంది. నేను మీ అమ్మ వాళ్ళ వివరాల కోసం ప్రయత్నిస్తాను,” అంటూ, ”ఇప్పటి నుండి జ్యోతిని మీ బిడ్డలాగే చూసుకోవాలి. తను వాళ్ళమ్మ వాళ్ళ దగ్గరికి చేరేవరకు,” అంటూ జ్యోతి బాధ్యతని రమణమ్మ గారికి అప్పగించింది. కమలమ్మ గారి ని చూస్తూ, “కమల, ఈ పిల్లకి కాస్త ధైర్యం వచ్చేటట్టు చేయి. రోజు మంచి విషయాలే చెబుతూ జీవితం పట్ల నమ్మకం కలిగించు. నెల నెల డాక్టర్ చెకప్ చేయించు. నాకు చెబుతుండు. నేను మళ్ళి వచ్చి చూసే సరికి జ్యోతి మనలో మనిషి లాగ ఉండాలి,” అని చెప్పింది. ‘తెలియదు అసలు ఈ పిల్ల కి ఆమె కుటుంబం దొరుకుతుం దో లేదో?’ అని స్వగతం లో అనుకుంది.
“వసంత! పెద్దక్క ఆయాసం ఎలా ఉంది. దగ్గు తగ్గినట్లేనా. పద వెళ్ళి చూద్దాం,” అంటూ ఆఫీస్ కి ఇంకో వైపు అవుట్ హౌస్ లాగా ఉన్న రూమ్ లోకి వెళ్ళింది. పెద్దక్క కాంతమ్మ గారి ని చూస్తూ లేవబోతు ,”బాగున్నావా కాంత?” అని కాస్త ఆయాస పడుతూ అడిగింది.
“ లేవద్దు అక్క. మీ ఆరోగ్యం ఎలా ఉన్నది?” అడిగింది.
“ ఊరు ఎప్పుడో పొమ్మన్నది, కాటి నుండే ఇంకా పిలుపు రాలేదు,” అంది చిరు నవ్వుతో.
“అవేం మాటలక్కా! మా అందరికీ నువ్వే స్పూర్తి. కాలం తో, జీవితం తో నీ కంటే బాగా ఎవరు పోరాడ గలరు. నువ్విలా పడుకొని ఉన్న కూడా మా అందరికీ నువ్వున్నావన్నధైర్యం. ఇలా మాట్లాడి మమ్మల్ని భయపెట్టాలను కుంటున్నవా ఏంటి,” అంటూ చనువుగా ముందుకు వంగి తన చీర కొంగుతో ఆమె మూతి తుడిచింది రమణమ్మ. “విశ్రాంతి తీసుకొ ఏమి ఆలోచించకూ,” అంటూ బయటి కొచ్చింది కాంతమ్మ కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపు కుంటూ. ఆమె చెబుతున్న విషయాలు ,చేస్తున్న పనులను మౌనంగ చూస్తూ కూర్చుంది మైత్రేయి. ఆమెకి ఎన్నో ప్రశ్నలు మనసులో. వాటికీ సమాధానం ఆమెనే అడగాలని అనుకుంది.
“జ్యోతి! ఈ రోజు నుండి నువ్వు వసంత ని అక్క అని పిలవాలి. రమణమ్మ గారిని పెద్దమ్మ అని పిలవాలి, కమలమ్మ గారిని చిన్నమ్మ అని పిలవాలి,” అని సొంత కూతురికి బుద్దులు చెప్పినట్లు ఆ పిల్లకి చెప్పి, నేను మళ్ళి వస్తాను. అప్పుడు నువ్వు నాకు సంతోషంగా కనిపించాలి, సరేనా!” అంటూ ఆప్యాయంగా ఆ అమ్మాయిని అక్కున చేర్చుకొని వీపు నిమిరింది.
వశీకరణం చేసినట్లు ఆమె చెప్పిన ప్రతి దానికి తలూపింది జ్యోతి. కారులో వెళ్లి పోతున్న కాంతమ్మ గారిని చూస్తూ చేయి ఊపుతూ భోరున ఏడ్చింది, కంగారుగా రమణమ్మ గారు ఆ పిల్లని అక్కున చేర్చుకొని సముదాయింస్తూ జ్యోతి ని తన గది లోకి తీసుకెళ్లింది.
కారు కొంత దూరం వేళ్ళ గానే, కాంతమ్మ గారు, ”మైత్రేయి, నీ చూపుల్లో నాకొక విషయం అర్ధమయింది. నీ మనసులో చాల ప్రశ్నలున్నాయి కదు? అడిగేసేయ్,” అంటూ ఆమె చేతిని తన చేతి లోకి తీసుకొని నవ్వింది కాంతమ్మ గారు.
“మనం చూసినప్పుడు ఏంతో ఆందోళనతో ఉన్న జ్యోతి అంత తొందరగా మీ మాటనెలా విన్నది,” అనుమానంగ అడిగింది.
(ఇంకా ఉన్నది)