నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం – 6వ భాగం

జరిగిన కథ…

అర్జున్, సుభద్ర పిల్లల కోరిక మీద అమెరికాకు వస్తారు. ముందుగా కొడుకు అభిమన్యు దగ్గరకు మినియాపోలీస్ వస్తారు. అక్కడ సీనియర్ సెంటర్ ఉందని, అందులో చాలా కార్యక్రమాలు సీయర్ సిటిజెన్ కోసం నిర్వహిస్తుంటారని వాకింగ్ ఫ్రెండ్ పటేల్ ద్వారా తెలుసుకొని అందులో చేరుతారు. ఇంటికి వచ్చిన హాండీమాన్ బిల్ తో కబుర్లు చెపుతూ అతని గురించి తెలుసుకుంటారు.

ఇక చదవండి…

పిల్లలను స్కూల్ బస్ ఎక్కించి కాసేపు ఇంటి వెనుక ఉన్న లేక్ దాకా వాకింగ్ వెళ్ళి వచ్చాడు అర్జున్. అభి, శశి ఆఫీస్ పని మొదలయినట్లుంది వాళ్ళు కనిపించలేదు. ఇల్లు నిశ్శబ్ధంగా ఉంది. పాంట్రీ లో నుంచి మాత్రం చిన్నగా శబ్ధాలు వినిపిస్తున్నాయి.

“భద్రా” పిలిచాడు.

వస్తున్నాఅంటూ పాంట్రీ లో నుంచి చేతిలో ఏదో పట్టుకొని వచ్చింది. ” బ్రేక్ ఫాస్ట్ ఏమైనా చేస్తున్నావా? ఈ లోపల ఓ కప్ కాఫీ ఇస్తావూ?” అడిగాడు.

“ఈ రోజు పిల్లలు ఇంటి నుంచే పని చేసుకుంటారట. అభికి స్టఫ్డ్ పరోటాలంటే ఇష్టం కదా, అందుకని మూలీ పరోటా చేస్తాను. వాళ్ళు ఉన్నప్పుడే స్టవ్ వెలిగించమని హుకుం జారీ చేసారుగా మీరు. శశి మీటింగ్ లోకి వెళ్ళే ముందే అన్నీ చూసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగండి ఇస్తాను” జవాబిచ్చింది సుభద్ర.

“మూలీ పరోటా వద్దాంటీ. డైటింగ్ చేస్తున్నాము కదా మేము నూనెలవీ అవీ తినటం మానేసాము” అంది శశి పాంట్రీ లో నుంచి బయటకు వస్తూ.

శశి చెప్పేది పూర్తిగా వినకుండా “మీ డైటింగ్ లు మేము వెళ్ళాక చేసుకోండి. ఇప్పుడు మటుకు ఆ ఆకులూ అలములూ మానేసి నేను చేసేవి తినండి” అంది సుభద్ర.

అత్తగారి మాట్లకు నవ్వేసి, “ఇదో ఆంటీ మీరు స్టవ్ వెలిగించండి, చూసి వెళతాను” అని పిలిచింది.

స్టవ్ వెలిగించి, ఇన్స్టాపాట్ లో ఉన్న పప్పులో పోపువేద్దామని,పోపు గరిట స్టవ్ మీద పెట్టింది. కొంచం కాలాక, నూనె వేసి, కాగాక ఆవాలూ, ఎండు మిరపకాయ ముక్క వేయగానే నూనెబాగా కాగిందేమో ఒక్కసారే పొగ వచ్చేసి, ఎక్కడి నుంచో గణగణమని పెద్దగా గంటలు వినిపించాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అర్జున్, స్టవ్ దగ్గర ఉన్న సుభద్ర ఉలిక్కిపడ్డారు. సుభద్ర ఒక్క అంగలో పక్కకు వచ్చి “ఏమైందీ?” గాభరాగా అడిగింది.

“ఏమీ కాలేదాంటీ, నూనె బాగా కాగి పొగ వచ్చింది కదా! అందుకని ఫైర్ అలారం మ్రోగింది. పరవాలేదు, లైట్ తీసుకోండి” అంటూ స్టవ్ ఆపేసింది.

“ఇదో ఇట్లా ఏదో తెలిసీతెలియకుండా చేస్తావనే వద్దన్నది” అన్నాడు అర్జున్.

భయంభయంగా చూస్తున్న సుభద్రను చూసి “పరవాలేదాంటీ. కొన్ని సార్లు అట్లా అవుతుంది. భయపడకండి. ఇదో ఇటు చూడండి, ఈ బటన్ నొక్కుతే ఫాన్ ఆన్ అవుతుంది. పొగ రాదు. ఈ స్టవ్ మీద గిన్నెలు వేడి కాస్త ఆలశ్యంగా అవుతాయి కానీ ఒక్క సారి వేడయ్యాయంటే చాలా ఎక్కువగా వేడవుతాయి. నూనె ఎక్కువ వేడి కాకుండానే పోపేసేయండి”   వివరించింది శశి.

కొంచం భయంభయంగానే వంట మొదలు పెట్టినా పూర్తి అయ్యేసరికి ఆ ఏముంది ఇందులో మన ఎలెక్ట్రిక్ స్టవ్ లు వెలిగించినట్లే కదా! కాకపోతే అలవాటులేక కాస్త భయం అనుకుంది. మామిడిమురుగులు కాకుండా తాజా మామిడికాయతో చేసినట్లుగా ఉంటుందని, ఇంటి నుంచి తెచ్చిన, ఉప్పు, పసుపు కలిపిన పచ్చిమామిడికాయ తురుము  వచ్చిన రోజే శశితో ఫ్రీజర్ లో పెట్టించింది. దానితో మామిడికాయ పప్పు చేసింది. మామిడికాయపప్పులోకి చల్ల మిరపకాయలు, అభి ‘చామే’ అని ఇష్టపడతాడని కాసిని వేయించింది. తెలిసిందిగా ఈ సారి పోపు గరిట కాకుండా  హాండిల్ ఉన్న చిన్న మూకుడు లాంటిది తీసుకొని, అందులో నూనె వేసి, ఫాన్ వేసి పొగరాకుండా,  వేడిచేసి మరీ వేయించింది. చామగడ్డ వేపుడు చేసింది. వీళ్ళు ఉన్నారని, అభి, శశి భోజనానికి కిందికి వచ్చారు. లేకపోతే ఎప్పుడో ఇంత బౌల్ లో వేసుకొని తినేస్తారుట!

“వావ్ మాతే, మామిడికాయపప్పు, చామేలు వావ్” అని తింటూ, “డాడీ ఈ వీక్ ఎండ్ మినెటొంకా లేక్ కు వెళుదాము. శశి అక్కడ క్రూస్ కు బుక్ చేసింది” అన్నాడు అభి.

“ఇక్కడ లేక్ ఉందా?” అడిగింది సుభద్ర.

“మినియాపోలీస్ ను సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు. ఇక్కడ దాదాపు పదివేల లేక్స్ దాకా ఉన్నాయి. మనింటి వెనుక చూసావు కదా ఒక లేక్. ఇలా అన్నమాట. ఇప్పుడిప్పుడే లేక్ చుట్టూ ఎండిన చెట్లు పచ్చగా అయ్యాయి కదా. ఇంకా పచ్చగా గుబురుగా అవుతాయి. చలికాలం లేక్ లో నీరంతా మంచులా గడ్డకడుతుంది. అప్పుడు కొందరు లేక్ మీద టెంట్స్ వేసుకుంటారు. టెంట్ బయట కుర్చీలో కూర్చొని, గాలం మంచులోకి గుచ్చి చేపలు పట్టుకుంటారు. ఇప్పుడు మంచు కరిగిపోయింది. ఇంక చిన్నగా వలసపక్షులు వస్తాయి. అప్పుడు లేక్ దగ్గర వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది” చెప్పాడు.

“ఓహ్ వింటుంటేనే చాలా బాగుంది” అంది సుభద్ర.

“అందుకే లేక్ చుట్టుపక్కల ఇళ్ళు కొనుక్కోవటానికి పోటీ పడుతుంటారు. ఇక్కడ ఇంటి ఖరీదు కూడా ఎక్కువే ఉంటుంది” శశి చెప్పింది.

“ఇంతకీ మినెటొంకా లేక్ ఏమిటి? అక్కడ క్రూస్ అన్నావు?” అడిగాడు అభిమన్యు.

“ఇక్కడ ఉన్న పెద్దలేక్స్ లలో ఇది ఒకటి అంకుల్. ఇది మనకు దాదాపు 16 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. చాలా పెద్ద లేక్. మినటొంకా అంటే ‘మిని టంకా’ అంటే గ్రేట్ వాటర్ అని అర్ధం. ఇది చాలా పాతది. దీని చుట్టుపక్కల పాత సిటీ ఉంది. చూసేందుకు చాలా బాగుంటుంది. ఇందులో కూడాక్రూస్ ఏర్పాటు చేసారు. మనకు లంచ్, టీ, స్నాక్స్ అన్నీ అందులోనే.బయట ఫుడ్ అలోవ్ చేయరు.  దాదాపు మూడు నాలుగు గంటలు ఒక మోస్తరు నౌకలో లేక్ లో తిప్పుతారు. చెప్పటమెందుకు. చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు” అంది శశి.

“నార్త్ అమెరికాలో ‘మిసిసిపి నది ఉంది. అది ఇక్కడ నుంచే మొదలవుతుంది. మినటొంకా లేక్ లోనే కాకుండా ఈ నదిలో కూడా క్రూస్ ఉంది. కాకపోతే మనం మినటొంకా లేక్ దానికి వెళుతున్నాము. ఎందుకంటే దాని చుట్టూ చాలా పురాతన బంగళాలు ఉన్నాయి. చాలా వరకు వాటిని మార్చలేదు. ఇంక లేక్ ఒడ్డున ఉన్న వాటిల్లో రెస్టారెంట్స్, షాప్స్ పెట్టారు. పాతవి అంటే మమ్మీకి ఇష్టం కదా! అందుకన్నమాట!” నవ్వుతూ అన్నాడు అభి.

“మిసిసిపీ నదికి కూడా వెళుదాము. కావలంటే కాసేపు బోట్ లో తిరగవచ్చు.ఇంకా ఇక్కడికి నాలుగు గంటల దూరములో “లేక్ సుపీరియర్” అని ఉంది. ఇది ప్రపంచములోనే అతి పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. కెనడా నుంచి వస్తూ, అట్లాంటిక్ సముద్రముదాకా వెళ్ళి, అందులోకలుస్తుంది. అక్కడికీ వెళుదాము. అక్కడికవుతే కావాలంటే పిక్నిక్ లాగా ఏమైనా చేసుకొని తీసుకెళ్ళవచ్చు. లేదా అక్కడే ఏమైనా తినవచ్చు. మా ఫ్రెండ్స్ కూడా ఎవరయినా వస్తారేమో అడుగుతాను. ఇద్దరుముగ్గురు కుటుంబాలు కలిసి వెళితే ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు క్రూస్ మటుకు నాలుగు గంటలది తీసుకున్నాను” అంది శశి.

“ఓకే డన్” అన్నాడు అర్జున్.

“మనమేమన్నా చేసి తీసుకెళ్ళాలా?” అడిగింది సుభద్ర.

“లేదాంటీ అందులోకి మన ఫుడ్ ఏమీ తీసుకు రానీయరు” చెప్పింది శశి.

“అభి చెప్పాడుగా సరిగ్గా వినలేదా?” అడిగాడు అర్జున్.

“విన్నానబ్బా! మళ్ళీ ఇంకోసారి కాస్తోకూస్తో అనుమానం తీర్చుకుందామని అడిగాను” అంది సుభద్ర.

రాత్రి పనంతా అయ్యాక, అలవాటు ప్రకారం స్పూర్తి ఫోన్ చేసింది. “ఏమిటమ్మలూ ఇవ్వాళ్టి విశేషాలు?” అడిగాడు అర్జున్.

“ఏముంటాయి డాడీ మీటింగ్స్ అయ్యాయి. పిల్లలు భోజనం చేసి చదువుకుంటున్నారు. విజయ్ కూడా ఏదో నవల చదువుకుంటున్నాడు. నువ్వు చెప్పు మీ విషయాలు” అడిగింది స్పూర్తి.

“ఈరోజు కాస్త కిందా మీదా పడి మీ మమ్మీ వంట చేసింది. పెళ్ళైన కొత్తల్లో అత్తగారి దగ్గర వంట నేర్చుకున్నట్లు, ఇప్పుడు కోడలు దగ్గర నేర్చుకుంటోంది” సుభద్రను ఆటపట్టిస్తున్నట్లుగా సుభద్ర వైపు చూస్తూ అన్నాడు అర్జున్.

“అప్పుడు వంటలోకి వచ్చి, వంట నేర్పిస్తున్నానంటూ ఉప్పు ఎక్కువేసి నన్ను నానా తిప్పలు పెట్టినట్లు ఇప్పుడు మీ డాడీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారులే! ఊరికే ఏమీ ఉండటం లేదు” ఉక్రోశంగా అంది సుభద్ర.

“మొత్తానికి ఇప్పుడూ గొడవ పడుతూనే ఉన్నారన్నమాట. ఎక్కడైనా మీ విశేషాలు అంతేనా డాడీ” నవ్వింది స్పూర్తి.

“ఈ వీకెండ్ మినటొంకా లేక్ క్రూస్ కు బుక్ చేసింది శశి. ఇంకా ఇక్కడ చాలా లేక్స్ ఉన్నాయట కదా! వీలు వెంట చూపిస్తామన్నారు” అన్నాడు అర్జున్.

“మినియాపోలీస్ మినటొంకా స్టేట్ లో సిటీ. సెయింట్.పాల్ రాజధాని. మినియాపోలీస్, సేయింట్.పాల్ మన హైద్రాబాద్, సికింద్రాబాద్ లాగా ట్విన్ సిటీస్. ఈ సిటీలు సుమారు నాలుగు వందల ఏళ్ళ క్రితం కట్టారు. అంతకు ముందు ఆ చుట్టుపక్కల మన హైద్రాబాద్ చుట్టూ ఉన్నట్లుగా చిన్నచిన్న గ్రామాలు ఉండేవి. అక్కడ పొలాలల్లో, గోధుమ, మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు. వాటిని ఆడించేందుకని మినియాపోలీస్ ఉన్న స్థలం లో మిల్ కట్టి, మినియాపోలీస్ ను డెవలప్ చేసారు. లేక్స్ నే కాదు అక్కడపండ్ల తోటలు, మొక్కజొన్న పొలాలు చాలా ఉన్నాయి. ఆపీల్స్, చెర్రీస్, పీచెస్ ఇలా పండ్ల తోటలు ఉన్నాయి. పండ్ల తోటలలో మనము సొంతంగా కోసుకోవచ్చు. ఒక ఆదివారం అక్కడకు వెళ్ళండి. ఇంకా పూల తోటలు ఉంటాయి. అవీ చాలా బాగుంటాయి. సీజనల్ పూలు వేస్తారు.  Arboretum అంటారు.అందులో జపనీస్ అనీ, చైనీస్ అనీ రకరకాలుగా తోటను వేస్తారు. పక్షులు, చిన్నచిన్నజలపాతాలతో చాలా బాగుంటుంది. లోపలంతా చిన్న వాన్ లో తిప్పుతారు. టికెట్స్ ఉంటాయి వీటన్నిటికీ. ఇక్కడ అట్లాంటాలో కూడ అలా పండ్ల తోటలకు వెళ్ళి మనము కోసుకోవచ్చు. మీరు వచ్చినప్పుడు తీసుకెళుతాను. ఇంకా సెయింట్. పాల్ లో మన అసెంబ్లీ హాల్ లాఉంది. దానిని ఇక్కడ State Capitol building అంటారు, దానికి కూడా వెళ్ళి చూడండి. నేను అక్కడ ఉన్నప్పుడు ఆగస్ట్ 15న మన స్వాతంత్ర దినోత్సవం రోజున, బయట లాన్ లో మన ఝండా ఎగురవేసి చిన్న ‘మేలా’ లాగా మనవాళ్ళు చేసారు. నేను వెళ్ళాను.ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు” అంది స్పూర్తి.

“ఓ అవునా? అలాగే వీలైయినన్ని చూస్తాము” అని కాసేపు అర్జున్, సుభద్ర ఇద్దరూ కూతురితో మాట్లాడి గుడ్ నైట్ చెప్పి పెట్టేసారు.

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

అవకాశవాణి – is it ok for friendship?