తొలి తెలుగు కవియిత్రి తాళ్ళపాక తిమ్మక్క 

తాళ్లపాక తిమ్మక్క (15వ శతాబ్దం) తెలుగులో రాసిన తొలి మహిళ. 

 తెలుగు సాహిత్య వనంలో కవయిత్రులలో మనకు తెలిసి మొల్ల ప్రథమ కవయిత్రి. మొల్లకు పూర్వము కవియిత్రులున్నారని మనకు ప్రముఖ ఆంధ్ర వాజ్ఞ్మయ పరిశోధకుడు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు చెప్పే వరకు ప్రపంచానికి తెలియదు.  

 రామాయణ కవియిత్రి మొల్ల కు పూర్వము తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. ఆమె రచించిన ప్రధానమైన కావ్యం ‘సుభద్రా కళ్యాణం‘.  ఇది ముందుగా ఎవరూ కనుగొన లేదు.  మరుగునపడింది. దీనిని బయటకు తీసుకువచ్చిన వారే వేటూరి ప్రభాకర శాస్త్రిగారు. 

 ఆమె నియోగ బ్రాహ్మణ వంశంలో పుట్టి, సాహిత్యమును అవుపోసన పట్టిన తాళ్ళపాక వంశానికి కోడలిగా వచ్చిందని తెలుస్తుంది. వారి తల్లితండ్రుల గురించిగాని మరే ఇతర వివరములు అందుబాటులో లేవు. మెట్టినింటి వంశంలో అందరూ కవులు, కవయిత్రులే. వారిలో ముఖ్యులు పదకవితా పితామహులు, శ్రీ వేంకటేశ్వరుని పరమ భక్తుడు, సంకీర్తనా చారుడైన తాళ్ళపాక అన్నమయ్య. ఆయన మొదటి భార్యే తిమ్మక్క లేదా తిరుమలమ్మ. వారిది 1424 – 1503 మధ్య కాలమని నిరూపించబడింది.   

 తాళ్ళపాక అన్నమాచార్యునికి  తిమ్మక్క, అక్కలమ్మ అని ఇద్దరు భార్యలు. పెద్దభార్య తిమ్మక్కకు కుమారుడు నరసింగన్న , చిన్నభార్య అక్కలమ్మకు ఒక పుత్రుడు పెద తిరుమలాచార్యుడు కాక ఇద్దరు కూతుర్లున్నట్టుగా తెలుస్తుంది.    

 ఈ కావ్యం శ్రీ కాళహస్తి రాజాగారి ఆస్థానం నుండి తెచ్చిన తాళపత్రం గ్రంథాలలో కనబడినదని, దీన్ని పరిశోధనా శాల విధ్యార్థులు కొంత దిద్ది క్రమంలో పెట్టారని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 1950 లో సుభద్రా కళ్యాణం పుస్తక ముద్రణ సమయంలో ముందు మాటలో రాశారు. 

ఆమె రచించిన మంజరీ ద్విపద కావ్యమే ‘సుభద్రా కళ్ళాణం‘. ప్రాస ఉంటే ద్విపద. ఈ కావ్యం ప్రాస లేనందు వల్ల ఇది మంజరీ ద్విపద అని, పాడుకోవటానికి వీలుగా ఉంటుందని వెల్లడించారు. సౌకుమార్యంగా అందమైన పదాలతో రచింపబడిన కావ్యమని పేర్కొన్నారు.  

సుభద్రా కల్యాణానికి ఆధారం నన్నయ భారతమే. నన్నయ ఆది పర్వంలో 135 గద్య పద్యాలలో విజయ విలాసం రచించాడు. అతనిని అనుసరిస్తూ తిమ్మక్క 1163 పాదాల ద్విపద కావ్యాన్ని రచించింది. సంస్కృత  తిహాసం నుండి తీసుకున్న కథలో ఆమె తెలుగు నేటివిటీని, సంస్కృతిని ప్రదర్శించింది. అందమైన తేటపలుకులతో చెప్పిన పాటగా తన కావ్యాన్ని పేర్కొంది. కొన్ని కొన్ని ఘట్టాలలో నన్నయలాగానే మూలాతిక్రమణం చేసిందని పేర్కొన బడింది. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ -తిరుమల వేంకటేశ్వరునికి అర్జునుని చేత మొక్కులందించింది 

 ఉత్తర భారతానికి చెందిన మహాభారతానికి చెందిన అర్జునుడు కథానాయకుడు అయినప్పటికీ, ఆమె తెలుగు సంస్కృతి, ఆచారాలు, ఇంద్రియాలు, తెలుగు ప్రదేశాలతో కథను తిరిగి ప్రదర్శించింది. 

నన్నయమహాభారతంలోలేని బావా మరదుల హాస్యం తిమ్మక్క సుభద్రా కల్యాణంలో చేర్చి సుభద్ర పాత్రను మలిచింది.  సందర్భోచితంగా ఆమె వయసుకు తగ్గ ఆటలను కూడా ఆడించింది. చేమకూర వెంకటకవితన విజయ విలాసంలో తిమ్మక్కను అనుసరించాడు. సుభద్రఅర్జునునివర్ణించిన సందర్భంలో రచించిన- “ఎగు భుజమ్ముల వాడు మృగరాజు నడుము నడచి పుచ్చుకొను నెన్నడుము గలవాడు” – అన్న తిమ్మక్క రచనను చేమకూర వెంకటకవి – “ఎగుభుజములవాడు మృగరాజ మధ్యంబు పుదికి పుచ్చుకొను నెన్నడుమువాడు”- అంటూ అనుసరించాడు. సుభద్రా కల్యాణం స్త్రీలకోసం స్త్రీ రచించిన గ్రంథం అన్న విషయం కావ్యాన్ని చదివితే అర్థమవుతుంది. సుభద్రా కల్యాణాన్ని తిమ్మక్క రచించలేదన్న వాదోపవాదాలు కూడా పండితలోకంలో ఉన్నాయి. 

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తప్పెవరిది?

దొరసాని