తప్పెవరిది?

రమక్కతో ముచ్చట్లు -5

రమాదేవి కులకర్ణి

శనార్తులు అందరికీ.మంచిగున్నరా?
ఈవారం ముచ్చట్లు మాత్రం చాన బాధతో
చెప్తున్న మీకు..! కడుపుల చెయ్యి వెట్టి తిప్పినట్టయితుంది నాకు. ఏం కాలము, ఏం మనుషులు,ఎంత ఆగమైతున్నమని రంది ఐతుంది. ఒక పెద్ద ఇస్కూల్ల.. తొమ్మిదో తరగతి చదివే పోరడు రెండో తరగతి చదువుతున్న చిన్నపిల్ల మీద అగాయిత్యం చేసిండంట, గా పిల్లగానికి టిసి ఇచ్చినమ్, ఇగ మళ్ళా అట్ల జరగకుండ సూసుకుంటమని స్కూల్ మేనేజ్మెంట్ చెప్పిండ్రు. గిట్ల టిసి ఇస్తే సరిపోతదా! తొమ్మిదో తరగతి సదువుతున్నడంటే ఆడుగుడా పోరడేనాయే, అప్పుడే వానికి గిస్వంటి పనులు చేయాలనే ఆలోచన ఎందుకు అస్తుంది. దిమాక్ ఎంత గలీజ్ అయిపోతుంది. వాడి డిమాఖ్ ల పురుగు జొర్రిందని ఎవ్వళ్లకు గూడ ఎందుకు అనిపించలేదు!!??

సదువులు, ఆటపాటలు ఉండాల్సిన వయసుల ఏమైతున్నరు పోరలు. ఆడపిల్లల అవయవాలు సూడాలే, సెక్స్ కోరికలు ఇప్పటినుంచే వాళ్ళ మైండ్ల తిరిగితే .. ఇగ సమాజం ఏం బాగుపడుతది? ముందు ముందు భవిష్యత్తు ఎట్లుంటది? పసి పిల్లల్ని గూడ ఏడ దాచి పెట్టాలే.
నెలల పిల్ల కాడికెల్లి, ముసలోళ్లదాక… ఆడది ఉంటే సాలా ఇగ! Sexual abuses, assault స్కూలల్ల
టీచర్లు చేసిండ్రు, తాతలు, మామలు ఇంటిపక్కల అంకుల్లు, ఆటో డ్రైవర్లు.. కొన్ని సార్లు కన్న తండ్రిగూడ. ఇవన్నీ వార్తలల్ల సదువుతున్నం,టీవీలల్ల సూస్తున్నము. కొన్నిసార్లు మన సుట్టుపక్కలనే ఇట్ల జరుగుతున్నయి.
మన బిడ్డకు కాదు కదా అని నోరు మూసుకొని కూసుంటే మనం మనుషులమేనా అసలు??. జవాబు చెప్పుండి మీరు దీనికి నాకు. మన కళ్ళల్లకెల్లి రక్తాలు కారాల్నా?వద్దా?
గిట్లాంటి నీచమైన సంఘటనలు జరిగినప్పుడు పిల్ల పరువు మర్యాదల కోసము పేరు బయట వెడ్తలేము అంటున్నరు. రెండో తరగతి సదువుతున్న పిల్లకు ఏమి ఎరక? ఆర్నెల్ల పసికందుకు ఏం తెలుస్తది? గిది సరైన న్యాయమేనా?
ఒక రెండు రోజులు లొల్లి జేసి ఆగిపోతం . మళ్లీ కొన్ని రోజుల తర్వాతగిట్లనే జరుగుతుంది.
తప్పు ఎవళ్లది అంటరు?
మన బాధ్యత ఎంతుంది ఇండ్ల!? ఆలోచించుండి. బడులల్లకి పిల్లల్ని పంపేముందు సైన్సు లెక్కలె కాదు ఆడ కొంచెం మంచి మాటలు, నీతి ధర్మము వాటికి గూడ ఏమన్నా విలువిస్తున్నర లేదా అని తల్లిదండ్రులు సూడుండి. మీ పిల్లలు అంటే యంత్రాలు గాదు, మార్కుల యంత్రాలు అసలే గాదు.
శాన మటుకు ప్రైవేట్ మేనేజ్మెంట్లకు
స్టూడెంట్ లంటే ర్యాంకులు తెచ్చేటోళ్లు,
వాళ్ల స్కూళ్లల్లా కాలేజ్ లల్లా స్ట్రెంతులు నింపేటోళ్లు. ఎవ్వళ్లకు కోపం వచ్చినా సరే ఇది మాత్రం పక్కా నిజం.
ఇగ తల్లిదండ్రులకు గూడ
పోరలంటే సదువు..సదువు దప్ప ఇంకొక ముచ్చట ఉండొద్దంటరు. ఆటలాడుకొనుడు అంటే ఏంది క్రికెట్ లాంటివి ఆడాలే. ప్రెస్టేజ్ ఆటలు.
అమ్మా నాయినలు, అమ్మమ్మ నాయనమ్మ తాతలు అందరూ కూసోని మాట్లాడుడు, నీతి కథలు , రామాయణము మహాభారతం లాంటి మంచి కథలు చెప్పుడు, ధర్మమంటే ఏంది? నీతి అంటే ఏంది అటువంటి ముచ్చటలే లేవు
ఈ కాలంల! వాళ్లకు ఒకరి మీద ఒకళ్ళకి గౌరవ మెట్ల వస్తది? ఆడపిల్లలు మగపిల్లలు ఒకళ్ళను ఒకళ్ళు గౌరవించుకోవాలె. పిల్లల విషయంలకొస్తే మాత్రం ఇది స్కూలు మరియు తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యత అంట నేను.
తల్లిదండ్రులకు టైమ్ లేదు పట్టి లేదు, ఇగ స్కూలల్ల స్ట్రెంతులు, ర్యాంకులు వస్తే సాలు. మోరల్ ఎడ్యుకేషన్ కు పీరియడ్ పెట్టమంటే ఎడ్డోళ్ళని సూసినట్టు సూసి
గొల్లున నవ్వుతుండ్రు. మంచి చెప్పేటోళ్లు ఈ దునియాల హౌలా గాండ్ల లెక్క కనవడుతున్నరు. ఇంగ భావితరంకు మన సంస్కృతి ఏం తెలుస్తది? స్త్రీలు అంటే గౌరవం ఎట్లేర్పడుతది.
మన కర్మ గాలి ott ఓటిపి కూడా నట్టింట్లనే పాడైంది. ఎసువంటి.. ఎసువంటి చెత్త సూపెడుతున్నరు… దిమాఖులు పోరగాండ్లయి కరాబ్ అయిపోతున్నయ్. చట్టాలు గూడ ఒకసారి గట్టిగా పనిష్మెంట్ జెయ్యాలే! ఓటీటీ లమీద కొంత పట్టు ఉండాలె
గవర్నమెంటుకి. పెద్దోళ్ళు భయం భక్తి అనేటోళ్లు. ఇప్పుడున్నయా ఎవరికైనా
ఇది చాలా నిజం. ఆలోచన చెయ్యుండి తల్లిదండ్రుల్లారా …!
పిల్లలకు మీ భయం లేకపాయె,టీచర్లు అంటే భయం లేకపాయె, ఇంగ ఆళ్లకు అడ్డేముంటది.
మనకు తెలిసి నిర్భయ కాడి నుంచి మొదలు వెడితే డాక్టర్ దిశా, బంగ్ల మీద తల్లి పక్కన పన్న ఆర్నెలల పసి గుడ్డు దాక, మొన్న ఒక బడిల డాన్స్ చెప్పే సారు చిన్న పోరి మీద గిట్లనే చేసిండట, నిన్ననేమో 9దో తరగతి పిల్లగాడు రెండో తరగతి పిల్ల మీద చేసిండు. సార్ ను దేనితోని కొట్టాలి, ఈ పోరన్ని దేనితోని కొట్టాలి. మళ్లీ నాలుగు రోజులకు అంతా
ఎక్కడి దొంగలు అక్కడ్నే , గప్ చుప్ సాంబార్ బుడ్డి అయిపోతరు. ఇంకెక్కడన్న ఏమన్న గిస్వంటి వార్త వినే దాకా… ఎవ్వలకు చీమ కుట్టినట్టుగూడ ఉండదు. అవునంటరా కాదంటరా ??
మరి వ్యవస్థ ఎట్ల మారాలంటరు. మన బాధ్యత ఏమి లేదా? బాధకు గురైనోళ్లు మనోళ్ళు ఉంటే తప్ప మనకు చీము నెత్తురు మరగదా? రోషం రాదా? మనమందరం మనుషులమేనా కాదా??
నాకైతే మస్తు బాధైతుంది తమ్మి – చెల్లే..!!
ఎప్పటికీ మన స్వార్థం మనదేనా! మనమీదోళ్లకు మస్కాలు కొట్టుకోవాలె,సంపాదించుకోవాలె, మనం బిల్డింగులు కట్టుకోవాలే, కట్టలు ఎన్కేస్కోవాలే ఇంతేనా..బతుకంటే!
అందరికీ నేను విన్నవించుకుంటున్న..
సమాజం మారాలంటే బాధ్యత మన అందరిదీ. ఇట్లాంటి చెత్త చేసిన చెత్త నా కొడుకుల్ని నిలదీయండి. ఏందో అయితదని ఇంకేందో అని భయపడకుండి తమ్మీ..!
పక్కింటికి కష్టం వస్తే అది మన ఇంటికి కూడా రావచ్చు..! మనకేం పట్టి అని కుసోవద్దు. చిన్నగున్నప్పటి నుంచి పిల్లలకు అన్ని నేర్పుండి. ఆడపిల్లలు -మగపిల్లలు ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం ఉండేటట్టు నేర్పుండి. పెద్దోళ్ళు మీరు కూడా ఇంట్ల అట్లనే ప్రవర్తించుండి.
నీ ఇంట్లో కొడుకు గట్ల చెడ్డ పని చేయకుండా వాడిని సంస్కారవంతునిగా పెంచుండి. ఆడపిల్లకు నేర్పుడే గాదు, మగ పిల్లగానికి ముందు నేర్పుండి.
అసలు మన పుట్టుక ఏడికెల్లి వస్తది, ఎట్లొస్తది, స్త్రీ ఎంత గొప్పదో చెప్పుండి. అమ్మ ఎంత గొప్పది, అమ్మకు ఎంత కష్టం వాడి పుట్టుక అన్నది చెప్పుండి. దయగల హృదయం వాడిలో నింపుండి.
స్కూలల్ల మీరు పిల్లల్ని వేసేటప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు కదా దాంతోపాటు మోరల్ క్లాసులు ఉన్నయా..!ధర్మము నీతి కలిగిన వాళ్లు అక్కడ ఒక్కల్లన్న ఉన్నారా అని సూసుకోండి జర. మీకు ఒకటి చెప్తున్న వినుండి. అడ్మిషన్లు తీసుకునే దగ్గర కాడికెల్లి, స్కూల్ల ఉన్నోళ్ల బాడీ లాంగ్వేజ్ లు గమనించుండి జర. ఏమాత్రం తేడా అనిపించినా పైసలకో, గొప్పలకో పోయి పిల్లల్ని జాయిన్ చెయ్యకుండి.
శాన బాధతోని చెప్తున్నా తమ్మీ.. పైలం.. మస్తు రంది వడ్తున్నా…చెల్లె..!!
చివరిగా మళ్లీ అడుగుతున్న.. తప్పు ఎవరిది అంటరు???????!!!!!!!!!

బాధతో
మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కనువిప్పు

తొలి తెలుగు కవియిత్రి తాళ్ళపాక తిమ్మక్క