లిఫ్టినెంట్ భావనా కస్తూరి

భారత స్వాతంత్రానంతరం ఆర్మీ కవాతులో పురుషులతో కూడిన బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించడం చరిత్రగా చెప్పొచ్చు. 26 ఏండ్ల భావనా కస్తూరి ఈ అవకాశం పొందిన తొలి మహిళా ఆర్మీ అధికారిగా రికార్డు కెక్కారు. వీరి ఆధ్వర్యంలో 144 మంది జవాన్లు రాజ్ పథ్ లో నిర్వహించిన కవాతుకు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గౌరవవందనం స్వీకరించారు.
తొమ్మిది సంవత్సరాల క్రితం నేషనల్ క్యాడెట్ కార్ప్స్ మార్చింగ్ కంటింజెంట్ న్యూ ఢిల్లీలో కూడా పాల్గొన్నారీమె.

భావన సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్ విద్యార్థి, అరోరా కళాశాలలో చదివి ఉస్మానియా యూనివర్సిటీ నుండి మైక్రోబయాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 2016లో సర్వీస్ సెలెక్షన్ బోర్డు (యస్. యస్ బి.) లో విజయం సాధించి , ఇండియన్ ఆర్మీ కార్ప్స్ బెంగళూరు లో లాజిస్టిక్స్ సేవలందిస్తున్నారు.
ఆమె కుటుంబీకులెవరూ ఈ వృత్తిలో లేరు. భావన స్కూల్లో ఉన్నప్పుడే యన్. సి. సి. లో చేరి స్ఫూర్తి పొంది,సాయుధ దళాల వైపు ఆకర్షితురాలైనట్టు తల్లి శశిరేఖ తెలిపారు. తల్లి లేబర్ కోర్టులో స్టెనోగ్రాఫర్ కాగా, కస్తూరి జీవిత భాగస్వామి ఆర్మీ లో వైద్య సేవలందిస్తున్నారు.

భారత సైన్యంలోని అత్యంత ప్రాచీన రెజిమెంట్లలో ‘ఆర్మీ సర్వీస్ కార్ప్స్’ 257 సంవత్సరాల క్రితం ఏర్పడిన విభాగం, ఈ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ లో ఎప్పుడు పరేడ్ కు నాయకత్వం వహించేది మగ అధికారి మాత్రమే, కానీ ఈసారి అవకాశం ఒక తెలుగు మహిళలకు దక్కడం అరుదైన విషయం. అది తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.అందరూ తనను భావనా సాహెబ్ అని పిలవడం వింత అనుభూతినిచ్చిందంటారు. అమ్మాయిలు అందరూ ఆరాధనగా చూడడం కూడా కొత్తగా అనిపించింది ఈ హైదరాబాద్ యువతికి. భారత సైన్యంలో పురుషులదే కీలక స్థానం అని అభిప్రాయాన్ని తిరగరాస్తు నన్ను ఆ స్థానంలో నిలబెట్టిన ఘన చరిత్ర కూడా భారత సైన్యానిదే అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. వృత్తి ధర్మంలో భాగంగా కవాతు ప్రాక్టీసు డ్రిల్ తర్వాత కంటింజెంట్ కమాండర్ గా సభ్యులందరి బాగోగులు చూడటం సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకు వెళ్లడం ఈమె వృత్తి ధర్మం. పురుషులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నానని, ‘కార్గిల్ ‘ ప్రదేశం లో కూడా విధినిర్వహణలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు.

ఇక ఎంపిక ప్రక్రియ బెంగుళూరులోని ‘రెజిమెంటల్ హెడ్ క్వార్టర్స్’ లో స్క్రీనింగ్ విభాగం నుండి లెఫ్టినెంట్ భావన ఎంపిక చేయబడ్డారు. సాధారణంగా ఆరు నెలల ప్రాక్టీస్ చేస్తారు , కానీ వీరి బృందం ఒక సంవత్సరంపాటు ప్రాక్టీస్ కొనసాగించారట. ఈ పరేడ్ లో ప్రేక్షకుల స్థానంలో ఉన్న నా తల్లిదండ్రుల సమక్షంలో దళానికి నాయకత్వం వహించిన సందర్భం ఉద్వేగభరితమైందంటూ పేర్కొన్నారు. చెన్నైలోని’ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ’లో శిక్షణ సమయంలో ఒక చేత 18 కిలోల బ్యాగు ,మరోచేతిలో రైెఫిల్ తో 40 కిలోమీటర్లు పరిగెత్తే సందర్భాన్ని గుర్తు చేసుకుంటారామె. ఈ పర్యటన తిలకించేందుకు కుటుంబ సభ్యులు ఆరుగురికి అవకాశం దక్కిందని తెలియజేసారు. అమ్మాయిలు అంతా మీరు సైన్యానికి ఎలా వచ్చారు? ఆర్మీ ఆఫీసరా అంటూ ప్రశ్నలు వేస్తారు కానీ అందులో పెద్దగా ఆసక్తి ఉండదని ,అయితే సైన్యం అమ్మాయిలను ఆహ్వానిస్తుందంటూ, చక్కని వృత్తిని ఎంచుకోవడానికి సరైన సమయమంటూ అవసరమైన వారికి దిశా నిర్దేశం చేస్తానంటూ చెప్తారు. సాయుధ దళాల ఆవశ్యకత, వారి పనితీరు అన్ని వివరిస్తానంటూ చెప్పి, అదో అద్భుతమైన ప్రపంచం అంటూ కొనియాడారు.

ఆర్మీ డే ( రైజింగ్ డే )ప్రతి సంవత్సరం జనవరి 15న జరుపుకుంటారు. అప్పటి భారత సైన్యం మొదటి కమాండర్ ఇన్ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్, ఫీల్డ్ మార్షల్ కోదండర మాదప్ప కరియప్ప గారు, ‘చివరి బ్రిటిష్ జనరల్, సర్ ఫ్రాన్సిస్ బుట్చర్ ‘నుండి బాధ్యతలు స్వీకరించిన రోజు. సర్వ సైన్యాధ్యక్షుడు, ” దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను గౌరవించే రోజు “. ఈ సందర్భాన్ని దేశ రాజధాని ఇంకా సైనిక ప్రధాన కార్యాలయాలలో కవాతులు, ప్రదర్శనలతో “మృతవీరులకు” వందన సమర్పణ చేసి వారిని స్మరించుకుంటారు. ఈ సందర్భంగా 2019 లో ఈ అవకాశాన్ని భావనా కస్తూరి దక్కించుకున్నారు.
సాయుధ దళాల సుప్రీం కమాండర్ ముందు ప్రదర్శన ఇవ్వడం నా సెల్యూట్ కు ప్రతిగా వారు సెల్యూట్ చేయడం ,అలాగే స్టాండింగ్ ఒవేషన్ అందుకోవడం ఒక గొప్పఅనుభూతి అంటూ ఆనందంగా చెప్పారామె. కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కవాతు వీక్షించిన తదనంతరం ట్వీట్ చేస్తూ ‘రాజ్ పథ్ లో నారీశక్తికి ప్రత్యక్ష సాక్షంగా యూనిఫాంలోని స్త్రీల ప్రదర్శన చారిత్రాత్మకమంటూ భావనా కస్తూరి అండ్ అస్సాం రైఫిల్స్’ ను ప్రత్యేకంగా అభినందించారు. “కలలు కనండి సాకారం చేసుకోండి” అనే అబ్దుల్ కలాం గారి మాటలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన యువతిగా భావనాకస్తూరిని అభినందిస్తూ భావి జీవితంలో మరిన్ని విజయసోపానాలు అధిరోహించాలని ఆకాంక్షిద్దాం.

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆషాడమా నీకు జోహార్లు

కనువిప్పు