ఆషాడమా నీకు జోహార్లు

శశి! తప్పదంటావా! కేన్సిల్ చేసుకో! ఇంకో ఆరు నెలల్లో మీ అమ్మా నాన్నని పిలిపించుకుందాం.” ప్లీజ్ ప్లీజ్! “అంటూ చిన్నపిల్లాడిలా మారం చేస్తున్న ఆరుష్ వైపు కొంటెగా చూసింది శశి.

“ఇదేమన్నా అనకాపల్లి నించీ కాకినాడ టికెట్టా ఇరవై నాలుగు గంటల్లో కేన్సిల్ చేయటానికి.ఫ్లైట్ టికెట్ రా. అయినా నెల రోజులు ఇట్టే గడచి పోతాయి. నీ తొట్టి గ్యాంగ్ ని మిస్ అవుతున్నా నంటావుగా ఎప్పుడూ ఎంజాయ్ చేయి.” అంటూ తన వాళ్ళకని అమెరికా నించీ తీసుకెళ్ళాల్సిన గిఫ్ట్స్ సర్దుతూ శశి.

నీకసలు హార్ట్ లేదు.అయినా ఈ సెంచురీలో ఆషాఢాలు పాషాణాలు ఏంటి అంతా ట్రాష్. మోరోవర్ వుయ్ ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అవర్ పేరెంట్స్ అండ్ వుయ్ ఆర్ అవుట్ ఆఫ్ ద స్టేట్.

“ఆరుష్ ట్రై టు అండర్ స్టాండ్. నాకు మాత్రం నిన్ను వదలి వెళ్ళటం ఇష్టమా చెప్పు.నేను మా పేరెంట్స్ కి ఓన్లీ డాటర్ని.జస్ట్ మన పెళ్ళికి.ముందే నాన్నకి కార్డియాక్ ప్రోబ్లమ్ వచ్చింది. ఈవిధంగా ఆయనకి మెడికల్ చెకప్ చేయించినట్లూ అవుతుంది. ఈ ఆషాఢం సెంటిమెంట్ ఫాలో అయినట్లవుతుంది. నేను మాత్రం హండ్రెడ్ పర్సంట్ హ్యాపీ. ఆఁ వచ్చేటప్పుడు ఆషాఢ పట్టీ ఐ మీన్ ఆషాఢ బెల్ట్ తెస్తా నీకు.” అంటూ కొంటెగా చూసింది శశి.
★★★

శశి ఆరుష్ ల పెళ్ళిమార్గశిరమాసంలో అయింది.ఆరుష్ కొత్తకంపెనీకి మారటంతో పెళ్ళైన వెంటనే ఇద్దరూ న్యూ జెర్సీకి వచ్చేసారు శశికి అప్పగింతల కన్నీళ్ళు చెక్కిళ్ళు జారకుండానే.

శశి కార్డియాలజిస్ట్.మాస్టర్స్ ఇన్ సర్జరీకి స్టేట్స్ వచ్చింది.ఆరుష్ ని కలవమని శశి తల్లి తండ్రులు, శశిని కలవమని ఆరుష్ తల్లి తండ్రులు అనటంతో ఇద్దరూ కాఫీ షాప్ లో కలవటం ఒకరికొకరు నచ్చటంతో వెంటనే పెళ్ళి అయిపోయింది.

ఆరుష్ తల్లి తండ్రి కొంచెం ఛాందసులు.కోడలు ఆషాఢంలో పుట్టింట్లో ఉండాలని పట్టు పట్టింది.
శశి తల్లి అయ్యోపిల్ల ఈ దేశంలో ఉంటే ఆషాఢం పేరుతో పిల్ల తన దగ్గర ఒక నెల ఉండేది అని బాధ పడింది.

రోగీ పాలే కోరాడు వైద్యుడు పాలే కోరాడన్నట్లు శశి కి తల్లి తండ్రులు మీద బెంగగా ఉంది.అందుకే ఆషాఢం ఛాన్స్ వదలు కో
తలచు కోలేదు.

ఆరుష్ IIT కని ఢిల్లీ లో ఐదేళ్లు ,MS కని స్టేట్స్ రావటంతో ఒంటరిగా ఉండి ఉండి శశి సహచర్యంతో
ఈ ఏడెనిమిది నెలల్లోఒక్క నిమిషం శశిని వదలి ఉండలేని పరిస్థితికి వచ్చాడు.శశి నెలరోజులకి వెళ్తోందంటే చాలా తిక్కలుగా ఉంది.

★★★

ఎవరి ఫీలింగ్స్ తో సంబంధంలేనట్లు ప్రయాణం రోజు రానేవచ్చింది.

శశికి సెండాఫ్ ఇస్తూ ఆరుష్ కళ్ళలో నీళ్ళు చూసిన శశికి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగినాయిఆరుష్ చేయి చేతిలోకి తీసుకుని “ఇది మనకి చాలా మంచి టైము.మన ప్రేమ ఈనెలలో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. రెగ్యులర్ గా చాట్ చేసుకుందాం. అయినా మ్యారేజ్ తర్వాత బేచలర్లైఫ్ కి మగవాళ్ళు ఎదురు చూస్తారని విన్నా.నువ్వేంటి ఇలా “అంటూ ఎయిర్ పోర్ట్ లో ఎడ్వర్టైజ్మెంట్ బోర్డ్ చాటుగా ఒక స్ట్రాంగ్ హగ్ తో ఆరుష్ ని శాంతపరచింది శశి.

★★★

తల్లీతండ్రిని చూసిన శశి ఆరుష్ని తాత్కాలికంగా మరచి పోయిందనే చెప్పవచ్చు.
“తనమీద బెంగతో ఈ కొద్ది నెలల్లో నే అమ్మా నాన్నల లో వృధ్ధాప్యం పొడచూపుతోంది.తను రావటం ఎంతో మంచిదయింది. నెక్స్ట్ హాస్పటల్ లో జాయిన్ అయితే తనకి ఇన్నాళ్ళుండటానికి వెసులుబాటుండదు.అంతా మన మంచికే” అనుకుందిశశి.

ఇంతలో చల్లని గాలి చెంపకు తాకింది.వర్షం పడుతోంది కాబోలు అనుకుంటూ కిటికీ తెరిచింది.”తొలకరిచినుకులకి పుడమిపడతి ప్రియుని స్పర్శకి పరవశిస్తోందా అన్నట్టు గా ఉంది” నవ్వుకుంది.పరవాలేదు తనకీ కవిత్వం వస్తోంది అనుకుంటూ.
అమ్మ రెండు చేతులకీ గోరింటాకు పెట్టి అన్నం తిని పిస్తుంటే జీవితమంతా అమ్మదగ్గరుంటే బాగుండు అనిపిస్తోంది.

“అమ్మా నాకు పెళ్ళెందుకు చేసావమ్మా! తల్లి రెండు చేతుల్లో తలపెట్టుకుంటూ”అంది.

అర్ధవంతంగా నవ్వింది మాధవి.

రాత్రి వీడియో కాల్ లో గోరింటాకు తో పండిన ఎఱ్ఙని చేతులు చూపించింది శశి. ఆరుష్ ఆ చేతులు చూసి తన చేతులు చూపెట్టాడు ఆరుష్.చేతులో కాలిన బొబ్బలు.
“ఆరుష్! అయ్యో ఏమిటది ఏమైంది అలా ఎలా కాలింది” అడిగింది శశి.
“పరధ్యానంగా పాలు పొంగుతుంటే చూసుకో లేదు.గబుక్కున దింపబోతుంటే వేడి పాలు చేతిమీదపడ్డాయి.పడ్డప్పుడు చాలా మండింది.ఇప్పుడు ఒ.కె. ఊఁ ఏమిటి పాపాయి అమ్మచేతి గోరుముద్దలు తింటోందా!” అంటూ నవ్వాడు ఆరుష్.

“ఆరుష్ నిన్న అత్తయ్య ఫోన్ చేసారు.”

” ఆఁ ఏమందేమిటి?”

“ఏకంగా శ్రావణమాసం నోములు నోచుకుని వెళ్ళమంది.”

“ఏం నీకు శ్రావణపట్టీ వఢ్ఢాణం చేయిస్తానందా!”

” నవ్వింది” శశి.

“అలా నవ్వకు.ఆ బుగ్గన సొట్టచూస్తె!…”

” ఆఁ చూస్తే!”రెట్టించింది శశి.

ఈవిధంగా వారి చాటింగ్ గంటలు గంటలు గడిచేవి.

★★★
తల్లి కాళ్ళా వేళ్ళా పడుతూ పనులు అందుకోవటం,తండ్రిని చెకప్ లకి తీసికెళ్ళి బ్యాంకు వ్యవహారాలు చూడటం,తండ్రితో కొబ్బరి తోటలో విహారాలు,తనతోపాటు కొత్తగా పెళ్ళైన స్నేహితులు
ఆషాఢం పుణ్యమా అని పుట్టిళ్ళకి రావటంతో ఎన్నోఏళ్ళు చదువు ధ్యాసలో పడి పోగొట్టుకున్న ఆనందాన్ని మనస్పూర్తిగా అనుభవిస్తోందిశశి.

“అప్పుడేవచ్చి ఇరవై రోజులైంది.అమ్మా,అత్తయ్య శ్రావణ మాసం నోములయ్యాక వెళ్దుగాని అంటూ మొదలుపెట్టారు.” అనుకుంది శశి

“ఆరుష్ గుర్తుకు వచ్చి దుఃఖం వచ్చింది. ఎందుకో.పరుగెత్తి కెళ్ళి ఆరుష్ వళ్ళో వాలుదామనిపించింది.ఆరుష్ చిలిపి చేష్టలు,ఎయిర్ పోర్టులో ఆరుష్ కళ్ళలో నీళ్ళు ఏదో సన్నని బాధకు గురి చేసాయి.
ఎందుకో గట్టిగా ఏడవాలనిపిస్తుంది.అమ్మ ప్రేమగా వండిపెట్టినవి నోట్లోపెట్టుకోపోతుంటే కాలిన ఆరుష్ చేతులు గుర్తుకురావటం”శశికి ఆశ్చర్యం అనిపించింది.

తల్లి తనకిష్టమని చేసిన బొబ్బట్లు తినబోతూ “అమ్మా!ఆరుష్ కి బొబ్బట్లు,సొజ్జప్పాలు చాలా ఇష్టం.”అంది శశి.

ఇంకొకరోజు గుత్తివంకాయకూర తింటూ”అమ్మా!గుత్తివంకాయకూర ఆరుష్ కి చాలా ఇష్టం.ఫ్రిజ్ లో పెట్టకుని మూడు రోజులు అదే తింటాడు.”

“అమ్మా !ఆరుష్ కి లైట్ కలర్స్ ఇష్టం”
ఇలాసాగేది శశి సంభాషణ.

అక్కడ శశి వెళ్ళాక ఆరుష్ కి ఏమీ తోచటంలేదు.

“భార్యాభర్తల గా కంటే తామిరువురు
మంచి స్నేహితులు లా ఎన్నో విషయాలు చర్చించుకోవటంతో మొదలు గిల్లికజ్జాలు చిన్న చిన్న అలకలు ,అన్నిటికంటే తనని పసిపిల్లాడిలా లాలించేతీరు ఎంతో సేద తీర్చేది.” అనుకున్నాడు ఆరుష్.

శశి ధోరణి గమనిస్తున్న మాధవికి తన ఆషాఢ విరహాలు గుర్తుకొచ్ఛాయి.

★★★

మాధవి వంశీకృష్ణ ల మొదటి ఆషాడానికి శశిని కడుపుతో ఉంది మాధవి.మాధవి మామగారు పరమఛాందసుడు.మాధవికి ఆషాడం రావటానికి వారంరోజులకే ఆరోనెల నిండిన మూడురోజులకే సీమంతం చేసిపుట్టింటికి తీసికెళ్ళమన్నారు.
మాధవి తండ్రి ఢిల్లీలో రిజర్వ బ్యాంక్ లో మేనేజర్.
మాధవి తల్లికి అంత తొందరగా కూతుర్ని వంశీకృష్ణ నించీ దూరం చేయాలని లేదు.అందుకని వియ్యంకుడితో”అన్నయ్యగారు పిల్ల పిల్లవాడు మీకు మాకు దూరంగానే ఉన్నారుకదా!ఆషాఢం అంటూ వాళ్ళని విడ తీయటం ఎందుకు!ఇంకొక నెల కలసి ఉంటారు.తరువాత పురిటికి తీసికెళ్తాం”అంది .
“మీకు పిల్లని ముందుగా.తీసికెళ్తే ఖర్చు అనుకుంటే ఆపని చేయండి” అంటూ పడక కుర్చీలో విశ్రమించిన రామశాస్త్రి చటుక్కున లేచి లోపల కెళ్ళాడు..
ఇక చేసేది లేక మాధవిని ఆరునెలల నాలుగు రోజులకల్లా పురిటికి తీసికెళ్ళింది. నెల ఆషాడం కాస్తా ఏడునెలలు పుట్టింట్లో ఉండిపోవాల్సి వచ్చింది.ఆరోజుల్లో ఫోన్లు గొప్పవారి స్వంతం అవటంతో రోజుకో ఉత్తరం రాసుకునెవాళ్ళు మాధవి వంశీలు.
మాధవి వంశీల విరహం పరాకాష్ట చేరేవరకూ పుట్టింట్లో ఉన్నా పుట్టిన బిడ్డ ఆలనా పాలనా మాధవి తల్లి చూసుకో వటం కొంత ఊరట నిచ్చింది.
వంశీకి భార్య దగ్గరలేకపోతేఎంత ఇబ్బందో అర్ధమయ్యింది.ఆరోజు నించీ ఈరోజువరకూ ఒకరిని విడిచి ఇంకొకరుండలేదు .

★★★
మాధవి శశి మనస్సు తెలుసుకుంది. శశి విరహబాధని అర్ధంచేసుకుంది .ప్రబంధ నాయకుల విరహానికీ నిజజీవితంలో విరహానికి చాలా తేడాఉంది.
ఆవిరహం శరీరానికి సంబంధించినది.ఈవిరహం మనస్సుకి సంబంధించినది.కొత్తగా తమ జీవితంలోకి అడుగు పెట్టిన వ్యక్తి బాగోగుల గురించిన ఆరాటం తపన ఈవిరహం.ఈ ప్రేమ అనిర్వచనీయం.అదే విషయాన్ని గ్రహించింది మాధవి.

“అమ్మాశశి! ఈ కట్టుబాట్లు పూర్వీకులు ఎంతో ఆలోచించి పెట్టారనిపిస్తోంది.కొత్తగా పెళ్ళైన వారికి ఇంకా తల్లి తండ్రులు కి దూరంగా ఉండలేక అది తెలుసుకోలేక గొడవలు పడుతూ ఉంటారు.పెళ్లి అయి కలసిఉన్నా ఒక ఆకర్షణ,శారీరకవాంఛలతో కలసి ఉంటారు తప్ప నిజమైన ప్రేమ వారిలో నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పడైతే ఎడబాటు వస్తుందో అప్పుడు వారి ఆకర్షణని అధిగమించి ప్రేమ అనేది ప్రస్ఫుట మౌతుంది.అది నీలో నేనిప్పుడు గమనిస్తున్నా.మాతో సంతృప్తిగా గడిపి నీ భర్తను చేరి ఆనందంగా ఉండు.”అంటూ శశి చెక్కిళ్ళు నిమిరింది మాధవి.
“అమ్మ ఎంతచక్కగా విశదీకరించింది.తను గోల్డ్ మెడలిస్ట్ పైపెచ్చు డాక్టరు.కానీ అమ్మ చెప్పిన మాటల్లో ఏ ఒక్కటీ తను కొట్టిపారేయలేదు .నిజమే ఆరుష్ తో ఉన్నప్పుడు సైకలాజికల్లీ ఎక్కడో చిన్న బెంగ ఉండేది అమ్మనాన్నలమీద.ఇక్కడికి వచ్చాక మళ్ళీ చిన్న దిగులు ఆరుష్ మీద.ఆరుష్ కాలిన చేయి చూసినప్పుడు అప్రయత్నంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.తనకెంతోఇష్టమైన వంటల్ని కూడా తినలేకపోతోంది ఆరుష్ జ్ఞాపకాలతో,”స్వగతంగా అనుకుంది శశి.
వెంటనే తల్లిని ముద్దుపెట్టుకుని వళ్ళో తలపెట్టుకుని”అమ్మా నాచదువు వేస్ట్.ఏ సైకాలజిష్ట్ కూడా నీ అంత చక్కగా చెప్పలేరమ్మా!అంటూ కళ్ళుమూసుకుంది శశి.

” ఏమిటి శశీ! అమ్మవళ్ళో పడుకున్నావు. అవతలఫోను మ్రోగుతుంటే పట్టించుకోకుండా” అంటూ ఫోన్ తెచ్చి కూతురికి ఇచ్చాడు అప్పుడే బయటనించీ లోపలకి వచ్చిన వంశీకృష్ణ.
ఫోన్ చూసి వెంటనే తల్లి వళ్ళోంచి లేచి తనగదిలోకి వెళ్ళింది శశి.
“అబ్బాయినించీ అనుకుంటా”అని వంశీమాధవులు నవ్వుకున్నారు తమగతం గుర్తుకురాగా
“అమ్మా!నాన్నా! ఆరుష్ ప్రాజెక్టు పనిమీద ఇండియా వస్తున్నాడుట.ఇద్దరం కలిసి వెళ్దామని నా ఫ్లైట్ టికట్కేన్సిల్ చేసాడుట.నన్ను నీ నోములు వ్రతాలు చేసుకో.అమ్మ కోడలచేత నోము నోయించాలని ముచ్చట పడుతోంది అన్నాడమ్మా!”అంటూ గదిలోనించి వస్తూ తల్లిని తండ్రిని చూసి చిన్నపిల్లలా ఇద్దరినీ గట్టిగా వాటేసుకుంది.
అది ఆరుష్ వస్తున్నాడని సంతోషమా!లేక తల్లి తండ్రి తో ఇంకొన్నాళ్ళు గడపచ్చునని సంతోషమా!

జోహార్ జోహార్ ఆషాడమా!వెన్నంటి వచ్చే శ్రావణమా!

దేవులపల్లి విజయలక్ష్మి.

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి – పాట విశ్లేషణ

లిఫ్టినెంట్ భావనా కస్తూరి