ఎపుడో చేసేద్దామనుకున్నా
కాని పనుల వత్తిడి
నా పని పక్కన పెట్టా
చిన్నప్పుడు చేద్దామంటే చదువు బాధ
నా పని పక్కన పెట్టా
హైస్కూల్ లో చేసిన వాటికి ఆహా ఓహో ల రివార్డు లొచ్చాయి.
కొనసాగిద్దా మనుకున్నా తీరికేది పై చదివాయే!
నా పని పక్కన పెట్టా
బతుకు బండి దౌడులో స్వేదంతో పరుగే సరిపోయింది. కుటుంభ భారంలో మునిగి పోయా.
నా పని పక్కనపెట్టా
వయసు మీదపడి చేసే పనుల నుంచి బయటకు తోయబడ్డా
అపుడైనా చేద్దామని కలంపట్టా, కానీ నాకేమొచ్చని సందేహం
కాసేపు నా పని పక్కనపెట్టా
రంగుల రచనా ప్రపంచం వింతగా, కొండంతగా అనిపించింది.
ఏంచెప్పాలన్నా నాకు తెలియాలికదా! నా చదువు నాకు లోకం పోకడ తెలపలేదాయే
అందుకోసం పఠనం ప్రారంభించా.
నా పని కాసేపు పక్కన పెట్టా
అయ్యో కాలం పరిగెడుతుంది మరి.
ఆగవా కాలమా నాకోసం
చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్
ఉన్న జీవితకాలం సరిపోదు.
కాసేపు ఆగవా నాకోసం.
శరీరం పట్టు తప్పుతుంది. చేతులు వణుకుతున్నాయి. కలం జారి పోతుంది. ఆలోచించింది గుర్తుకు రావటం లేదు.
కాలమా కాసేపు ఆగవా! ప్రాణాన్ని ఉగ్గదీసుకుంటాను, నా పనిని కాసేపు కూడా పక్కన పెట్టను.
కాలమా కాసేపు ఆగవా! నన్ను కాసేపు రాసుకోనివ్వు. ఏదైనా నా రచన నీకు లంచమిస్తాను.
చేతులు అచేతనాలయ్యాయి. కాలమా నీవు ఆగవు కదూ!
చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్
కాలం ఆగలేదు. ముగిసిపోయింది.