అమ్మయ్య! మా పిల్ల/ పిల్లవాడికి మెడిసిన్ /ఇంజనీరింగ్ సీటు వచ్చేసింది. మేమింక వర్రీ కానవసరం లేదు, అని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటే పొరపాటు పడినట్టే. అసలు కథ అక్కడినుండే మొదలవుతుంది. సాధారణంగా ఈ మెడిసిన్/ ఇంజనీరింగ్ చదివే పిల్లలు హాస్టల్లోనే ఉంటారు. ఒకవేళ ఇంటి నుండే కాలేజీకి వెళుతున్నా కాని, మా పిల్ల/ పిల్లాడు మంచి కాలేజీలో సీటు తెచ్చుకున్నారు, కాబట్టి వాళ్ల జాగ్రత్తలో వాళ్ళుంటారని తల్లిదండ్రులు ఆనుకోవడం సహజం.
తల్లిదండ్రుల్లాగే పిల్లలు కూడా, ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, ఇప్పుడు మేము చాలా సాధించేసామని రిలాక్స్ అయిపోయి, చదవడం మానేస్తున్నారు. దాని తోడు వాళ్ళు జాయిన్ అయ్యే కాలేజీలలో కొత్త వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి కొంతకాలం పడుతుంది. ఇంకా కొత్త స్నేహితులు, సీనియర్ల ర్యాగింగ్లు, ఇంటర్మీడియట్ లో లాగ, అధ్యాపకుల అజమాయిషీ లేకపోవడం… వీటికి తోడు నేటి సమాజంలో ఎక్కడపడితే అక్కడే తేలిగ్గా దొరుకుతున్న మత్తుమందుల వాడకం, స్నేహితులు మరియు సీనియర్ల ప్రభావం… యివన్నీ కలిసి పిల్లల మీద సహజంగానే దుష్పరిణామాలు చూపిస్తున్నాయి. అందుకని ఈ సమయంలోనే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. పిల్లవాడిని హాస్టల్లో చేర్చినప్పుడే, ఒకరిద్దరు అధ్యాపకులతో మాట్లాడి, కుదిరితే వాళ్ల ఫోన్ నెంబర్లు తీసుకోవడం మంచిది.
పిల్లలతో స్నేహపూర్వకంగానే మాట్లాడుతూ, ప్రతిరోజూ వాళ్లేమి చేస్తున్నారు, ఆ రోజు యే,యే క్లాసులు జరిగాయి, అధ్యాపకులు యెలా చెప్తున్నారు, వారితో ఎవరెవరు స్నేహంగా ఉంటున్నారు… ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకోవడం మంచిది. అలాగే పిల్లల స్నేహితుల ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని ఉంచుకోవడం మంచిది. (తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళైనా, చదువులేని వాళ్ళైనా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి)
రెండు నెలలకు ఒకసారైనా వాళ్ళుంటున్న హాస్టల్ కు వెళ్లి, అక్కడ భోజన సదుపాయాలు యెలా వున్నాయో చూడడం మంచిది. అలాగే, కాలేజీకి వెళ్లి, తమ పిల్ల/ పిల్లవాడు సరిగ్గా కాలేజీకి వెళ్తున్నాడా లేదా? అటెండెన్స్ యెలా ఉంది అని అన్ని విభాగాలకు వెళ్లి కనుక్కోవడం చాలా మంచిది. వ్యక్తిగత అజమాయిషీ లేకపోవడం వలన, పిల్లలు కాలేజీకి వెళ్లకపోయినా వెంటనే తెలిసే అవకాశం ఉండదు. తెలిసేసరికే చాలాకాలం గడిచిపోతుంది. ఒక్కోసారి పిల్లలకు ఆ సెమిస్టర్ ( ఇంజనీరింగ్ కాలేజీలో) లేదా సంవత్సరం ( మెడికల్ కాలేజీలో) వృధా అయిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఫలితం ఉండదు… ముఖ్యంగా మెడికల్ కాలేజీలలో.
ఒకసారి పిల్లలు చదువులో వెనకబడ్డారంటే… యిన్నాళ్ళూ తెలివైన పిల్లలుగా ముద్రపడి, ఇప్పుడు పరీక్ష పోయిందంటే… దాని ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా వుంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు వారిని కోప్పడినట్టు మాట్లాడితే… ఒకవైపు పరీక్ష పోయిందన్న అవమానం, అందరితో సమానంగా వుండలేకపోయామన్న చిన్నతనం, తల్లిదండ్రులేమంటారోనన్న భయం… యివన్నీ కలిసి వాళ్లు అబద్ధాలాడేందుకు ప్రేరేపిస్తాయి. ఒకసారి అబద్ధమాడితే, దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం… యిక దానికి అంతుండదు.
ఈ పరిస్థితుల్లోకి పిల్లలు రాకుండా వుండాలంటే తల్లిదండ్రులు మొదటి నుండి జాగ్రత్త పడుతూ, అనుక్షణం వాళ్ళని గమనిస్తూ, ఒకవేళ పిల్లలు తప్పుచేస్తే, ఆ సమయంలో దండించకుండా, వాళ్లు సరైన మార్గంలో వెళ్లేందుకు దోహదం చేసి, ఆ తర్వాత ఒక చిన్న తప్పు జీవితాలను యే రకంగా మార్చగలదో వాళ్లకు చెప్పాలి. చిన్నప్పటినుండి యివన్నీ చేస్తే మన పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది, ధైర్యంగా వుండగలుగుతాము.