మన మహిళామణులు

శ్రీమతి లలితా

ఆల్ రౌండర్ పంతుల లలితగారు ఎన్నో ఎన్నెన్నో విషయాలు తరుణి తో పంచుకున్నారు.ఆమె మాటల్లోనే చదవండి…

స్వీయ పరిచయం:

నా పేరు పంతుల లలిత. నేను పుట్టి పెరిగింది ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో. వివాహం తరువాత
నివాసం ఆంధ్ర ప్రదేశ్  లోని విశాఖపట్నంలో.
నా కలం పేరు నీలాంజన అంటే మెరుపు అని అర్ధం. ఒక రచయిత్రిగా ఎందరో ప్రముఖ  రచయితలు, రచయిత్రులను కలుసుకునే భాగ్యం కలిగింది.
అందరిలో ఒక గుర్తింపు వచ్చింది. నేను తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్నాను. వివాహానికి ముందు ఒడిశాలో బి.యస్. సి.
బి. ఎడ్ చేసాను. ట్రెజరీ ఆఫీసులో జాయిన్ అయ్యాను. ఆరు నెలలు పని చేసిన తరువాత వివాహం కుదిరడం వలన ఉద్యోగానికి రాజీనామా చెయ్యవలసి వచ్చింది.


తరువాత బ్యాంకులో క్లర్క్ గా, ప్రభుత్వ ఉపాధ్యాయినిగా ఉద్యోగం వచ్చినా ఇంటి బాధ్యతల వలన వెళ్లలేదు. పిల్లలు చదువుతున్న ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో జాయిన్ అయ్యాను. అలా అలా 32 రెండేళ్లు పొలాక్ స్కూల్,  లిటిల్ ఏంజిల్స్  స్కూల్ లో సామాన్య శాస్త్రం, జీవ, రసాయన శాస్త్ర ఉపాధ్యాయినిగా చేసాను.
ప్రస్తుతం విశ్రాంత సైన్స్ ఉపాధ్యాయిని అయినా ఐకాస్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్స్ – న్యూ ఢిల్లీ) వారి అధ్వర్యంలో జ్యోతిష్య పాఠాలు ఉఛితంగా బోధిస్తున్నాను.
టీచర్ గా, టివీ సీరియల్స్ నటిగా, చలనచిత్ర నటిగా పలు అవార్డులు అందుకున్నాను.
అల్లమరాజు మహాలక్ష్మి, వెంకట్రావు దంపతులకు కనిష్ట సంతానంగా జన్మించాను. తండ్రి ఆయుర్వేద డాక్టర్, తల్లి గృహిణి.. తల్లిదండ్రులు ఇరువురు శివైక్యం చెందారు. నా బాల్యం చదువుతో బాటు ఆట పాటల హరివిల్లు. నాకు ఇద్దరు అన్నలు, నలుగురు అక్కలు.
మా అత్త మామలు కీ.శే. పంతుల సౌభాగ్యలక్ష్మి, సోమనాథంలు.
ఇద్దరు పిల్లలకు తల్లిని.
మా కూతురు పేరు సౌభాగ్యలక్ష్మి, అల్లుడు సుబ్రహ్మణ్యం, మనుమడు వేంకట సహృద్,
మనుమరాలు నాగ సంస్థిత.
మా కొడుకు పేరు కృష్ణ సుమంత్, కోడలు- శ్రీరమ్య
మనుమరాలు సాయి అకిరానందిని.
విద్యాభ్యాసం:
ఒకటవ తరగతి నుండి బి.యస్సీ బి.ఈడీ. డిగ్రీ వరకు బరంపురం లోని ప్రభుత్వ పాఠశాల, మహిళా కళాశాల, ఖల్లికోట కళాశాల, ప్రభుత్వ బి.ఈడి కళాశాలలో చదువుకున్నాను. వివాహం తరువాత ఆంధ్రా విశ్వ విద్యాలయంలో ఎం ఎ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. దక్షిణ హిందీ ప్రచార సభ అధ్వర్యంలో హిందీ విశారద వరకు చదివాను. జ్యోతిష్య విశారద, హస్తరేఖ విశారద, నాడి ప్రవీణ, సంఖ్యా శాస్త్రం కూడా చదివాను.
జీవితంలో ఆనందం కావాలంటే హాస్యం ఉండాలి అని నమ్మే నేను కామెడీ స్కిట్స్ లో కూడా ఇప్పటికి పాల్గొంటాను.
కుటుంబ నేపథ్యం:


నాకు 1980లో పంతుల నరసింగరావు గారితో వివాహం జరిగింది.. మా వారు కోరమాండల్  ఎరువుల కంపెనీ విశాఖపట్నంలో మేనేజర్ గా పనిచేసి 2014 లో పదవీ విరమణ చేశారు.. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.
అభిరుచులు:
విద్యార్ధినిగా వున్నప్పుడే యద్దనపూడి సులోచన గారి రచనలంటే ఇష్టం వుండేది. యన్.ఆర్ నంది, రావినూతల సువర్ణ, మాలతీ చందూర్ గారి సాహితీ కెరటాలు, డా. కృష్ణ కుమారి గారి రచనలు (కృష్ణక్క సలహాలు) అంటే చాలా ఇష్టం.. చిన్ననాటి నుండి న్యాయవాది వృత్తి చేపట్టాలని ఉండేది. కానీ నా జాతకం ప్రకారం టీచర్ వృత్తి చేపట్టాల్సి వచ్చింది. అమెరికాకు వెళ్లి ఉద్యోగం చెయ్యాలని కోరిక. కానీ అమెరికాలో ఉద్యోగం తృటిలో తప్పిపోయింది, అందుకే అమెరికా ఎలాగైనా చూడాలి అన్న కోరికను అమెరికా సిటిజన్ అయిన మా రెండవ అక్క నా కోరిక తీర్చింది. అక్కడ మూడున్నర నెలలు ఉన్నాను. తరువాత 2016లో మా వారితో పాటు అమెరికా వెళ్లాను. అప్పుడు మా మరిదిగారి స్పాన్సర్షిప్ అన్నమాట.  వర్జీనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, ఒరిగాన్- కొరొవలిస్, నార్త్ కరోలినా, ఆట్లాంటా, చికాగో, ఓషన్ సిటీ, క్రేటెర్ లేక్, వాషింగ్టన్ డి.సి, మేరీల్యాండ్, నయాగరా జలపాతం, ఫ్లారిడా, పోర్ట్ ల్యాండ్ ప్రదేశాలు సందర్శించాను. మా అబ్బాయి మస్కట్ లో మెకానికల్ ఇంజనీర్ గా పని చేసినప్పుడు మస్కట్ కి వెళ్లాము. ప్రకృతి ప్రేమికురాలిని నేను.
సాహితీ ప్రస్థానం:
ఒడిశాలో బరంపురం లో జన్మించిన నేను పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలో తెలుగు ఒక సబ్జెక్టు. అప్పుడు చంధస్సు చెప్పారు. అప్పుడే నాలోని రచన చేయాలి అనే తృష్ణ బయటపడింది. తెలుగు ఉపాధ్యాయురాలి సూచనలతో ఆటవెలది, సీస కంద, తేటగీతి పద్యాలు. కానీ అవేమి నేడు నాతో లేవు. కలలా, జ్ఞాపకంగా మిగిలిన తీపి గుర్తులు మాత్రమే. తరువాత అమ్మ, నాన్నల వియోగం, అంతా తానై అంతులేని కథలో జయప్రదలా మాకు మా రెండవ సోదరి విద్యా దానం, వివాహం చేయడంతో ఇదిగో ఇలా విశాఖపట్నం-ఆంధ్రా వాసిగా మారాను. చిన్నప్పటి నుండి డిబేట్స్ లో పాల్గొన్న అనుభవం వుంది. ముప్పై రెండేళ్ల విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయ వృత్తి విడిచి పెట్టిన తదుపరి గత ఆరు సంవత్సరాల నుండి తిరిగి ఈ సాహిత్య ప్రక్రియ ఒరవడి మొదలయ్యి, మీ అందరి ప్రోత్సాహంతో కొనసాగుతున్నది. పెళ్లాం చెబితే విధాలా వద్దా అన్న అంశంపై వాదనలో 60 మందిలో తృతీయ బహుమతి ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ గారి నుండి అందుకోవడం నా అదృష్టం.


నేను పాఠశాల విద్య అభ్యసించే రోజుల్లోనే నాకు చూసిన, విన్న సంఘటనలను కాగితంపై వ్రాసే అలవాటు ఉండేది.. తొమ్మిదవ తరగతిలోనే  సీస, కంద, తేటగీతి మొదలైన పద్యాలు వ్రాశాను.. ప్రస్తుతం నీలాంజన కలం పేరుతో కవితలు, కథలు, సిసింద్రీలు, పంచ పదులు, అష్టాక్షరీలు, సప్తపదులు, విపంచికలు, ప్రయాగలు, శిశిరాలు,   పేరడీలు ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రక్రియల్లో వ్రాస్తున్నాను..
వైజాగ్ విజన్, ఆశా న్యూస్ ఛానెల్,  స్వేచ్ఛా టీవీ  యూ ట్యూబ్ ఛానెల్స్ లో ఆధ్యాత్మిక భాషణలు, వంటిల్లే వైద్యశాల అంటూ అమ్మ వైద్యం, తెలుగు జాతీయాలు, కామెడీ స్కిట్స్, విశిష్ట అతిథిగా ఆన్ లైన్ లో  పర్యావరణం మీద ప్యానల్ డిస్కషన్ లో పాల్గొనడం మొదలైనవి.


నేను ఇప్పటివరకు 1000కు  పైగా తెలుగు కవితలు, 40కి పైగా ఆంగ్ల కవితలు, 350కి పైగా పంచ పదులు, 350కి పైగా సిసింద్రీలు,  అర్థ శతకం పైన కథలు మరియు అయిదు పేరడీలు వ్రాసారు.. 50 కథలతో పుస్తకం అచ్చు వేయించాను.
రిసోర్స్ పర్సన్ గా  ఎన్నో అంతర్జాలంలో మరియు బయట సదస్సుల్లో పాల్గొన్నాను.మన సంప్రదాయం, కళలు మీద రిసోర్స్ పర్సన్ గా సి సి ఆర్ టి
న్యూ ఢిల్లీ వారు ఇచ్చిన శిక్షణలో పాల్గొన్న ఏకైక ప్రయివేట్ పాఠశాల టీచర్ ని.
పురస్కారాలు:
ఉద్యోగరీత్యా….
🔸జిల్లా స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డ్,.
🔸సైన్స్ ప్రాజెక్టుల్లో బెస్ట్ టీచర్ గైడ్ గా ఎన్నో అవార్డులు,
🔸లయన్స్ మెట్రో విశాఖ వారి నుండి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డ్,
🔸పర్యావరణ మిత్ర అవార్డు,
🔸బిజెపి మహిళా సభ్యుల నుండి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డ్,
🔸నార్త్ కల్చరల్ అసోసియేషన్ న్యూ ఢిల్లీ వారినుండి జాతీయ అవార్డ్,
🔸ఉపాధ్యాయ మిత్ర ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం.
🔸నేషనల్ యాక్టివ్ టీచర్స్ అవార్డ్. అనురాగ్యం- న్యూ ఢిల్లీ వారి నుండి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సెలెన్స్.
🔸గోరసం వారి నుండి ఆచార్య పురస్కారం,
.తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారి నుండి జీవన సాఫల్య అవార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డు వారి నుండి సర్టిఫికెట్లు.
సర్వేజనా సుఖినో భవంతి వారి చేత సన్మానం, క్రియిటివ్ కామెడీ క్లబ్ వారి నుండి సన్మానం,
తానా వారు నిర్వహించిన తెలుగు భాష మీద అంతర్జాల పోటీల్లో ఫైనల్ స్థాయి వరకు చేరడం.
🍀సాహిత్య పరంగా కైవసం చేసుకున్న పురస్కారాలు🍀
🔹విశేష ప్రతిభాశాలి, కవన వజ్ర, ప్రత్యేక ప్రజ్ఞాశాలి కవన రత్న, కవన మణి, కవన వరిష్ట, కవన ఉత్కృష్ట, కవన విశిష్ట, కవన వజ్ర, కవన శ్రేష్ఠ, కవన కణిక, సాహితీ ధురీణ, కవి కిరణం, హాస్య కథా చక్రవర్తి, విభిన్న కవితా రత్న, యూ ట్యూబ్ హాస్య కథా చక్రవర్తి, మనో రచన చక్రవర్తి, ఉమెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నేషనల్ అవార్డ్, సర్దార్ పురస్కారం,
భగత్ సింగ్ జాతీయ పురస్కారం మొదలైనవి.
నా తల్లిదండ్రుల నుండి నేర్చుకొన్నది ఏమిటంటే మంచి పోషక ఆహారం తీసుకోవాలని, ఆయా ఋతువుల్లో  దొరికే పండ్లను తినాలని, మనం బతుకుతూ నలుగురిని బతికించాలని, పశు పక్ష్యాదులకు, జంతువులకు కూడా మనతో బాటు బతికే హక్కు వుంటుందని. అందుకే ఇంత వయసు వచ్ఛినా నాకు వీలున్నంతలో వీధి కుక్కలు, పిల్లులకి, కాకులకి, పిచుకలకి, రోడ్డు మీద  ఆవులకి ఆహారం, నీరు అందిస్తాను.ఈ విషయమై ఇరుగు పొరుగు వారితో ఎప్పుడూ యుద్ధమే
పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకుంటాను.  విత్తనాల బంతులు విద్యార్థినీ విద్యార్థులతో, ప్రజలతో చేయించి కొండల మీద, ఖాళీ స్థలాల్లో వేయించడం, మట్టి వినాయకుడిని తయారు చేయించడం, ఏక వింశతి పత్రాల విశిష్టత తెలియ జేయడం, విత్తనాలతో రాఖీలు తయారు చేయించడం, పర్యావరణహిత హోలీ, దీపావళి, వినాయక చవితి ఎలా జరుపుకోవాలో నేర్పించడం, రక రకాల పర్యావరణ సంబంధిత దినోత్సవాలు జరపడం, ర్యాలీల్లో పాల్గొనడం, కాలువల్లో చెత్తను వేయవద్దని, రోడ్డు మీద ధూమపానం వలదని, మద్యం, గుట్కా మొదలైనవి ఆరోగ్యానికి హానికరమని చెప్పే అవగాహనా సదస్సులు, విత్తనం వినాయకుడు, విత్తనాలతో రాఖీలు, హారితహారంలో భాగంగా 10000కి పైగా మొక్కలు విద్యార్థుల చేత నాటించడం, సామాజిక అంశాలైన విద్యాలయం, బాల కార్మిక వ్యవస్థ, అవినీతి, టెక్నాలజీ అంశాలపై అయిదు వీడియోలకు నిర్మాతగా, నటిగా చేశాను.
కరోనా మీద వీడియోల్లో నటించి  యూ ట్యూబ్ ఛానెల్ లో పెట్టి అవగాహన కల్పించడానికి ప్రయత్నించాను.
కవిగా నేటి యువతకు నేనిచ్చే సందేశం:
కవిత్వం ఓ పదునైన ఆయుధం. సమస్యలను ఎత్తి చూపడమే కాదు పరిష్కారాలు సైతం చూపగల మార్గదర్శి. రాజ పోషకులు, మహరాజ పోషకులు లేని నేటి కాలంలో డబ్బులిచ్చి బిరుదులు పొందడానికి ప్రయత్నించకండి, దయచేసి అలాంటి వ్యవస్థలను ప్రోత్సాహించకండి. చాలా మంది ఇలా చేయడం వలన నిజంగా కళ వుండి, ఆర్ధిక పరిపుష్టి లేని వారు డబ్బులు పెట్టలేని స్థితి. కన్న తల్లి లాంటి కళను అమ్మకండి, కొనకండి. ఎవరైనా కళాభిమానులైన దాతలను సాయం చేయమని  అర్ధించండి. కవి అన్నవాడు కవిత్వంలో కుల మతాల ప్రస్తావన అసలు తీసుకు రాకూడదు.”
**
పంతుల లలిత-నీలాంజన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శతక పద్యాలు జీవన మార్గ సూచికలు

కవన సృష్టి