… అందమైన ఏడుపు….

ఏడుపు ఏమిటి? అందంగా ఉండటం ఏమిటి?ఏడిస్తే ఎవరైనా వికృతంగా ఉంటారు కానీ అందంగా ఎలా ఉంటారు? అని అనుకుంటున్నారా?అవునండీ,మీరు చదివింది నిజమే,ఏడుపు అందంగానే ఉంటుంది,కానీ మనం ఏడిస్తే కాదు. మరి ఎవరు ఏడిస్తే బాగుంటుందో తెలుసా?

అందాలరాశి అయిన అమ్మాయి ఏం చేసినా అందంగానే ఉంటుంది.రసజ్ఞుడైన కవికి అపరంజి బొమ్మ లాంటి తన కావ్యనాయిక కోప్పడినా, ఏడ్చినా కూడా ఎంతో అందంగా కన్పిస్తుంది.అందుకే విరహంతో,ఈర్ష్యతో నాయిక ఏడ్చే ఏడుపు మన ప్రబంధకవులకు వర్ణనీయ వస్తువైంది.

పురాణాల నుండి ఒక చిన్న కథను తీసుకుని, దానికి అందమైన కల్పనలు,వర్ణనలు జోడించి రసవత్తరమైన ప్రబంధాలు రచించారు మన పూర్వ కవులు.

భాగవతంలోని దశమ స్కంధంలోని మూడు శ్లోకాలను తీసుకుని ఐదు ఆశ్వాసాల ప్రబంధాన్ని సృష్టించాడు నంది తిమ్మన.(నాయిక ముక్కును వర్ణిస్తూ అందమైన పద్యం వ్రాసాడు కనుక ఈయనకు ముక్కుతిమ్మన అనే ప్రసిద్ధ నామం ఉంది)ఆ ప్రబంధమే పారిజాతాపహరణం. అందులో నాయిక
సత్యభామ.

కావ్యనాయికలలో సత్యభామ తీరే వేరు. అందం,అహంకారం,ఆభిజాత్యం కలబోసిన ముద్దుగుమ్మ సత్యభామ. శ్రీకృష్ణుని అమితంగా ప్రేమించి,అతనిచే ప్రేమించబడి,కలలో కూడ తన మాటను జవదాటనీయకుండా కొంగున కట్టుకున్న స్వాధీనపతిక,అభిమానవతి.

అలాంటి సత్యభామకు ఒకనాడు తన అనుంగు చెలికత్తె తెచ్చిన వార్త అశనిపాతం(పిడుగుపాటు) అయింది.క్రోధాగ్నిని రగిల్చింది,అవమానాన్ని మిగిల్చింది.

”దేవలోకం నుండి నారదుడు పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి ఇచ్చాడు.అది సువాసనలు వెదజల్లుతూ ఎంతో అందంగా ఉంది.ఆ పువ్వు గొప్పతనాన్ని వర్ణిస్తూ నారదుడు “కృష్ణా! దీన్ని నీకు ప్రియమైన భార్యకు ఇవ్వవయ్యా” అని చెప్పగా శ్రీకృష్ణుడు దానిని రుక్మిణికి ఇవ్వటమే కాదు,తానే స్వయంగా ఆమె సిగలో తురిమాడు.ఆ పుష్ప మహత్వం వల్ల రుక్మిణి సాన పట్టిన మన్మధ బాణంలా ప్రకాశించింది.మీదుమిక్కిలి ఆ తంపులమారి నారదుడు రుక్మిణి ముందు నిన్ను చిన్నబుచ్చుతూ చాలా మాటలన్నాడు,అది వింటూ కూడా శ్రీకృష్ణుడు మాట్లాడకుండా ఊరుకున్నాడు”..ఇదీ ఆ వార్త.

ఇదంతా విన్న సత్యభామ దెబ్బతిన్న ఆడత్రాచులా,నెయ్యిపోయగా భగ్గుమన్న అగ్నికీలలా మారింది.కళ్ళు
ఎరుపెక్కాయి.
అందులోను సవతియైన రుక్మిణి ముందు నారదుడు తనను కించపరచటం, తన గౌరవాన్ని కాపాడవలసిన పతిదేవుడు ఉపేక్షించటం భరించలేక పోయింది.ఇన్నాళ్ళు సవతులందరిలో మిన్నగా గౌరవింపబడిన తాను ఈ సంఘటన వల్ల చులకనైపోయానని,ఏ వస్తువైనా ముందు తన ఎదుట పెట్టకుండా,ఎవరికీ ఇవ్వని తన నాథుడు తననిలా అవమానాల పాలు చేసాడని కుమిలిపోయింది.అలంకారాలు తీసివేసి, మాసిన చీర కట్టుకుని కోపగృహంలోకి ప్రవేశించింది.

సత్యభామ ఏమి గొడవ చేస్తుందోనన్న బెదురుతోనే శ్రీకృష్ణుడు ఆమె అంతఃపురంలోకి అడుగు పెట్టాడు.అలకపాన్పును ఎక్కిన సత్యను ప్రసన్నం చేసుకోబోయాడు.కానీ చేరవచ్చిన నాథుని సత్య విదిలించి కొట్టింది.అయినా అతను బ్రతిమాలుతుంటే ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది.

“ఈసున‌‌‌‌‌బుట్టి డెందమున
హెచ్చిన శోకదవానలంబుచే
గాసిలి యేడ్చెఁ బ్రాణవిభు
కట్టెదుటన్లలితాంగి పంకజ
శ్రీ సఖమైన మోము పయిఁ జేల
చెఱంగిడి బాలపల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠ
వధూకల కాకలీధ్వనిన్”

మనసులో పుట్టిన ఈర్ష్య శోకాగ్నిని రగల్చగా సత్యభామ,పద్మంలాంటి అందమైన తన ముఖంపై చీరచెంగు కప్పుకుని లేత చిగుళ్ళను తిన్న కోయిల కంఠంతో,అవ్యక్త మధురధ్వనితో ఏడ్చిందట.

ఈ సత్యభామ తిమ్మన చెక్కిన సజీవశిల్పం.
అచ్చమైన తెలుగు ఆడపడుచు.తెలుగువారి ఇళ్ళలో ఇలాంటి సత్యభామలెందరో!

ఇక వరూధిని……
“ప్రబంధకవితాపితామహుడు” గా పేరు పొందిన అల్లసాని వారి అందాల నాయిక వరూధిని.
మార్కండేయ పురాణంలో నూట యాభై పద్యాలలో ఉన్న కథను తీసుకుని”మనుచరిత్ర” పేరుతో
ఆరాశ్వాసాల ప్రబంధంగా రచించాడు అల్లసాని పెద్దన.ఆంధ్రదేశమంతటా మిక్కిలి ప్రసిద్ధి పొందిన వరూధినీప్రవరాఖ్యుల వృత్తాంతం ఇందులోనిదే.

వరూధిని గంధర్వకాంత. మెరుపుతీగ వంటి మేను,కమలాల వంటి కనులు,తుమ్మెదరెక్కల్లాంటి కురులు,చంద్రబింబంలాంటి మోము కలిగిన అప్సర శిరోమణి.

ప్రవరుడుఉత్తమ బ్రాహ్మణగృహస్థు.
నిష్ఠాగరిష్ఠుడు‌,నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత,
వైరాగ్య సంపన్నుడు, తీర్థయాత్రలన్న కడు ప్రీతి.
అరుణాస్పద పురంలో నివసించేవాడు.నిరంతరం అతిథి అభ్యాగతులను ఆదరించే ఆ ప్రవరుని ఇంటికి ఒకనాడు,అతి చిన్నవయసులోనే దేశదేశాలు తిరిగిన సిద్ధుడొకడు వచ్చాడు.అతడికి అతిథి మర్యాదలు చేసి సత్కరించిన పిమ్మట ప్రవరుడు,
అతడి నుండి వివిధ దేశాల విశేషాలు తెలుసుకున్నాడు.అంత చిన్న వయస్సులోనే అన్ని ప్రదేశాలు ఎలా తిరగగలిగారని అడిగాడు.అతని ఉత్సాహాన్ని గమనించిన ఆ సిద్ధుడు ప్రవరుని
పాదాలకు ఒక పసరు పూసి,దాని సాయంతో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చునని చెప్పాడు.ప్రవరుడు ఎంతో సంతసించి,
హిమాలయాలను చూడాలనే కోరికతో ఆకాశ మార్గంలో బయలుదేరాడు.

హిమాలయాలను చేరాడు.ఆకాశాన్ని తాకే పర్వతశిఖరాలను,సెలయేళ్ళను,నెమళ్ళను,
ఆడఏనుగులను, ఎండవేడికి కరిగే మంచును చూసాడు.ఈ హిమగిరి సొగసును వర్ణించటం బ్రహ్మ తరం కూడా కాదనుకున్నాడు.”ఇక్కడి అందాలు ఎంత చూసినా చూడాలనిపించేటట్లు
ఉన్నాయి.కానీ నిత్య
విధులను నిర్వర్తించవలసిన సమయం మించిపోక ముందే ఇల్లు చేరాలి కదా,మిగిలిన విశేషాలు మరల రేపు వచ్చి చూస్తాను” అనుకుని తిరిగి ఆకాశంలోకి ఎగరాలని ప్రయత్నించాడు.కానీ ఎగరలేకపోయాడు.మంచునీటి వల్ల తన పాదాలకు సిద్ధుడు పూసిన పసరు కరిగిపోయినట్లు గమనించాడు.

“అయ్యో!అరుణాస్పద పురమెక్కడ? హిమాలయ పర్వతాలెక్కడ?” అని ఏ మాత్రం ఆలోచించకుండా ఇంత దూరం వచ్చాను! భగవంతుడా!ఇల్లు చేరే మార్గమేమిటి?వచ్చిన దారి కాని,వెళ్ళే దారి కాని ఏమీ తెలియదే?అని తల్లడిల్లుతూ తిరుగుతున్న ప్రవరుని నాసికాపుటాలకు ఎక్కడినుండో గాలిలో తేలుతూ వచ్చిన తాంబూల పరిమళం సోకింది.
దాన్ని అనుసరించి వెళ్ళగా,వీణ వాయిస్తున్న ఒక వనిత కన్పించింది.

‘ఒంటరిగా ఈ భయంకరారణ్యంలో ఉన్న నీవెవరు?’ అని ఆమెను ప్రశ్నించి,తనను పరిచయం చేసుకుని‌,దారి తప్పానని,తన ఇల్లు చేరే మార్గం చెప్పమని అడిగాడు.ప్రవరుని చక్కదనమును చూసి ఆమె ఆశ్చర్యపోయింది. నలకూబరుని,చంద్రుని,
జయంత వసంత కంతులను మించిన అతని సౌందర్యం ఆమెను మోహపరవశను చేసింది.ఇతడు తనను చేపట్టినచో మన్మథుడే తనకు సేవకుడు కాగలడనిఅనుకుంది.తన పేరు’వరూధిని’
అని,రంభ తిలోత్తమాది అప్సరసలు తన చెలికత్తెలని,రాళ్ళను కరిగించే సంగీతం తమ సొంతం అని చెప్పింది.”ఇంత పెద్ద కళ్ళుండీ,దారి నన్ను ఎందుకు అడుగుతున్నావు?ఏకాంతంలో ఉన్న స్త్రీలను పలకరించటానికి ఇదొక సాకా?”అనీ దబాయించింది.ప్రవరుడు తన స్వభావం అలాంటిది కాదని చెప్పాడు.

ఎండలో తిరిగి అలసినట్లున్నావు,నా అతిథి మర్యాదలు స్వీకరించి,కొంతసేపు విశ్రమించి,బడలిక తీరాక వెళ్ళమని సాభిప్రాయంగా చెప్పింది.కానీ ప్రవరుడు అగ్నికార్యమునకు,దేవతార్చనకు,
అతిథిసేవకు వేళ మించుచున్నదని,వృద్ధులైన తల్లిదండ్రులు తన కొఱకు కనిపెట్టుకుని ఉంటారని,వారికి భోజనవేళ కూడా మించుచున్నదని,ఇంటికి వెళ్ళే మార్గం చెప్పమని అడిగాడు.

యజ్ఞాలు చేసేది స్వర్గసుఖాల కోసం,కాంతాసమాగమం కోసమే కదా,రాజసూయ,అశ్వమేధ యాగాలు చేసేవారికి తప్ప లభింపని గంధర్వకాంత పొందు నీకిక్కడే,ఇప్పుడే లభింపనుండగా ఇంక ఆ యజ్ఞాలెందుకు?ఇక్కడి మణిగృహాలు,గంధపుచెట్ల తోటలు,గంగానది ఇసుకతిన్నెలు,వెన్నెలతీవెల పొదరిండ్లలో స్వర్గసుఖాలు అనుభవించమని ప్రలోభపెట్టింది.కానీ ప్రవరుడు దేనికీ లొంగలేదు.తాను కాముకుడను కాననీ,పరస్త్రీని తల్లిగా భావిస్తానని అన్నాడు.కానీ
అంతకంతకు అధికమవుతున్న మదనతాపముతో వరూధిని అతనిని కౌగలించుకుంది. వెంటనే ప్రవరుడు ‘హా! శ్రీహరీ!’అంటూ ఆమెను త్రోసివేసాడు. వరూధిని క్రింద పడింది.ఆ అవమానమును భరించలేని ఆమె…..

పాటునకింతులోర్తురె కృపా
రహితాత్మక నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోకెఁ
గనుంగొనుమంచుఁజూపి య
ప్పాటలగంధి వేదన నెపంబిడి
యేడ్చెఁగలస్వనంబుతో
మీటిన విచ్చుగుబ్బచనుమిట్టల
నశ్రులు చిందువందగన్

దయలేనివాడా! ఇలా త్రోసివేస్తే స్త్రీలు ఓర్చుకోగలరా?నీవు త్రోసినపుడు నీ గోరు గుచ్చుకున్నది చూడు,ఎంత నెప్పిగా ఉన్నదో అంటూ నెప్పి వంకతో ఎదపై కన్నీరు చిందుచుండగా అవ్యక్త మధురధ్వనితో ఏడ్చిందట.

మరి, గిరిక…..రామరాజభూషణుని కావ్య
నాయిక.నన్నయ వ్రాసిన మహాభారతము
ఆదిపర్వములో పన్నెండు గద్యపద్యములలోనున్న ఉపరిచర వసువు వృత్తాంతమును గ్రహించి, దానిని ఆరాశ్వాసాలలో ఎనిమిది వందల గద్యపద్యాలలో
“వసుచరిత్ర” అనే అద్వితీయ ప్రబంధంగా తీర్చిదిద్దాడు రామరాజభూషణుడు.(ఇతనినే భట్టుమూర్తి అంటారు.)వసుమహారాజు
శుక్తిమతీ కోలాహలుల పుత్రిక అయిన గిరికను ప్రేమించి వివాహమాడిన వృత్తాంతం ఇది.

ఇందులో నాయిక గిరిక ముగ్ధ.
అమృతమయమైన మనస్సు కలిగినది.ఆమె వసురాజును వలచినది.అతని ఎడబాటు ఆమెకు వేదనను కలిగించింది.

వెన్నెల అందరికీ ఆనందాన్ని,చల్లదనాన్ని ఇస్తుంది. కానీ విరహంతో బాధపడేవారికి అదే భరింపరానిదవుతుంది.

ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల
డాయన్ లేక రాకానిశా
రాజశ్రీ సఖమైన మోమునఁ
బటాగ్రంబొత్తి యెల్గెత్తి యా
రాజీవానన యేడ్చెఁగిన్నర వధూ
రాజత్కరాంభోజ కాం
భోజీ మేళ విపంచికారవ సుధా
పూరంబుతోరంబుగాన్

అసలే విరహంతో బాధపడే గిరిక ఆ వెన్నెల వేడికి తట్టుకోలేక చంద్రబింబంతో సాటి రాగల పద్మం వంటి తన ముఖముపై వస్త్రమును కప్పుకుని ఎలుగెత్తి కాంభోజరాగంలో ఏడ్చిందిట.

ఈ ఏడుపులన్నీ పరిశీలించిన ‘వికటకవి’ తెనాలి
రామకృష్ణుడు….
“అల్లసాని అటునిటు ఏడ్చె,
ముక్కుతిమ్మన ముద్దుముద్దుగానేడ్చె,
భట్టుమూర్తి బావురుమని ఏడ్చె”
అని పరిహసించాడట.

ఇవి కదండీ అందమైన ఏడుపులు!ఏడుపులో కూడ అందాన్ని గమనించి,చక్కని పోలికలతో వర్ణించిన మన ప్రబంధకవుల నైపుణ్యాన్ని చూసారా?
రసజ్ఞులైన పాఠకులు ఇది చదివి ఆనందించగలరని భావిస్తున్నాను.

Written by Jyotsna Tatiraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“జలము – జనజీవనము “

గిరికర్ణిక