భూగోళం మీద మూడొంతులు జలమే. ప్రాణి మనుగడ ఈ భూగోళం మీద సాగాలంటే, భూమి, జలము … వాటి సమతుల్యత ఎప్పుడూ సరిపోవాలి. ఏదీ యెక్కువగానూ వుండకూడదు, తక్కువగానూ వుండకూడదు. ఆ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, ప్రాణుల మనుగడకే కష్టం. అందుకే పిల్లల చిన్నతనంలోనే వాళ్లకు నీటి విలువ గురించి, త్రాగేనీరుగా గాని, సాగుకోసం వాడే నీరుగా గాని, జలము మన జీవితాలలో ఎంత ప్రముఖ పాత్ర వహిస్తుందో చెప్పాలి.
మన శరీరం బరువులో మూడొంతులు నీటి శాతమే వుంటుంది. మన శరీరంలో ఆ నీటిశాతం తగ్గినప్పుడు, ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. మరి అటువంటి నీరు, దప్పిక తీర్చుకోవడానికే కొంతమందికి కరువైపోతే, ఇంకొందరు ఆ నీటినే వృధాగా పారబోస్తుంటే, సమాజ జీవనం దెబ్బతినదా? అలా జరగకుండా వుండాలంటే మనమేమి చెయ్యాలి? ప్రాణాధారమైన నీటిని వృధా చెయ్యకుండా, భవిష్యత్ తరాలను ఏ విధముగా సన్నద్ధం చెయ్యాలి?
ప్రతీ నీటిచుక్క, మానవ జీవితంలో ఎంత విలువైనదో, పిల్లలకు విడమర్చి చెప్తే, కానీ ఖర్చు లేకుండా నీటి వృధాను అరికట్టవచ్చు. దానికి ముందు, తమ యింటిలో పాడైపోయిన కొళాయిలను, ఎవరికి వారే బాగు చేయించుకోవాలి. నీటి ఆవశ్యకతను పిల్లలకు తెలియ చెప్పాలి. అవసరం తీరిన వెంటనే కొళాయిలను కట్టాలని, నీటితో ఆడుకోరాదని, త్రాగేందుకు మంచినీరు దొరకక, దొరికిన కలుషిత నీటితో దాహాన్ని తీర్చుకుంటే, వాంతులు విరేచనాలు మొదలగు అంటురోగాలు ప్రబలుతాయని, అందువలన ఎంతో ప్రాణనష్టం, ధననష్టం జరుగుతుందని పిల్లలకు చిన్నతనంలోనే తెలియజెప్పితే, ఎవరూ నీటిని వృధా చెయ్యడానికి సిద్ధపడరు. ప్రతి నీటిచుక్క విలువ పిల్లలు తెలుసుకునేలా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, 2022 లెక్కల ప్రకారం, 1.7 బిలియన్ ప్రజలు కలుషిత నీటిని వాడుతూ, రకరకాల వ్యాధులకు లోనవుతున్నారు. మనము నీటిని జాగ్రత్తగా వాడితే, ఈ దుష్పరిణామాలను అరికట్టవచ్చు. ఒక బిందె మంచినీళ్ల కోసం కొన్ని మైళ్ళ దూరం కొంతమంది నడవాల్సి వుంటుందనే విషయం పిల్లలకు గ్రాహ్యమైతే ఏ ఒక్క పిల్లా/ పిల్లవాడు నీటిని వ్యర్థం చెయ్యడానికి ఒప్పుకోరు. నేటి బాలలే రేపటి పౌరులు. చిన్ననాటి నుండి వారిని పరిస్థితులకు తగినట్లుగా, దేనినీ వృధా చెయ్యకుండా, మంచి మార్గంలో పెంచగలిగితే, ఆ కుటుంబంలోనే కాదు, సమాజంలో కూడా పిల్లలు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తయారవుతారు.
అన్నింటికి ముందు పెద్దలు తాము చెప్పినది తూచా తప్పకుండా పాటిస్తూ వుంటేనే, పిల్లలు మన మాట వింటారు ఈ విషయం మనమంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతగా ప్రవర్తించే పెద్దలు మాత్రమే, పిల్లలు బాధ్యతాయుతముగా తయారు చెయ్యగలుగుతారు.
తేటగీతి:
సౌఖ్యమేది నవనియందు జలము లేక
జీవ నాడియేగద జలసిరుల ధార
జలము లేకున్న చింతనే జగతిలోన
జనులు పొదుపు చేయవలెను జలమునెపుడు