నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం- 5వ భాగం

మాలాకుమార్

“మీరు వింటానంటే నా కథ చెపుతాను” నవ్వూతూ అన్నాడు బిల్.

“సుభా, బిల్ తన కథ చెపుతాడట విందాము. ఇంకో కప్ టీ తీసుకురా” సుభకు చెప్పాడు అర్జున్.

మూడు కప్పు లలో టీ ట్రే పెట్టి తెచ్చింది సుభద్ర. అప్పటికి బిల్ పని అయిపోయినట్లుంది, కిట్ తన సంచీలో సద్దుకుంటున్నాడు. సద్దుకొని, సంచీ పక్కన పెట్టి తీసుకున్నాడు. అర్జున్ కూడా టీ తీసుకొని, ఇక చెప్పు అన్నట్లు బిల్ వైపు చూసాడు. సుభద్ర కూడా ఆసక్తిగా బిల్ వైపు చూస్తూ, తన టీ తో ఇంకో కుర్చీలో కూర్చుంది. బిల్ డెక్ మెట్ల మీద తీరికగా కాళ్ళు చాపుకొని కూర్చొని చెప్పసాగాడు…

“మాది లోవర్ మిడిల్ క్లాస్ ఫామిలీ. మా నాన్న ఒక కంపెనీలో పని చేసేవాడు.అమ్మ గృహిణి. ఆ రోజులల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేందుకు ఇంట్లో వాళ్ళు ఇష్టపడేవారు కాదు. అందుచేత అమ్మ ఇంట్లోనే ఉండిపోయింది. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. పెద్దన్నయ్య ఏదో ఫాక్ట్రీలో పని చేసేవాడు. చిన్నన్నయ్య అప్పుడే 12 త్  క్లాస్ పూర్తి చేసాడు. అక్కలు హై స్కూల్ కు వచ్చారు. అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్దం వచ్చింది. ముందు అన్నయ్యలు, ఆ తరువాత నాన్న సైన్యంలో అమెరికన్ వాలెంటరీస్ గా చేరారు. మాకు తెలిసిన, మా కౌంటీలోని దాదాపు యుక్త వయసు వచ్చిన, దాటిన మగవారందరు కూడా అమెరికన్ వాలెంటరీస్ గా చేరారు.అప్పుడు అమ్మ నన్ను కడుపుతో ఉంది. ఇంట్లో ఉన్న మగవాళ్ళు ముగ్గురూ సైన్యంలోకి వెళ్ళారు. మాది మామూలు సంసారం కావటంతో ఏమీ సేవింగ్స్ కూడా లేవు. మేమే కాదు ఆ కౌంటీలో ఉన్నవారు, మా బంధువులూ అందరూ మామూలు సంసారులే కావటంతో ఎవరూ ఒకరికి ఒకరు సహాయపడే పరిస్థితి లేదు. దానితో ఇప్పుడు ఉంటున్న చిన్న ఇంటిని కూడా వదిలేసి రూరల్ ఏరియాకు మారాము. అమ్మ గర్భిణి, అక్కలు కూడా ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళు కాదు. మా వాళ్ళే కాదు దాదాపు మాకు తెలిసిన ఆడవారు అందరిదీ ఇదే పరిస్థితి.  వారంతా కూడా  ఏదో ఒక పని చేయాలని తలోదారిన వెళ్ళారు. ఆ పరిస్థితులలో అక్కలు ఇద్దరూ చదువు మానేసి, దుకాణాలల్లో చిన్నచిన్న పనులకు చేరారు. వాళ్ళు తెచ్చిన దానితోనే అమ్మ సంసారం గడుపుతుండేది. నేను పుట్టాక, నన్ను వదిలేసి అమ్మ పనికి వెళ్ళేందుకు వీలు లేకపోయింది. అలా కష్టంగా రోజులు జరుగుతుండగా ఒక సంవత్సరం తరువాత యుద్దం ముగిసి మా అన్నయ్యలిద్దరూ తిరిగి వచ్చారు. నాన్న యుద్దంలో చనిపోయాడు.

ఎప్పటికైనా తిరిగి వస్తాడని నాన్నకోసం ఎదురుచూస్తున్న అమ్మను, నాన్న మరణం కృంగదీసింది. అన్నయ్యలు ఇద్దరూ అమ్మను ఊరడించి, అక్కున చేర్చుకున్నారు. సంసార బాధ్యతను తీసుకున్నారు. దొరికిన ఉద్యోగాలల్లో చేరారు. ముఖ్యంగా మా పెద్ద అన్నయ్య చాలా బాధ్యతగా ఉన్నాడు. చిన్నగా సంసారం ఒక గాడిన పడింది. అక్కలిద్దరికీ పెళ్ళి చేసాడు. అన్నయ్యలు ఇద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. పెళ్ళిళ్ళ తరువాత, చిన్నన్నయ్య, అక్కలు వేరుగా వెళ్ళిపోయారు. నేనూ, అమ్మ పెద్ద అన్నయ్యకు దగ్గరలోనే ఇంకో ఇంట్లోకి మారాము. నన్ను స్కూల్ లో చేర్చాడు మా అన్నయ్య. నేను చిన్నవాడిని కావటము వలన నన్ను చాలా గారాబంగా చూసుకునేది అమ్మ. దానితో చదువులో అంత ఆసక్తి లేకుండా, ఏదో చదివేస్తూ తిరుగుళ్ళల్లో కాలం ఎక్కువగా గడుపుతుండేవాడిని.నాకు మిడిల్ క్లాస్ లో మేరీ పరిచయం అయ్యింది. సన్నగా, లేత గులాబీ రంగులో చాలా అందంగా ఉండేది. పిల్ల కూడా చాలా ఆక్టివ్ గా, అందరితో చకచకా మాట్లాడుతూ ఉంటే, ఓ అందమైన రబ్బరు బొమ్మలాగా అనిపించి తన వైపు ఆకర్శితుడనయ్యాను. ఇద్దరికీ స్నేహం కలిసింది. హైస్కూల్ కు వచ్చేసరికి ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్ళి చేసుకున్నాము. ఈ ప్రేమ, పెళ్ళి, నా తిరుగుళ్ళల్లో మా చదువు సక్రమంగా సాగలేదు. పెళ్ళి అయ్యింది కాబట్టి ఇక నీ సంగతి నువ్వే చూసుకోవాలి అని పెద్ద అన్నయ్య చెప్పేసాడు. అమ్మ కూడా పెద్దది అయిపోయింది. ఇక తప్పక హైస్కుల్ లోనే హాండీ మాన్ డిప్లమా చేసి, అప్పటి నుంచి ఈ పనులు చేస్తున్నాను” అని చెప్పి ఆగాడు.

“మరి మీ అమ్మగారు నీ దగ్గరే ఉందా? నీ  కూతురు నీ భార్యను చూసుకోవటమేమిటి?” ఆతృతగా ముందుకు వంగి అడిగింది సుభద్ర.

సుభద్ర అడిగింది అర్ధమయ్యి, బిల్ చెపుతానన్నట్లుగా చూసి, బాటిల్ లోనుంచి మంచినీళ్ళు తాగి “నా పెళ్ళి తరువాత కొన్ని రోజులకే మా అమ్మ చనిపోయింది. నా భార్య మేరీ చూడటానికి అందంగా చెలాకిగా ఉంది కానీ పరమ గయ్యాళిదని పెళ్ళి తరువాత తెలిసింది. చూసిన ప్రతిదీ కావాల్సిందే కొనాల్సిందే! తను అనుకున్నది అప్పటికప్పుడే జరిగిపోవాలి. ఏమాత్రం ఓర్పూ, నేర్పూ లేవు. కూతురు పుట్టాక కూడా మారలేదు. చాలా సంవత్సరాలు భరించాను కానీ ఇంక భరించటం నా వలన కాలేదు. అందుకే విడాకులు ఇచ్చేసాను” సింపుల్ గా చెప్పేసాడు!

“అవునా మరి నీ కూతురు…” ఇంకేమి అడగాలో తెలియక సందిగ్ధంగా ఆపేసాడు అర్జున్.

“నా కూతురు తల్లి దగ్గరే ఉంటుంది. నా దగ్గరకు రమ్మంటే రానన్నది. పెళ్ళి కూడా చేసుకోలేదు. ఉద్యోగం చేస్తూ తల్లిని చూసుకుంటోంది” జవాబిచ్చాడు బిల్.

“నీ భార్య ఉద్యోగం చేయటం లేదా? పెళ్ళి మాసేసి నీ కూతురు చూసుకోవటమేమిటి? అర్ధంకాక అడిగింది సుభద్ర.

“నా భార్య గయ్యాళిది, ఖర్చులెక్కువ అని చెప్పాను కదా. నేను నెలనెలా ఇచ్చే భరణం తనకు సరిపోదు. నాకు డబ్బులు సమకూరక ఇవ్వటము కొన్నిసార్లు ఆలశ్యం అవుతే, నేను పని చేసే చోటుకు వచ్చి గోలగోల చేస్తుంది. ఇప్పుడు కూతురుని పీడించి, అరిచి డబ్బు తీసుకుంటుంది. నా కూతురు పడే కష్టం చూడలేక అమ్మను వదిలేసి పెళ్ళి చేసుకో, లేదా నా దగ్గరకు వచ్చేయి అని ఎన్న సార్లో నచ్చచెప్పాను. కానీ నాకూతురు వినటం లేదు. అమ్మది చిన్నపాప మనస్తత్వం. ఎవరమూ దగ్గర లేకపోతే పిచ్చిది అవుతుంది. నేను పెళ్ళి చేసుకుంటే నాకు బాధ్యతలు పెరుగుతాయి. అమ్మను ఇంత బాగా చూసుకోలేను అంటుంది. ఇంకేమి చేస్తాను? వీలయినంత వరకూ నేను ఇచ్చే డబ్బులు ఆలశ్యం కాకుండా పంపేస్తుంటాను” అన్నాడు.

“మరి నువ్వు మళ్ళీ పెళ్ళిచేసుకోలేదా?” అడిగాడు అర్జున్.

“లేదు చేసుకోవాలనిపించలేదు” జవాబిచ్చాడు బిల్.

అందరూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. ఇక వెళుతాను బై అని చెప్పి బిల్ వెళ్ళిపోయాడు.

ఏప్రిల్ నేలాఖరు అయినా ఇంకా చల్లగానే ఉంది. సాయంకాలం ఆరున్నర సమయము అయినా ఇంకా వెలుతురుగానే ఉంది. సూర్యుడు ఇంటికి వెళ్ళనా వద్దా అన్న మీమాంసలో పడ్డట్టున్నాడు చిన్నగా కిందికి దిగుతున్నాడు. ఆకాశం పసుపు, నారింజ రంగులు పరుచుకుంటున్నాయి. పక్కన ఉన్న లేక్ మీద సూర్యకిరణాలు ఏటవాలుగా పడి తళతళా మెరుస్తున్నాయి.

“అబ్బా ఆరయ్యిందా? ఈ సూరన్నగారు ఇంకా డూటీ దిగలేదేమిటి?” మనోహరంగా రంగులతో ఉన్న సరస్సును చూస్తూ అంది సుభద్ర.

“అవును మరి ఇద్దరు పెళ్ళాళ్ళ ముద్దుల మొగుడు కదా? ఏ ఇంతి దగ్గరకు వెళ్ళినా ఇంకో ఇంతి జుట్టు పట్టుకు పీకేస్తుందీనేమో పాపం కాసేపు ఇటే తచ్చాడుతున్నాడు” తమాషాగా అన్నాడు అర్జున్.

అర్జున్ జవాబుకు “ఉం హూ” అంటూ  ముచ్చటగా మూతి తిప్పింది.

అభి డెక్ మీదకు వస్తూ “ఇక్కడున్నారా? లోపలికి రండి. చలిగా లేదూ? అడిగాడు.

“ఎక్కువగా లేదు. ఇప్పుడిప్పుడే మొదలయ్యింది. ఇప్పటి దాకా బిల్ తో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము.మీ అమ్మ భాషలో నులి వెచ్చని గ్రీష్మం” నవ్వుతూ లేచాడు అర్జున్.

లోపలికి వస్తూ, అక్కడే ఉన్న శశితో “పాపం బిల్ జీవితం ఎంత విషాదకరం కదా” జాలిగా అంది సుభద్ర.

“ఏం?ఏమయ్యింది?” ఆశ్చర్యంగా అడిగింది శశి.

“భార్య గయ్యాళిదట కదా! వేగలేక విడాకులిచ్చాడట. మళ్ళీ పెళ్ళి చేసుకోలేదట. సంపాదించుకున్న ఇల్లు కూడా కోర్ట్ వాళ్ళు ఆమెకే ఇప్పించేసారట. భరణం కూడా ఇస్తున్నాడట” అంది సుభద్ర.

“మేరీ గయ్యాళిదేమీ కాదు. కాస్త గట్టిది. తనని ఉద్యోగం చేయనీయలేదు. వాళ్ళ నాన్న, అన్నయ్యలు ప్రవర్తించినట్లు తను కూడా భార్యను ఇంట్లోనే పడి ఉండమన్నట్లు ప్రవర్తిస్తే ఎట్లాగా? చేయకుండా హాయిగా ఇంట్లోనే ఉండి, తోచక షాపింగ్ లు అలావాటు చేసుకుంది. కూతురును కూడా ఉద్యోగం చేయవద్దు ఇంట్లో ఉండమన్నాడు. ఈ కాలంలో అట్లా ఎవరు పడి ఉంటున్నారు ఆంటీ? బిల్ ప్రవర్తనతో విసుగెత్తిపోయారు ఇద్దరూ. విడాకులు తీసుకుంది. తనా ఇన్ని సంవత్సరాలూ ఉద్యోగం చేయలేదు. ఏమీ సంపాదించలేదు. అందుకని కోర్ట్ వారు మేరీకి ఇల్లు, భరణం ఇప్పించారు. ఆ డబ్బులు ఏ నెలా సరిగ్గా ఇవ్వడు. మరి ఏమి చేస్తుంది? వచ్చి గొడవ పెట్టుకోక? కూతురేమో ఈ గొడవలన్నీ చూసి నాకు పెళ్ళొద్దు ఏమీ వద్దని అమ్మ దగ్గర ఉంది” అని చెప్పింది శశి.

 

“హోరినీ ఇదా కథా? ఎంత బాగా చెప్పాడు. అయినా శశీ అమెరికాలో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండిపోవటమేమిటి? వాళ్ళ అమ్మను కూడా ఇంట్లోనే ఉంచేసాడట వాళ్ళ నాన్న. వాళ్ళు చాలా స్వతంత్రంగా ఉంటారు కదా!” కుతూహలంగా అడిగింది.

“రెండవ ప్రపంచ యుద్దంకు ముందు మన దగ్గర మన పెద్దవాళ్ళలాగనే ఆడవాళ్ళుఅస్వంత్రంగా ఇంట్లోనే ఉండేవారు. అప్పట్లో  అక్కడక్కడా కొంత మంది మాత్రమే ఉద్యోగాలు చేసేవారు. ఆ తరువాత చిన్నగా ఇట్లా పరిస్థితి మారింది. ఇక రండి డిన్నర్ చేద్దాం” అంది శశి.

“హాయ్ తాతా… హాయ్ బామ్మా…” అంటూ ఆరాధ్యా, ఆరాధ్య వెనుక కొద్దిగా బొద్దుగా, తెల్ల్లగా ఉన్న ఒక అమ్మాయి వచ్చారు.

ఆ అమ్మాయిని చూపిస్తూ” నా ఫ్రెండ్ కారా” అని పరిచయం చేసింది ఆరాధ్య.

“హాయ్ తాఆ… హాయ్ బ్మా…” ముద్దుగ అంది కారా.

“ఆ అమ్మాయి ఏమంటోందీ” అడిగింది సుభద్ర.

“హాయ్ తాతా, హాయ్ బామ్మా అంటోంది. నేను దానికి తెలుగు నేర్పిస్తున్నాను. మీరు వచ్చారని చెపితే మిమ్మలిని చూడటానికి వచ్చింది. మిమ్మలిని ఏమని పిలవాలీ అని అడుగుతే బామ్మా, తాతా అని చెప్పాను. దానికి అనటం సరిగ్గా రాక అట్లా అన్నది” చెప్పింది ఆరాధ్య.

“గుడ్… గుడ్… వేరీ గుడ్” అంటూ వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకున్నాడు అర్జున్.

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆకలి

అరవింద