ఆకలి

కథ

రుక్మిణమ్మకు కడుపులో గాబరాగా ఉంది. ఆకలి వేస్తుంది. కానీ, ఏమీ తినాలనిపించడం లేదు. ఆమె జీవితం మొన్నటి వరకు ఒక లెక్క. ఇప్పటినుండి మరొక లెక్క.

పుట్టినప్పటి నుండి పట్నవాసం తెలియదు రుక్మిణమ్మకు. పెద్ద ఇల్లు ఇంటి వెనకాల ఇంటి ముందు బోలెడంత స్థలం. అందులో రకరకాల మొక్కలు, చెట్లు ,ఇవన్నీటి సంరక్షణ రుక్మిణమ్మదే.

నాలుగు పాడి గేదెలు, ఇంటికి వచ్చిపోయే అతిథులతో ఇల్లు ఎప్పుడు సందడిగానే ఉండేది. ఊపిరి పీల్చనంత పని ఉన్నా కూడా ఏరోజు కష్టమనిపించలేదు. ఆమె పనే ఆమె ఆరోగ్యం. భర్త వ్యవసాయం పనుల్లో మునిగి ఉండేవాడు. అతని చేతి వాసి మంచిదేమో! ఎప్పుడూ పంటలతో పొలాలు కలకల్లాడేవి. ఇల్లు నిండుగా ఉండేది ధాన్యంతో.

ఒక్కసారిగా ఆ సందడి అంతా మాయమైపోయినట్లు అయింది రుక్మిణమ్మకు. హఠాత్తుగా మాయమైన భర్త, బోసిపోయిన నుదురుతోపాటు వెలవెల పోయిన ఇల్లు. శ్రాద్ధకర్మలన్నీ అయిపోయిన తర్వాత కొడుకుతో పట్నం వచ్చింది రుక్మిణమ్మ.

అంతే! ఒక్కసారి ఊపిరాడనట్లు అయిపోయింది. రెక్కలు కత్తిరించినట్లయింది. ఫ్లాట్లో నాలుగడుగులు ఇటు వేస్తే వంటిల్లు ,నాలుగు అడుగులు అటు వేస్తే పడకగది, 4 అడుగుల ముందరికి వేస్తే హాలు. ఇంతకే కుదించబడింది ఆమె నడక.

చేతికి ఎముక లేకుండా అన్నం పెట్టిన చేతులకి, గ్లాసు రెండు గ్లాసుల బియ్యం వండడం, అది కూడా మిగిలిపోవడం.

పొద్దున్నే ఇంట్లో అందరూ నూడుల్స్ లేదా బ్రెడ్ ఇలాంటివి తిని వెళ్తారు. తనకు ఆ ఆహారం సహించదు. ఆకలైతే ఉదయం పూజ అయ్యాక పిడికెడు అటుకులు నోట్లో వేసుకోవడమే తెలుసు. ఇప్పుడు ఏది తినాలన్నా ఇక్కడవేవీ లేవు. కడుపులో ఆకలి, అంతకన్నా ఎక్కువ కాళ్లు చేతులకు పని లేదు ఆ ఆకలి ఎక్కువైపోయింది.

అందరూ వెళ్ళిపోతూ మీరు మధ్యాహ్నం వంట చేసుకుని తినండి. మేం బాక్స్ లో చపాతి పెట్టుకొని వెళ్తున్నాము అని చెప్తారు.

పదిమందికి పెట్టిన చేతులు పిడికెడి గింజలు వండుకోవాలంటే చేతులు రావడం లేదు. ముద్ద నోట్లోకి వెళ్లడం లేదు.

ఇక్కడ జీవితం ఉరుకులు పరుగులు. మనుషులు ఉన్న జనారణ్యం. పెదవులు బిగుసుకునే ఉన్నాయి. ఆఫీస్ నుండి వచ్చిన ఇంటి సభ్యులు అలసటతో నాలుగు మెతుకులు కొరికి పడుకుంటారు. పిల్లలకు మోయలేని బరువైన పుస్తకాలు, రాత పని.

ఒంటరితనం భరించలేక పోతుంది. మెల్లిగా లేచి చారెడు బియ్యం వండుకున్నది. ఊరి నుండి తెచ్చిన ఉసిరికాయ పచ్చడితో నాలుగు ముద్దలు తిన్నది కండ్ల నీళ్లు కుక్కుకుని.

ఆరు నెలల గడిచాయి. చిక్కి శల్యం అయ్యింది. ఒక ఆదివారం పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు హాల్ లోకి వచ్చింది.

అప్పుడు గమనించారు కొడుకూ కోడలు. అసలు నిలబడ లేని పరిస్థితిలో ఉంది రుక్మిణమ్మ.

“అమ్మా! ఏమయ్యింది?” అన్నాడు కొడుకు దినేష్.

కళ్ళ వెంబడి జలజలా నీళ్ళు కారాయి రుక్మిణమ్మకు.

“నన్ను ఊరికి పంపించరా! నాకు ఇక్కడ ఊపిరాడటం లేదు. చేసేదేమి లేక మనసు బాధగా ఉంటుంది మీ పని ఒత్తిడిలలో మీరు ఉంటారు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. కానీ, నాదైన లోకంలో నన్ను బ్రతకని” అన్నది రుక్మిణమ్మ.

“అప్పుడంటే నాన్న ఉన్నారు ఇప్పుడు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా” అన్నాడు కొడుకు.

“అవునత్తయ్య అక్కడ అంత ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటారు?”అన్నది కోడలు రేవతి.

“అక్కడ నేను ఒంటరిని కానమ్మ .మీమామయ్య జ్ఞాపకాలు, నేను నలుగురికి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఉంటే తిన్నా కడుపులో ఆకలిగానే ఉంది. కడుపు అంతా వెలితిగా ఉంది. ఇటు పని ఆకలి అటు ఈ ఆహారం తినలేని నా అలవాట్లు. నాకు చేతగాని రోజున ఇక్కడికే వస్తాను. కొంచెం నామనసు కుదుటపడే వరకు అక్కడే నన్ను ఉంచండి” అన్నది రుక్మిణమ్మ.

తెల్లవారి కొడుకూ కోడలు ఆఫీసుకు సెలవు పెట్టీ తల్లిని తీసుకెళ్లి ఊర్లో దించారు.

రుక్మిణమ్మ వచ్చిందని తెలియగానే చాలా ఎంతమంది జనం ఆమె కోసం వచ్చారు. పాడి గేదెలు ఆమె కోసం ఆశగా చూసాయి. ఆమె చేతి భోజనం తినడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. హాల్లో ఫోటోలో ఉన్న ఆమె భర్త రఘురామయ్య ఆమెను సంతృప్తిగా చూశాడు.

ఆమెకు ఇప్పుడు కడుపు నిండుగా ఉంది. ఆకలి తీరిపోయింది మనిషికి సంతృప్తి సగం బలం.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

నులివెచ్చని గ్రీష్మం