దొరసాని

ధారావాహికం – 39 వ భాగం

     లక్ష్మిమదన్

మంచు తెరల మధ్య నుండి కారు అలా రోడ్డు మీద వెళ్ళసాగింది… సాగర్ మరియు సౌదామినీ మౌనంగా కూర్చున్నారు ఇద్దరి మనసులు మాత్రం మాట్లాడుకుంటున్నాయి.

మాటలకందని భావం ఇద్దరి మధ్యలో తారాడుతూ ఉంది.. తెరిచి ఉన్న కిటికీ నుండి చల్లని గాలి వస్తుంది ..ఇలాంటి ప్రకృతి ఉన్నప్పుడు సౌదామినికి కార్లో ఏసీ వేసుకోకుండా కిటికీలు తెరిచి చల్లని గాలిని ఆస్వాదిస్తూ వెళ్లడం అలవాటు… సాగర్ కూడా ప్రకృతి ప్రేమికుడే….

కాసేపటికి ఇద్దరి మధ్య మౌనం భగ్నమైంది దానికి కారణం రోడ్డు మధ్యలో వచ్చిన నెమలి కారణంగా.. అందమైన ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ నెమలి పురివిప్పి దారిలో ఆగి ఉంది..

ఒక్కసారిగా ఇద్దరూ “నెమలి “అని అరిచారు…

‘కాసేపు కారు ఆపుతారా సాగర్ “అని అడిగింది సౌదామిని…

వెంటనే కొంచెం దూరంగా కారు ఆపి ఇద్దరూ దిగి అలాగే నెమలిని చూస్తూ ఉన్నారు. వారిద్దరి మనసులు కూడా మయూరంలా పురివిప్పి నాట్యం మాడుతున్నాయి…

అలాగే అనుకోకుండా ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకున్నారు… ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు…

పెదవుల భాష కన్నా కన్నుల భాష చాలా గొప్పది.m చెప్పకనే ఎన్నో భావాలను చెప్పగలిగేవి కళ్ళు.. మరొకరు వినకుండా ఒకరికొకరు సంభాషణను చేర వేసుకోవడానికి ఉపయోగపడేవి కళ్ళు…

నెమలి కూసిన శబ్దానికి ఇద్దరు ఉలిక్కిపడి “వెళదాము లేట్ అవుతుంది” అన్నది సౌదామినీ..

” అవును అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు” అని ఇద్దరు కారు ఎక్కి కూర్చున్నారు… కారు వేగాన్ని పెంచాడు సాగర్ దారిలో ట్రాఫిక్ అంతరాయం ఏమీ లేనందువల్ల తొందరగానే గమ్యం చేరుకున్నారు.

కారు బాలసదనం ముందు ఆగింది…

ఇద్దరూ కారు దిగారు…

ఒక్కసారి బాలసదనంను చూసి ఆశ్చర్యపోయింది సౌదామిని…

ఎంతో అందమైన నిర్మాణం ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంది… ప్రహరీ చుట్టూ అందమైన పూల చెట్లు కాస్తా లోపలికి వెళ్తే పండ్లు కూరగాయల చెట్లు. గోడల నిండా అందమైన పెయింటింగ్స్… బయట ఉన్న బోర్డుకు ఒక తెర వేసి పెట్టి ఉంది…

” ఎంత మంచి అభిరుచి అత్తయ్య గారిది” అన్నది సౌదామిని.

” అవును సౌదామినీ! అమ్మ చాలా తెలివిగలది తెలివి కన్నా ఎక్కువగా అమ్మ ఆత్మ సౌందర్యం చాలా గొప్పది ..అందరి పట్ల కారుణ్యం కలిగిన తల్లి అందుకే అమ్మ మాట ఇంట్లో ఎవరం జవదాటము.. అమ్మంటే మాకు అందరికీ చాలా ఇష్టం తన వ్యక్తిత్వం చాలా గొప్పది ఇంకా కొన్ని రోజులు చూస్తే నీకే అర్థమవుతుంది” అన్నాడు సాగర్.

” నిజమే సాగర్ వచ్చిన రెండు రోజుల్లోనే నేను చాలా వరకు అర్థం చేసుకున్నాను నిజంగా ఇలాంటి తల్లి ఉండడం నీ అదృష్టం” అన్నది సౌదామిని.

ఇద్దరూ లోపలికి వెళ్లారు… లోపల హాల్లో పెద్ద సరస్వతి అమ్మవారి ఫోటో అలంకరించి ఉంచారు..

పూజారి గారు పూజ చేయించడానికి సిద్ధంగా ఉన్నారు ముందుగా నీలాంబరి భూపతి పీటల మీద కూర్చున్నారు…

అలేఖ్య సుధీర్ సౌందర్యలహరి వచ్చిన తర్వాత వారితో పూజ చేయించి ఫంక్షన్ ప్రారంభం చేయాలని అనుకున్నారు…

చాలామంది బంధువులు వచ్చి కూర్చున్నారు అందరికీ అతిథి మర్యాదలు చాలా బాగా అందుతున్నాయి…

బయట అన్ని కుర్చీలు వేసి ఉంచారు చిన్న వేదిక ఏర్పాటు చేశారు ముఖ్యఅతిథులు ఎక్కువమంది లేరు కాబట్టి కొన్ని కుర్చీలు మాత్రం వేసి పెట్టారు…

క్రింద ఒక పెద్ద ఊయల ఏర్పాటు చేశారు లోపల బాలసదనంలో పిల్లల గురించి చాలా ఊయలనే ఉన్నాయి. ఈ ఊయల మాత్రం భూపతి వంశపారంపర్యంగా వచ్చే ఊయల…

సాగర్ సౌధామిని వచ్చి నీలాంబరి కి అటు ఇటు కూర్చున్నారు… ఏది అవసరం ఉందో నీలాంబరకి చకాచకా అందిస్తుంది సౌదామిని.. ఒక కంట ఆ అమ్మాయిని కనిపెడుతూనే ఉంది నీలాంబరి…

దాదాపు పూజ పూర్తి అయ్యేవరకు రెండు గంటలు పట్టింది… ఇంతలో అలేఖ్య సుధీర్ మరియు సౌందర్య లహరి వచ్చారు వారితో పాటే మహేశ్వరి కూడా వచ్చింది..

సౌందర్యలహరి ఎరుపు పట్టు పరికిణి వేసుకుని బుట్ట బొమ్మ లాగా కనిపిస్తుంది. అప్పుడప్పుడే మెడ నిలుపుతుంది కాబట్టి అందరిని చూసి నవ్వుతుంది…

సౌదామిని సౌందర్యలహరిని తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకుంది…

అలేఖ్య సుధీర్ పీటల మీద కూర్చున్నారు.. పూజారి గారు గోత్రనామాలతో పూజ చేయించారు…

ఇంకా అతిథులు రావడం ఆరంభమయ్యింది… అప్పటికే చిన్నపిల్లలతో చుట్టుపక్కల ఉన్న కుటుంబాలందరూ వచ్చారు అందులో 80 శాతం మంది బాలసదనంకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లే…

పిల్లల కోసం ఆహార పదార్థాలన్నీ చేయించి ఉంచారు పెద్దవాళ్లు కూడా ఆహారం చూస్తే వారికి కూడా నిశ్చింతగా ఉంటుంది ..పిల్లలను ఇక్కడ వదిలేసి వెళ్లినా కూడా మనసుకు ఏ చింతా లేదు అనిపించాలి అని నీలాంబరి అలా ఏర్పాటు చేసింది…

అనుకున్నట్లుగానే మంత్రివర్యులను ఆహ్వానించారు తర్వాత కలెక్టర్ గారు మరో ఇద్దరు నాయకులు వచ్చారు … మరి కొంతమంది విద్యావంతులను కూడా ఆహ్వానించారు…

ప్రముఖులందరికీ ఎదురు వెళ్లి ఆహ్వానం పలికారు భూపతి నీలంబరి….

సాదరంగా వారిని ఆహ్వానించి బాలసదనం ముందున్న బోర్డు దగ్గరికి తీసుకొని వచ్చారు….

మంత్రి గారి చేతి మీదగా ప్రారంభోత్సవం జరిగింది…

బోర్డు మీద ఉన్న పేరుని చూసి అందరికీ సంతోషం కలిగింది…
” నవ్వుల ఒడి” ఆ పేరులోనే ఎంతో ఆనందం ఉంది ఎంతో భరోసా కూడా ఉంది అన్నారు మంత్రివర్యులు…

అందరిని స్టేజి మీదకి తీసుకెళ్లారు…

ముందుగా ఆ ఊర్లోనే చక్కగా పాడగలిగిన ఒక అమ్మాయి ప్రార్థన గీతం పాడింది…. అనంతరం అతిధులు అందరూ ఒక్కరొక్కరుగా ఉపన్యాసం ఇచ్చారు…

తర్వాత మంత్రి గారు మాట్లాడుతూ…

” అందరికీ నా నమస్కారం… బాలసదనం ఏర్పాటు అంటే ఇంత గొప్పగా ఉంటుందని నేను అనుకోలేదు.. అద్భుతమైన సంకల్పం దానితో పాటే అద్భుతమైన నిర్మాణం.. దానికి తోడు ఇక్కడ పండిన కూరగాయలతోటే పిల్లలకు భోజనం అందించడం.. ఇక్కడ పెంచే పాడి పశువుల పాలు పిల్లలకు తాగించడం.. ఇవన్నీ నా మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి.. కమర్షియల్ గా ఇలాంటివి ఎంతో మంది కట్టిస్తున్నారు కానీ నీలాంబరి గారు తనకు వచ్చిన ధనంతో దీనికి శ్రీకారం చుట్టారు దానికి వారి కుటుంబ సభ్యుల నుండి కూడా ప్రోత్సాహం లభించింది వారి స్థలంలోనే ఏర్పాటు చేసి దాదాపు ఖర్చు అంతా వాళ్లే పెట్టుకోవడం ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం.. ఈరోజుల్లో ఇలాంటి వారు ఉంటారా! అనిపించింది తర్వాత వారి కూతురు అలేఖ్య ద్వారా వారి స్నేహితులు కొంతమంది విరాళాలు పంపించారట ..ఇవన్నీ నాకు ఇక్కడికి వచ్చే ముందే తెలిసాయి… నేను ఇది విని చాలా స్పందించాను దీనికి నా ప్రోత్సాహం నూటికి నూరు శాతం ఉంటుంది ఇలాంటి సదనాలు ఏర్పాటు చేస్తే… ఆడవాళ్లకు పిల్లల మీద ధ్యాస పోయి పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది తల్లిలాగా చూసుకునే ఇలాంటి సదనాలు ఉంటే వర్క్ రేట్ పెరుగుతుంది ..నిజంగా ఇది మంచి ఆలోచన నా వంతు సహకారంగా ఇలాంటివి మరికొన్ని కట్టించడానికి నేను సహాయపడతాను.. ముఖ్యంగా భూపతి గారిని అభినందించాలి వారు వారి శ్రీమతి నీలాంబరి గారి కోరిక మేరకు తాను కూడా ఎంతో కష్టపడి ఈ నిర్మాణం జరగడానికి సహాయపడ్డారు అన్నింట్లో ఆమెకు చేయూతగా నిలిచారు… ఇక మీరు తల్లిదండ్రులందరూ ఏం చేయాలి అంటే మీ పిల్లలని ఇక్కడ వదిలి చక్కగా మీ పనులు చేసుకోవచ్చు అన్ని సౌకర్యాలతో పాటు.. తల్లిలా చూసుకునే సదనం ఇది నవ్వుల ఒడి అనే పేరు సార్థకం అవుతుంది…”

అని తన ఉపన్యాసం ముగించి కూర్చున్నారు…

తర్వాత భూపతి నీలాంబరి కూడా ఈ బాలసదనం అంకురార్పణ ఎలా జరిగింది అని వివరించారు… అందరికీ ధైర్యం వచ్చేలా మంచి వచనాలు పలికారు తర్వాత వాళ్ళ మనవరాలిని మొదటగా ఈ సదనంలో ఉయ్యాలలో వేయాలని నిశ్చయించుకున్నామని మా పాప తోటి ఈ కార్యక్రమం మొదలవుతుందని నీలాంబరి చెప్పగా అందరూ కరతాల ధ్వనులు చేశారు..

తర్వాత సౌందర్యలహరినీ ఉయ్యాలలో వేసి…

” మా మనవరాలు సౌందర్యలహరి ఈ నవ్వుల వడిలో చేరిన మొదటి బిడ్డ” అని చెప్పింది నీలాంబరి.

తర్వాత అందరి పిల్లలను తీసుకొని వేదిక ముందుకు రమ్మని చెప్పింది నీలాంబరి అందరి పిల్లలని ఎత్తుకుని కూర్చున్న తల్లుల దగ్గరికి తన మనవరాలును తీసుకొని అలేఖ్యను కూడా కూర్చోమని చెప్పింది… అందరి పిల్లలకు పూజారి గారితో అక్షంతలు వేసి ఆశీర్వచనం చేయించింది…

“రేపటినుండి నవ్వులతో వెలిగిపోవాలి ఈ సదనం ప్రతి ఇంట నవ్వులు విరియాలి.. ఆ నవ్వులే తల్లి తండ్రులకి పువ్వులై మెరవాలి….” అని చెప్పింది నీలాంబరి..

ఆ తర్వాత అందరూ భోజనాలు అక్కడే చేశారు అలేఖ్య సుధీర్ సాగర్ సౌధామిని అందరికీ భోజనాలు ఎలా అందుతున్నాయి అని పర్యవేక్షణ చేశారు పిల్లలందరినీ పలకరించారు సౌదామినికైతే పట్టలేనంత సంతోషంగా ఉంది ఆ పిల్లల్లో తనే చిన్నపిల్లగా మారిపోయి లేడి లా గెంతుతుంది…

ఓ కంట సౌదామిని గమనిస్తున్న సాగర్.. ముచ్చట పడిపోతున్నాడు…

నీలాంబరి కూడా తన మనసులోని మాట అడగాలని అనుకున్నది…

పిల్లల డాక్టర్ గా ఇక్కడే ఉండిపోతే తనకు కూడా విశ్రాంతిగా ఉంటుంది పిల్లల అనారోగ్యాల గురించి చింత ఉండదు… ఇలా చక్కగా కార్యక్రమం జరిగింది…

సాయంకాలం అందరూ ఎవరు ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మెచ్చుకోలు -మంచిదోయ్

కత్తి పట్టిన కవియిత్రి