మెచ్చుకోలు -మంచిదోయ్

రమ్మక్కతో ముచ్చట్లు-4

       రమాదేవి కులకర్ణి

శనార్థులందరికీ,

తరుణి పత్రికకి, నిహారిణమ్మకు ప్రత్యేక దండాలు. రమక్కతో ముచ్చట్లు మొదలువెట్టి మూడు వారాలు అయిందో లేదో చాన మంది దోస్తులు సాహితివేత్తలు పెద్దలు, తమ్ముండ్లు- శెలెండ్లు ముచ్చట్లు బాగున్నయని మెసేజ్లు వెడుతున్నారు, కాల్ జేత్తున్నరు మెచ్చుకుంటున్నరు. శాన సంతోషం. బల్లెల చదివే శిన్న పిల్లలకే కాదు, అందరికీ ఒక మెచ్చుకోలు ఆవుసురం. ” బాగుంది” ‘ శభాష్’ అన్నమాట మస్తు దైర్నం ఇస్తది. పని ఇంకా మంచిగ చెయ్యాల్ననిపిస్తది. అందరికి ‘గుడ్ ‘ అనిపించుకోవాల్ననే ఉంటది. ఇగో కొందరుంటరు.. మీగ్గూడా అనుభవం అయ్యే ఉంటది, ఎంత జెయ్యు, ఎంత సేవ చెయ్యు, గుండె ఒలిశి శేతులు వెట్టు గాక.. ఒక ఉల్కుండదు, పల్కుండదు ఇక రాయి లెక్కనే.. ” ఎవళ్ల కోసం చేసినవ్ ” అన్నట్టే ఉంటది వాళ్ళ లెక్క.
ఇంగ్లీష్ల ఒక మాట చెప్తా
“By approciation we make excellence in others ” అంటరు. ఒక చిన్న మెచ్చుకోలు ఎదుటి వాళ్ళల్ల ప్రతిభను పెంచుతది అని అర్థం. ” సుత్తి కొట్టుడు బంద్ చేయరా అంటం గదా “. అది వేరు. మన పనులు పూర్తి చేయించుకోనీకి ఎదుటోనికి మసక కొట్టడం అది. అది అవుసరం లేదు.
ప్రశంస మాత్రం అందర్కి అవుస్రమే తమ్మి!
నేను గమనించిన కాడికి చెప్తున్న.. చిన్నపిల్లలు తెలిసి తెల్వక రకరకాల పనులు చేస్తుంటరు. కొన్నిరగొడతరు, కొన్ని పలగొడ్తరు , కొన్నిసార్లు ఎత్తేస్తరు. దబ్బున వాళ్ళను భయపడేటట్టు కసరు కుంటరు శాన మంది పెద్దోళ్ళు. అట్ల చేయకుండ్రి వాళ్లకు ఏంకరేజ్మెంట్ ఇయ్యండి ఏదైనా చేస్తే శభాష్ అని మెచ్చుకోండి. బడిలల్ల గూడ ఇట్ల శాన ఉంటది. ఎప్పుడు ఫేలయ్యేటోళ్లు ఒకసారి ఐదు-ఆరు మార్కులు దెచ్చుకున్న వాళ్లను గూడ మెరిట్ స్టూడెంట్లను మెచ్చుకున్నట్టే, మెచ్చుకుంటే తర్వాత వాళ్లకు ఎక్కువ చదవాలన్న హుషార్ మొదలైతది.
” నీ ముఖం తీ” అన్నమనుకోండి.. ఇగ ఆ పిల్లగాడు ఎప్పటికీ సదువనే సదవడు.
” మెచ్చుకోలు -మంచిదోయ్ ”
పూర్వకాలంల రాజుల దగ్గర ” బట్రాజులు” అని ఉండేటోళ్లట. వీళ్ళ కొలువు ఏందంటే రాజును ఊకే పొగుడుతా ఉండాలె..! ఇప్పుడు అసొంటియి అవుసరం లేదు. దీనిని ఆంగ్లంల Flattery అంటరు. ” Flattery is a food of fools ” అని దీని మీద సామెత గూడ ఉంది.
ప్రోత్సాహం తోని ఆనందం వస్తది.
మనిషి ఆనందంగా ఉన్నప్పుడు పని మంచిగ జేయగలుగుతడు. హృదయంల గూడ ప్రశాంతత ఏర్పడుతది.
దీనికి శాస్త్రవేత్తలు ఏం చెప్పిండ్రో, సైన్స్ ఏం చెప్పిందో వినుండి ఆశ్చర్యపోతరు ఇగ మీరు గూడ.
ప్రోత్సాహం వల్ల శరీరంల డోపమైన్,సెరొటోనిన్,ఆక్సిటోసిన్,ఎండోర్ఫిన్స్ అనే రసాయన పదార్థాలు విడుదలైత యంట,
వాటి తోని ఆనందం, ప్రోత్సాహము, మంచి మనస్తత్వం, సంతృప్తి పెరుగుతయంట.
అంతే గాదు ప్రేమ, అనుబంధాలు పెరుగుతయంట. వీటి వల్ల సహజంగా నొప్పి నివారణ గూడ పని జరుగుతదంట. చూసిన్రా ఎన్ని అద్భుతలున్నయో.
” ఇంట్ల ముసలోళ్ళు ఉన్న, చాతగానోళ్లు ఉన్నా, వాళ్ళ దెగ్గర జెర సేపు కూసోని మూడు మంచి ముచ్చట్లు శెప్పుండి రోగం సగం తక్కువ అయితది” అనేటోళ్లు పెద్దోళ్ళు ఒకప్పుడు. యాదికుందా? టైం యాడుంది పైసల్ పడేస్తం,మందులు ఇప్పిస్తం గదా అంటరు. అవి గూడ అవుసరమే గాని, మీతోని ఐదు నిమిషాల ముచ్చట గూడ అవసరమే శెల్లే ..! ” ఏమంటరు? అవునంటరా..! కాదంటరా ..!
ఆలోచన జెయ్యుండి. మీ ఇష్టం ఇగ మరి. చిన్న మెచ్చుకోలు అందరికి అవుసరమే అనుకుంటే మీ ఇంట్ల పెద్దోళ్ళను చిన్నోళ్లను, మీకు వండి పెట్టె అమ్మను, పెండ్లామును అందరిని మెచ్చుకోండి. చిన్న పిల్లల పనులను మెచ్చుకోండి, ఇంట్ల పని జేసే పనోండ్లను గూడ మెచ్చుకోండి. ఈ ఆర్టికల్ నచ్చితే నన్ను గూడ మెచ్చుకోండి. మీకు దెలిసిన నల్గురికి ఈ ఆర్టికల్ పంపుండి. నచ్చకపోతే సలహాలు ఇయ్యుండి.
ఇది నేను ఈ వారం మీతోని చెప్పాలనుకున్న ముచ్చట. మీకు నచ్చిందని అనుకుంటున్న.
ఉంట మరి. అందరూ పైలం..!!

మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శతక పద్యాలు జీవన మార్గ సూచికలు

దొరసాని