శ్రీ గురవేనమః

రమక్కతో ముచ్చట్లు .. 3

శనార్థులు.
గురుపార్ణమి శుభాకాంక్షలు తమ్ముండ్లు చెల్లెండ్లందరికి. పెద్దోళ్లకు గురువులకు పాదాభివందనాలు.
ఇవ్వాళ్ళ గురు పౌర్ణమి మస్తుగ చేస్తున్నరు అన్ని తావుల. కొందరైతే అన్నదాలను జేసిన్రు. ఇక వాట్సప్ స్టేటస్ లు ఫేస్బుక్ లు ఇన్స్టాల అయితే ఇక చెప్పనే వద్దు. , భక్తి ఉందో లేదో గాని సెల్ఫీలు ఫోటోలు మాత్రం మస్తుగున్నయ్. దునియాల అందరికీ గురువంటే గింత భక్తుందా అనిపించేటట్టే ఉంది ఆ ఫోటువల్ గిట్ట చూస్తుంటే.
ఆషాడ మాసం ల వచ్చే పున్నమి వ్యాస భగవానుల పుట్టినరోజు.

      రమాదేవి కులకర్ణి

మహాభారతం రాసిన వ్యాసుని జయంతి గనుక, ఈ పున్నమిని గురు పూర్ణిమ అని ప్రతి సంవత్సరము పండుగ లెక్క జేస్తరు.
వ్యాసులతో పాటు ఎవరెవరికి, ఎవల గురువులు ఇష్టమో వాళ్ళ గురువులకి చేసుకుంటరు. నా లెక్కల, వీళ్ళకే చెయ్యాలని ఏం లేదు గురువు అంటే ఒక్కలే..! ఎవరికి చేసినా గురువులకు చేర్తది.
” దైవమైన చూపలేడు ఒక్క గురువును
సద్గురువైతే చూపగలడు దేవదేవుని. ”
ఎంత మంచిగున్నయి కదా ఈ మాటలు.
మన బతుకుకు బాట చూపేటోళ్లు గురువులు. యే కాలమైతెంది ఏ దేశమైతెంది? ఏ ప్రాంతమైతెంది, జీవితం అంటే ఏంది, విలువలు అంటే ఏంది అన్నది అందరికీ తెలవాలె. మనకి కష్టంల సుఖంల ఆదుకున్నోళ్ల మీద ఎప్పటికీ కృతజ్ఞత ఉండాలె. మన అమ్మా నాయనల మీద
ఎంత ప్రేమ ఉంటదో, బతుకును సూపెట్టిన గురువు మీద గూడ అంతే గౌరవము భక్తి ప్రేమ ఉండాలె.
మన భారత దేశ సంస్కృతి అంత గూడ ఈ గురు పరంపర మీదనే నడుస్తుంది. ముందు తరం కి గూడ అది అందించే బాధ్యత మనది. అదేందో గానీ ఈ మధ్యన శాన మటుకు గురువుకు పంగనామం పెట్టేటోళ్లే ఎక్కువయ్యిండ్రు.
ఒకటి మాత్రం నిజం తమ్మి..! Karma plays అంటరు.
కబీర్ దాస్ అనే ఒక గొప్ప కవి ఉంటుండే.! ఆయన హిందీలో రాసిన ఒక దోహా యాద్ జేసుకుందాము.
” గురు గోవిందు దోవు కడే,
కాకేలగావు పావు
బలిహరి ఓ గురువుకే,
జిస్ని గోవిందుకే రాహ దిఖావా ”
దేవుడు గురువు ఇద్దరు ఒక్కసారే ప్రత్యక్షమైతే ముందు నేను గురువు కాళ్ళకి మొక్కుతా, ఎందుకంటే దేవుణ్ణి నాకు సూపెట్టినోడు గురువే కదా అంటడు కబీర్దాస్.
ఎంత గొప్ప మాట చెప్పిండ్రు కదా. అది గురువు యొక్క విలువ బిడ్డ. అందం ఉన్న ఎన్ని పైసలు ఉన్నా జ్ఞానం లేకపోతే ఏం జేస్తం. నాలుగు అక్షరాలు నేర్పి దునియా అంటే ఏందో చూపిచ్చి, ఎట్ల బతకాల్నో నేర్పిన గురువునే జెర్రన్ని పైసలు, జెర మిడి మిడి హోద రాంగానే బేఖాతర్ జేస్తున్న దునియాల ఉన్నం.
ఏది శాశ్వతం కాదు చెల్లె. యాదికుండాలె. పండుగల అంటే వండుకొని తినుడు కాదు. అసలు పండుగలు పబ్బాలు నేర్పే నీతి ఏంది, ఇచ్చిన సంస్కృతి ఏంది. యాడికెల్లి వచ్చినం, యాడికి పోతున్నమని ఎప్పుడు ఆలోచన ఉండాలె.
పెద్దల మీద గౌరవం చిన్నోళ్ల మీద ప్రేమ ఇదే గదా మనం సూపించేది. ఎప్పుడు తెప్ప తగలబెట్టుకుంటా పోతే ఎట్లా? శెట్టెక్కి కొమ్మనరుకుడు అయితది బతుకు.
ఒక మంచి గురువు దొరికినోనీ బతుకు పున్నమిలెక్క నిండుగుంటది.
గురువు విలువ తెలుసుకోవాలి. యేది మరిశినా ఏమి
ఇడిశినా గురు పాదాలను విడవద్దు.
అర్థం పరమార్థం అన్ని గురువే సూపుతడు. ఈ మాట బాగా యాదికుండాలె చెల్లెండ్లు,తమ్ముండ్లు మీ అందరికీ.
సరే మరి ఉంట.
గురుపూర్ణిమ సందర్భంగా ఒక్కసారే అందరం ” గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవేనమః” అని స్మరణ చేసుకుందాం! సెలవ్ మరి వచ్చేవారం కలుస్తా.

మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంధి అంటే….

” వెన్నుడా వేదాంతవేద్యుడా..