ఆడియో విజువల్ హెరిటేజ్

చరిత్ర

యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్

మన సంస్కృతీ పరంపరను దృశ్య శ్రవణ మాధ్యమాల్లో భద్రపరిచి వాటిని ప్రదర్శించడం ద్వారా రాబోయే తరాలకు మన వారసత్వ సంపదను అందజేయ చేయవచ్చు. దీనిలో పూర్వ సాహిత్యమే కావచ్చును, చారిత్రక కట్టడాలు కావచ్చును, మంచి శిల్పకళా నైపుణ్యం ఉన్న దేవాలయాలు కావచ్చును, వ్యవహారాలు ప్రతిబింబించే పండుగలూ కూడా కావచ్చును, రాజులు నిర్మించిన కోటలు, బురుజులు వాటిద్వారా చరిత్రను రాబోయే తరానికి తెలుపవచ్చు! వాటి యొక్క పూర్వ వైభవాన్ని తెలుసుకోవడమే కాకుండా, వాటిని ప్రచారంలోనికి తీసుకొని రావాలని ,ప్రచార మాధ్యమాల ద్వారా తెలియజేయాలని దాని కొరకు శబ్ద( ఆడియో) చిత్రీకరణ(విజువల్) ఉపయోగించుకోవాలనేది ముఖ్య ఉద్దేశం.
దీనిలో భాగంగా మన పూర్వ సంస్కృతి పరంపరలో భాగంగా ఈరోజు రామప్పదేవాలయం యొక్క అపూర్వతను, అద్భుతాలను రాబోయే తరాలకు దృశ్య- శ్రవణ మాధ్యమాన్ని ఉపయోగించినట్లయితే చాలా చక్కగా తరతరాలకు అందించగలము. ఎలా అంటే? విదేశాలలో నివసించే వారు కానీ దూర ప్రాంతాల్లో ఉన్న వారు కానీ తమ తమ కంప్యూటర్ ద్వారా వారికి రామప్ప ఆలయం తాము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేలా చేయవచ్చును.
1. కాల్పనిక వాస్తవికత్వము( Virtual realing).
2. అనుబంధ వాస్తవికత ( Augmented realty).
ఈ రెంటి ద్వారా ఉపయోగం ఏ విధంగా ఉంటుంది అంటే ఉదాహరణకు రామప్ప దేవాలయంలోని ఒక స్తంభం దగ్గర నిలిచి మనం ఆ స్థంభం మీద చిత్రకళా నైపుణ్యాన్ని చూస్తున్నప్పుడు మనకు ఆడియో ప్రీ రికార్డెడ్ మెసేజ్ లతో వాటి ప్రతేకత ఆ శిల్ప కళా యొక్క ప్రత్యేకత, ఆ శిల్పాల చరిత్ర, ఆ శిల్పకారుడి ఉద్దేశ్యం, దానికి ఆ కాలంనాటి సాహిత్యానికి ఉన్న సంబంధం, అది ఏ శతాబ్దానికి చెందిన కట్టడం, అది ఎవరిచే నిర్మించబడింది ఇలా అన్ని వివరాలు ఈ వీడియో ఆడియో ల ద్వారా తెలుసుకొనవచ్చు.
ఇందులో ఎవరికీ అర్థమయ్యే భాష ద్వారా వారు వినే సదుపాయం కూడా కల్పించవచ్చు. ఈ ఆడియోలు నిపుణులచే తయారు చేస్తారు కాబట్టి తప్పుడు సమాచారం అందే అవకాశం ఉండదు.
ఉదాహరణకు రామప్ప దేవాలయం చూడాలని ఎవరైనా అంతర్జాతీయ యాత్రికుడు వచ్చినప్పుడు శిక్షణ పొందిన గైడు లేనట్లయితే, ఉపాధి దృష్ట్యా వృత్తి గా తీసుకున్న ఎవరైనా గైడ్ వారికి చరిత్ర అంశాలు కానీ, కట్టడం యొక్క ప్రశస్తి కానీ, ఆయా కట్టడాలు నిర్మించిన కాలం అవగాహన లేకపోవడం గానీ, ఆగైడుకు శిల్పకళా రీతులు తెలియకపోతే… యాత్రీకులకు తప్పుడు సమాచారం అందుతుంది. అలా కాకుండా ముందే సమాచారం రికార్డు చేసి ఉండడం వల్ల సరియైన సమాచారం యాత్రికులకు అందడమే కాకుండా, ప్రతి చిన్న అంశాన్ని ప్రతి ఒక్కరు కూలంకషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది… ఇది శాశ్వతంగా కూడా ఉంటుంది. అంతే కాదు సమయము కూడా వృధా కాకుండా ఉంటుంది. కాబట్టి రాబోయే తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను చరిత్ర పరంపరగా అందించ వచ్చును.
అనుబంధ వాస్తవికత ( Augmented realty)
కాల్పనిక వాస్తవికతత్వం ( Virtual realing) వీటికి .ధ్వని తోడ్పాటు( sound effects) ను జత చేస్తే, అనగా వీడియోను చిత్రీకరించిన అప్పుడు సన్నివేశంలో ధ్వనితో మరింత ఆసక్తికరంగా విశేషాలను తెలుపవచ్చు. ప్రత్యేక ధ్వనులతో పాత కాలం నాటి పరిస్థితులు దేవాలయం కానీ ఇతర యాత్రా విశేషాలును కానీ సహజ స్థితిని అంటే పవిత్ర భావం కలిగించే అనుభూతిని ఇవ్వవచ్చు. మాటలు లేదా కామెంటరీకి ధ్వని తోడ్పాటు బాగా రక్తి కట్టిస్తుంది.

రేడియో;- మన పరంపరలో దృశ్య శ్రవణకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తొలినాళ్ళనుండి సామాన్యజనానికి అందుబాటులో ఉండి శ్రోతలు ఎక్కువ కలిగి ఉన్నది రేడియో. దూరదర్శన్ లు వచ్చిన కూడా ప్రయాణంలోనూ కార్లలో బస్సులలో,, చరవాణి లోనూ ట్రాన్సిస్టర్లు ద్వారా మొబిలిటీ ఉన్నది రేడియో కావడం వల్ల దీని ద్వారా సంస్కృతీ పరంపరను రాబోయే తరాలకు అందించేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. ఇది వరకే ఈ విషయంలో ఎంతో పురోగతి సాధించిందని చెప్పాలి.
టెలివిజన్:– టెలివిజన్ ద్వారా కూడా మన పరంపరాగతమైన అనేక విషయాలు భద్రపరచడంలోనూ , తెలియ చెప్పడంలోనూ ఆడియో వీడియో హెరిటేజ్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నది… పడుతుంది కూడా! ఇందులో Virtual reality ( కాల్పనిక వాస్తవికత్వం, Augmented realty ( అనుబంధ వాస్తవికత అను సాంకేతికత ఉపయోగించి ప్రతి చిన్న అంశాన్ని విస్తృతంగా చూపెట్ట వచ్చు. సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను ఆడియో ద్వారా వినిపించవచ్చు. దీనికి సరి అయిన నిపుణులే (టెక్నీషియన్లు) కాకుండా చరిత్రను పరిశోధన చేసిన వారితో స్క్రిప్ట్ వ్రాయించి చాలా బాగా విశ్లేషణ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఆ ప్రదేశం సందర్శించాలని కోరిక కలిగేటట్టు చేయడంతో యాత్రికులు (Tourists) పెరగడంతో టూరిజం శాఖ అభివృద్ధి చెందుతుంది.
అట్లాగే మన సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ కూడా చేసిన వాళ్లం అవుతాము. అనుబంధ వాస్తవికత ద్వారా వీడియోలు నెటిజన్లు వారి వారి లాప్ టాప్ లోనూ చూస్తూ కూడా ఏదైతే చూస్తున్నారు ఆ ప్రదేశాన్ని దగ్గర నుండి చూసిన అనుభూతిని పొందుతారు. మనం పరంపరలో భాగంగా ఈరోజు రామప్ప దేవాలయం దర్శిద్దాం! అంతకన్నా ముందు ఈ రామప్ప దేవాలయాన్ని నిర్మించిన కాకతీయుల గురించి విహంగవీక్షణంగా తెలుసుకుందాం!           కాకతీయులు:- 350 సంవత్సరాల పాటు ఓరుగల్లు లేదా నేటివరంగల్ ను రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాకతీయుల చాలా ప్రసిద్ధి పొందిన వంశం. అనగా క్రీ.శ. 1083- 1323 వరకు వీరి సేనానులు రాష్ట్రకూటులు శాతవాహనుల తర్వాత తెలుగు జాతినిసమైక్యంగా చేసి ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన హిందూ వంశీయులు కాకతీయులు.
కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరిసంపదలతో తులతూగుతున్నట్టు అమీర్ ఖుస్రూ , మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తున్నది. తెలుగువారికి ముఖ్య వృత్తి వ్యవసాయం అయితే అప్పటి వరకు వర్షాధారం గానే వ్యవసాయం చేసేవారు. కానీ కాకతీయ రాజులు, రాణులు, సామంతులు పెద్ద పెద్ద చెరువులు కాల్వలు తవ్వించి నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. అందులో” రామప్ప చెరువు” కేసరి సముద్రం”, “పాకాల చెరువు”, “కాట సముద్రం”” చౌడ సముద్రం”, జగత్ కేసరి సముద్రం మొదలైనవి నీటి వనరులు.
కాకతీయ చక్రవర్తులు లలితకళలు సాహిత్యం ఈ పెంచి పోషించారు. వీరికాలంలో నాట్యకళ ఎంతో ప్రసిద్ధి పొందింది. నాట్యం చేసే నర్తకీమణులకు, మృదంగ విద్వాంసులులకు ఇండ్లు కట్టించి ఇచ్చారట. చేబ్రోలు శాసనంలో కాకతి గణపతి దేవుడు నృత్తరత్నావళి రచయిత జాయపసేనాని 16 మందిని గృహ దానాలు చేసినట్లు రాశాడు.
శాసనాలతో పాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాల్లో నాట్య సంప్రదాయాలను పోలిన చాలా నాట్యశిల్పాలు ఉన్నాయి. చాలా దేవాలయాలు తురుష్కుల దండయాత్రలతో ధ్వంసమై పోయాయి. వారసత్వానికి అనగా హెరిటేజ్ కు నిదర్శనంగా సాహిత్యం, నాట్యం, శిల్పకళ, చిత్రకళ మొదలైన అన్ని రంగాలలోనూ కాకతీయులు తమదైన శైలిని చాటి చెప్పారు. సంస్కృతి సాహితీ సంపద శిల్ప కళారీతులు లలితకళలు ఈ రోజుకు కూడా చెక్కుచెదరకుండాఉన్నాయి. భారతదేశంలో ఉన్న అద్భుత శిల్ప రీతుల్లో కాకతీయ శిల్పరీతికి ఒకటి. దేవాలయాలలోని స్తంభాల నిర్మాణ పద్ధతి, వాటిని నిలబెట్టిన విధానం, గర్భాలయ ముఖద్వారాలు బట్టి అవి కాకతీయులు కట్టించారో లేదో చెప్పవచ్చు! కాకతీయుల శిల్పరీతి హోయసల శిల్పరీతి వలేఉంటుంది. ఈ రామప్ప దేవాలయం నిర్మాణానికి ముందే బేలూరు, హలేబీడు, సోమనాథపురాలలో దేవాలయాలు దాదాపు రెండు వందల సంవత్సరాలకు ముందే నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. ఈ దేవాలయం మీద కనిపించే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటి శిల్పాలు కాకతీయ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే హోయసల  శిల్పరీతికి కాకతీయ శిల్పరీతికి కొన్ని భేదాలు కనిపిస్తాయి. హోయసల శిల్పులు ఆలయాల బయటవైపునే తమ నేర్పరితనాన్ని చూపెట్టారు. కానీ కాకతీయుల శిల్పులు లోపలి భాగాలలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు. హోయసల ఆలయాలపై కన్పించేవి దేవతామూర్తులు కాగా…. కాకతీయుల ఆలయాలపై కనిపించేవి ఆ నాటి సామాన్య స్త్రీ పురుషులవి. ఆనాటి సామాన్యుల వేషధారణ, హావభావాలను చెప్పించడం ఒక కాకతీయ రాజులు చేశారు.
రుద్రేశ్వరాలయాన్ని రుద్రసేనాని శ్రీముఖ నామ సంవత్సరం 1135 క్రీస్తుశకం 30-3 -1213లో నిర్మించినట్లు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.
రామప్ప ఆలయ విశేషాలు:- శ్రీ రుద్రేశ్వర ఆలయంలోనికి ప్రవేశించగానే ఈశాన్యభాగంలో రుద్రసేనాని వేయించిన శాసనం కనిపిస్తుంది. అందులో రుద్రసేనాని వంశవర్ణనం, అతనిపూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి, పరాక్రమాలు, ఆనాటి ఓరుగల్లు పూర్వవైభవం వర్ణింప బడి ఉన్నాయి. ఆలయానికి తూర్పు ,దక్షిణ, ఉత్తర దిశలో మూడు ద్వారాలున్నాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా నందివిగ్రహం అత్యంత నేర్పరితనంతో చెక్కిన విగ్రహం. అంటే ఏ దిక్కు నుండి ఆ నందిని చూసిన ఆ నంది మన వైపే చూస్తున్నట్టు కనపడుతుంది. మంచి చెక్కడాలతో ఉంది.
మదనిక శిల్పాలు:– ఆలయంలో బయట వైపున స్తంభాలను పైకప్పులను కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహర శిల్పాలే మదనికలు. ఇవి ఆనాటి సామాన్య స్త్రీలవి. మదనిక శిల్పాలను వస్త్రాల కంటే ఆభరణాలతోనే అందంగా రూపొందించారు. అందులోనూ అప్పటి స్త్రీలు ధరించే హారాలు శిరోభూషణాలను పొందుపరచారు. ఒక్కో శిల్పం ఒక్కో విశేషంగా కనిపిస్తుంది. ఆనాటి జీవన సౌభాగ్యానికి ఆ శిల్పాలు నిదర్శనాలు. ఒక మదనిక చీరను ఒక కోతిలాగి వేస్తుంటే… మరొక చేత్తో మానసంరక్షణ చేసుకుంటూ… రెండవచేతితో ఆ కోతిని అదిలిస్తున్నట్టు ఉన్నా శిల్పంలో ముఖ కవళికలు పరమాద్భుతంగా ఉంటుంది. మరొక మదనిక పాదంలో ముల్లు గుచ్చుకోగా ఆ పాదం మీద ఏర్పడిన వాపును కూడా చక్కగా చెక్కిన చూపెట్టిన నేర్పరితనం ఆనాటి శిల్పులది.
రంగమంటపం;-
గర్భాలయానికి ముందున్న రంగమంటపం నిర్మించిన తీరు అద్భుతంగా ఉంది. నాలుగు స్తంభాల మీద చెక్కిన శిల్పాలు చాలా అందంగా కనిపిస్తాయి. స్తంభం పైభాగాన్ని సంగడి పట్టినట్లు చెక్కారు. స్తంభాల మధ్యలో చతురస్రాకార ఫలకాల మీద గుండ్రంగా ఉన్న భాగాల పైన వాటికి తగినట్లుగా శిల్పాలను చెక్కారు శిల్పులు.
ఒకదానిమీద సముద్ర మధనం, మారో దాని మీద ముగ్గురు స్త్రీలకు నాలుగు కాళ్లు ఉన్న శిల్పం, మరొక స్తంభం మీద పేరిణి నాట్యం, ఇంకో స్తంభం మీద దండ లాస్యం, కుండలాకార నృత్యం, ఇంకొక స్తంభం మీద స్త్రీలే మధ్యలో వాయిస్తుండగా మరొక స్త్రీ నాట్యం చేస్తున్నట్టు చెక్కినట్టున్న అద్భుత చిత్రాలున్న స్తంభాలు బాగుంటాయి.
గర్భాలయ ముఖ ద్వారం:-
ఆలయంలో ప్రధాన ద్వారం మీద చెరుకుగడలు, అరటి బోదలు, మధ్య బాణాలు ధరించి రకరకాల భంగిమలలో నిలబడ్డ స్త్రీలు జీవకళ ఉట్టిపడుతూ ఉన్నట్టుగా చెక్కారు. ఇక్కడి శిల్పాలను చేత్తో మీటితే ఆ రాయి నుండి లోహపు శబ్దం రావడం మరొక విశేషం. వాటి పైభాగాన సింహాల వరసలు లతలు వాద్యకారుల చిత్రాలు అందంగా చెక్కారు.
శ్రీ రుద్రేశ్వర మహాలింగం:- గర్భాలయంలో ఉన్న పెద్ద శ్రీ రుద్రేశ్వర మహాలింగం చాలా పెద్దది. పానవట్టంలోనే కాకుండా కింది భాగంలోనూ చెక్కిన సన్నని గీతలు శిల్పుల పుణ్యాన్ని తెలియజేస్తుంది.
దశ భుజ రుద్రుడు:-
రంగ మండపం మధ్యభాగంలో ఉన్న పైకప్పులో దశభుజుడైన నాట్యరుద్రుడు అందంగా చెక్కబడి ఉన్నాడు. ఇలాంటి శిల్పమే హన్మకొండలోని రుద్రేశ్వర ఆలయంలోని ( వేయిస్తంభాల గుడి) లోనూ ఉన్నది.
శైవమతాన్ని బాగా పాటించిన కాకతీయులు వైదిక రుద్రుని ఆరాధించారు అనడానికి రుద్రదేవ మహారాజు, రుద్రమదేవి, ప్రతాప కుమార రుద్రదేవ మహారాజు అన్న వారి పేర్లలో కనిపించే రుద్ర శబ్దమే తార్కాణం. ఆ దశభుజ రుద్రునికి కుడివైపున ఉన్న ఐదు చేతులలోనూ శూలం, వజ్రాయుధం, ఖడ్గం, పరుశువు, అభయముద్రలున్నాయి. అలాగే ఎడమ వైపు ఉన్న ఐదు చేతులలోనూ నాగం, పాశం,గంట, అగ్ని, అంకుశాలున్నాయి.
‌      కావ్యాలలోని ప్రకరణాల వర్ణనల ఆధారంగా శిల్పులు తమ శిల్పాలను చెక్కారని అనిపిస్తుంది. ప్రతాపరుద్రుని సమకాలికుడైన పాల్కుర్కి సోమనాథుని” పండితారాధ్య చరిత్ర” వాద ప్రకరణంలో సరిగ్గా ఇదే రకమైన వర్ణన కనిపిస్తుంది. ఆ దశభుజరుద్రునికి చుట్టూ అష్ట దిక్పాలకులు భార్యాసమేతులై, తమతమ వాహనాల మీద కొలువుతీరి ఉన్నారు. ఆ రంగమంటపం చుట్టూ ఉన్న నాలుగు అడ్డ దూలాల మీద సముద్ర మధనం, త్రిపురాసుర, గజాసుర సంహారం, వరాహ మూర్తి, నాట్య గణపతి, కృత్య మొదలైన రూపాలను శిల్పులు ఎంతో అందంగా చెక్కారు. ముఖ్యంగా గజాసుర సంహారం చేసిన శివుడు ఆ ఏనుగును చీల్చి బయటకు వస్తున్నట్లు చెక్కిన శిల్పం మహాద్భుతం!రంగమంటపం చుట్టూ ఉన్న పైకప్పు లో రకరకాల పద్మాలు, రాతి చక్రాలను చెక్కారు.
ప్రదక్షిణ పథం:-
ఆలయానికి చుట్టూ విశాలమైన ప్రదక్షణ పథం ఉన్నది. దాని మీద నడుస్తుంటే ఆలయం వెలుపల చెక్కిన ఎన్నో కుడ్యశిల్పాలు కనిపిస్తాయి. వాటిలో శృంగార క్రీడా వినోదాలు, వాద్యకారులు, మల్లయుద్ధాలు, భైరవ మూర్తులు మొదలైన శిల్పవిశేషాలు కనిపిస్తాయి. అవేకాక మహిషాసురమర్దని, వీరభద్రుడు, సప్తమాతృకలు వంటి శిల్పాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. రుద్రేశ్వరాలయంలో పైభాగాన పెద్ద గోపురం కనిపిస్తుంది. అది వేసర శిల్ప విధానంలో నిర్మింపబడింది. ఆలయ శిఖరానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్ళలో తేలుతాయి. ప్రస్తుతం అవి దొరకడం లేదు కానీ అవి కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.
ఇటువంటి అనేక శిల్పకళా విశేషాలతో అతి రమ్యంగా ఉన్న ఆలయం శ్రీ రుద్రేశ్వరాలయం. భారతదేశంలో గొప్ప పర్యాటక కేంద్రంగా వెలుగుతున్నది. అందరూ తప్పక దర్శించుకోవలసిన క్షేత్రం రామప్ప.
ఈ చారిత్రక వారసత్వ సంపదను నేను ముందే మనవి చేసినట్లు ఆడియో విజువల్ హెరిటేజ్ లో భాగంగా చిత్రించి భావితరాలకు అందజేయడం అందరి కర్తవ్యం. మన సంస్కృతి పరంపరలో రామప్పను ఆ విధంగా రూపొందించాలి. కావ్యాలకు సంబంధించినవిశేషాలు జోడించాలి. అట్లాగే ఇంతకు ముందు చెప్పినట్టు స్తంభాలమీద చిత్రం చిన్నప్పుడు పేరిణీనృత్యం, పేరిణి తాండవ నృత్యం వంటి వాటిపై పునరుద్ధరించిన నటరాజరామకృష్ణగారి గురించి చెప్తూ అలాగే దేవదాసీల ప్రదర్శనలో ఎంతో పేరు పొందిన నృత్యరీతులను దేవాలయాల్లోని ప్రతిమల నాట్యభంగిమలను లక్షణం గ్రంథాలతో కలిపి అధ్యయనం చేసిన ఆంధ్ర నాట్యం గురించి వివరించాలి. దీనికోసం కృషి చేసిన వారి గురించి తెలియజేయాలి.
విషయ వ్యక్తీకరణ చేయడానికి దృశ్య శ్రవణ మాధ్యమాలు చాలా ఉపయోగపడతాయి. వీడియోల వల్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఈ దేవాలయం మీద ఉన్న కొన్ని శిల్ప కళాకృతులు శిధిలావస్థకు చేరుకోబోతున్నాయి. చారిత్రక నేపథ్యమున్న ఆలయాలను ప్రభుత్వం రక్షించుకోవాలి. వీటిని గురించి ప్రచారం చేసేందుకు లఘు చిత్రాలు నిర్మించి సినిమా హాల్లో సైడ్ షో ( స్వాతంత్ర పోరాటం గురించి మొదలైనవి డాక్యుమెంటరీలు సినిమాకు ముందు ప్రదర్శించేవారు )ఆ విధంగా డాక్యుమెంటరీలు తయారుచేసి సినిమా హాల్లోనూ, యూట్యూబ్ లలో లఘు చిత్రాల ద్వారా ఆడియో రికార్డ్ ద్వారా దేవాలయం యొక్క చరిత్రను, కట్టడాల విశేషాలను శిల్పకళా నైపుణ్యం గురించి సంస్కృతి పరంపరను విస్తృతంగా ప్రచారం చేసినట్టయితే పరోక్షంగా నెటిజన్లకు అక్కడికి వెళ్లి చూడలేని యాత్రికులకు చాలా ఉపయోగపడుతుంది.

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

” వెన్నుడా వేదాంతవేద్యుడా..

అంతరిక్షంలో సునితా విలియమ్స్