సందెపొద్దు గూటిలోకి

కథ

                 లక్ష్మీశర్మ

మాఘమాసం  అటు ఎండకాదు ఇటు చలికాదు. మధ్యాహ్నం  భోజనంచేసి ఎండకోసంమని  వాకిట్లో  నులకమంచం వేసుకుని.  కళ్ళుకనిపించని  తన భర్తను చేయ్యిపట్టుకుని  నడిపించుకుంటూ  వచ్చి  కుర్చీలో  కూర్చోపెట్టింది  సుగుణమ్మ.
పత్తి చ్చుకుని  పువ్వు వత్తులు చేస్తూ, తను  నేర్చుకున్న  చిన్నప్పటి  భాగవతంలోని పద్యాలు పాడుతూ  వత్తులు  చెయ్యసాగింది  తొంభై  అయిదు సంవత్సరాల  సుగుణమ్మ. గేటు చప్పుడైతే  ఎవరాని చూస్తూ, “ ఎవరది  వచ్చింది,” అంది అటువైపు చూస్తూ.
“ హలో  మామ్మా… బాగున్నావా?  నాపేరు శ్రీలక్ష్మీ,   నేను  టీవి  ఆఫీసునుండి  వచ్చాను, మీగురించి  తెలుసుకోవడానికి  వచ్చాను, మీ ఇంట్లో  ఎవరున్నారింకా  వాళ్ళను కూడా  పిలిస్తావా?  అంటూ  నవ్వుతూ  వచ్చి  సుగుణమ్మకు  ఎదురుగా ఉన్న  అరుగుమీద కూర్చుంది  శ్రీలక్ష్మీ.
సుగుణమ్మ  చూడటానికి  చిన్నగా పొందికగా  ఉంటుంది. అంతవయసు  వచ్చిన పచ్చటి మేని చాయతో, నుదుట  పెద్దకుంకుమ బొట్టుపెట్టుకుని  చేతినిండా గాజులువేసుకుంది. ఉన్నవి  కొన్ని వెంట్రుకలయినా  వాటిని  చిన్నగా  శిగముడిచి  శిగచుట్టూ   పువ్వులుచుట్టింది. నోటిలో అక్కడో  ఇక్కడో  ఉన్న పళ్ళతో  యాలక్కాయ నములుతూ, నవ్వు ముఖంతో  చూడముచ్చటగా అనిపించింది  సుగుణమ్మ  శ్రీలక్ష్మీకి. పక్కనే ఉన్న ఆమె  భర్త  కొంచెం చామనలుపు. పాపం కళ్ళుకనిపించక  వయసు  మీదపడిన ప్రభావంచేత  మనిషి  కుంచించుకపోయాడు. అతన్ని చూస్తే జాలి అనిపించింది  శ్రీలక్ష్మీకి.
“ఏంది  బిడ్డా  మాగురించి  ఏం తెలుసుకుంటావు? తెలుసుకొని ఏం చేస్తావు? మాకేమన్న పైసలిప్పిస్తావా ఏంది  చెప్పు బిడ్డా?,” ముసిముసిగా  నవ్వుతూ.
“ అవును మామ్మా… మీ ఆయనకు  వందసంవత్సరాలు  దాటాయి కదా! అందుకని గవర్నమెంటు  వాళ్ళు  వందసంవత్సరాలు  దాటినవాళ్ళకు సన్మానం చేస్తారట, మేము అలాంటివాళ్ళను  వెతికిపట్టుకుంటే  మా టీవి చానల్ వాళ్ళకు పేరు వస్తుంది, మరీ మీ ఆయనగురించి   నీగురించి  చెబుతావా,” అడిగింది  శ్రీలక్ష్మీ.
“ అట్లనా … అయితే   నా దగ్గరకూర్చో  అన్నీ చెబుతా,” అంది  తన చేతిలో  ఉన్న పత్తిని పక్కనపెడుతూ. దగ్గరగా వచ్చి కూర్చుంది  శ్రీలక్ష్మీ.
“ ఇదిగో  ఈయన నా పెనిమిటి, పాపం మంచోడే కానీ! కళ్ళుపోయినాయి  చెవులు వినిపించవు, అన్ని  నేనే  దగ్గరుండి చూసుకోవాలి,”
“ అదేంటి మామ్మా  మీకెవరు  పిల్లలులేరా? మధ్యలోనే అడ్డువస్తూ అడిగింది.
“ ఆగు  నన్ను  చెప్పనియ్యి, అబ్బా  ఈ కాలం పిల్లలకు అన్ని తొందరనే, చూడు బిడ్డా…
నేను అంతా పూసగుచ్చినట్టు  చెప్పుతా  మధ్య మధ్య  నువ్వు  నన్ను విసిగించావంటే  నాకు కోపంవస్తుంది, ఎందుకంటే  నేను మొదలుపెట్టింది మొత్తం అయ్యేవరకు నన్ను  విసిగించావనుకో నేను చెప్పను సరేనా,”అంది. సరే అన్నట్టుగా  తలవూపింది  నవ్వుతూ.
“ మా ముసలాయన  ఉన్నాడు చూసినావు కదా! మూడునాలగేళ్ళయింది కళ్ళుకానరాక, పోని చెవులైన వినపడతాయంటే  అవి మొన్నటినుండి  వినిపిస్తులేవు అంటున్నాడు, ఇక  నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు  వాళ్ళేమో  పట్నంలో ఉంటరు, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి  పురుళ్ళు పుణ్యాలు చేసి వాళ్ళ  పనులన్నీ అయిపోయాయి, ఇప్పుడు  అమ్మా  నాయినా ఎట్లా ఉన్నారో చూద్దామని ఒక్కసారి కూడా రారు, ఏమన్నంటే  మేమేం వట్టిగా ఉన్నామా మాకు  ఉద్యోగాలు సెలవులులేవు అంటారు బిడ్డా… ఒక్క కొడుకున్నాడు  వాడికి పెళ్ళాం  పిల్లలున్నారు, అగో  పైన కనపడుతుంది గదా ! గా మిద్దె మీదనే ఉంటరు, పాపం  నాకొడుకు   శాన  మంచోడు, మా కోడలు  పొద్దున్నే  చాయపంపిస్తుంది, నా కొడుకు  పనిమీద పొయ్యేటప్పుడు మాకు  నాస్త పెట్టి, మధ్యాన్నం  భోజనానికి  అన్నీ అక్కడపెట్టి  పోతాడు,” అంటూ ఆగింది  సుగుణమ్మ.
“ మామ్మా  … ఒక్కనిమిషం  నాకో  చిన్న  అనుమానం, నీ కొడుకు అన్ని తెచ్చిపెడతాడు అంటున్నావు కదా!  మరీ  మిమ్మల్ని  పైననే  ఉండమనొచ్చు కదా!  మీ కోడలు  మిమ్మల్ని చూసుకోదా,” అడిగింది.
“ బిడ్డా … నీకు ఇంకా  పెళ్ళవలేదా?  ఇప్పటికాలం వాళ్ళకు  మాఅసంటోళ్ళను  చూస్తే పసందైతదా  చెప్పు? నాకోడలు  ఉద్యోగానికి  పోతుంది,  పాపం మంచిదే నాకోడలు గానీ!
నా పెనిమిటికి  స్నానం గది నేనే చేయిస్తగని, ఏదో వాసన వస్తుందట వాళ్ళకు  గందుకని మాకు కిందిల్లు  ఖాళీ చేయించి  ఇందులో ఉంచారు  మాకు ఇది బాగానే ఉంది, మాకొడుకు చిన్న టీవి కొనుక్కొచ్చిపెట్టాడు  నాకొరకు ఏదో  అప్పుడో ఇప్పుడో నేను చూస్తా, ఈ ముసలాయనతో నాకెక్కడకుదురుతుంది, ఎప్పటికి  నసపెడతాడు  ఏంచేస్తాను, మెల్లెగా చెపితే వినపడదు గట్టిగా అరిస్తే తప్పా  వినపడదు, నాకేమో  నా శరీరంలో బలంలేదు చూడు నాకేమన్న నెత్తురుందేమో,” అంటూ తన చెయ్యని చూపిస్తూ అడిగింది.
“ అవునవును  మామ్మా , అయినా ఇంత ఓపికతో  మీ ఆయనకు చేస్తున్నావంటే  నువ్వు చాలా  మంచిదానివి, అవును  మామ్మా… నువ్వు  మీ ఆయనను  ఇంతబాగా  చూసుకుంటున్నావు కదా!  మరి మీ ఆయన  నిన్ను ప్రేమగా చూసుకునేవారా?  మీ ఆయనకు నీకు పెళ్ళెప్పుడు జరిగింది? నువ్వు ఇప్పుడే   ఇంతందంగా  ఉన్నావు కదా! మీ ఆయనను ఇష్టపడే పెళ్ళిచేసుకున్నావా, మీ ఇద్దరికి వయసులో ఎంతతేడా ఉంది,”  శ్రీలక్ష్మీ నవ్వుతూ అడిగింది.
సుగుణమ్మ సిగ్గుపడుతూ  తలకిందకు దించుకుని, ” ఇప్పుడు గవన్నీ ఎందుకులే గానీ, మా పెనిమిటికి  నాకంటే  ఒకటితక్కువ పదేళ్ళు పెద్ద, మా కాలంలో మా పెద్దోళ్ళు  ఎవరిని చూసి పెళ్ళిచేస్తే  వాళ్ళనే  చేసుకోవాలి,  ఈకాలంలో అయితే మీ ఇష్టంవచ్చినోణ్ణి చేసుకుంటున్నరు,
మా  తాత మా  ఆయనను అడిగినాడట  మా పిల్ల పసందైందాని, ఆయన చిన్నపిల్లాడే అయింది అన్నాడట, పిల్లవాడు మంచోడని మాతాత  ఈయనకిచ్చి పెళ్ళిచేసిండ్రు, మా ఆయన దేముడులాంటోడు  నన్ను  శానా మంచిగా చూసుకునేటోడు, మా అత్తనే నన్ను సతాయించింది,” ఎందుకులే అనుకుంటూనే తన చిన్నప్పటి అన్ని విషయాలు చెబుతూనే ఉంది సంతోషంతో. మధ్య మధ్యలో వాళ్ళాయనను చూస్తూ.
“మామ్మా …  ఇప్పుడు తాతకు ఎంతవయసుంది,”అడిగింది.
“ ఆ ఎంత… మరీ ముసలోడేంకాదు, వందకు ఆటుఇటు ఉంటాడేమో, మాతాతైతే  నూటపదేండ్లు బతికిండు, ఆయన కండ్లముందట నేను పోవాలి అని దేముడికి రోజు మొక్కుతున్న, మేమిద్దరం చెయ్యని పూజలులేవు  నోచని నోములులేవు, ఎప్పుడన్న జ్వరం వస్తుందికానీ  ఇప్పటివరకు  బాగానే ఉన్నం,” అంది  గొప్పగా.
“ మరీ జ్వరం వస్తే  మీ కొడుకు దవఖానకు తీసుకపోతాడా? మందులు అవన్ని తెచ్చిస్తాడా?
నీకు పొద్దెలా  పోతుంది ఎవ్వరు కనపడరు కదా!,” అడిగింది.
“ఇగో  ఈయనకు కాలుచెయ్యి  మంచిగున్నంతసేపు  మేమే  పోతుంటిమి, ఇప్పుడైతే నా కొడుకు డాక్టరును ఇంటికే పిలుస్తున్నడు, ఆయన  ఒక ఎర్రటి  సూదిమందు వేస్తే  దానంతలదే తగ్గిపోతుంది, నాకు  పొద్దు ఎందుకు పోదు, సందెవేళ  గా అరుగుమీద కూచుంటాము, ఎవరన్నా ఇంటిముందు నుండిపోతుంటే  వాళ్ళను పిలిచి మాట్లాడుతా,సందె పొద్దు గూటిలోకి పొయ్యేదాక అరుగుమీదనే కూర్చుంటాము. ఇక రాతిరంతా నిద్రపట్టదు  అందుకని నాకొచ్చిన  పద్యాలు పాటులు అన్ని చదువుకుంటా, ఏందో  పిల్లా  నువ్వు  అప్పటిసంది మాట్లాడుతునే ఉన్నవు, నాగొంతైతే  ఎండుకపోతుంది  ఆగు  మంచినీళ్ళన్న తాగుదాము,”  మెల్లగా లేచి లోపలకు వెళ్ళింది. పొట్టిగా ఉండడం  వల్ల  నడుం వంగిపోకుండా  ఉంది సుగుణమ్మ.
ఆమెనే చూస్తూ  ఎంత అదృష్టవంతురాలు .భర్త గురించి గొప్పగా చెబుతుంది. కొడుకును కోడలిని  తప్పుపట్టకుండా  సమర్ధించుకుంది. కన్నపిల్లలు తనను చూడకున్నా  వాళ్ళమీద నిందలు వెయ్యలేదు.  పాపం ముసలాయన ఈవిడ మంచిగా  ఉంటేనే  ఆయనకు అన్ని జరుగుతాయి లేకపోతేనా, అసలు పట్టించుకునేవాళ్ళే  ఉండకపోదురేమో  అనుకుంటుండగానే ఒకచేతిలో నీళ్ళగ్లాసు , ఇంకోచేతితో  బిస్కెట్లు  పట్టుకొచ్చింది.
“ఇదిగో  బిడ్డా… అప్పటిసంధి మాట్లాడి  అలసిపోయినావు  తిను” అంది చేతికి ఇస్తూ. వాళ్ళాయనను  లేపి  కూర్చోబెట్టి  చేతికి  బిస్కెట్లు ఇచ్చింది. ఆయన  తడుముకుంటూ.
“ఏంటియే  ఇవి  బిస్కెట్లా,  ఒకటే ఇచ్చినవేంది  నాకు ఆకలైతుంది ఇంకో రెండివ్వవే,”
“అబ్బ  ఉండరాదయ్య  ఇస్తున్న  నీకు అన్ని తొందరనే,“ అంటూ  నాలుగు బిస్కెట్లు ఆయన చేతిలోపెట్టి.  “ నువ్వుతీసుకో  తిను, అవును  మా ఆయనకు సన్మానం అన్నావు కదా! మరి ఎప్పుడు చేస్తారు?  నా బిడ్డలకు  నాకొడుకు చెపుతా, వాళ్ళు ఉండాలి కదా!  వాళ్ళ నాయనకు సన్మానమంటే   ఎంత సంతోషపడుతరో  నా బిడ్డలు,” అంది మురిసిపోతూ.
“ తొందరలలోనే  ఉంటుంది  మామ్మా, నీ కొడుకుకు తెలియచేస్తాము, అన్నట్టు నువ్వు మీ ఆయన  పక్క పక్కన కూర్చోండి  ఒక ఫోటో  తీసుకుంటాను,” అంది.
“అయ్యో  గా ముక్క  ముందు చెప్పలేదు, కొంచమాగుతవా  నేను మంచిచీర కట్టుకొస్తా, ఈ శిగ ముడుచుకొని వస్తానంటూ,” లేవబోయింది.
“వద్దు  వద్దు  మామ్మా… ఇట్లనే  బాగున్నావు  కూర్చో,” అంది.
కళ్ళు కొంచెం పెద్దగా తెరుస్తూ బొక్కినోరు  మూయడానికి  ప్రయత్నిస్తూ  ఫోటో  దిగారు భార్యాభర్తలు .
“చాలా  సంతోషంగా  ఉంది మిమ్మల్ని చూస్తుంటే, అరే  మరిచేపోయాను  ఇవిగో  ఇవి తీసుకోండి,” తను  తెచ్చిన పండ్లు  బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి.  “ఇక వెళ్ళి వస్తాను”అంది.
“మంచిది… ఇట్లనే  ఎప్పుడన్న రా, నీకు మంచి ముచ్చట్లు చెపుతా,” నవ్వుతూ సాగనంపింది.

Written by Lakshmi Sharma Trigulla

॥॥ రచయిత్రి పరిచయం॥॥

పేరు- లక్ష్మీశర్మ త్రిగుళ్ళ
గృహిణి
భర్త పేరు- మెట్రామ్ శర్మ
(HMT రిటైర్మెంట్ )
ప్రవృత్తి –కథలు కవితలు రచనలు
4/10/2021కిన్నెర ఆర్ట్ ధియేటర్స్ ఆద్వర్యంలో
( మబ్బులు వీడిన ఆకాశం) కథల సంపుటి
మన తెలుగు కథలు డాట్ కామ్ వారి నుండి
(30/10/2022) ఉత్తమ రచయిత్రి బిరుదు
(సందెపొద్దు గూటిలోకి) కథకు (ప్రథమ బహుమతి)
( విశిష్ట బహుమతి) ఉత్తమ కథ బహుమతి ఓకే కథకు మూడు
రావడం
వివిధ పత్రికలలో మరిన్ని కథలు ప్రచురణ జరిగింది
మీ అందరి అభిమానంతో మరిన్ని మంచి కథలు రాయాలన్నదే
నా ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

ఎడారి కొలను