” గబగబా ఇంటి పనులన్నీ చేసేయ్యవే మంగమ్మ… పని తెముల్చుకుని బయటికి వెళ్లే పని ఉంది. ” అంది రాధమ్మ.. ” ఎక్కడికి అమ్మ అంత హడావిడి పడుతున్నారు…. సినిమాకా.. చీరలు కొనడానికా అందులోనూ ఆషాడ మాసం వచ్చింది కదా… చీరలకి రిబేట్ కూడా ఇస్తారట కదా.. నాకు కూడా ఒకటి తెచ్చి పెట్టు రాద మ్మా ” అంది మంగమ్మ.. ” నీ మొహం ఎప్పుడూ నీకు సినిమాలూ చీరల గొడవే. మా ఫ్రెండు పద్మ అమెరికా నుండి వచ్చిందట ఒకసారి రమ్మని ఫోన్ చేసింది. నీవు ఎరుగుదవు కదా మేమిద్దరం ఒకే స్కూల్లో పనిచేసేవాళ్ళం, మా ఇంటికి కూడా వస్తూ ఉండేది. సరే పని కానీ…నేను వెళ్ళాలి. ఈలోగా నేను పూజ కానిచ్చి తయారు అవుతాను. మీ అయ్యగారు వచ్చేటప్పటికి నేను ఇంటికి చేరుకోవాలి.” అంటూ లోపలికి దారితీసింది రాధమ్మ. పని పూర్తయిన తర్వాత ఇంటికి తాళం వేసి అన్యమనస్కంగానే ఆటో ఎక్కింది. ఫోనులో మాట్లాడినప్పుడు ఎందుకో తన ఫ్రెండ్ పద్మమ్మ గొంతులో నీరసం, నిరుత్సాహం కనిపించాయి అని అనుకుంది రాధమ్మ.
ఆటో దిగి గేట్ తీసుకుని లోపలికి వెళ్లిన రాధకు సోఫాలో దిగులుగా కూర్చున్న పద్మ కనిపించింది. చాలా కాలం తర్వాత చూసిన సంతోషంతో దగ్గరకు వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని పక్కన కూర్చుంది. చూసి చిరునవ్వు నవ్వింది కానీ… కళ్ళు చిమిర్చినట్టుగా ఉన్నాయి. ” ఏంటి అమెరికా నుంచి వచ్చావు… ఎన్నో విశేషాలు చెబుతావు అని ఆత్రుత వచ్చాను. ఏమేమి చూసావో..ఎక్కడికి ఎక్కడికి వెళ్లావో…అన్ని పోస గుచ్చినట్లు చెబుతావ్ అనుకున్నాను. కానీ అలా దిగాలిగా నీరసంగా ఉన్నావు ఏమిటి ” అంది రాధ. ” లేదు రాధా ఈసారి అమెరికా ట్రిప్ వెళ్ళిందంతా ఆనందంగా గడవలేదు. అబ్బాయి మురళి పెళ్లికాక మునుపు వెళ్ళినప్పటి సంతోషం లేదుఈసారి. కోడలు కూడా ఉంది కదా అని ఎంతో మురిపంగా వెళ్లాను. నాకు ఉన్నదే ఒక్క కొడుకు. వాడి పెళ్లి అయి పెళ్ళంతో సంతోషంగా ఉండటం చూడాలని కోరుకున్నాను. కానీ అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. కొడుకు కోడలు పెళ్లయి అమెరికా వెళ్లిన వెంటనే కరోనా రావడంతో నేను రెండు ఏళ్లకు కానీ అమెరికా వెళ్లడానికి కుదరలేదు. పెళ్లయిన తర్వాత వారం రోజులు కూడా… ఇక్కడ లేరు. అందువల్ల అమ్మాయితో సరిగా మాట్లాడటం కూడా కుదరలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా బానే ఉంటారులే అనుకున్నా. ఇప్పుడు వెళ్లి చూసేటప్పటికి అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. పిల్ల కంప్యూటర్ ఇంజనీరింగ్ పాసై మంచి ఉద్యోగం చేస్తోంది. కానీ వంట పని,ఇంటి పని అస్సలు చేయదు. నాకు అలవాటు లేదు అంటుంది గాని నేర్చుకోవడానికి ప్రయత్నించదు. నేను ముందే చెప్పాను కదా నాకు వంట పని రాదని అంటుంది. ఈ రెండు ఏళ్ల బట్టి ఇదే తంతుట. ఇంటినుంచి పనే కనుక అన్ని వాడే చేసి పెడుతున్నాడు. ఈమధ్య వాడు తప్పక ఆఫీసుకి వెళ్ళవలసి రావడంతో గొడవలు మొదలయ్యాయి. అలసిపోయి ఇంటికి చేరిన వాడికి కప్పు కాఫీ కూడా ఇవ్వదు. అమ్మ ఒక్కతే చేస్తుంది కదా సాయం చేయమంటే నా వల్ల కాదని…ఒక మెయిడ్ ని ఏర్పాటు చేసింది. ఆదివారం నాడు ఆ తెల్లమ్మాయి వచ్చి ఇల్లంతా సద్ది, బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి, గిన్నెలన్నీ కడిగి, వాటిని ఎక్కడివక్కడ సద్ది, ఇల్లంతా నీట్ గా చేసి పోతుంది. దానికి ఎన్ని డాలర్లు ఇస్తుందో తెలియదు. డబ్బు సంపాదిస్తోంది కదా.. భూమి మీద కాలు పెట్టకుండా అన్ని పనులు జరిపించు కుంటోంది. ఒకసారి భోజనాలు దగ్గర ” పెళ్లయి రెండేళ్లయింది, పిల్లా పాపనో కనండి. నాకూ చూడాలని ముచ్చటగా ఉంది” అని అన్నాను. దానికి గయ్యమని లేచి పిల్లలను కంటే ఎవరు చూస్తారు? నువ్వా నీ కొడుకా? ఇప్పుడు ఇలాగే అంటారు కన్నాక మా నెత్తి నే పడేస్తారు. అయినా నాకు పిల్లలను కనాలని లేదు. ఆ బాదర బంధీలన్నీ ఎవరు పడతారు ” అంటూ లేచిపోయింది. నా కొడుకు తిండికి కూడా మొహం వాచి ఉన్నాడు. నేను ఉన్నన్నాళ్లు వండి పెట్టాను. వచ్చి తను కూడా శుభ్రంగా తిని వెళ్ళేది. ఇప్పుడు నా కొడుకు తిండికి కూడా మొహం వాచి ఉంటాడు. ఇప్పుడు వండుకోవాలి అన్న వాడే వండుకోవాలి. లేకపోతే ఏ బర్గరో,పిజ్జా యో తెచ్చి తినాలి. వాడి కాపురం చూసి ఎంతో బెంగ వచ్చిందనుకో! . దీనికంతటికి కోడలును పెంచడంలోనే లోపం అనుకుంటున్నాను. ఎందుకు అంటే కోడలు పుట్టింటి వాళ్ళు డబ్బు ఉన్నవాళ్లు. తల్లి తండ్రి ఉద్యోగస్తులు. అడిగిందల్లా ఇచ్చే తల్లిదండ్రుల ముద్దు మురిపాలతో పెరిగిన పిల్ల మరి! దానికి తోడు విద్యావంతురాలు,స్వతంత్ర భావాలు ఉన్న పిల్ల. ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అనుకున్నా. కాలం మారింది. నా బ్రతుకు చూశావు కదా గవర్నమెంట్ ఉద్యోగం చేసే నా భర్త హార్ట్ ఎటాక్ తో చనిపోతే అబ్బాయిని అమ్మాయిని పెంచి చదివించి ప్రయోజకులును చేశాను. ఆయన ఫెంక్షన్, నా ప్రైవేట్ టీచర్ ఉద్యోగంతో వచ్చే డబ్బుతో ఎంతో కష్టపడి. పిల్ల చూడు ఎంబీఏ చేసి ఏదో కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పిల్లలను ఎలా చూసుకుంటుందో. అత్తింట పుట్టింట ఎంతో హుందాతనంతో మసులు కుంటోంది. ఏమైనా పిల్లల పెంపకంలో లోపం పెద్దలదే అనుకుంటున్నాను. ఎంత డబ్బు వున్నా, ఎంత చదువుకున్నా,, ఒకే ఒక్క సంతానమైన.. వారికి సంసారికమైన, సామాజికమైన, సాంస్కృతికమైన అవగాహన చిన్నతనం నుండి నేర్పించాలి. అదే మనం వారి జీవితానికి వేసే బంగారు బాట. తమ సంసారాన్న దిద్దుకోలేని వాళ్లు సంఘాన్ని ఏముద్దరిస్తారు దేశాన్ని ఏమి ఉద్ధరిస్తారు? ప్రతి జన్మకు సార్ధకత ఉండాలి కదా! నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో ” అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ” అన్నట్టు తయారవుతోంది సమాజం. ఒక ఫోన్ చేస్తే అన్ని వచ్చి ఒళ్ళు పడుతున్నాయి. జీవితం కూడా ఇలాంటిదే అనుకుంటున్నారు. ఆర్థికంగా ఎదిగినా జీవిత పరంగా ఆరోగ్యపరంగా దిగజారుతున్నారు. అయినా రాధ….నిన్న అబ్బాయి ఫోన్ చేసి తను కోడలిని తీసుకుని కొంతకాలం ఇండియా వచ్చేద్దామని అనుకుంటున్నానని, అక్కడ వాళ్ళ అమ్మ వాళ్లు, నువ్వు ఉంటారు కనుక అమ్మాయికి సద్ది చెప్ప దానికి వీలవుతుందని భావిస్తున్నానని చెప్పాడు. రానీ చూద్దాం… మన మందరం కలిసి ఆ అమ్మాయిలో మార్పు తేవడానికి ప్రయత్నిద్దాం. వింటే సంసారం బాగు చేసుకున్నది అవుతుంది. లేకపోతే ఒక వంట మనిషిని, ఎప్పుడు ఇంట్లో ఉండే ఒక మనిషికి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇవాళ కాకపోతే రేపైనా ఆ అమ్మాయి అర్థం చేసుకొని మారవచ్చు. మా అమ్మాయిని కూడా మధ్యలో వచ్చి పోతూ ఉండమని చెప్తాను. ఇంచుమించు ఇద్దరూ ఒకటే వయసు వాళ్ళు కదా. వాడి అభిప్రాయాలు పంచుకోడానికి బాగుంటుంది. ఏమైనా బతకడానికి ఒక తోడై నీడలా వెంట నడిచే వాళ్ళు ఉండాలి కదా చివరిదాకా.
మన చిన్నతనంలో పెద్దలు ఏమి చెబితే అలా నడుచుకునేవాళ్ళుం. తర్క వితర్కాలు లేవు. అవి కూడదనటం లేదు. తర్కంవల్ల విషయ పరిజ్ఞానం పెరగవచ్చు. పెరిగిన జ్ఞానాన్ని అమలులో పెట్టుకుని, ఉన్న దానిని పాడు చేసుకోక, లేని దానికోసం ఆర్రుచులు పడక సర్దుకు జీవించినప్పుడే శాంతికి నిలయం అవుతుంది జీవితం. మనుషులందరూ ఒకేలా ఉండరు. పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. బయట నుంచి వచ్చిన ఇద్దర మనుషుల తీరుతెన్నులు ఒకలా ఉండవు. సర్దుకు జీవించడమే సంసారం. అందుకే సంసారాన్ని సాగరం అంటారు. దానిలో ఎన్ని నదులు, ఎన్ని కల్మషాలతో వచ్చినా అన్నిటినీ భరించి, అక్కర్లేని వానిని మరల మరల తన అలలతో ఒడ్డుకు విసిరి కొడుతూ స్థితప్రజ్ఞతతో నిలిచి ఉంటుంది. సముద్రమే నాటికి నేటికి ఏనాటికైనా మనిషికి నిదర్శనం. విజ్ఞానాన్ని విస్తరించు కోవచ్చు కానీ జ్ఞానాన్ని మాత్రం కృశింప చేయకూడదు “అంటూ సుదీర్ఘంగా మాట్లాడింది పద్మ.
అన్నీ విన్న నేను నోట మాట రాక నిశ్చలంగా ఉండిపోయాను. ఎంత సత్యాన్ని విడమర్చి చెప్పింది. కాలం మారింది అంటారు కానీ మారేది మనుషుల స్వభావాలే. కాలం మారనట్లు మనుషుల మానవత్వం మాత్రం మారకూడదనిపించింది నాకు. పద్మ నెమ్మదిగా తేరుకొని. ” రాగానే నిన్ను నా మాటలతో విసిగించానా.. ఆరు నెలల బట్టి మనసులో బిగబెట్టుకున్న బాధన్నంత వెళ్లాగక్కాలనిపించింది రాధా… ఇప్పుడు నా హృదయం కాస్త తేలిక పడింది. కాఫీ కలుపుతా, నీకోసం తెచ్చిన గిఫ్ట్ లు కూడా ఇస్తా ” అంటూ లోపలికి వెళ్ళింది . నేను జరిగిందానికి బాధ పడవద్దు అని, అది వాళ్ళ ఉభయులు నిర్ణయించుకోవలసిన విషయం అని, ఎలా జరగాలంటే అలా జరుగుతుంది,నీవు భరించిన బాధలలో ఇది ఒకటి అని ఊరడించి అబ్బాయి వచ్చాక వస్తానని ఇంటికి బయలుదేరాను.
ఇంటికి వచ్చిన రాధ ఆలోచనలో పడింది. ఏమిటి ఈ తరం ఆడపిల్లల సంస్కారాలు అనుకుంది. పద్మని ఎలా ఓదార్చాలో తెలియటం లేదు అనుకుంది. భోజనం ముగించి కూర్చుంది కానీ మనసు ఎక్కడెక్కడకో పరిగెడుతోంది. తన పెద్ద వదిన ఆఖరి చెల్లెలు కూడా అమెరికాలోనే ఉంది. మొన్న బుల్లి అన్నయ్య కొడుకు పెళ్లిలో కలిసినప్పుడు మీ చెల్లెలు ఎలా ఉంది అని వదిన అని అడిగాను. ఆ పిల్ల వాళ్ళ ఆయనకు అమెరికాలో యాక్సిడెంట్ అయ్యి కాళ్లు పనిచేయడం మానేశాయట. అప్పటికి వీళ్ళు అమెరికా వెళ్లి 5 ఏళ్ళు పైన అయిందిట. ఇల్లు కారు కూడా కొనుక్కున్నారుట కూడా. అప్పట్లో ఆ అమ్మాయి కూడా ఎం సి ఏ చేసింది ఇండియాలో. వెంటనే కన్సీవ్ అవ్వడంతో ఉద్యోగ ప్రయత్నం చేయలేదు. ఒక పాప కూడా ఉంది. భర్త కంపెనీ వారి ప్రోత్సాహంతో ఏవో కంప్యూటర్ కోర్సు నేర్చుకుని అక్కడ ఉద్యోగం సంపాదించుకుందుట. పుట్టింటి వాళ్ళు ఇండియాకు వచ్చేయమంటే ఇక్కడ నాకు అలవాటయింది కదా.. ఎలాగో మేనేజ్ చేసుకుంటానని భర్తని పాపని చూసుకుంటూ ఇంటి నుంచే ఉద్యోగం చేసుకుంటోందట. సాయంగా ఉండడానికి ఇక్కడ నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్లి వస్తున్నారట. ఆశ్చర్యపోయాను ఎంత ధైర్యంగా బతుకుతోందని. మొన్న వదిన ఫోన్ చేసి అతనికి ఆఫీసు వాళ్ళు ఇంటి నుంచే పని చేసుకునేలా ఉద్యోగం కూడా ఇచ్చారట. భర్తకు సహకారం అందిస్తూ, తను కూడా ఉద్యోగం చేసుకుంటూ, పిల్లని స్కూల్కు పంపడం,వంట,ఇంటి పని,చక్కగా చేసుకుంతొందట. ఈ నెలాఖరకు భర్తను ( వీల్ చైర్ సహాయంతో ) తీసుకొని ఇండియా వస్తోందట. ఏమో మొక్కలు కూడా ఉన్నాయిట. అత్తవారింట పుట్టింట కొంతకాలం గడపడానికి. ఇదంతా ఆలోచిస్తున్న రాధకు తన స్నేహితురాలు పద్మ కోడలు జ్ఞాపకం వచ్చింది. జీవితాలను చక్కదిద్దుకోవాలన్నా, నాశనం చేసుకోవాలన్నా అది వారి చేతుల్లోనే ఉంటుంది అనుకోంది. చదువుతోపాటు పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, సమర్థత నేటి తరానికి చాలా అవసరం అనుకుంది. పూరకాలంలో ఉమ్మడి కుటుంబాలు కాదు కదా ఒకరికి ఒకరు సర్ది చెప్పుకోవడానికి. యంత్రాలతో పనులను ఎంత సులువుగా చేసుకున్నా తోడుండి వెన్ను తట్టే వారు ఉండటం మానసికంగా ఎంతో స్వాంతన కలగజేస్తుంది. ఆర్థికంగా చిన్నవైన ఎన్నో కుటుంబాలు సుఖంగా జీవిస్తున్నాయి. మన కళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాం కదా. ఈ తరంవారు బాహ్య సమస్యలను మానసిక సమస్యలుగా చేసుకొని కృంగిపోతున్నారు. ఇది వాళ్లు గుర్తించటం లేదా…. అని నిట్టూర్చింది రాధ.