హిందూ వివాహ వ్యవస్థ విశిష్టత:–

సంస్కృతి

                రంగరాజు పద్మజ

మన భారతదేశ హిందూ వ్యవస్థ” శ్వేతకేతువు” అనే ఋషి ఏర్పాటు చేశాడని, ధర్మశాస్త్రమైన పంచమ వేదం చెబుతుంది. ఎందుకంటే అప్పటివరకు సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఏ విధమైన కట్టుబాట్లు లేకుండా నచ్చిన పురుషుడితో… నచ్చిన స్త్రీతో కామ కలాపాలు సాగించేవారు. అలా అయ్యేసరికి ఒక స్త్రీకి అనేక మంది భర్తలు ( పురుషులతో) సంబంధాలు కలిగి ఉండేది. అయితే వారికి కలిగిన సంతానాన్ని ఎవరు పోషించాలి? ఎవరు రక్షించాలి? అనే వివాదం కలిగి, ఎవరూ బాధ్యత తీసుకోకపోతే ఆ సంతానం సమాజానికి బరువై, వారంతా సమాజానికి చీడపురుగుల వలె చెడు మార్గంలో జీవనం గడుపుతూ, అశాంతి, అరాచకాలకు పాల్పడుతుండే వారు. ఈ అనాచారంతో సమాజం నైతిక పతనానికి దారి తీసింది. ఆనాటి ఆ స్థితి నుండి సమాజాన్ని రక్షించడానికి సంఘ కట్టుబాట్లు చేశాడు ఈ శ్వేతకేతువు. ఈ ఋషి ఉద్దాలక మహర్షి కుమారుడు. ఒకసారి ఈ శ్వేతకేతువు ముందే తన తల్లిని ఎవడో బలవంతంగా లాక్కొని పోతుండడం చూసి, సహించలేక వివాహ వ్యవస్థకు నాంది పలికాడు.
” విశేషేణ వాహయతి వివాహః”
అనగా వివాహం విశేషమైన వాహము జీవన విధానమునకు” “విశేష” ఆధారం కనుక వివాహము అని నిర్వచించారు.
భారతీయ వివాహం ధర్మం ఆధారంగా నిర్మించబడింది. ధర్మ అర్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలను మానవ జీవనానికి ఉత్తమ సోపానాలై ఉత్తమ మానవులుగా తీర్చబడతారు. అయితే ధర్మ మార్గంలో అర్థ- కామాలను అనుభవించాలని ఋషి మాట ! ఈ ధర్మ అర్ధ కామాలను పొందాలంటే… తప్పనిసరిగా వివాహం చేసుకొని, ధర్మపత్నితో ధర్మకార్యాలను నిర్వహించాలనీ, అలా వివాహం కాని వాడు అనర్హుడని ధర్మశాస్త్రం చెబుతోంది.
మన శాస్త్ర ప్రకారం మానవ జీవితంలో నాలుగు ఆశ్రమాలుగా విభజించారు
1. బ్రహ్మచర్యం.
2. గృహస్థాశ్రమం.
3. వానప్రస్థాశ్రమం.4. సన్యాసాశ్రమం.
అని ఈ ప్రకారంగానే జీవించాలని ఒక కట్టడి చేశారు.
మనుస్మృతి వివాహాలను ఎనిమిది రకాలుగా వర్గీకరించాడు.1. బ్రహ్మ, 2. దైవ, 3.ఆర్ష, 4. ప్రాజాపత్య, 5. అసుర, 6.గాంధర్వ, 7. రాక్షస, 8. పైశాచికములు అని ఇందులో అసుర, పైశాచిక వివాహాలు తప్పు పద్ధతని చెప్పారు.
ఆపస్తంబ సూత్రం ప్రకారం వివాహాలు ఆరు రకాలు.1. బ్రహ్మ, 2. దైవ, 3. ఆర్ష్య, 4. గాంధర్వ, 5 అసుర, 6. రాక్షస అని చెప్పబడ్డాయి.
వేద కాలానికి ముందే వివాహ పద్ధతులు, ఆచారాలు ఉన్నట్టు పురాణాల వల్ల తెలుస్తున్నది. ఋగ్వేదంలో” వివాహ సూక్తం” అనేది ఉందనీ, వేదంలోను రెండు సూక్తాలు వివాహం గురించి వివరించాయనీ వేద పండితులు చెప్తారు. ఊర్వశి- పురూరవుల కథ ఇందులోనిదే. సూర్యుని కుమార్తె సూర్యను సోము నికి వివాహం చేయడం ఇందులోనిదే.
రామాయణం లోని వాల్మీకి మహర్షి వివాహం గురించి ఈ విధంగా చెప్పారు.

శ్లోకం ॥     చతుర్ణామ్ ఆశ్రమాణామ్ హి గృహస్థశ్రేష్ఠం ఆశ్రమమం।
పాహుర్ ధర్మజ్ఞ ధర్మజ్ఞాః తం కథం త్యక్తుం అహిసి॥

భావం:– ఓ రామా! ఆశ్రమ ధర్మాలు నాలుగింటిలో గృహస్థ జీవనం అనేది అత్యుత్తమమైనది. అటువంటి అద్భుతమైన గృహస్థ జీవనాన్ని ఎలా త్యజిస్తావు? అని దీన్ని బట్టి తెలిసింది ఏమిటి అంటే” “ధర్మబద్ధమైన” కామం సమాజం బాగుండేలా చేస్తుందనీ, వివాహం చేసుకున్న భార్య ద్వారా కామాన్ని అనుభవిస్తే ఆయువు పెరుగుతుందనీ… ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న పురుషుడే ఉత్తమ పురుషుడనీ రామాయణం ద్వారా తెలుస్తున్నది.
వివాహం అనేది సుఖభోగాలు అనుభవించటానికి మాత్రమే కాదు ! వివాహం దంపతులకు మాత్రమే సంబంధించినది కాకుండా మంచి సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది. వివాహం లేకపోతే సంకర సమాజం అవుతుంది. సమాజం సంకరమైనపుడు మేలైన యువత సమాజ నిర్మాణంలో సరైన పాత్రపోషణ చేయలేదు. అంతే కాదు భార్య భర్త కు, భర్త భార్యకు శాంతి స్థానం గా ప్రకృతి ప్రసాదించిన వరం. మహిళగా పరిపూర్ణత చెందాలంటే వివాహం ముఖ్యం.
హిందూ ధర్మంలో పితృ రుణం తీర్చాలంటే తప్పక ధర్మబద్ధంగా వివాహం చేసుకొని, మంచి సంతానాన్ని పొందాలి. పెళ్లి చేసుకోకుండా, సన్యాసం తీసుకోకుండా ఉండిపోతే తల్లితండ్రులకు ఉత్తమలోకాలు లభించవని పంచమ వేదమైన మహాభారతంలో జరత్కారువు కథ ద్వారా చెప్పబడింది. ధర్మకార్యాలు చేయాలంటే ధర్మపత్నితోనే చేసే అర్హత పురుషుడికి ఉంటుందని, సంతతిని పెంపు చేయాలంటే స్త్రీ పురుష సంగమం తప్పనిసరి కదా! అది వేదోక్తంగా జరిగినప్పుడు మాత్రమే సత్ సంతానం పొందే వీలు ఉంటుంది. అందుకే వివాహానికి ఒక నియమం, ఆచారాలు, సంప్రదాయాలు కట్టడి చేసి, చక్కని కుటుంబ వ్యవస్థకు, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి నాంది పలికారు.
అలాంటి ఒక నిర్దిష్టమైన పద్ధతిని సంప్రదాయం అని అంటారు. తెలుగువారి సంప్రదాయాలు ,భారతీయ సంప్రదాయంలో కలిసి ఉంటాయి. హిందూ సంస్కారాలలో( పుట్టినప్పటి నుండి మరణించే వరకూ జరిపే సంస్కారాలు.ఉదా॥ నామకరణం మొ॥)అందులో వివాహం ఒక సంస్కారం. ఈ సంస్కారం భారతదేశ సనాతన వ్యవస్థలో సమాజ నడవడిని శాసించే గొప్ప సంప్రదాయం. ధర్మబద్ధమైన కామం వలన సక్రమ సంతానం సమాజ నిర్మాణంలో చక్కని భాగస్వామ్యం. కామంతో కూడిన స్త్రీ పురుష సంబంధం.. ఆ బంధనాలు తెగిపోతే పుట్టిన పిల్లలు అధోగతి పాలు అవుతారు. అలా పుట్టిన వారికి సంఘంలో గౌరవం ఉండదు.

ఏ జీవికైనా తనను తాను రక్షించుకోవటం, తన జాతిని లేదా వంశాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది స్వభావ సిద్ధంగా ఉండే గుణాలు…. ఒక మనుషులే కాదు అన్ని జీవరాశులు తమను తాము రక్షించుకోవడం కోసమే పోరాడతాయి. అందులో భాగమే స్వీయవృద్ధి, స్వీయరక్షణ! ఈ రెండూ వివాహానికి ముఖ్యకారణంగా భావిస్తారు.
జీవితంలో మరపురానిది పెళ్ళి. స్త్రీ పురుషుల మధ్య స్నేహ భావం కలిగిస్తూ… శారీరకంగా- మానసికంగా ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా విడదీయరాని బంధం వివాహం. ఇది ఏ ఒక్క మతానికో సంబంధించినది కాదు… అన్ని మతాల వారు వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆచరించు కుంటారు. భార్య భర్తల సుఖమే కాకుండా వంశాభివృద్ధి, పిల్లల సంరక్షణ కోసంపెళ్లి తప్పక చేసుకోవాలని సమాజ నిర్ణయం. అలా కలిగిన సంతానం తల్లిదండ్రులకు మనోధైర్యం మనశ్శాంతిని కలిగిస్తాయి. అయితే ఇక్కడ భార్యాభర్తల నడవడి మీద ఆధారపడి మంచి ఫలితాలు ఉంటాయి. ఇద్దరి భావాలు ఒకటిగా కలుపుకుని పోవాల్సి ఉంటుంది ఒకరి విజయాలకు ఒకరు కారణం అయి ఉండాలి. ఒక పురుషుడి విజయం వెనుక స్త్రీ హస్తం ఉందని అంటుంటారే.. అలాగే స్త్రీ అభ్యుదయం లోను పురుషుడి పాత్ర ఉంటుంది… ఉండాలి… దీనికి కావలసింది మానిసిక పరిణితి. వివాహం యొక్క ప్రాముఖ్యత తెలిసి ఉంటే ఆ దాంపత్యం పరిపూర్ణత చెంది ఉంటుంది. చదవుకోడం, పెద్దలను అనుకరించడం, చుట్టూ ఉన్న మంచి వాతావరణం వివాహ జీవితం ఎలా గడపాలనే పాఠాలు చెప్పకనే చెబుతాయి.
వివాహం అంటే అంత గొప్పది. ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు వివాహం చేసుకోవడం అంటే జీవితాలకో లక్ష్యం , దాని నెరవేర్చుకోవడం, తర్వాతి తరాలకు ఆదర్శంగా ఉండి, చక్కని మార్గాన నడిచి, ఎనలేని కీర్తి పొందడం… దానికోసం సరి అయిన పురుషుడు లేదా స్త్రీని పెద్దల ద్వారా నిర్ణయించుకోవాలి . ఇలా పెద్దలు కుదిరించే పద్ధతిని “కన్యావరణం” అని అంటారు.
వివాహం కేవలం పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి సంబంధించిందే అనుకుంటే వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. యావత్ కుటుంబ సంక్షేమం కోరడమే వివాహం జరిపించడమని గ్రహించాలి.
హిందూ వ్యవస్థలో ఆచరణలు లేదా వేడుకలు పూర్వకాలంలో వివాహ సూత్రాలలో చాలా రకాలుగా చెప్పారు. అందులో 1. పెళ్లి చూపులు, 2. నిశ్చితార్థం, 3. స్నాతకం,4. కాశీ ప్రయాణం,5 వరపూజ, 6. ఎదుర్కోలు,7. గౌరీ పూజ, 8. మంగళ స్నానాలు,9. కన్యావరణం,10. మధుపర్క బహుకరణ,11. యజ్ఞోపవీత ధారణ,12 మహా సంకల్పం,13. కాళ్ళు కడగడం,14. సుముహూర్తం( జీలకర్ర బెల్లం తలమీద పెట్టడం)15. కన్యాదానం,16. స్వర్ణజలాభిమంత్రం, 17.యోత్త్రే బంధనం,18 మంగళ సూత్ర ధారణ,19. తలంబ్రాలు, 20.బ్రహ్మముడి, 21. సప్తపది, 22 పాణిగ్రహణం,23. హోమం,24 సన్నికల్లు తొక్కడం,25. లాజ హోమం, 26.స్థాళీపాకం,27. నాగవల్లి,28. సదస్యం,29. నల్లపూసల ధారణ,30. అరుంధతీ నక్షత్ర దర్శనం,31. అప్పగింతలు.. అనేవి ఉండేవి.
ప్రస్తుతం చాలా పద్ధతులు తగ్గించి 1.సమావర్తనం
( గురుకుల విద్యాభ్యాసం ముగించుకుని రావడం)2. కన్యావరణం,3. కన్యాదానం,4. సుముహూర్తం,5. పాణిగ్రహణం,6. అగ్నిహోత్రం,7. లాజ హోమం( లాజలు అనగా పేలాలు)8. సప్తపది,9. అరుంధతీ నక్షత్ర దర్శనం మాత్రమే ఆచరిస్తున్నారు.
ఈ అన్ని కార్యక్రమాలలోనూ భార్యాభర్తల బంధం కలకాలం మన కలగాలని పెండ్లిలో తంతు జరిపిస్తారు.
కన్యావరణంలో పెద్దలను యోగ్యులైన వధూవరులను వెతికి తెమ్మని మంచి నిర్ణయం తీసుకోమని బాధ్యత తల్లిదండ్రులు వారికి అప్ప చెపుతారు.
తల్లితండ్రులు వరుడిలో కోరేది ధర్మబద్ధమైన సంపాదన, ధర్మబద్ధమైన కామం మాత్రమే పొందాలని, మనస్సు, శరీరం పవిత్రంగా ఉన్నవారిని శాస్త్రం చెప్పిన పద్ధతి ప్రకారం వరుడిని లేదా వదువును నిర్ణయించాలని చెప్పి పంపిస్తారు. అటువంటి వాళ్ళతో వివాహమైతే నాలుగవ పురుషార్థమైన మోక్షం లభిస్తుందని నమ్మకం.
నిశ్చితార్థంలో తమ తమ సంతానానికి వధువు లేక వరుడు తగిన వారు అనుకున్న తరువాత రెండు కుటుంబాల వారు పరిచయం చేసుకుని తాంబూలాలు పుచ్చుకుంటారు.వరుడు విద్యాభ్యాసం ముగించుకొని కాశికి వెళ్తానని అనుమతి కోరితే తల్లిదండ్రులు వివాహం చేసుకోమని అడగడం గురువుగారు వరుడిని కొన్ని ప్రశ్నలు వేస్తాడు.
వివాహం ఎందుకు చేసుకుంటున్నావని ప్రశ్నిస్తే..వరుడు”ధర్మప్రజాసంపత్యర్ధకం ” అనగా ధర్మబద్ధంగా సంతానాన్ని కంటామని జవాబిస్తాడు. గురువుగారు భార్యపట్ల , తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల సత్య ధర్మాలను పాటించేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలని, సమాజ శ్రేయస్సే ప్రధానలక్ష్యంగా జీవించాలని, అర్హులకు దానం చేయాలని అవన్నీ నిర్వహించేందుకు వివాహం చేసుకొమ్మని అనుమతినిస్తూ… ఈ విధంగా చెప్తాడు.

శ్లోకం ॥   “సత్యాన్న ప్రమదితవ్యం ”
అనగా అబద్ధాలాడి సమాజాన్ని నాశనం చేయకు!

” ధర్మాన్నప్రమదితవ్యమ్ ”
అనగా ఎట్టి పరిస్థితులలోనూ ధర్మమార్గం నుండి వైదొలగవద్దు !

” కుశలాన్న ప్రమదితవ్యం”
అనగా సమాజానికి మేలు కలిగించే పనుల నుండి తొలగ వద్దు !!

ఇలా వివాహ జీవితంలో పాటించవలసిన ధర్మాలనూ స్నాతకంలో పురోహితుడు వివరిస్తారు.

శిష్యుడు విద్య పూర్తి చేసుకొని ,యోగ్యత సంపాదించుకొని, కాశీకి పోతానని అక్కడే తన జీవితం కొనసాగిస్తానని పెద్దల అనుమతి అడిగితే, మంచిది కాదని వివాహం చేసుకొని గృహస్థ జీవితం గడపమని ఒక హోమం చేయించి పెళ్ళికూతురు సోదరుడు వచ్చి మా సోదరిని వివాహం చేసుకోమని గృహస్థాశ్రమ ధర్మం పాటించమని బహుమతులు ఇచ్చి ,వరుడినిసన్యాసం ఆలోచననుండి మళ్లించి తీసుకొని వస్తాడు.
ధర్మం అంటే అనురక్తి ఉండి,ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు ఏది పరమ ధర్మమో దానిని ఆచరించాలనీ, సులువైన మార్గం పాటిద్దామనుకోకుండా , కష్టం అనుకోకుండా ధర్మం పాటించాలి. అప్పటికప్పుడు సుఖాలనిస్తుందని అధర్మాన్ని ఆచరించవద్దని ఋషులు చెప్పారు.
వధువు వరుడు ఎవరి ఇళ్లలో వారు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును చేసే వేడుక ఒకటి నిర్వహిస్తారు. మంగళ వాయిద్యాలతో ప్రారంభించి, పెళ్లికి కావలసిన మంగళకర పదార్థాలు ఉదా॥ పసుపు దంచడం మొదలైన పదార్థాలు సమకూర్చడంలో భాగంగా కుందెనలు -రోకళ్ళు, విసుర్రాయి మొదలైన వాటిని అలంకరించి ముత్తైదువులు సువ్వి పాటలు పాడుతూ పసుపు దంచడం చేస్తారు. తరువాత మంగళకరంగా అందరికీ మాడ మీద నూనె అలదడం( తలమీద నూనె రాయడం), స్నానాలు కాగానే నూతన వస్త్రాలు ధరింపచేసి, కుల దేవతోపాసన చేస్తారు. ఈ మొత్తం తంతును “కొట్నం కులదేవత” అని అంటారు. ఆ తర్వాత పెళ్లి పందిరి వేసి, మామిడాకు తోరణాలు కట్టి, మట్టి మూకుడులో నవధాన్యాలు -పుట్టమన్ను వేసి పాలతో తడిపి అంకురార్పణ చేస్తారు. వడియం పెట్టించి, పెళ్లికూతురు చేత ఆకుపచ్చని గాజులు ముత్తయిదువుల అందరికీ బహుమతిగా ఇప్పిస్తారు.
సాంప్రదాయ వంటలు అనగా పులిహోర, పూర్ణం, వడియాలు, అప్పడాలు ఇలా తాహతు బట్టి అనేక రకాల వంటలు చేయించి అందరికీ వడ్డించి మగ పెళ్ళి వారు ఆడపెళ్లి ఇంటికి తరలివస్తారు.
మేళతాళాలతో మర్యాదలతో చక్కని ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు ఇందులో శుభపత్రిక మార్చుకోవడం తాంబూలాలు పుచ్చుకోవడం మొదలైనవి ఆచరిస్తారు.
తరువాత పెళ్లికూతురి చేత గౌరీ పూజ కార్యక్రమం ప్రారంభిస్తారు.
అమ్మాయి చేత ఈ విధంగా గౌరీదేవిని ప్రార్ధన చేయిస్తారు.
శ్లోకం:–
గౌరీ హర మహేశాన సర్వమంగళ దాయక
పూజాం గృహాణ దేవేశ సర్వదా మంగళం కురు ॥

విడిది ఇంట్లో వరపూజ జరుగుతుంది వరుడిని పురోహితుడు లేదా గురువు మళ్ళీ అడుగుతాడు.
“ఈ అమ్మాయిని నువ్వు వివాహం ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నావు?” అని..
వరుడు” ఈమె ద్వారాధర్మబద్ధంగా సంతానాన్ని కంటానని చెప్తాడు.
పెళ్ళి మంటపంలోనికి వరుని ఆహ్వానించి వేదిక ముందు కాళ్లుకడిగి పెళ్ళి పీటల మీద కూర్చో పెడతారు. వరుడిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు.
సర్వాంగ శోభితంగా అమ్మాయిని అలంకరించి గౌరీ పూజ చేయిస్తారు వధువుతో. గంపలో కూర్చుండబెట్టి మేనమామలు లేదా అన్నదమ్ములు ఎత్తుకొని అమ్మాయి ముందు ముత్తయిదువలు 32 దీపాల వరుసతో మంటపానికి తోడుకొని తీసుకొని వస్తారు.
ఇక కన్యాదాన సమయములో పురోహితుడు వరుని చేత” ధర్మేచ! అర్థేచ! నాతిచరామి అని ప్రతిజ్ఞ చేస్తావా? అని అడుగుతాడు. అనగా ధర్మం విషయంలో ఆర్థిక విషయాలలో భార్యను అతిక్రమించను అనే ప్రమాణం !
” నాతిచరామి” అని వరుడు ప్రమాణం చేస్తాడు.దంపతులు జీవితాంతం కలిసి మెలసి జీవించాలని గురువు చెప్తాడు.
ఇలా హిందూ వివాహాన్ని ఋషులు సంస్కరించారు. హిందూ వివాహ వ్యవస్థ ఇంత గొప్పగా ఉంటుంది.కామం తీర్చుకోవడానికే వివాహ వ్యవస్థ లక్ష్యంకాదు. ధర్మమార్గంలో నడవడానికి, భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.
భారతీయ వ్యవస్థలో సన్మార్గంగా వెళ్ళే దిశగా ప్రయాణించే జీవనయానమే వివాహం! భార్య లేకుండా లేదా భర్త లేకుండా ఏ ధర్మకార్యాలు చేయడానికి అర్హులు కారు అని ధర్మశాస్త్రం చెబుతోంది.
కన్యాదానం సమయంలో” ప్రతిపాద యామి” అని కన్యాదాత అంటాడు. అనగా ధర్మంలో ఆలంబనగా నా కూతురుతో నీవివాహం చేస్తున్నాను అని అర్థం.
హిందూ వివాహంలో మాంగల్యధారణ ముఖ్యమైనది. మాంగల్యం అంటే పుస్తే లేదా తాళి లేదా మంగళసూత్రం అని అంటారు. 108 సన్నని దారపు పోగుల తో పసుపు రాసి తయారు చేస్తారు ఈ సూత్రం భర్త కు వచ్చే ఆపదలను తొలగిస్తుంది అని ఒక నమ్మకం. ఈ సూత్రధారణ సమయంలో” మాంగల్యం తంతునానేనా- మమ జీవన హేతునా! కంఠే బద్నామి శుభ గే త్వం జీవశరదాం శతమ్!”
అని. అనగా నా జీవనానికి హేతువైన ఈ మంగళసూత్రంతో నీ కంఠంలో ముడి వేస్తున్నాను.ఇది నేను జీవించి ఉన్నాననే ఉనికికి కారణం! ఆపదలు వచ్చినప్పుడు గట్టెక్కించి నన్ను కాపాడుతుంది.ఈ మంగళ సూత్రం సర్వమంగళను పూజిస్తూ మంత్ర పూరితంగా ఉచ్ఛరింపబడి…మంగళ పూరితంగా ఉంటుంది.
సుముహూర్తంలో చూపులు కలుస్తాయి. అన్యోన్యతకు చిహ్నంగా జీలకర్రబెల్లం పెడతారు. సుముహూర్త సమయంలో ప్రవర చదువుతారు. ప్రవర అనగా అటు ఇటు తరతరాలను తెలిపే గోత్రనామాలతో పరిచయ కార్యక్రమం.
సూత్రధారణ తర్వాత” భద్రతే” నీకు శుభమగు గాక అని తండ్రి కూతురును దీవిస్తూ… ధర్మం ఆచరించడంలో నా కూతురు నీ వెంట ఉంటుంది అని వరుడికి చెప్తాడు.. ఇలా అన్ని కార్యక్రమాలలోనూ ప్రమాణాలు చేయిస్తారు.
ఏడడుగులు నడిపించి అమ్మాయిని అప్పగిస్తారు. తలంబ్రాలు కూడా ముఖ్యమైన ఘట్టమే !
వివాహంలో జరిగే ప్రతి తంతూ మనసును సంస్కరించి, మనిషి మనిషిగా బతికేలా… పరిపూర్ణత పొందడానికి వీలుగా వేదరూపంగా చూపిన మార్గమే వివాహం లోని మంత్రాలు.వాటి అర్థం తెలుసుకుని ఆచరించి ఆ ప్రకారంగా జీవిస్తే తమను తాము ఉద్ధరించు కోవడమే కాకుండా సమాజ ఉద్ధరణ కూడా లక్ష్యంగా సాగుతుంది వివాహం. రెండు కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంచడమే ముఖ్య లక్ష్యం.
వివాహం లేని కామానికి ప్రాధాన్యత ఇస్తే జీవితాల్లో అశాంతి పెరుగుతుంది. అంతేకాదు ఆయువు కూడా తరుగుతుంది. కలిసికట్టుగా ఏ సమస్యనైనా ఎదుర్కోవాలంటే… ఎంత పెద్ద సమస్య అయినా తేలికగా పరిష్కరించు కోవాలంటే ఇద్దరి అభిరుచులు కలియాలి. అలా కలవకపోతే ఎంత డబ్బు ఉన్నా సుఖశాంతులు ఉండవు. కలియక పోతే కలుపుకునే ప్రయత్నం చేయాలి. జీవితంలో ప్రశాంతతే పెద్దసంపద. క్షమాగుణంతో ఇద్దరు సర్దుకొని పోవడానికి ఒకరిపై ఒకరికి ప్రేమ, క్షమాగుణం కలిగి ఉండాలి. హిందూ వ్యవస్థను అనేక పురాణ ఇతిహాసాలలో కథల ద్వారా వివాహ విశిష్టతను తెలిపాయి. వాటి ద్వారా తమను తాము సంస్కరించుకుని ఆనందమయ జీవితం గడపవచ్చు.

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అబ్బూరి ఛాయాదేవి

ముగ్గుల ముచ్చట్లు