శిక్షెవరికి

కథ

విజయా రంగనాథం

రచ్చబండ దగ్గర చేరిన జనాలందరూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడు తున్నారు. “ఏం రోగం, ఉన్నచోట ఉండకుండా తెల్లవారు ఝామున తోటలోకి ఎందుకెళ్ళాలట.” రంగమ్మగారు ఈసడింపుగా అంది.
“రోజూ వెళుతుంది కదా ఈ వేళ ఏమైనా కొత్తా. చిన్నప్పటినుండి వాళ్ళ నాన్న మాలకారి రాఘవ శాస్త్రి గారికి సహాయం చేయటానికి తోటలో కెళ్ళి పూలుకోసుకొస్తుంది కదా ఈ పిల్లా… మరి ఉదయమే దేవుడికి వాళ్ళ నాన్న మాలలు ఇవ్వాలికదా. తప్పదాయే.” తాయమ్మ జవాబిచ్చింది. రోజూ దేవుడి అలంకరణకోసం పూల మాలలు గుచ్చి పోద్దున్నే గుడిలో ఇవ్వటం రాఘవశాస్త్రి గారి ఉద్యోగం. అందుకని అంతా ఆయన్ని ‘మాలకారి’ అంటారు. అంటే మాలలు చేసేవాడు. అంతేకాక మంచి మనసున్న వైధ్యం తెలిసిన వాడు. ఊరి జనాలంతా ఆయన దగ్గరికే మందుల కోసం వెళతారు.
“ఏదేమైనా ఈడొచ్చిన పిల్ల. అన్ని రోజులు ఒక్కలా ఉంటాయా.. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇంతకాలం నేను చాలా విషయాలు రాయాలనుకుంటున్నాను ఎక్కడంటే అక్కడ తిరగటం పరవాలేదు. ఇప్పుడు జాగర్తగా ఉండాలని నీవైనా చెప్పాలికదా జానకమ్మా. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో” రాధమ్మ తనకు తోచిన విధంగా జానకమ్మని ఓదార్చుతుంది.
“ఊరుకోండి, జానకమ్మను ఊరడించాల్సింది పోయి ఎవరికి తోచింది వారు మాట్లాడుతారా..కాసేపు గమ్మునుండండి. ఆమె పెంపకం గురించి ఇవేళ కొత్తగా తెలిసొచ్చిందా. ఎంతో మర్యాద తెలిసిన పిల్ల. ధైర్యస్థురాలు. ఎవరికి కష్టమొచ్చినా నేనున్నానంటూ వచ్చే పిల్ల. ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పమ్మా. మీరు మీ పెంపకం గురించి చూసుకున్నాక పార్వతమ్మ గురించి మాట్లాడండి.” అంటూ కసురుకుంది ఆండాళు. రాదమ్మ ఇంకో మాట అనకుండా చేసింది. ఆమె కూతురు ఎవరినో ప్రేమించానని ఊర్లోంచి వెళ్ళి పోయింది. వయసులో పెద్దది, నిర్మొహమాటంగా మాట్లాడే ఆండాళు అంటే అందరికి హడలు. ఎంతవారినైనా తప్పు చేస్తే వదిలి పెట్టదు. జానకమ్మ ఏడ్చి ఏడ్చి రచ్చబండకి కాస్త దూరంలో ఉన్న రావి చెట్టుకింద, కూతురు పార్వతి పక్కనే కూచుండి పోయింది.
రాఘవ శాస్త్రి గారు జానకమ్మలు, ఒక్కతే కూతురని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. అయినా చక్కటి సంస్కారం, తెలివిని నేర్పాడు తండ్రి. ఇంటిపనులు, వంటపనులలో కూడా ఆరితేరింది. తండ్రి, బావకు నేర్పిస్తుంటే తనుకూడా కొద్దిగా వైద్యం, సంస్కృతం నేర్చుకుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన మేనల్లుడు శంకరాన్ని, చెల్లెలు సీతమ్మను తన దగ్గరే ఉంచుకున్నాడు. పార్వతి, చిన్నప్పటినుండీ బావతోనే లోకంగా పెరిగింది. శరీరాలు వేరైనా మనసులు ఒకటేలా ఉంటారని ఊరంతా అనుకునేవారు. రాఘవశాస్త్రి గారు, పక్క ఊళ్ళో శంకరం హైస్కూల్ చదువు అయిపోగానే పై చదువులకై మేనల్లుడిని దగ్గరలో ఉన్న, చెన్నపట్నం పంపాడు. తరువాత ‘లా‘ చదువుతానంటే ఊళ్ళోని పొలం అమ్మి చదివించాడు. శంకరం, చదువుతో పాటు చెన్నపట్నంలో జరుగుతున్న స్వతంత్ర పోరాట ఉద్యమాల్లో కూడా చురుకుగా పాల్గొనేవాడు. మంచి చెడుల వివరణ పట్ల ఉండే సంస్కారాన్ని చిన్నప్పటి నుండి మేనమామ దగ్గర నేర్చుకున్నాడు. సమాజ శ్రేయస్సు పట్లా, రాజకీయాల పట్లా అవగాహన కలిగిన యువకుడిలా మారాడు. ఈ సంవత్సరం పరీక్షలవంగానే, పార్వతితో పెళ్ళి జరిపించేద్దా మనుకున్నారు ఇంటివాళ్ళు.
పార్వతి తండ్రి దగ్గర ఆయుర్వేద వైద్యం నేర్చుకుని అతనితో పాటు ఊళ్ళో అందరికి తన సేవలందిస్తుంది. దేవుడి మాలకట్టడంలో తండ్రికి సహాయ పడ్డం, తల్లికి ఇంటిపనుల్లో చేదోడు వాదోడుగా ఉండడం. లక్ష్మి, సీత, కళ్యాణి లతో కలిపి ఊర్లో వారికి ఏ సహాయం కావాలన్నా, ఎవరైనా జబ్బు పడినా నేనున్నానంటూ వెళ్ళడం, ఆమె రోజూ దినచర్య. సెలవులకు బావ వస్తే క్షణం వదలకుండా శంకరం తోనే గడపేది.
పార్వతి ఈలోకంలో లేనట్టుగా ఎటో చూస్తూంది. ఆమెని తీసుకొచ్చి చెట్టు దగ్గర కూచోబెట్టి నప్పటునుండి అలాగే జారిగిలపడి కూచునుంది. నల్లని ఓణీ పమిటను, తల్లి భుజం చుట్టూ కప్పినా కూడా చిరిగిన నల్లని జాకెట్టు చేయి సన్నటి ఓణీ లోంచి కనబడుతూనే ఉంది. బారెడు జడ ఊడి పోయి వీపంత పరచుకున్న వెంట్రుకలతో, పాలిపోయిన తెల్లటి ముఖాన గీరుకుపయిన గాయాల్లోంచి రక్తం కారి గడ్డ కట్టి కపోలాలు వాచి, ఎర్రబడ్డాయి. చేతులు కూడా రక్కుకు పోయి రక్తం మరకలు కనబడుతున్నాయి. ఏంజరిగిందో చెప్పకనే చెబుతున్నాయి ఆమె కనబడుతున్న తీరు.
“ఏవరు ఈ దురాఘాతానికి ఒడిగట్టారో చెప్పమ్మా.. నీవు నోరు తెరువక పోతే మా కెలా తెలుస్తుంది.” అంటూ ఊరు పెద్ద పరందామయ్యగారు అనునయంగా అడిగారు. పార్వతికి మాటలు వినబడుతున్నాయో లేదో ఆమె దగ్గరనుంచి ఏ జవాబు లేదు. పక్కనే ఉన్న జానకమ్మ కూడా కూతురుని పదే పదే పిలుస్తున్నా లాభం లేక పోయింది. “లక్ష్మీ, ఎప్పుడూ పార్వతితో వెళ్తావు కదా నీకు తెలియదా” ఆమె ద్వారా నన్నా విషయం తెలుసుకుందామని అడిగాడు. “లేదు బాబాయ్, ఈ రోజు నేను వెళ్ళలేదు. తాను ఒక్కతే వెళ్ళింది.” లక్ష్మి జవాబిచ్చింది. స్నేహితురాలి దీనావస్థచూసి ఏడుస్తుంది.
“పోనీ, ఇంతకు ముందు ఎవరైనా మిమ్మల్ని వెంటబడి ఏడిపించేవారా? వాళ్ళే ఈ దురాగతానికి పాల్పడ్డారేమో…ఏ మైనా జ్ఞాపకముందా..” ‘‘లేదు. ఎవరూ మమ్మల్ని అలా చేయలేదు”. లక్ష్మి అంది.
“అసలు ముందుగా ఎవరు చూసారు?”  అందరిని ఉద్దేశించి అడిగారు పరంధామయ్య. “నేను బాబుగారు, ఆరు గంటలేళ శాస్త్రిగారు నాతో, అమ్మాయి గారు వెళ్ళి ఇంకా రాలేదు. మాలకట్టటానికి సమయం మించి పోతుందని తోట కెళ్ళి చూసి రమ్మన్నారు. నేను వెళ్ళే సరికి తోటలో ఎక్కడా కనబడ లేదు. అప్పుడే వచ్చిన గోవిందు, అమ్మాయిగారు పూలు కోసుకుండగా తాను గోశాల కెళ్ళానని చెప్పాడు. ఒక్కో సారి అమ్మాయిగారు వెనకాల తోట బావి దగ్గర ఉన్న గులాబీల కోసం వెళ్తారు. అందుకని అటు వేపు కూడా చూడమని గోవిందు చబితే వెళ్ళాను. అక్కడ ముళ్ళ పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న అమ్మాయిగార్ని సూసి గుండె గుబేల్ మందండి. వెంటనే తోటమాలి గోవిందుని కేకేసి ఇద్దరం మంచం మీద పడుకో బెట్టి శాస్త్రి గారింటికి పట్టుకొచ్చామండి. అప్పుడే మీరూ వచ్చారు కదండి” అన్నాడు రాఘవ శాస్త్రి గారి పాలేరు రంగయ్య.
“మరి గోవిందూ, నీవేమి చూడలేదా? నీకు పార్వతి తప్ప ఎవరూ కనబడలేదా?”
“లేదు బాబుగారు, అమ్మాయిగారు పూలు కోసుకుని తులసి దవనం, గులాబీలు కోసుకుంటానని వెనకాతల వేపు కెళ్ళారండి. నేనేమో, గో మందల్ని మేతకి తోలడానికి గోశాలకి వెళ్లానండి. అమ్మాయిగారు ఎప్పటిలాగా గులాబీలు కోసుకుని వెళ్ళి పోతారని నేనూ అక్కడ్నుంచి నా పనిమీద వెళ్ళి పోయానండి.” గోవిందు జవాబిచ్చాడు.
“నీవు అమ్మాయి గారితో తోట వెనకాలకు వెళ్ళలేదా? పోనీ, అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నట్టు కనిపించిందా?”
“లేదండి, ఎప్పుడూ పార్వతమ్మకి అలవాటే తోట అంతా తిరిగి పూలు కోసుకోవటం అందుకని నేను అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడూ పార్వతమ్మ, లక్ష్మమ్మ తప్ప ఎవరూ రారు. చాలా చీకటిగా ఉంది. నాకెవరూ ఉన్నట్టు కనబడలేదయ్యా”. గోవిందు బాధగా అన్నాడు. తను కొంచెం జాగర్తగా ఆమె వెంటే ఉంటే బాగుండే దేమో, ఇంత ఘోరం జరిగేది కాదేమో …అంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందని బాధ పడుతున్నాడు.
పరంధామయ్యగారికి ఎలా దోషిని పట్టుకోవాలి అగమ్యగోచరంగా అనిపించింది. ఎవరైనా ఆ సంఘటన చూసిన వాళ్ళన్నా చెప్పాలి లేదా బాధితురాలైనా చెప్పాలి. అప్పటికే ఉదంతం జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పెద్దగా ఏ ఆధారాలు దొరకలేదు. ఎవరో మట్టి కాళ్ళతో తోట వెనక గోడమీదకి ఎక్కి అటువేపు దూకినట్టుగా మరకలున్నాయి. అలాగే గోడ మీద రక్తపు మరకలు ఉన్నాయి. అంటే ఆ దుర్మార్గుడి కాలు గాయపడి ఉండాలి. ఆ ఒక్క కాలి గాయం ఆధారంగా దోషిని పట్టుకోలేము. లాభం లేదు. ఎలా అయినా పార్వతికి స్పృహలోకి రావాలి అప్పుడేగాని దోషి బయట పడడు.
అక్కడే ఉన్న ఆండాళుని పిలిచి, పార్వతిని మాట్లాడించ్చేట్టు ప్రయత్నించమన్నాడు. అప్పటికే ఆ పనిలోనే ఉంది తను. ముఖాన కాసిని నీళ్ళు చల్లింది. తన పమిట చెంగుతో తుడిచి.  “పార్వతీ..పార్వతీ..ఇటు చూడు తల్లి..మాట్లాడు పార్వతి..ఇంత ఘోరం ఎవరు చేసారో చెప్పు. వాడికి తగిన శాస్తి చేద్దాం నీవేం భయపడకు. పరందామయ్య ఉన్నారుగా. మాట్లాడమ్మా.”  అంటూ మంచినీళ్ళు తాగించే ప్రయత్నం చేసింది. అప్పటి వరకూ స్పందించని పార్వతి గట గటా నీళ్ళు తాగింది. కొంచెం తేరుకో గానే తన పరిస్థితి అర్థమైంది.  వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది. తల్లి జానకమ్మ కూతుని కౌగలించుకుని ఏడుస్తుంటే అక్కడున్నవారంతా కన్నీళ్ళు ఆపుకోలేక పోయారు. చెంగు చెంగున ఆ ఊరు ఊరంత లేడి పిల్లలా తిరిగే పార్వతి ఇలా దీనంగా, హృదయవిదారకంగా ఏడుస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. ఆండాళు వాళ్ళిద్దరిని ఓదార్చుతూ “పార్వతీ, అలా ఏడిస్తే కాదు. జరిగింది ఘోరమే.. కాని మనం ఇప్పుడు ఆ దుర్మార్గుడిని పట్టుకొని శిక్షించాలి. నీకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలి. ఇలాంటి ఘోరం మరోసారి ఈ ఊర్లో మరెవరికి జరగకుండా చూడాలికదా.” అంది.
పరందామయ్య మాట్లాడుతూ..”చూడు తల్లీ! నీవు ధైర్యస్థురాలివి… నాకు తెలుసు. బేలగా బాధపడి ఏడ్చి బలహీన పడకు. నాకు తెలుసు నీవు ఎటువంటి కష్టంలో నైనా పోరాడగలవని. ఏడవకు. నిన్ను నీవు సమాధాన పరచుకో.. జ్ఞాపకం చేసుకో ఎవరు నీపై అఘాయిత్యం చేసింది. చెప్పు తల్లి.” పార్వతి స్వభావాన్ని, ధైర్యాన్ని ఆమెకే గుర్తు చేస్తూ బాధ నుంచి బయటపడేయాలని అనునయంగా చెప్పాడు. ఆ ఊరు ఊరంతా అక్కడే ఉన్నారు. అప్పటివరకూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్న వాళ్ళు, అంతా నిశ్శబ్దం అయిపోయారు. పార్వతి, ఏం చెబుతుందోనని, ఆ దుర్మార్గుడు ఎవరని చెబుతుందోనని అందరూ, చెవులు రిక్కించి వింటున్నారు.
పార్వతి ఏడుపు ఉదృతం కొంచెం తగ్గింది. అయినా వెక్కిళ్ళు పడుతూనే ఉంది. “ఎవరో నాకు తెలియదు. చాలా చీకటిగా ఉంది. ముఖాన్నంతా కప్పేసుకున్నాడు. ఎవరో గుర్తించలేక పోయాను. అనుకోని సంఘటనకి నాకు స్పృహ తప్పినట్టైంది. తేరుకుని తప్పించుకోవాలని ప్రయత్నం చేసా..బతిమిలాడాను…పెనుగులాడాను. చివరికి అతని ముసుగు తీయాలని చూసాను. కాని బాగా కొట్టాడు. హింసించాడు….” ఏడుపు  ఎక్కిళ్ళ మధ్య చెప్పింది. ఆమె దీనావస్థకి అందరూ కలత పడ్డారు. పెళ్ళీడు కొచ్చిన పిల్ల బతుకు ఇలా అన్యాయమై పోవటం అందరిని కలచి వేస్తుంది. కానీ, పార్వతి కూడా ఆ మనిషిని గుర్తించలేక పోవటం నిరాశే ఎదురైంది. ఆమె వల్లనైనా దోషి ఎవరని తెలుసుకో వచ్చననుకునే ఆశ కూడా పోయింది.
అదో మప్పై నలబై కడపలున్న, మారు మూల కుగ్రామం. స్వతంత్రం రాక పూర్వం, సనాతన ఆచారాలతో నియమ నిష్టలతో కూడుకున్న బ్రాహ్మణ అగ్రహారం కావటం వల్ల ఆ పల్లెటూళ్ళో పోలీసులు కంప్లేంట్స్ ఇవ్వడాల్లాంటివి లేవు. అన్ని సమస్యలను గ్రామ పెద్దలే పరిష్కరించుకుంటారు. అందుకని డిఎన్ఏ ద్వారా లేదా వేరే పద్దతుల ద్వారా ఆ అగంతకుడిని పట్టుకునే ఆస్కారం ఆరోజుల్లో, ఆ గ్రామం లో లేదు.
పరందామయ్యగారు ఆలోచనలో పడ్డారు.. అక్కడ గుమి కూడిన జనాల్లోకి చూసారు. వాళ్ళలో నిలుచున్న యువకులందరిని తేరిపారా చూసారు. వాళ్ళ కాళ్ళ వేపు చూసారు. ఎవరికైనా కాళ్ళకి గాయాలున్నాయాని. ఆలోచనలో పడిపోయారు.
ఆ గ్రామంలోని వయసులో పెద్దైన, అనుభవజ్ఞులైన అయిదుమంది పెద్దలతో ఆ న్యాయపీఠం ఏర్పడింది. వాళ్ళలోని గంగాధరంగారు “పరందామయ్యా, ఇప్పుడు ఏమిటి దారి. బాధితురాలు ద్వారా తప్ప దోషిని పట్టుకునే అవకాశం లేదనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఆశ లేదు. పార్వతి, అతనెవరో తెలియదంటుంది. ఎవరా వ్యక్తని తెలుసు కోలేక పోయాం..ఏ అవకాశమూ కనబడటం లేదు. ఏం చేద్దాం.” అనడిగారు.
ఇంకో సభ్యుడు మాధవయ్య “సరే, ఇప్పుడెలాగూ దోషిని కనిపెట్టే ఆస్కారం లేదు కాబట్టి…అతనిని పార్వతి కనిపెట్టినప్పుడు శిక్ష విషయం ఆలోచిద్దాం. ఇహ ఇప్పుడు మిగిలిన కార్యక్రమాలు కానిద్దాం. పార్వతి వల్ల ఆ కుటుంభం అపవిత్రం అయిపోయింది కాబట్టి మాలకారి దేవుడి కైంకర్యానికి రాఘవ శాస్త్రి అయోగ్యుడు. ఇకనుంచి సుందరానికి ఈ పనిని అప్పగిద్దాం.‘‘ ఎప్పటినుంచో ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మాధవయ్య ఇప్పుడు వదులుకో దలచుకోలేదు. తన బావ మరిది సుందరం చాలా బాగా కొత్త కొత్త పద్దతుల్లో పూల మాలలు కడతాడు. కానీ, అతనికి సరియైన ఉపాది లేదు. పోని ఇక్కడ దేవుడి కొలువు దొరకటానికి రాఘవయ్య అడ్డుగా ఉన్నాడు. తరతరాల నుంచి అతని వంశం వారే ఈ కైంకర్యం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటనని మాధవయ్య ఉపయోగించుకో చూసాడు.
అతని మాటలు జగన్నాధాచారికి అభ్యంతరకరంగా తోచింది. ‘‘ఇది సబబుగా తోచడం లేదు. ఎప్పటినుంచో దేవుడి సేవలో ఉన్న శ్రీమాన్ పరాంకుశంగారి వంశజుల మునిమనుమడైన రాఘవశాస్త్రి గారిని పనిని మాన్పించటం తప్పు. ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన మీ మేనత్త ఎవరితోనో లేచిపోయినప్పుడు మీ నాయన గారిని, దేవుడి రామానుజకూటం వంట పనులు నుండి ఈ కమిటీ దూరం చేయలేదు కదా. చిన్న ప్రాయశ్చిత్తంతో ఆకుటుంభాన్ని వదిలేశారుకదా. గుర్తులేదా. ‘‘  అంటూ కొంచెం ఘాటుగానే అన్నాడు.
జగన్నాధాచారి గారి మాటలు మాధవయ్యని చురుక్కుమనిపించాయి. అయినా ‘‘ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ముందు మాట. ఇప్పుడు మరీ గుర్తుచేసుకుని చెప్పక్కర్లేదు. కాలం మారలేదూ? అయినా ఆ విషయం ఈవిషయం ఒకటేనా ఏమిటి? మరీ చెప్పుకొచ్చారు!‘‘ అంటూ సాగదీశాడు. ‘‘సరే! జరిగిన సంగతులు ఇప్పుడెందుకు గానీ, ఎంతైనా దేవుడి పని కదా, ఏదో ప్రాయశ్చిత్తంతో రాఘవ శాస్త్రి గారిని విధులకు అంతరాయం లేకుండా చేద్దాం. పార్వతికి ఆమె తల్లి తండ్రికి పుణ్యావాచనం, ప్రాయశ్చిత్తం నిర్దారించండి.‘‘ అన్నాడు గోపాలంగారు.
ఆ నలుగురు న్యాయపీఠం సభ్యులు చెప్పిన దాన్ని విని పరంధామయ్య ఆలోచనలో పడ్డాడు. దూరంగా ఉన్న ఆండాళు, వయసుతో వచ్చిన వడిలిన శరీరానికి, ఊతకర్ర సహాయం చేసుకుని నెమ్మదిగా రచ్చబండ మీద కూచున్న పెద్దల దగ్గరగా వచ్చింది. ‘‘ఏమయ్యా, పెద్దమనుషులు, ఏం మాట్లాడుతున్నారు? ఇదేమయినా న్యాయంగా ఉందా? తప్పెవరు చేశారూ, శిక్ష ఎవరికి వేస్తున్నారు? దోషి పట్టుబడనంత మాత్రాన వాణ్ణి వదిలేసి ఇప్పటికే జరిగిన ఘోరానికి బాధ పడుతున్న వారికా ప్రాయశ్చిత్తము గురించి మాట్లాడుతున్నారు.‘‘ అంటూ అందరిని కడిగేసింది. ఆమె ధాటికి కొద్దిగా జంకారు ఆ నలుగురు.
‘‘మరి మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇంత దుశ్శహాసానికి పాల్పడ్డవాడు దొరికితే బాగుండేది.‘‘ అయోమయంగా అన్నాడు గంగాధరం. ‘‘పెద్దమ్మా, నీవెళ్ళి కూచో. మేమున్నాం కదా. న్యాయంగానే పరిష్కరిద్దాం‘ అంటూ గోపాలం గారు ఆవిడకు సర్ది చెప్పారు. సణుక్కుంటూ అక్కడే ఓ పక్కగా కూర్చుండి పోయింది ఆండాళు.
చుట్టూ ఉన్న వాళ్ళల్లో గుసగుసలు మొదలయ్యాయి. గట్టి చర్యలు తీసుకోక పోతే, గ్రామంలో ఇలాంటి అరాచకాలు ఎక్కువ కావా. ఆడపిల్లల్ని అడ్డూ అదుపు లేక బయటకు వెళ్ళనిచ్చే తల్లితండ్రులకు బుద్ది రావాలిగా… అంటూ తలా ఒకరకంగా మాట్లాడుతున్నారు. మాధవయ్య జనాల్లో ఉన్న ఆయన మేనల్లుడు భాస్కర్కి కనుసైగ చేసాడు. ‘‘అవునవును.. ఊరంతా నియమం నిష్టలు లేక పిల్లలంతా బరితెగించి పోతారు. ఇంతవరకూ మన అంబాపురానికున్న మంచి పేరు పోతుంది. తగిన శిక్షలు వేయాల్సిందే. మన ఊరి ఇలవేల్పు భ్రమరాంభికాదేవి ఇలాంటి ఘాతుకాన్ని సహించదు‘‘. అంటూ అందర్నీ రెచ్చగొట్టాడు. జనాలంతా అవునవును అంటూ వంత పాడారు.
‘‘అందరూ అలాంటి అభిప్రాయంలో ఉంటే మనకు గత్యంతరం లేదు మరి. మీరేమంటారు‘‘ అంటూ మాధవయ్య గంగాధరం వేపు చూస్తూ అన్నాడు. ‘‘తప్పదుగా ప్రజలు మాటే మనమాట‘‘ అంటూ గంగాధరం తలూపాడు. ఆ అయిదుగు సభ్యుల్లో ముగ్గురూ అవునవునంటూ వంత పాడారు.
పరంధామయ్యకీ, జగన్నాధం గార్కి వాళ్ళమాటలు అంతగా నచ్చలేదు. ‘‘మీరంతా కాస్త నిశ్శంబ్దంగా ఉంటే సరియైన నిర్ణయం తీసుకునే వీలవుతుంది. అందరి గురించి ఆలోచించే న్యాయ బద్దంగా తీర్పు చెప్పబడుతుంది.‘‘ అక్కడున్న వారితో అన్నారు.
‘‘ఇంకా ఏం నిర్ణయం తీసుకోవటం ఏమిటీ, ముందు నుంచీ ఉన్నదేగా. బలత్కరించిన వాడు దొరికితే, పార్వతి వివాహం జరిపించడం తప్పదుగా. ఆపిల్ల జీవితం చక్కదిద్దాలంటే, ఓ దారి చూపించాలంటే అతడే పార్వతిని పెళ్ళి చేసుకుని తీరాలి. గత్యంతరం కూడా లేదు. ఒకవేళ వాడు పట్టుబడక పోతే, రాఘవ శాస్త్రి వంశపారంపర్యంగా వస్తున్న మాలకారీ కొలువును వదులుకుని కుటుంభ సహితంగా గ్రామం వదిలి వెళ్ళాలి. తీసేయకూడదన్నారుగాని. దేవుడి కైంకర్యమాయే, మరి అతడు ఎలా నిర్వహిస్తాడు. మరో మార్గం అంటే, ఆయన కుటుంభానికి ప్రాయశ్చిత్తం చేసి దోష నివారణ చేసి, ధనదండ శిక్ష వేయాలి. కానీ పార్వతి బతుకేమిటి? ఏ మంటారు‘‘ అని సబ్యులను అడిగాడు మాధవయ్య. ‘‘‘సబబుగా లేదనిపిస్తుంది‘‘ అన్యమనస్కంగా అన్నారు గంగాధరం. ‘‘ అదెలా, ఏ నిర్ణయమైనా దోషి దొరికితేనే కదా తీసుకోగలం.‘‘ జగన్నాధం అడ్డుపడ్డాడు.
‘‘నిజమే కాని అప్పటి వరకూ రాఘవ శాస్త్రిగారి పని ఆపలేం కదా. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అదీ కాక వాడు ఎప్పుడు దొరుకుతాడో తెలియడం లేదు. అందుకని మిగిలిన కార్యక్రమాలు కానిచ్చి సభను ముగిస్తే సరి. అంతకంటే వేరేదారి కనపడ్డం లేదు.‘‘ గంగాధరం జవాబిచ్చాడు.‘‘‘అవునవును‘‘  అంటూ అక్కడున్న వారిలో సగం మంది ఆయనతో ఏకీభవించారు. వారి మాటలు వింటూ పార్వతి భవిష్యత్తు ఘోరంగా కనబడుతుంటే మనసులోనే రోదిస్తున్నాడు రాఘవశాస్త్రి. జానకమ్మ ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లే స్థితిలో ఉంది.
పార్వతి నెమ్మది నెమ్మదిగా పరిస్థితిని గ్రహిస్తుంది. ఆలోచించటం మొదలు పెట్టింది. ‘ఎవరు ఈఘోరం చేసింది. ఏమాత్రం గుర్తుకు రావటం లేదు. సూచనా మాత్రంగా కూడా ఆవ్యక్తిని పోల్చుకునే ఆధారం దొరకటం లేదు. ఎలా కనిపెట్టాలి‘ అనుకుంటూ తన భవిష్యత్తు ఏమిటి? ఎంతగానో ప్రేమించిన బావతో, త్వరలో వివాహం చేయాలనుకునే తల్లీతండ్రీ, అత్తయ్య ఎంత బాధ పడతారో. బావకి ఇలా జరిగిందని తెలిస్తే…. తనను క్షమించి మన్నించగలడా? తన తప్పు లేదని నమ్ముతాడా? అయినా ఎవరో దుర్మార్గుడు వల్ల తను శిక్ష అనుభవించాల్సి రావటం ఏమిటనే ఊక్రోషంతో ముఖం ఎరుపెక్కింది. ఇలా అందరి ముందూ తానే తప్పు చేసిన దానిలాగా నిలబడాల్సి వస్తుంది. తనవల్ల అమ్మా నాన్న కూడా అవమానాన్ని ఎదుర్కుంటున్నారు. ఇంతకింత పగ తీర్చుకుంటాను వాడు కానీ దొరికితే‘ అని బాధ పడుతున్న పార్వతి రచ్చబండ దగ్గర జరుగుతున్న చర్చ వినబడటం లేదు.
‘‘అయితే మరి పరంధామయ్య గారు, పుణ్యావచనం, ప్రాయశ్చిత్త హోమం చేసి, గంగ తీర్త స్నానాధికాలతో కార్యక్రమం పూర్తి చేద్దాం. ఏమంటారు‘‘ అంటూ అడిగాడు గంగాధరం. అందరు పెద్దలు అతని మాటకు సరే నన్నారు. ‘‘అలాగే తండ్రిగా ‘ధన దండన శిక్ష‘ కూడా రాఘవశాస్త్రికి తప్పదు.‘‘  అంటూ మాధవయ్య జోడించాడు. ‘‘అతను ఎక్కువ ఇచ్చుకోలేడు కనక, ఏదో చిన్న మొత్తాన్ని దేవాలయ హుండీలో వేయమని చెబుదాం‘‘. అంటూ గోపాలం సూచించాడు. ఆ మాటలు నచ్చకున్నా ఎక్కువ ఏమి అనలేక పోయాడు మాధవయ్య. పరంధామయ్యకు జరుగుతున్న చర్చా, శిక్షల నిర్ణయాలు ఏమాత్రం నచ్చటం లేదు. ‘‘చూడండి. ఇలా మాట్లాడటం ధర్మం కాదు. తప్పు చేసింది ఎవరో. మనం అపరాధం చేసిన వారికి కాక శిక్షలు వేస్తున్నది బాధితులకు. ఇదెక్కడి న్యాయం. ఆలోచించండి.‘‘ అంటూ తన అభిప్రాయం చెప్పాడు.
‘‘అవును, నీవన్నది సమంజసంగానే ఉన్నది. కానీ ఇక్కడ శాస్త్రి గారు దేవుడి సేవకు అపవిత్రంగా వెళ్ళలేడు కదా. అందుకని అయినా, ఆ కుటుంభానికి పుణ్యావచనం తప్పదు. ఇక కొద్ది మొత్తం దండనగా దేవుడికి సమర్పించటం వల్ల దోషం కూడా పోతుందని నా భావన.‘‘ గోపాలం గారు వివరించారు. దానికి పరందామయ్య ఏమీ అనలేక, మనసుకు కష్టంగా ఉన్నా, న్యాయపీఠం సభ్యుల నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చింది.
అక్కడున్న యువకులంతా హోమానికి సిద్దం చేశారు. ముందుగా పుణ్యావచనం కార్యక్రమం కోసం బ్రాహ్మణులు అన్నీ సిద్దం చేసారు. పార్వతిని శాస్త్రి గారిని జానకమ్మని బావి దగ్గర తలమించి నీళ్ళు పోసుకుని హోమం దగ్గరికి రమ్మని చెప్పాడు పూజారి ఆంజనేయశాస్త్రి. బావి దగ్గర నాలుగు బొక్కెనల నీళ్ళు తల మీద గుమ్మరించుకుని రాఘవశాస్త్రి వెళ్ళగానే తల్లీ కూతుర్లు కూడా తలమించి స్నానం చేశారు. ఆండాళు ఒక శాలువా తెప్పించి పార్వతికి కప్పింది. ఆ కార్యక్రమాన్ని పూజారి తదితరులు ప్రారంభించి హోమగుండంలో మంత్రోశ్చారణుల మధ్య అగ్నిని ప్రజ్వలింప చేసారు. తలవంచుకుని తప్పు చేసిన వాడిలా నడుస్తున్న రాఘవ శాస్త్రి గారితో కలిసి తల్లీ కూతుర్లు తడి బట్టలతో అక్కడికి వచ్చారు. ఆండాళు పార్వతికి సహాయంగా పక్కనే నిలబడింది.
హోమం దగ్గర పూజారికి సహాయంగా నిలబడ్డ ధనుంజయుడు ఒక్కసారిగా మండుతున్న హోమ గుండలో పడ్డాడు. శరీరం పడకుండా చేతులతో ఆపటానికి ప్రయత్నించాడు. హోమం కోసం ఆజ్యపు గిన్నెని పట్టుకున్న అతని చేతులు అగ్ని ప్రజ్వరిల్లుతున్న హోమగుండంలో ఆజ్యంతో పాటు పడ్డాయి. ఇంకేం అగ్నికి ఆజ్యం తోడైనట్టు, నెయ్యిలో మునిగిన అతని చేతులు హోమం మంటతో సహా మండడం మొదలెట్టాయి. ఆ మంటకు దిక్కులు పెక్కుటిల్లేట్టు అరుస్తున్నాడు. చేతులు పైకి తీసేసరికే రెండు అరచేతులూ అగ్నికీలలతో ఎగిసి పడుతున్నాయి. అనుకోని ఈ అవాంతరానికి దిక్కుతోచని పూజారి కలశంలోని నీటిని అతని చేతులపై పోయబోయాడు. అక్కడే ఉన్న మాధవయ్య పరుగున వచ్చి కొడుకు ధనుంజయని పట్టుకున్నాడు. ‘‘ఏ పార్వతీ కలశం తీసుకుంటావేమిటి వీడి చేతులు కాలి పోతున్నాయి. దాంలోని నీటిని చేతులమీద పోయ్యి. త్వరగా‘‘ అంటూ అరుస్తున్నాడు. అప్పటికే పార్వతి పూజారి చేతిలో నుంచి కలశం లాక్కుంది. ఆమె ముఖం ఖణ ఖణ మండే అగ్ని గోళంలా రగులుతుంది.
‘‘కాలనీ, బూడిదవనీ, చేసిన పాపం ఊరికే పోతుందా. నా బతుకుమీద మాయని మచ్చ వేసాడు. పశువులా నన్ను హింసించాడు. నన్ను తాకిన చేతులు మండిపోనీ, వాడికీ జీవితమంతా గుర్తుండే మచ్చపడని. అవిటివాడవని. ఆ భ్రమరాంభికాదేవి శిక్ష వేయకుండా ఉంటుందా‘‘ కోపంతో రొప్పుతూ అరుస్తుంది.
‘‘ఏమైందమ్మా, అమ్మ శిక్ష వేసిందా! ఎందుకు?‘‘ అంటూ గోపాలంగారు మిగిలిన పెద్దలూ అక్కడికి వచ్చారు.
‘‘అవును, ఆ పాపాత్ముడు వీడే. నన్ను నా జీవితాన్ని నాశనం చేసింది ఇతడే‘‘ అంటూ కోపంతో కన్నీళ్ళతో ఏడుస్తూ అంటోంది. ‘‘ఏం మాట్లాడుతున్నావ్ పార్వతి మతిగాని పోయిందా? నాకొడుకు నీ మీద అఘాయిత్యం చేసాడా? వాడు అమాయకుడు అనవసరంగా మాట్లాడకు‘‘ అంటూ కోపంతో అరుస్తూ, తన మేనల్లుడు భాస్కర్ తెచ్చిన గంగాళంలోని నీటిలో కొడుకు కాలుతున్న చేతులను పెట్టాడు. మంటకు తాళలేక ఏడుస్తున్నాడు ధనుంజయుడు.
‘‘ఏమయింది పార్వతీ, ఇంతవరకూ ఎవరో తెలియ దన్నావు. ఇప్పుడు ఇతడే అంటున్నావు. ఎలా? ఏ ఆధారాలతో చెబుతున్నావు?‘‘ అంటూ పరంధామయ్యగారు ఆమె దగ్గరగా వెళ్ళి అడిగాడు.
ఆమె ధనుంజయ దగ్గరగా వెళ్ళింది. భయంగా చూసాడు ఆమె వైపు. వంగి మండుతున్న చేతులను నీటిలో ఉంచి నిలుచున్న అతని పైన అంగవస్త్రం కింద పడిపోయింది. నగ్నంగా ఉన్న అతని ఛాతీ అంతా రక్తపు గీరికలు. బయటపడ్డ యజ్ఞోపవీతానికి తగులుకుని మెరుస్తున్న పార్వతి బంగారు ఉంగరం వేలాడుతుంది. ఆమె ఉంగరాన్ని ఊరు ఊరంత గుర్తుపడతారు. చాలా ప్రత్యేకంగా కనబడేది. పొడుగు దోసపలుకు ఆకారంలో ఉన్న కెంపు తొడిగిన బంగారు ఉంగరం అది. ఆమె వేలు సగ భాగాన్ని కప్పివేసేది. ఆమె నానమ్మగారు అవసాన దశలో తన ఉంగరాన్ని తీసి పార్వతికి వేలుకి ఆమె బావ శంకరంతో తొడిగించింది. ఇద్దరికి పెళ్ళి చేసేట్టు కూతురు సీతమ్మ, కొడుకు రాఘవ శాస్త్రి గారి దగ్గర వాగ్దానం చేయించుకుంది. ఈ సంగతి ఊరంతా తెలుసు.
అంతకుముందు, స్నానంచేసి హోమగుండం దగ్గరికి వచ్చిన పార్వతికి అక్కడే నిలుచున్న ధనుంజయ ఉత్తరీయం కిందుగా వచ్చిన యగ్నోపవీతం, దానికి చిక్కుకున్న ఆ ఉంగరాన్ని చూసింది. ఆ ఉత్తరీయంతో తన పై భాగాన్నంతా కప్పేసుకున్నాడు. అతడే ఈ ఘాతుకానికి బాధ్యుడని తెలిసిపోయింది. పట్టరాని కోపంతో అతన్ని హోమగుండలోకి తోసింది. అదంతా పక్కనే ఉన్న ఆండాళు చూస్తూనే ఉంది. వాడిని అలా శిక్షించే హక్కు పార్వతికి మాత్రమే ఉందని బలంగా నమ్మింది. చెప్పకనే అందరికీ అర్థమై పోయింది. తప్పు దొరికి పోయినందుకు తన దగ్గరికి వచ్చిన పార్వతిని భయంగా చూస్తూ నిటారుగా నిలబడిపోయాడు. ధనుంజయ చెంపలు బలంగా వాయించింది. రాఘవశాస్త్రి ఆమెని ఆపుతూ శాంతింప చేస్తున్నాడు.
‘‘ఏంటి, అలా కొడుతున్నావు. నీవు అతన్నే వివాహం చేసుకోవాలి. నీకు మరో గత్యంతరం లేదు. లేదంటే కులటలా ఈ ఊరు విడిచి నువ్వు నీ కుటుంభం బయటకు నడవాల్సి వస్తుంది. నీ దూకుడు తగ్గించు కోవటం మంచిది.‘‘ అంటూ మాధవయ్య కోపంగా చూశాడు పార్వతి వైపు. ఆమె అపర కాళిలా ఊగిపోతుంది. ‘‘ఎవడ్ని చేసుకునేది? ఈ దుర్మార్గుడినా? ఎందుకు చేసుకోవాలి.‘‘
గోపాలంగారు పార్వతిని శాంతపరుస్తూ ‘‘చూడమ్మా, నీ జీవితం పాడై పోతుంది. నిన్ను ఎవరు చేసుకుంటారు. మీ తండ్రి గారు నీ బాధ్యత తీర్చుకోవాలికదా. నీ బతుకుని పాడుచేసినందుకు అతను నిన్ను తప్ప ఎవరినీ పెళ్ళి చేసుకోరాదు. అది అతనికి శిక్ష. పెళ్ళి చేసుకోక పోయినా శిక్ష పడుతుంది. అలా కాదంటే నీ తల్లితండ్రులతో పాటు గ్రామ బహిష్కరణ తప్పదు.‘‘  
‘‘అతనికి శిక్షా, నాకా? నేనేపాపమూ చేయకుండా నా తప్పు లేకుండా అన్యాయంగా బలైన నాకెందుకు శిక్ష మరి. ఆడవాళ్ళ పట్ల గౌరవం లేని ఈ పశువుకన్నా హీనమైన వీణ్ణి, నీతి లేనివాణ్ణి చేసుకుని నేను నా జీవితాంతం వీణ్ణెందుకు భరించాలి. పశువు కూడా బలవంతంగా జతకట్టవు. వీడిని పశువుతో పోల్చినా తప్పే. నేనెందుకు చేసుకోవాలి. ఏ ధర్మ శాస్త్రం లో చెప్పబడింది. నేను వీడిని చంపి, ఈ అగ్నిగుండంలో దూకనైనా దూకుతాను కానీ వీడిని చేసుకోను.‘‘ ఆమె కోపం పట్టలేక పోతుంది.
‘‘అవును, నీవు ధనుంజయని పెళ్ళి చేసుకోవలసిందే. ఈ గ్రామ కట్టుబాట్లను కాదనడానికి వీల్లేదు. మేమంతా చూస్తూ ఊరుకోము. ఈ ఊర్లో ఇలాంటి అఘాయిత్యాలు ఇంకోసారి జరగకూడదు. ఇక్కడ నీ ఇష్టాయిష్టాలతో పనిలేదు.‘‘ అంటూ భాస్కరం కల్పించుకుంటూ కోపంగా అన్నాడు.
‘‘ఎందుకు పనిలేదు? తనే ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికైనా అర్హురాలు. ఎందుకంటే తానే బాధితురాలు కాబట్టి. తానే ఎక్కువ నష్టపోయింది కాబట్టి. పార్వతి ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె శరీరాన్ని, మనసుని గాయపరచి, అవమానించినందుకు ఆమే వాడికి ఎలాంటి శిక్ష వేయాలో నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. అతన్ని శిక్షనుంచి విముక్తుణ్ణి చేయటానికి మాధవయ్య మామయ్య చాలానే ప్రయత్నిస్తున్నారు. పార్వతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో, ఆమెకో జీవితాన్ని ఇవ్వటానికి, ఆమె కాపురాన్ని నిలబెట్టాలని చూడాలని ధనుంజయని దోషిని చేయకుండా, వివాహం చేయటం ధర్మ మనుకుంటుంన్నారు. మరో దారి లేదని దానికో ముద్ర వేస్తున్నారు. తరతరాలుగా ఈ సంఘంలో జరుగుతున్న పురుషహంకార అరాచకమిది. ఏతప్పు జరిగినా ఆమెని కళంకిని, అపవిత్రురాలు, పతిత అనే ముద్రలు వేసి ఆడదాన్నే దోషిగా చేయటమనే జాడ్యం జీర్ణించుకుపోయింది. కానీ, ఒక ఆడపిల్లని పైశాచికంగా బలత్కరించి, శారీరక మానసికంగా హింసించిన వాడితో పెళ్ళి చేసుకోవటమంత ఘోరం మరోటి ఉందా ఆ అమ్మాయికి? జీవితాంతం ఈ జరిగిన సంఘటన తలుచుకుంటూ చిత్రవధ అనుభవించే జీవితశిక్ష ఆమెకెందుకివ్వాలి? ఆమె బాధితురాలా? దోషా? శిక్ష ఎవరికి‘‘
ఎక్కుపెట్టిన బాణాల్లాంటి మాటలు అంటున్నదెవరా నని అందరూ వెనక్కి తిరిగి చూసారు. శంకరం నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి మాధవయ్య ఉలిక్కి పడ్డాడు. అయినా ధైర్యం కూడదీసుకుని ‘‘చాల్లే కుర్రకుంకవి, ఏదో పెద్దచదువులు చదివానని, మామీదే నీ ప్రతాపం చూపించకు. ఎప్పటినుండో వస్తున్న మా ఊరి సనాతన ధర్మాలను కాదనటానికి నువ్వెవరు? అంబాపురం ధర్మ పీఠం, వారి న్యాయ నిర్ణయాలంటే చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో దడ. అలాంటిది మా నిర్ణయాన్నే తప్పుపడతావా?‘‘ అంటూ హూంకరించాడు.
‘‘బాబాయ్, ఇక చాలు, నా చదువు సంస్కారం, మంచేదో చెడేదో నాకు నేర్పింది. ఆ జ్ఞానమే ఈ వివరణ ఇచ్చింది. ఇది కాక చాలా విషయాలు చెప్పగలను నీగురించి.  నీ పెంపకాన్ని, నీ ధర్మపీఠం అధికారాన్ని ఆసరా చేసుకుని ఎంతమందో అమ్మాయిల జీవితాలను నాశనం చేసి బయటపడకుండా వాళ్ళని గంగలోకి తోసారు. పోలీసుల జోక్యం లేదుకాబట్టి పట్టుపడలేదు నీ కొడుకు, నీ మేనల్లుడు. కానీ ఎప్పటికైనా పాపం పండక పోదు. అవన్ని బయట ఊళ్ళల్లో చేసారు కాబట్టి ఈ ఊరివరకు రాలేదు. చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇక పోతే, నీ గురించి. మా మామయ్య మాలకారి పనిని నీ బావమరిదికి ఇప్పించే కుట్రే ఈనాటి సంఘటన. పార్వతిని అడ్డుపెట్టుకుని, కోడల్ని చేసుకుంటే మెల్లిగా మామయ్య మంచితనాన్ని ఆసరాగా చేసుకుని అతన్నించి ఆ కైకంర్యాన్ని నీ చేతుల్లోకి తీసుకునే కార్యక్రమే ఇది. ఒకవేళ పార్వతి పెళ్ళికి నిరాకరిస్తే ఆ కుటుంభాన్ని గ్రామ బహిష్కరణ చేయించినా ఆ కొలువు మీదే కదా. ఈ మొత్తం గ్రంథం నీ కొడుకు, నీ మేనల్లుడు తో కలిసి రచించావు. అంతే కాదు, నీవు చెన్నపట్నం లోని బ్రిటిష్ అధికారిని కలిసి ఇక్కడిభూములు, వారికి ధారాదత్తం చేయాలనే నీ దురాలోచన కూడా నేను ఆధరాలతో సహా తీసుకొచ్చాను. చాలా? నీవి, నీ పిల్లల అరాచకాలను గురించి ఇంకా చెప్పాలా?‘‘ ఊరందరి ముందు మాధవయ్య బాగోతం వినిపించాడు శంకరం.
తాను ఎంతో పకడ్బందీగా ఏర్పాటు చేసిన ఈ ప్రయత్నం ఇలా ఊరందరి ముందు బయటపడిపోవటం మాధవయ్యకి, ధనుంజయకి, భాస్కరానికి మతులుపోగొట్టాయి. ఏం మాట్లాడి తనని తాను సమర్థించుకోవాలో అర్థం కాలేదు మాధవయ్యకి. అయినా ‘‘ఏం టబ్బాయ్ చిన్నంతరం పెద్దంతరం లేకుండా, న్యాయపీఠం సభ్యుడనని కూడా చూడకుండా అవాకులు చెవాకులూ పేలుతున్నావ్. ఇదేం బాగాలేదు. మాట్లాడరేం గంగాధరం గారు, గోపాలం గారు.  జనార్దనం గారు మీరు చూస్తూ ఊరుకుంటున్నారు‘‘ అని  పీఠం సభ్యులందరిని అడిగాడు తనను సమర్థిస్కారేమోనని.
‘‘నీవు కాసేపు మాట్లాడకు మాధవయ్యా, నీవిపుడు సభ్యుడివి కాదు. ముద్దాయి తండ్రివి. మమ్మల్ని నీ కొడుకుతో మాట్లాడనీ.‘‘ అంటూ జనార్ధనం అతని నోరు మూయించాడు.
‘‘ధనుంజయ్, ఇప్పుడు చెప్పు, తనని ఈ రోజు తెల్లవారు ఝామున అమ్మవారి తులసి తోటలో తనను నీవు అమానుషంగా బలత్కరించావవి నీ మీద అభియోగం మోపింది పార్వతి. దానికి సాక్షంగా నీ యగ్నోపవీతానికి ఆమె ఉంగరం తగులుకొని ఉండటం, నీ చిటికెనవేలు చిట్లి రక్తం రావటం, నీ చేతులు, వంటిమీద పార్వతి గోర్ల గుర్తులుండటం ఆమే నిన్ను దోషి అనటానికి సాక్షాలుగా కనబడుతున్నాయి.‘‘ దీనిమీద నీవు చెప్పాల్సింది ఏమైనా ఉందా?‘‘ అని గోపాలంగారు అడిగారు.
రెండుచేతులు బొబ్బెలెక్కగా, విపరీతమైన మంటతో మాట్లాడలేక పోతున్నాడు ధనుంజయుడు. ‘‘నేను చాలా తప్పు చేసాను. క్షమించుమని అడిగలేనంత పెద్ద తప్పే చేసాను. నేను మారిపోయాను. నన్ను నమ్మండి, మీరంతా అనుమతిస్తే పార్వతిని వివాహం చేసుకుంటాను. నా వల్ల ఆమె జీవితం బలవకుండా కాపాడుతాను. నాకిక ఏ శిక్షా వేయకండి. అమ్మవారే నాకు సరైన శిక్ష వేసింది. నన్ను క్షమించి నాకు ఒక్క అవకాశ మివ్వు పార్వతి‘‘. ఏడుస్తూ అంటున్న ధనుంజయుడ్ని చూసి మాధవయ్య లోలోన మెచ్చుకుంటున్నాడు. తను అనుకున్నట్టుగా తన కొడుకు చేస్తున్నాడని, అంతా సవ్యంగానే జరుగుతుందని, ధర్మపీఠం వాడి మాట నమ్మి వివాహం జరిపించటం, తన గుప్పిట్లోకి రాఘవయ్య కుటుంభం చిక్కుతుందని, శంకరాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చననే ఆలోచనలతో ఉన్నాడు.
పార్వతి శంకరానికి తన ముఖాన్నిచూపించలేక చేతుల్తో ముఖం దాచుకుని కింద కూలబడి పోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ధనుంజయుడు క్షమించమని అడుగుతూ ఆమె దగ్గరికి రావటం తో, కోపాన్ని ఆపుకుంటూ అతని చెంపలు వాయించింది. ‘‘నువ్వు నన్ను కాపాడుతావా? నీవే ఒక వేటగాడివి. నీ వల్ల పాడై పోయిన ఎంతమంది అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటావు. ఛీ.. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఫో అవతలకి. ఇంకా నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు.‘‘ అంటూ వెక్కి వెక్కి ఏడవ సాగింది.
ఆండాళు, పార్వతి దగ్గరికి వచ్చి ‘‘నిజమే నమ్మా, వీడు ఊళ్ళో ఉండదగిన వాడు కాదు. నీవు చేసుకోవాల్సిన అవసరమూ లేదు‘‘ అంటూ ఓదార్చింది. పరుగున దగ్గికి వచ్చి అక్కున చేర్చుకున్నాడు శంకరం. ‘ఏడవకు పార్వతి, నీవే తప్పు చేయలేదు. నీకు నేనున్నాను.‘‘ అంటూ ఆమెను ఊరడించాడు.
‘‘మామయ్యా, నిన్ననే పరీక్షలయిపోయాయని ఇక్కడికి బయలుదేరుదామని అమ్మా నేను అనుకుంటున్నాము.   ఇంతలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. జరిగిన విషయాలని మనసులో పెట్టుకుని బాధ పడకండి మామయ్యా. అతనికి తగిన శాస్తి జరిగిందికదా. అతన్ని ఏంచేయాలో బాబాయి వాళ్ళు తీర్పు చెబుతారు.‘‘ రాఘవశాస్త్రిగారితో అన్నాడు.
వెనుకనే ఉన్న శంకరం తల్లి, శాస్త్రి గారి చెల్లెలు సీతమ్మ,‘‘అన్నయ్యా, జరిగినదాన్ని పీడకలని మరచి పొండి. పార్వతిని నా కూతురుగా చూసుకుంటాను. నీవు దిగులు పడకు. మంచి ముహుర్తం చూసి పెళ్ళి కానిచ్చేద్దాం‘‘ అన్న చెల్లెలి మాటతో కన్నీళ్ళు తుడుచుకున్నాడు. సీతమ్మ, ఏడుస్తున్న జానకమ్మను దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఆమె ముఖం దుఃఖం, అవమానంతో దిగులుగా ఉంది.
పరందామయ్య మిగిలిన ముగ్గురూ ఆ ఊరికి వయసుకి పెద్దదైన ఆండాళు కలిసి చర్చించుకుని తమ ధర్మ పీఠం తీర్పును చెప్పారు. ధనుంజయ హోమగుండంలో పడిన విషయం పరందామయ్యకి, కమిటీ వాళ్ళకి వివరించి వాడి శిక్ష ఏవిధంగా వేయాలనే నిర్ణయాధికారం, బాధితురాలిగా పార్వతికి ఉందని, ఆమె ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని కమిటీ గుర్తించాలని కరాకండీగా చెప్పింది. అందరూ ఆమె వాదన సమంజసమని వప్పుకుంటూ, ఆ ధర్మపీఠం తీర్పును తీర్మానించింది.
‘‘ఇంతవరకు ఇక్కడ గ్రామ ప్రజలందరి సమక్షంలో జరిగిన విషయాలకు మీరంతా ప్రత్యక్ష సాక్షులు. మేము అందరం కలిసి న్యాయమైన తీర్పును నిరిణయించాం. పార్వతిని అమానుషంగా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ధనుంజయ బలత్కరించాడు కాబట్టి అతన్ని, అతని కుటుంభాన్ని దోషులుగా పరిగణిస్తూ గ్రామ బహిష్కరణ శిక్షను విధిస్తున్నాము. అపరాధి ఎప్పుడూ తప్పించుకోలేడు. ఎప్పుడో ఒకప్పుడు దొరికి పోతాడు, తన తప్పుకు శిక్షను తప్పకుండా అనుభవిస్తాడనే రుజువుని ఆదిశక్తి పార్వతీదేవి చూపించింది. అతన్ని బ్రమరాంభికా అమ్మవారు చేసిన తప్పుకు శిక్షను వెంటనే అనుభవింపచేసింది. అయినా శంకరం మాకు అందించిన సమాచారం, ఆధారిత సాక్ష్యాలు పరీక్షించిన మీదట ఈఊరు ప్రజల క్షేమం దృష్ట్యా ఆకుటుంభం అంతా తక్షణమే ఊరువిడిచి వెళ్ళ వలసిందిగా ఊరుమ్మడిగా తీర్మానించాము. రాఘవశాస్త్రి గారి కుటుంభం నిరపరాదులు, వారికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన అవసరం లేదు. అమ్మవారే ప్రాయశ్చిత్తం కార్యక్రమాన్ని ఆపివేస్తూ విఘ్నాన్ని కలిగించారు. వారు పుణ్యావాచనం వారి గృహంలో చేసుకుని తమ మాలకారి విధులను నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. ఇక పార్వతి, బాధితురాలు. దోషికాదు. ఆమె తన ఇష్ట ప్రకారం తన వివాహ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఆమెకి ఉంది. ఆమెని వివాహం చేసుకోవటానికి తమ ఇష్టాన్ని వ్యక్తపరచిన రాఘవశాస్త్రి మేనల్లుడు శంకరం, అతని తల్లిగారు సీతమ్మగారి మంచి మనసును ఈ ఊరంతా అభినందనలు తెలుపుతుంది.‘‘ అంటూ పరందామయ్య గారు చెప్పిన తీర్పుకు గ్రామ ప్రజలంతా హర్షాతి రేకాలతో చప్పట్లు చరితారు.

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇరుగు పొరుగు జెప్టో అత్తమ్మలు

తోడు- నీడ