శనార్థులు తమ్ముండ్లు, చెల్లెండ్లు. పైలమా.
ఒక ముచ్చట తెచ్చిన వినుండి.
“గిరిజమ్మత్తా… రెండు చెంచాల చా పత్తి ఇయ్యుమన్నది మా అమ్మ ” ఒక గిన్నె పట్టుకొని వచ్చింది పక్కింటి వనజ.
” బడికి పోలేదే పిల్లా ” చాయిపత్తి రెండు చెంచాలు కొలిసి వనజ గిన్నెల పోసి అడిగింది అత్త. పోలె సుట్టాలొచ్చిన్రు అని చెప్పి చాయి పత్తి తీస్కొని పోయింది వనజ. మేము చిన్న గున్నప్పుడు మా జొమాటో లు గిట్లుంటుండే.
కొత్తిమీర, అల్లం ముక్క, ఒక్కో పారి బియ్యం.. పది రూపాయలు ఇట్ల ఏది అక్కర పడ్డా.. మంచిగ పక్కింటి అత్తమ్మలను అడిగేటోళ్ళము. మా పిల్లలము గిన్నెలు తీస్కొని పోయేటోళ్ళము. మళ్ళీ వాండ్లు తెచ్చుకున్నాక చేబదులు వాపాసు ఇచ్చేటోళ్ళు.
ఇదేమి నామోషీ అనిపించేది కాదు. ఇప్పటిలెక్క అప్పుడు జొమాటోలు బిగ్ బాస్కెట్లు లేవు, కూరగాయలు తాజాగా దొరికేటివి. బట్టతో కుట్టిన బస్తాలు తీస్కొని బజారుకు పోయి తెచ్చుకోవాలె . లేకుంటే ఇంటికాడికే గుల్లలల్ల ఎత్తుకొని వచ్చేటోళ్ళు.
ఒక్కటి మాత్రం నిజం కార్పొరేట్ దునియాని అప్డేట్ చేసిందేమో కానీ.. గిట్ల కూరలు, పాలు, పండ్లు అమ్ముకునేటోళ్ల పొట్ట మాత్రం కొట్టిందని అనిపిస్తది నాకు, కొబ్బరినీళ్లు కూడా ఆన్లైన్ లనే అనవట్టిరి, మీరేమంటరు చెప్పుండి జర మరి.! నాకైతే మా ఆన్సుయత్తమ్మ ఇంకా యాదికుంది. గంపనిండ కూరగాయలు, ముఖ్యంగా తాజా ఆకుకూరలు తెస్తుండే. మా అమ్మ పక్కింటి రేణుకత్తమ్మ, మమ్మద్ బి అత్తమ్మ అందరు గంట బ్యారంజేసి కొని, ఆ కూరలత్తమ్మకు చాయి పోసి ముచ్చట్లు చెప్పి గంటకు లోపలికి ఒద్దురు. మా పోరగాండ్ల ముచ్చట్లు మాకుంటుండే మస్తుగా..!
ఎవరన్న ఇంటికి అనుకోకుండ సుట్టమొస్తే.. మెల్లగ కంప సాటునుండి కూరలు సప్లై అయ్యేటియి. కంప అంటే తెల్వదు కదా మీకు. కాంపౌండ్ వాల్ లెక్క కట్టేటోళ్ళు. ఫెన్స్ అన్నమాట.
ఇప్పుడు అట్ల తీస్కుంటరా.. మీరు జర చెప్పుండి నాకు. ప్రెస్టిజి.
ఒక ముచ్చట చెబుతా ఇనుండి. యే కులంగాని, యే మతంగాని నీ పక్కపొంటి ఉండేటోడే నీ నిజమైన సుట్టం
తమ్మీ..! కష్టంల సుఖంల నీకు దబ్బున ఆసరైతరు. వాళ్ళతోని చిన్నదానికి, పెద్దదానికి లాడాయి వడొద్దు. కల్ప్క పోవుడు నేర్వాలే.
అప్పుడప్పుడు చిన్న చిన్న లాడాయి జగడ్ లు అయినా మొత్తం మీద అందరూ కలిసి మెలిసి ఉండేటోళ్ళు. ఎవ్వళ్ళింట్ల పెండ్లి అయినా, పబ్బమయినా తలా ఒక చెయ్యి వేసి పనులు కానిచ్చేటోళ్ళు. ఇప్పట్లేక్క ఈవెంట్ ఆర్గనైజర్స్ లేకపోయే.
బాపమ్మలు, అవ్వలు తాతలే పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్లు అప్పుడు. పది పది కిలోల సకినాల పిండి, అరిసెల పిండి కొట్టి ఒండెటోళ్ళు అంటే.. ఇగ ఆలోచించుండి మీరు. గట్లుంటుండే అత్తమ్మల అండర్ స్టాడింగు.
ఆళ్ళకు ఎప్పుడన్న పెద్ద లాడాయి జగుడం పడ్తే మాత్రం.. ఇగ అయిపాయె గల్లి గత్తర లేశి పోతుండే అనుకోండి.
ఇంకోమాట మేము శానామటుకు అత్తమ్మ మామయ్య అనే పిలిసేటోళ్ళము. ఆంటీలు జెర తక్కువనే.
ఏది ఏమైనా ఒకరికి ఒకరు అక్కరైదురు. చిన్నా శితక గిట్లాంటి హెల్పులు మస్తుగ నడుస్తుండే.
ఎందుకో ఈ రోజు సాయంత్రం గింత అల్లం ముక్క అవసరమైంది.
మా ఓడిని అడుగుతే ఫోన్ పట్టుకుండు జెప్టో లో పెడ్తా అని. పానం ఉసూరు మన్నది మాకు. గింత అల్లం ముక్కకు, టాక్సు.
పక్కింట్ల తెరాదు బిడ్యా అంటే.. వాడు ” తేరాదు ” అనేసిండు.
ఏమ్ జేస్తం.
ఉంటమరి జెప్టోడు బెల్లు కొడ్తుండు. అల్లం ముక్క గింత పెద్ద బ్యాగుల పెట్టి తెచ్చినట్టుండు. ఉంట మరి. పైలం.
మీ
రమక్క