ఎడారి కొలను

ధారావాహికం – 26వ భాగం

(ఇప్పటివరకు : మైత్రేయిది  ఆత్మా హత్య ప్రయత్నం కాదని తెలియడంతో ప్రసాద్ ఊపిరిపీల్చుకున్నాడు. అమ్మ నాన్న ల దగ్గరికి వేళ్ళటానికి విముఖత చూపెట్టడంతో, కాంతమ్మ గారు మైత్రేయి తన ఇంటికి తీసుకెళుతుంది. కాంతమ్మ గారి భర్త ప్రభాకర్ గారి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టు కుంటుంది.  అందరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడానికి సిద్ధమవుతారు)

మైత్రేయి ప్రసాద్  ఒక వైపు. రాజ్యలక్ష్మి సుమంత్ ఎదురు కుర్చీలలో  మాస్టర్ చైర్ లో ప్రభాకర్ గారు, అయనకి పక్కగా ఉన్న కుర్చీలో కాంతమ్మ గారు కూర్చున్నారు.  రాంబాయమ్మ గారు మడి  కట్టు లోనే ఉండి  వాళ్లందరికీ కంచాలలో వడ్డిస్తున్నది. కాంతమ్మ గారు,”రాంబాయమ్మ గారు! మీ వంట చేసుకున్నారా లేదా?”అంటూ ఆరా తీసింది.

దూరంగా వంటగది కి  దగ్గరిగా నిలబడి ఉన్న రమణి,   ” రాంబాయమ్మ! గారు నన్ను కూడా సాయం చేయనివ్వరమ్మా, ఆమె మడితో చేసుకున్న వంట ఒక పక్కన ఎప్పుడో పెట్టేసుకున్నారు. మీరు తిన్నాక తింటామన్నారు. నన్నా  వంటలను ముట్టుకోవద్దని కూడా చెప్పారు,” అంటూ గల గల చెప్పేసింది.

“పోనీ లేవే! ఆమె అలాగే బతికింది , అలాగే ఉండని, మనకోసం ఎందుకుమారాలి. ఆమె అలవాటేమి మనకు ఇబ్బంది కాదు కదా?. ఆమెని నువ్వు ఇబ్బంది పెట్టమాకు నీ అల్లరితోటి,” అంటూ గదమాయించింది.

“అయ్యో!అలా ఏమి లేదమ్మా1 నాతొ పాటు భోజనం చేయక పొతే దానికేమి తోచదు. మేమిద్దరం మీరంతా తిన్న తరువాత, ఆ పెరట్లో తులసి కోట దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాము. దానికి నేను చేసుకొనే రోటి పచ్చడి అంటే మహా ఇష్టం,” అన్నది రాంబాయమ్మ.

“ఓహో! ఇవాళ ఏ రోటిపచ్చడి చేసారండి, ఏది నాక్కాస్త వడ్డించండి, నాకు చాలా ఇష్టం,” అన్నాడు ప్రభాకర్ .

“అదెంత భాగ్యం, మీరు కావాలంటే రోజు చేస్తాను, కాస్త నెమ్మదిగా తినండి ఇప్పుడే పట్టుకొచ్చేస్తా,”అంటూ పరుగు లాటి  నడకతో వెళ్లి ఒక చిన్న రాచిప్ప లో పెట్టిన పచ్చడి తీసుకొచ్చారు ఆవిడ.

“వేసుకోండి బాబు, ఇది కొత్తిమీర టమాటా కాల్చి చేసిన పచ్చడి,” అంటూ అందరి పళ్ళేలలో  పచ్చడి వేసింది.

“వేడి వేడి అన్నంలో ఇలా ఈ పచ్చడి కలిపి నెయ్యి వేసుకొని తింటే , నా సామిరంగా స్వర్గానికి బెత్తెడు దూరం లో ఉన్నట్లుంటుంది,” అంటూ ఏంతో  సంతృప్తి తో  తింటున్న ప్రభాకర్ గారిని తన తోబుట్టువుని చూసినట్లనిపించి, రాంబాయమ్మ గారికి కళ్ళు చెమర్చాయి.

“ఇప్పుడు నా పులుసు వంతు.ముందు నువ్వు రుచి చూసి వడ్డించమను, పిల్లలు బెదిరిపోగలరు,” అంటూ గుస గుసగా కాంతమ్మకి చెవులో చెప్పాడాయన.

”ముందుగా కొంచం వేసుకొని నోట్లో పెట్టు కుంటూ మీ పులుసు కూడా నన్ను స్వర్గానికి బెత్తెడు దూరం లో వదిలేసింది,” అన్నదావిడ నవ్వుతూ.

“అదేంటి స్వర్గ చేరనంటావనుకున్నాను,” అన్నాడాయన అమాయకంగా.\

“అయ్యో అదెలా, మీరు స్వర్గానికి బెత్తెడు దూరం లోనే కదా ఆగిపోయారు, మీతో దారిలో కలిసి ఆ స్వర్గం చేరాలనుకున్నాను లెండి,” అన్నది ఆమె అంతే అమాయకంగా.

అందరూ వారి సంభాషణకు మనసారా నవ్వుకొన్నారు. తృప్తిగ మంచి కుటుంబం మధ్యలో భోజనం చేసే భాగ్యం కలిగిందని ప్రసాద్ మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఆ దంపతులకి మనసులోనే.

భోజనాలు కానిచ్చి డ్రాయింగ్ రూమ్ లోకెళ్ళి పోయారు అందరు. రమణి రాంబాయమ్మ గారు ఆ టేబుల్ సర్దేసి వాళ్లు  కూడా తినడానికి కూర్చున్నారు.ప్రభాకర్ గారు టీవీ పెట్టారు , బీ బీ సి లో  ఒక చర్చ “హార్డ్ టాక్ “అనే ప్రోగ్రాం వస్తున్నది.

అది కాస్త జాగర్తగా వింటున్నారు ఆయన. అది భారత దేశం లో ఆత్మహత్యలు ప్రపంచంలోకెల్లా ఎక్కువ అని, ముఖ్యం గ స్త్రీ లు ఆత్మహత్య కు పాల్పడే సంఖ్యాఇండియా  లోనే ఎక్కువ అని వాళ్ళు చూపిస్తున్న బార్ ఇండికేటర్స్ లో స్పష్టం గ ఉన్నది. అది చూస్తూనే చలించిపోయారు ఆ దంపతులు.

“ఎప్పటికి ఈ సమాజం లో మార్పువస్తుందో తెలియదు?”  ప్రభాకర్ అన్నాడు,

“మన దేశం లో వివాహం అమ్మాయి  ఇష్టం తో జరిగేవి చాల తక్కువ. చాల మటుకు తల్లి తండ్రి గాని మరెవరో చెప్పారని , జాతకాలూ సరిపోయాయని, అబ్బాయి కి అమ్మాయి  చాల బాగా నచ్చేసిందని, ఇలాటి ఎదో ఒక సాకుతో అమ్మాయికి సంబంధం కుదిరించేస్తారు. ఆ తరువాత సర్దుకు పోవాలమ్మా అన్న పాఠం వంటబట్టిస్తారు. పాపం ఆడపిల్లలు ఎవరికీ చెప్పుకోలేక, సర్దుకుపోలేక ఇలాటి అఘాయిత్యాలకు పూనుకుంటారు.”

“అవునండి. ఇప్పుడు ఇంకొక కొత్త పోకడ కనిపిస్తున్నది. ఇప్పుడు పెళ్లిళ్ల  మార్కెట్ లో అమ్మాయి కి కట్నం ఇచ్ఛి పెళ్లి చేయనక్కరలేదు. ఆ అమ్మాయి పేర అంతో ఇంతో ఆస్తి చూపిస్తే చాలు, అలాగే బంగారం పెట్టి ,పెళ్లి ఘనంగా చేస్తే సరిపోతుంది,”  అని అన్నది కాంతమ్మ గారు.

రాజ్య లక్ష్మి అందుకొని, “ ఇంకొక ట్రెండ్ కూడా వచ్చిందండి,” అన్నది.

“ అదేంటో కాస్త వివరంగా చెప్పు,” అన్నాడు ప్రభాకర్.

ఈ మధ్యన మా మేనమామ తన చిన్న కూతురికి ఇంటర్మీడియట్ లో నాన్ మెడికల్లో సీట్ సంపాదించడానికి పడిన కష్టాలు చెప్పుకొచ్చాడు.”

నేను ఆయన్ని అడిగాను,” మామయ్య మరయితే అదేమో నేను చదవలెను నాన్న అని మొత్హుకుంది కదా! అయినా కూడా చేర్పించావ?”

దానికి అయన, “దాని మొహం దానికేం తెలుసు, దాన్ని నేను వెలగపూడి లో రెసిడెంషియల్  కాలేజీ లో చేర్పించాను . వాళ్ళు బాగా రుబ్బుతారు, చాలు. పాసయి పోతుంది.”

“ అనుకున్న స్కోర్ రాకపోతే ఎలాగా !”

“దాందేముంది. ఏదొక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించేస్తాను. వాళ్ళు ఎక్కడోక్కడ ప్లేసెమెంట్ ఇప్పిస్తారు.”

“అంటే దాని చేత ఉద్యోగం చేయించి, దాన్ని స్వతంత్రురాలిని చేద్దామను  కుంటున్నావా, మావయ్యా? గ్రేట్!” అన్నాను చాల సంతోషంగా.

“ ఓసి నీ! నీకలా అర్ధమయిందా? మా నాన్న ఉద్దేశ్యం అదేం కాదు. నన్ను బి ఇ  ఎందుకుచేయిస్తున్నాడో తెలుసా! అయన స్నేహితుడి కొడుకు ఇప్పుడు ఫైనల్ సెమిస్టరు బి ఈ లో ఉన్నాడు, అతనికి అది పూర్తయే ప్లేసెమెంట్ కోచ్చేస్తాడు కదా, అప్పటికి నేను  ఏదొక ఇంజనీరింగ్ కోర్స్ లో ఉన్నననుకో అతని తో నాకు పెళ్లి చేసేయొచ్చని. పైగా అతనే స్వయం గ మా నాన్నకు చెప్పాడట నన్ను ఇంజనీరింగ్ చదివించమని,” అంటూ తన నాన్ మెడికల్ కోర్స్ వెనక కిటుకు విప్పింది.

నాకు కాస్త అయోమయంగ అనిపించినా, అమ్మాయిని పెళ్లి కోసమే చదివిస్తున్న మా మావయ్య అంతరంగం అర్ధమయ్యి, కాస్త చనువుగా ఆయన్ని అడిగాను,” మరి మావయ్య! కట్నం అది ఇక ఇవ్వవ?” అని.

దానికి కూడా మా మావయ్య కూతురే సమాధానం చెప్పింది, “కట్నం ఎందుకె వదిన! జీవితాంతం బోలెడంత జీతం పెళ్ళాం తే చ్చి పెడుతుందిగా! ఎవడికవ్వాలి  ముష్టి కట్నం.”

“మా పిల్లకు పెళ్ళయితే అదే చాలు. మాకేమి దాని సంపాదన మీద ఆశలేదు.” అంటూ మా మావయ్య వేదాంతిలాగా మాట్లాడాడు.

“అది అయన అమాయకత్వమో,లేక మూర్ఖత్వమో నాకు అర్ధం కాలేదు,” అని     కొత్తగావస్తున్న మ్యారేజ్ ట్రెండ్ గురించి చెప్పింది రాజ్య లక్ష్మి.

“అందుకే నెమో  మనదేశం లోనే వివాహిత అమ్మాయి ల్లో ఎక్కువ శాతం మానసికంగ అసంతృప్తి,ఆవేదనతో కుంగిపోతున్నారు. మొండిగా జీవితాన్ని అంతం చేసుకోవడాన్నికూడా వెనుకాడటం లేదు. ఎడ్యుకేషన్ ఉండి ఎం లాభం? అవగాహన లేనప్పుడు.” అంటూ నిట్టూర్చాడు సుమంత్.

నేను కొద్దీ సేపు విశ్రాంతి తీసుకుంటాను అంటూ కాంతమ్మగారు ”మైత్రేయి నువ్వు కూడా వెళ్లి కాసేపు పడుకో ! “ అంటూ వెళ్ళిపోయింది. మైత్రేయి ఆమె వెనకాలే రాంబాయమ్మ గారి రూములోకి వెళ్ళింది పడుకోవడానికి.

సుమంత్, రాజ్యలక్ష్మి కూడా సెలవు తీసుకొని ఆఫీస్ కి వెళ్లి పోయారు.  ప్రసాద్ , ప్రభాకర్ గారు మాత్రమే హాల్లో  మిగిలిపోయారు.

(ఇంకావుంది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శతక పద్యాలు జీవన మార్గ సూచికలు

ఆషాఢ మాస గోరింటాకు