ప్రప్రథమ స్త్రీవాద అభ్యుదయ వాది బండారు అచ్చమాంబ

ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి. మహిళాభ్యుదయానికి తొలి విదూషీమణి, సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలను అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథస్తం చేసిన తొలి తెలుగు కథా రచయిత్రి, స్త్రీ విద్యా, స్వాతంత్య్రముల వలన దేశానికి లాభమే గాని నష్టం గలుగదని, స్త్రీ విద్య యత్యంతావశ్యకం అని మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించిన 1902 నాటికే అభ్యుదయా భావాలతో ‘నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహమాడుట వలనను భర్తకు దాసి నగుదునా యేమి ?‘ అని ఆనాడే సమాజాన్ని ప్రశ్నించిన మహిళా తేజం మనం గర్వించదగ్గ బండారు అచ్చమాంబ గారు.

ఆమె 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడుకూడా ఆమెతో పాటే ఉండేవారు. తమ్ముడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, చరిత్ర పరిశోధనలకు ప్రసిద్ధి చెంది, తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టి కర్త. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగుహిందీ నేర్చుకొన్నది.ఆయనకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయుడు వచ్చినపుడు తను కూడా పక్కనే ఉండి చదవడం రాయడం నేర్చుకున్నారమె. సోదరుని ప్రోత్సాహంతో, సహాయంతో, పుస్తకాలు సేకరించి ఆసక్తితో చదువుకున్నది. హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం భాషలు నేర్చుకున్న విదుషీమణి అచ్చమాంబ. వివిధ భాషల్లో స్త్రీ సాహిత్యం రాసిన రచయిత్రులు గురించి పరిశోధన చేసి, విషయాలు సేకరించి అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని రచించిన ప్రథమ స్త్రీవాద చరిత్ర కారిణి. ఆమెకు ఇంగ్లీషు, గుజరాతీ భాషలలో కూడా ప్రవేశం ఉంది

కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, ఆయన అక్క భండారు అచ్చమాంబల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.

తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు కథ 1910 లో గురజాడ అప్పారావు రాసిన “దిద్దుబాటు” (ఆంధ్ర భారతి పత్రికలో) అని చాలా మందికి తెలుసు. చాలా ప్రక్రియ లకు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ప్రారంభకులు అని తీర్మానం చేయడం వల్లనో, మరే కారణం వల్లనో కానీ చాలా కాలం ఈ అభిప్రాయమే చెలామణిలో ఉంది. విమర్శకులు, పరిశోధకులు, ముఖ్యంగా స్త్రీవాదులు తమ పరిశీలనలో భండారు అచ్చమాంబ తొట్టతొలి కథకురాలిగా నిర్ధారించారు. 1902 లోనే “ధన త్రయోదశి” కథ రాసిన అచ్చమాంబ 1893 నుండే కథలు రాసినట్లు, కానీ ప్రస్తుతం పది మాత్రమే వాడుకలో ఉన్నాయని తెలుస్తుంది. సంగిశెట్టి శ్రీనివాస్ సంకలనం “తొలి తెలుగు కథలు” గా ప్రచారం లో ఉన్నాయి.

1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు.అయితే ఈ కథ గ్రాంధిక భాషలో ఉంది.

దీపావళికి ముందరి రోజు త్రయోదశి. అది కూడా పర్వదినమే.లక్ష్మీపూజ చేసే రోజు అది.దరిద్రం తాండవించేఒక కుటుంబం యొక్క పరిస్థితిని కథా వస్తువుగా తీసుకున్నారు  రచయిత్రి. పది రూపాయల జీతానికిగుమస్తాగా పని చేస్తున్న భర్తకు చేదోడుగా ఆమె కుటుంబ నిర్వహణ కోసం రవికలు కుడుతూ సంసారాన్ని గడుపుతూ ఉంటుంది.దీపావళి పండుగకు పిల్లలకు కొత్తబట్టలూ, టపాసులు, కొని పెట్టలేని ఆర్థిక దుస్థితికి బాధపడుతున్నాఅది పైకి కనపడనీయదు. పతిని మందలించటం మంచిది కాదు అనే సాంప్రదాయ భావం వున్నప్పటికి అతను చెడిపోతుంటే చూడడం వివేకం కాదన్న ఉద్దేశ్యంతోఎలా మంచిగా జీవించాలో అతనికి చెప్పింది. ‘‘ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే‘‘ సామెతకు అక్షర రూపం యిచ్చి లక్షల విలువైన నిజాన్ని చెప్పిన కథ ఇది. మనిషి నిజాయితీ బయట పడేది, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినపుడేఅటువంటి పరిస్థితులను ఎదిరించి యెలాధైర్యంగా, నిజాయతీగా బతకాలో ఒక స్నేహితురాలుగా భర్తకు చెప్పింది.అడ్డదారుల్లో అవినీతి సంపాదనతో ఆడంబరంగా ఆనందంగా జీవిస్తూ,అవినీతి పరులైన భర్తలను ప్రోత్సహించే ‘నారీశిరోమణులకు’ పతివ్రత అంటే ఎలా ఉండాలో నిజమైన అర్థం చెప్పిన గొప్ప కథ ఈ ధనత్రయోదశి కథ.

దీనితో పాటు‘దంపతుల ప్రధమ కలహం కథ హిందూ సుందరి 1902 లో ప్రచురితమైంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా జీవించాలని, కుటుంబం మొత్తం సామరస్య పూర్వక వాతావర ణాన్ని కల్పించుకోవాలని తెలియజెప్పే కథ.

“నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహ మాడుట వలనను భర్తకు దాసినగుదునా యేమి” … అనే తీవ్రమైన వాక్యాలతో మొదలైన ఈ కథ బహుశా అప్పుడు ఒక సంచలనమే కలిగించి ఉంటుంది. స్త్రీ ధిక్కార స్వరం నాటి రచయితలకు కర్ణ కఠోరంగా ఉండి వుండొచ్చు.

ఇవే కాక ఆమె కలం నుండి సంచలన కథలుగా వెలువడ్డాయి. గుణవతియగు స్త్రీ (తెలుగుజనానా, 1901 మే), లలితా శారదులు, జానకమ్మ (తెలుగు జనానా, 1902 మే), దంపతుల ప్రథమ కలహము (హిందూసుందరి, 1902 జూన్), సత్పాత్ర దానము (హిందూసుందరి, 1902), స్త్రీవిద్య (హిందూసుందరి, 1902), భార్యా భర్తల సంవాదము (హిందూసుందరి, 1903 జూలై), అద్దమును సత్యవతియును (హిందూసుందరి, 1903), బీద కుటుంబము (సావిత్రి, 1904), ప్రేమ పరీక్షణము (1898 ), ఎరువుసొమ్ము పరువు చేటు (1898) ఇంతదాకా అలభ్యంగా వుండిన ‘ప్రేమా పరీక్షణము’, ‘ఎఱువుల సొమ్ము బఱువుల చేటు’ అనే రెండు కథలు సంగిశెట్టి శ్రీనివాస్కు లభించాయి.

అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు) (చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నాయి.)

క్రోషో అల్లిక మీద పుస్తకం,ఊలు అల్లిక మీద పుస్తకం,ఒక శతకం కూడా రాసారని అంటారు కానీఇంకా మరుగున పడే ఉన్నాయి.

“నూరేళ్ళ పంట” కథా సంకలనంకి ముందు మాట రాస్తూ భార్గవీరావు” 1902 లోనే బందరులో తొలి మహిళా సమాజాన్ని (బృందావన స్త్రీ సమాజాన్ని) స్థాపించిన అచ్చమాంబ గారు మొదటి రచయిత్రి అని గర్వంగా చెప్తూ, వారి రచన “స్త్రీ విద్య”ను మొదటి కథగా వేసుకున్నాము. గురజాడ వారి దిద్దుబాటు మొదటి కథ అనుకోవడం పొరబాటని సవినయంగా మనవి చేస్తున్నాము” అని నిర్ధారించారు.

హిందూ సుందరి పత్రికలో 1902 నవంబర్లో అచ్చైన అచ్చమాంబ కథ ధన త్రయోదశిని వివరిస్తూ ప్రముఖ స్త్రీవాద పత్రిక భూమిక సంపాదకీయంలో కొండవీటి సత్యవతి -” తెలుగు సాహిత్య చరిత్రలో ఆ నాటి రచయిత్రులకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. తెలుగులో తొలి ఆధునిక కథ రాసిన భండారు అచ్చమాంబకు జరిగిన అన్యాయం గురించి కె. లలిత బయటపెట్టే వరకు ఎవరికీ తెలియదు” అన్నారు. కథానిలయం ట్రస్ట్ 2008లో తొలి తెలుగు కథలు – ఏడు అభిప్రాయాలు అనే పుస్తకంలో అచ్చమాంబ కథలను ప్రచురించింది. అందులో మొదటి రెండు కథలు 1902 లోనే అచ్చమాంబ రాసిన “ధన త్రయోదశి”, “స్త్రీ విద్య”.

దిద్దుబాటు, ధన త్రయోదశి రెండు కథలలోనూ కథాంశం భర్తను సంస్కరించడమే. అయితే ధనత్రయోదశి కథను తొలి కథగా అంగీకరించక పోవడానికి కారణాలు రెండు అని చెబుతున్నారు. ఒకటి గ్రాంథిక భాష. రెండు ఆధునిక కథకు ఉండాల్సిన లక్షణాలు లేవు. అయితే గురజాడ దిద్దుబాటు కథను మొదట గ్రాంథిక భాషలో రాసి తర్వాత సరళ గ్రాంథికంలోకి మార్చినట్టు తెలుస్తోంది. రెండో దానికి వివరణ – 19 శతాబ్దంలో “కథ” ఒక సాహిత్య ప్రక్రియగా ఏర్పడి, కొన్ని లక్షణాలు స్ధిరపరచుకుంటున్న సమయం. అయినా ఎలా చూసినా అచ్చమాంబ కథలు తీసి పారేయాల్సిన అవలక్షణాలు ఏమీ లేవు. కథానిక లక్షణాలన్నీ అమరినదే.అచ్చమాంబ చాలా కథలు 1902 లోనే రాసినట్లు తెలుస్తోంది. కనుకనే కొందరు “స్త్రీ విద్య” మొదటి కథ అనీ, మరి కొందరు ధన త్రయోదశి మొదటి కథ అని ప్రస్తావించారు.
1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాథ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం వ్రాసిన రచయిత్రుల గురించి భండారు అచ్చమాంబ రచనల ద్వారా మనకు తెలుస్తుంది.భర్త ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్ లో ఉండి, తన ముప్పై ఏళ్ళ వయసుకే 1905 జనవరి 18 న మరణించారు. ఆ నాడే స్త్రీ వాద భావాలతో, స్త్రీలకు విద్య ద్వారానే మంచి భవిష్యత్తు అని మనసా నమ్మిన స్త్రీవాద సంస్కర్త, సత్యాన్వేషి. స్త్రీల సంక్షేమం కోసం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.

అచ్చమాంబ నైజాం ప్రాంతంలోని మునగాల సంస్థానంలోని నందిగామలో జన్మించారని, తెలుగులో మొట్టమొదటి రచయిత్రి మాత్రమే కాక “తెలంగాణ తొలి రచయిత్రి ” అని కొందరు అంటారు. అయితే అసలు విషయం ఏమిటంటే నాటి కృష్ణా జిల్లాలోని మునగాల ప్రాంతం నైజాం పరిపాలనలో ఉండేది.

అయితే అచ్చమాంబ తన ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించడంతో తల్లి, సోదరునితో తన సవతితల్లి కొడుకైన కొమర్రాజు శంకరరావు ఉంటున్న నల్లగొండ జిల్లా లోని దేవరకొండ ప్రాంతానికి వచ్చారు. ఏది ఏమైనా ఆమె తెలంగాణ ప్రాంతంలో జీవించిన విషయం నిజమేనన్నది చారిత్రక సత్యం. భర్త ఉద్యోగరీత్యా నాగపూర్, దిలాపూర్ ప్రాంతాలలో ఉండవలసి వచ్చింది.

ఆమె జీవించింది ముప్పై ఏళ్ళు. లోకం పోకడ తెలుసుకునే సరికి ఎవరికైనా పదిహేనేళ్ళు పడుతుంది. మిగిలిన పదిహేనేళ్ళలో ఇంతటి సాహిత్యాన్ని సృజించడం సాధారణ విషయం కాదు. ఆమె రచనా ప్రణాళిలు ఇంకా చాలా ఉన్నాయి. చిన్న వయసులోనే మరణించడం దేశానికి, సమాజానికి, స్త్రీలకు, ముఖ్యంగా సాహిత్యానికి తీరని లోటు. ఆమె తొలి చరిత్రకారిణిగా, తొలి మహిళా చరిత్రకారిణిగా, తొలి కథా రచయిత్రిగా, తొలి స్త్రీ వాద రచయిత్రిగా నిలిచిపోయారు. అతి చిన్న వయసులోనే మరణించక పోతే వీరు మరెన్ని మంచి కథలను సమాజానికి అందించే వారని, ఆ రోజుల్లోనే ఆమె భావాలను పరిశీలిస్తేఇదిఅతిశయోక్తి కాదనవచ్చు.

అచ్చమాంబ భావాలు ఆమె మాటల్లో….

స్త్రీల బుద్ధి పురుష బుద్ధి కన్న మందమనియు, స్త్రీల మెదడు మస్తిష్కము, పురుషులమస్తిష్కము మెదడు కన్న బలహీనమగుటచే దక్కువ తూగుననియు వ్రాయు వ్రాత బక్షపాతము కలదనుట నిర్వివాదమే- స్త్రీలు నైసర్గిక మూఢురాండ్రనుటకంటె బాల్యము నుండియు వారికి విద్యాగంధమే సోకనియ్యనందున మూఢురాండ్రుగా నున్నారనుట మంచిది- చిన్నతనమున బాలురు బాలికలు సమబుద్ధి కలవారుగా నున్నను శాస్త్ర విషయముల బ్రవేశ పెట్టనందున బురుషులు జ్ఞానాధికులును ఎట్టి తెలివిగలదైనను కన్న తల్లిదండ్రులే యామెను పైకి రానీయక మూల మూలల నణగదొక్కుటచే బాలిక మూర్ఖురాలును అగుచున్నవారు. స్త్రీ యభివృద్ధి లేకుండుటకిట్లు మగవారి పక్షపాతమే మూలం కాని మరొకటి కాదు. పురుషులా పక్షపాతమును విడిచిరేని స్త్రీలు విద్యావతులయి భర్తలకర్ధాంగులన్న నామును సార్థకము జేతురు.

స్త్రీలు అబలలనియు, బుద్ధి హీనులనియు వివేకశూన్యులనియు, సకల దుర్గుణములకు -నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన ఈ దోషారోపణములన్నియు నబద్ధములనియు స్త్రీలలో నత్యంత శౌర్యధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితులునూ… బూర్యముండిరనియు, నిపుడున్నారు.

స్త్రీలకు విద్య నేర్పిన యెడలను, వారికి స్వాతంత్య్రమోసగిన యెడలను, వారు చెడిపోవుదురనియు, బతుల నవమానించెదరనియు, గుటుంబ సౌఖ్యమును నాశనము చేసేదరనియు గొందరు మహానుభావులు వక్కాణించెదరు. ఈ యారోపణములన్నియు నిరర్థకములనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూలమగునే కాని దురాచార ప్రవృత్త్యనుకూలము గానేరదనియు స్త్రీ విద్యా స్వాతంత్య్రముల వలన దేశానికి లాభమే గాని నష్టముంగలుగనేరదనియు, స్త్రీ విద్య యత్యంతావశ్యకం.

బాలుడు చిన్నతనమునందెంత మందబుద్ధియైనను వానికైదేండ్లు రాగానే తల్లి దండ్రులు విద్య నేర్పి వానికిగల మాంద్యమును వదిలించి జ్ఞానాభివృద్ధికొరకనేక శాస్త్రములను జదివింతురు…చిన్ననాడు వానికంటే విశేష ప్రజ్ఞ గల వాని యక్క మాత్రము విద్యాగంధమేమియు లేనందున మహా మూర్ఖశిరోమణియై యుండును. ఇట్లు తల్లిదండ్రులు పక్షపాతముచే బురుష సంతతిలోను స్త్రీ సంతతిలోను జ్ఞానమును గురించి మహాదంతరము పడినదే గాని స్త్రీల స్వాభావిక మౌర్ఖ్యము వలన కాదు

మానవ దేహమున కలంకారమయిన విద్యభూషణము వారికి లేకుండ చేసి లోహపు నగలను మాత్రము పెట్టి తమ వేడుక నిమిత్తమయి వారిని తోలుబొమ్మల వలె జేయుచున్నారు. వారిని గృహ యజమానురాండ్రుగా జూడక తమ యుపచారము నిమిత్తమయి దాసులనుగా జేయుచున్నారు. పురుషులు స్త్రీల విషయమున జేసినయిట్టి యన్యాయము వలన స్త్రీలను మూఢురాండ్రనుగా జేసి చెడగొట్టుటయే కాక తామును వారికి తోడిపాటుగా మూర్ఖ శిరోమణులయి జెడిపోవుచున్నారు. ఈ స్థితి యంతయు పురుషుల లోపమువలనను, స్వప్రయోజనపరత్వం వలనను గలుచు చున్నదే కాని స్త్రీల దోషము వలనను మాత్రము గాదు.

తొలినాటి, ఆ నాటి సాప్రదాయ సృంకలాలను తెంచుకుని స్త్రీల సమస్యల పట్ల సమాజానికి అవగాహన కలిగించిన మహిళా మణిని ఆదర్శంగా తీసుకుని ఈ నాటి సాహిత్య లోకం ఎదగాలని ఆశిస్తూమన వీర వనిత అచ్చమాంబ గారికి జోహారులు సమర్పించుకుందాం

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నా బాల్యం గల్లంతైంది

ఇలా పెంచుదామా? The Motherhood