ఓ గురువారంనాడు నేనూ మా వారూ కలిసి షిర్దీ సాయిబాబా గుళ్ళో అన్నదానానికి డబ్బు కట్టడం కోసం మధ్యాన్నం పన్నెండున్నర ఆ ప్రాంతాల్లో వెళ్ళాము. ఆ సమయంలో అక్కడ అన్నదానం జరుగుతోంది. ఆ గుడి కార్యకర్తలు మేము వచ్చినపని చెప్పగానే కొంచెం ఆగండి…ఈ అన్నదాన కార్యక్రమం అయిపోగానే మీ దగ్గర డబ్బు కట్టించుకుంటాము. అప్పటివరకూ కావాలంటే మీరుకూడ వాలంటీర్లుగా అన్నం వడ్డించవచ్చు అని చెప్పారు. అంతటి మహద్భాగ్యం మాకు లభించినందుకు ఆనందంగా వెంటనే ఒప్పుకుని మేము కూడ వడ్డనలో పాలుపంచుకోనారంభించాము. నేను సాంబారూ మా వారు అన్నం వడ్డిస్తున్నాము. ఇంతలో నా ప్రక్కాయన కసురుకుంటూ మరీ వడ్డిస్తున్నాడు. ఏమనంటే….” ప్లేటు సరిగా పట్టుకోండి..ప్లేటుకుడా సరిగా పట్టుకోలేని దరిద్రులంతా తయారయ్యారు…మీ మొహాలు చూస్తే మాకుకూడ దరిద్రం చుట్టుకునేటట్లు ఉంది…ఊ సరిగా పట్టుకోండి అంటూ ఒకటే కసురుకుంటున్నాడు. ఆ మాటలు విన్న నా మతిపోయింది.
నిజానికి వడ్డిస్తున్నది ఆయన సొమ్మేం కాదు. ఎవరో దాతల డబ్బుతో గుడి యాజమాన్యం మానవతా దృష్ట్యాచేస్తున్న మహత్కార్యమది. వడ్డనకు గుళ్ళోవాళ్ళకి వీలుకాక వాలంటీర్లని నియమించారు. ఆయనకాపని అంత కష్టంగా ఉంటే ఆ పనికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అంతేకానీ పేదలను పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా అవాకులూ చవాకులూ మాట్లాడడానికి ఆయనకు ఏం హక్కుంది? నిజమే వాళ్ళు ఆర్ధికంగా దరిద్రులే…కానీ నీది మానసిక దారిద్ర్యమే…! మనసులో అంత నీచ భావనలు పెట్టుకుని ఆయనను ఎవరు రమ్మన్నారు వడ్డించడానికి..! నిజంగా ఆ దరిద్ర నారాయణులను చూస్తుంటే నా హృదయం జాలితో ద్రవించింది. భాగ్యవంతులుగా పుట్టడంగానీ లేక దరిద్రులుగా పుట్టడంగానీ మన చేతుల్లో ఉందా? ఆలోచించాలి…!
నీవు చేసే ప్రతీ పనినీ భగవదార్పణ బుధ్ధితో చేయమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. అందుకే ముఖ్యంగా మనం ఎవరికైనా దానం చేస్తున్నప్పుడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనుకోవాలని చెప్పబడింది. అంటే అంతా ఆ భగవంతుడి సంకల్పమే నాదేం లేదు అన్న వినమ్ర భావం కలిగి ఉండాలన్నదే దీని ముఖ్యోద్దేశ్యం….! ఈ సంఘటన నిజంగా మనందరికీ ఓ కనువిప్పులాంటిది. బీదలపట్ల, దరిద్ర నారాయణులపట్ల దయాకరుణలతో వ్యవహరించాలనీ, లేనిచో మనం పశువులతో సమానమని నాకనిపించిందాక్షణం.