జరిగిన కథ:
(అర్జున్ సుభద్ర, కూతురు స్పూర్తి, కొడుకు అభిమన్యు కోరిక మీద అమెరికాకు బయిలుదేరుతారు. అర్జున్ ఎక్కడైనా, ఎవరికైనా ఇబ్బంది కలుగుతోందని అనిపిస్తే వారు అడగకపోయినా వారికి సహాయము చేయటము అలవాటు. అన్యాయాన్ని సహించడు. దాని వలన కొన్ని సార్లు తను ఇబ్బందులలో కూడా పడుతుంటాడు. అతని స్వభావము తెలిసిన పిల్లలు కొంచం జాగ్రత్తగా ఉండమని, అనవసరంగా ఎందులోకీ వెళ్ళవద్దని హెచ్చరిస్తారు. కానీ నేను ఫౌజీని (మిలిట్రీవాడిని) అట్లా చూస్తూ ఊరుకోలేను అంటాడు అర్జున్. మొత్తానికి మినియాపోలీస్ కొడుకు ఇంటికి చేరుతారు. ఒక వారం తరువాత కొద్దిగా ఎండ వచ్చిందని వాకింగ్ కు వెళుతారు సుభద్ర, అర్జున్. దారిలో కనిపించిన కుందేలు, జింక, తాబేలును చూసి పరవశించిపోతుంది సుభద్ర. పార్క్ లో కొంతమంది భారతీయుల సమూహము కనిపిస్తుంది. వారితో కలుస్తారు. వారి పార్టీలో చేరుతారు. అక్కడ ఉన్నపటేల్ అనే అతని ద్వారా అమెరికన్సీనియర్ సెంటర్స్ గురించి తెలుస్తుంది. వీళ్ళు కూడా అక్కడికి వస్తామని పటేల్ కు చెపుతారు.
ఇక చదవండి)
-3-
పొద్దున పదకొండు గంటలకు అర్జున్ , సుభద్రలను శశి అక్కడి సీనియర్ సెంటర్ కు తీసుకెళ్ళింది. దారి పొడుగూతా రోడ్ కు ఇరువైపులా పొడవాటి చెట్లు, అక్కడక్కడ చిన్న చెరువులు చాలా అందంగా కనిపించాయి.
“ఇంత ఖాళీ స్థలం మన దగ్గర ఉంటే ఎప్పుడో ఎన్ని అపార్ట్మెంట్స్ లేచేవో” నవ్వుతూ అన్నాడు అర్జున్.
అక్కడక్కడా అడపాతడపా కార్ లు, ట్రక్ లు కనిపిస్తూ, ఖాళీగా ట్రాఫిక్ లేని రోడ్ ను చూస్తూ “రోడ్ ఇంత ఖాళీగా ఉంటే నేను హాయిగా డ్రైవింగ్ నేర్చుకునేదానిని” అంది సుభద్ర.
“నీకోసం రోడ్ ఖాళీగా ఉంచలేదని డ్రైవింగ్ నేర్చుకోలేదా నువ్వు?” తమాషా చేసాడుఅర్జున్.
ఊఊ… అని మూతి ముడిచింది సుభద్ర. “ట్రాఫిక్ లేదని అనుకోకండి ఆంటీ. వీక్ డేస్ కాబట్టి ఖాళీగా ఉంది. వీకెండ్స్ లో అవుతే బంపర్ టు బంపర్ ఉంటాయి” అంటూ కార్ ను సీనియర్ సెంటర్ లోకి తిప్పింది శశి.
కార్ దిగి చుట్టూ చూసారు. కొన్ని కార్ లు పార్కింగ్ ఏరియాలో వరుసగా ఆగి ఉన్నాయి. ఎదురుగా మెట్లు, లోపలికి దారి గ్లాస్ డోర్ లో నుంచి కనిపిస్తోంది. మెట్ల ముందుగా రంగురంగుల పూలు గుత్తులుగుత్తులుగా పూసి, అందంగా ఉన్నాయి. ఎక్కడా చిన్న చప్పుడు వినిపించటం లేదు. ఆ నిశ్శబ్దంగాఉన్న వాతావరణానికి కొంచం బెదిరినట్లుగా అర్జున్ చేయి పట్టుకుంది సుభద్ర. ఇంతలో శశి కార్ పార్కింగ్ ప్లేస్ చివరలో పార్క్ చేసి వచ్చి, “పదండి అంకుల్” అని ముందుకు దారి తీసింది. లోపల పెద్ద వరండా, దానికి అటూ ఇటూ గదులున్నాయి. వరండా చివర కిందికి మెట్లు ఉన్నాయి. గ్లాస్ డోర్ పక్కనే ఉన్న చిన్న కాబిన్ లో ఒకతను కూర్చుని కంప్యూటర్ చూస్తున్నాడు. శశి అతనిని చూసి “హాయ్” అని పలకరించింది.
అతను తల తిప్పి ఏమిటన్నట్లు చూసాడు.
“నా పేరు శశి. వీళ్ళు మా ఇన్లాస్, అర్జున్, సుభద్ర. ఇక్కడ చేరాలని వచ్చారు. దయచేసి ఎవరిని కలవాలో చెప్పగలరా?” అడిగింది.
“హాయ్ నా పేరు జాన్. ఇక్కడ రిసెప్షనిస్ట్ గా చేస్తున్నాను. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను” అని కంప్యూటర్ దగ్గర నుంచి లేచి వచ్చాడు.
“గ్లాడ్, మీరు మా సెంటర్ లో చేరేందుకు వచ్చారు. చాలా సంతోషం. రండి మీకు సెంటర్ చూపిస్తాను” అని అర్జున్ కు, సుభద్రకు షేక్ హాండ్ ఇచ్చాడు.
అర్జున్ అతనిని వివరాలు అడుగుతూ, ముగ్గురూ అతనిని అనుసరించారు. అతని రూం ఎదురుగా పెద్ద హాల్ లా ఉంది. అందులో చాలా టేబుల్స్ వేసి ఉన్నాయి. ఆ టేబుల్స్ ముందు నలుగురు చొప్పున కూర్చొని కార్డ్స్ ఆడుతున్నారు. ఆ పక్కన కూడా ఒక హాల్ ఉంది. అందులో ఒక టేబుల్ మీద కొన్ని బ్రెడ్, కేక్, పేస్ట్రీ పాకెట్స్ పెట్టి ఉన్నాయి. ఓ పక్కన కాఫీ మిషిన్, పేపర్ కప్స్ ఉన్నాయి. రెండుగుండ్రని టేబుల్స్,వాటి చుట్టూ నాలుగేసికుర్చీలు వేసి ఉన్నాయి. అక్కడ ఒకతనుకూర్చొని, కాఫీ తాగుతూ, పుస్తకం చదువుకుంటున్నాడు. వీళ్ళను తలెత్తి చూసి “హాయ్” అని మళ్ళీ పుస్తకం లో మునిగిపోయాడు.
“ఆ పెద్ద హాల్ లో ఇప్పుడు బ్రిడ్జ్ కార్డ్స్ గేం ఆడుతున్నారు. ఈ హాల్ లో కాఫీ, స్నాక్స్ ఉంటాయి. కాఫీ ఫ్రీ. మీరు ఎన్ని సార్లైనా కలుపుకొని తాగవచ్చు. ఆ పేస్ట్రీలూ అవీ ఒకావిడ చేసుకొచ్చిఅమ్మకానికి పెట్టింది. ఆవిడకు సహాయం చేయాలనుకున్నా, ఇంట్లో తయారు చేసినవి, ఆరోగ్యకరమైనవి అని అనుకున్నా మీరు కొనుక్కోవచ్చు. ఇటు వైపు ఉన్న రూంస్ లలో ఒకదానిలో పోకర్ కార్డ్స్ ఆడుతున్నారు. రండి చూద్దురుగాని” అని తలుపు దగ్గరగా వేసి ఉన్న ఒక గది దగ్గరకు తీసుకెళ్ళి, తలుపు కొద్దిగా తీసాడు. ముగ్గురూ లోపలికి చూసారు. అక్కడంతా ఆడవాళ్ళే ఆడుతున్నారు. ఓసారి తలెత్తి చూసి,హాయ్ అన్నట్లు చేయి ఊపి,మళ్ళీ ఆటలో పడిపోయారు. తలుపు దగ్గరగా వేసి, కిందికి తీసుకొచ్చాడు వాళ్ళ ముగ్గురినీ జాన్. అక్కడా పెద్ద హాల్, కొన్ని గదులు ఉన్నాయి.
“ఇక్కడ యోగా, జుంబా డాన్స్ క్లాస్ లు జరుగుతాయి” అని చెప్పాడు. అదంతా తిరిగి చూసి, మళ్ళీ పైకి అతని కాబిన్ కువచ్చారు. అక్కడ పక్కన చిన్న బుక్ రాక్ నుంచిఒక బుక్లెట్ తీసి ఇస్తూ, “ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు సెంటర్ తెరిచి ఉంటుంది. శని, ఆదివారాలు సెలవు. రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. మీరు దేనిలో నైనా చేరవచ్చు. ఇప్పుడే సమ్మర్ మొదలయ్యింది కదా, ఒక రోజుమూన్ లైట్ డిన్నర్ కూడాఉంటుంది. నెలకొకసారి సిటీ టూర్స్ కు తీసుకెళుతాము. మీకు ఆసక్తి ఉంటే రావచ్చు. వాటికి మటుకు డబ్బులు తీసుకుంటాము. సెంటర్ లో చేరేందుకు ఫీజ్ ఏమీ లేదు. ప్రతినెలా ఈ బుక్లెట్ లో ఈనెల కార్యక్రమాలు ప్రింట్ చేసి, పబ్లిష్ చేస్తాము. మెంబర్స్ కు పంపుతాము” అని వివరించాడు.
“ఇక్కడకు వచ్చేందుకు ట్రాస్పోర్ట్ ఏర్పాటు ఏమైనా ఉందా? లేక మేమే రావాలా?” అడిగాడు అర్జున్.
ఇంకొక చిన్న బుక్లెట్ తీసి ఇస్తూ “ఇది సౌత్, వెస్ట్ ట్రాన్స్పోర్ట్ వారిది. వాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళ కోసం అంటే కొంత ఏరియాలో, సీనియర్స్ కోసమని నడుపుతున్నారు. వారి చార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. వారితో మాట్లాడుతే వివరాలు చెపుతారు. మీరు ఇక్కడ మీ పేరు రిజిస్టర్ చేసుకొని, మీకు కావలసినప్పుడు బుక్ చేసుకొని రావచ్చు. ఇంకా కొంతమంది సీనియర్స్ మీరు ముందుగా చెపితే వాళ్ళ కార్ లో తీసుకొస్తారు. వాళ్ళు ఒక ట్రిప్ కు ఎనిమిది డాలర్స్ తీసుకుంటారు. ఈ సౌత్ వెస్ట్ వాళ్ళ వివరాలు ఇందులో ఉన్నాయి” అని జవాబిచ్చాడు
వీళ్ళూ అతనితో మాట్లాడుతుండగానే పటేల్ వచ్చాడు. వీళ్ళను చూసి హాయ్ అంటూ పలకరించాడు. జాన్ కు థాంక్స్ చెప్పి ఆ రెండు బుక్లెట్స్ తీసుకున్నాడు అర్జున్. పటేల్ కు శశిని పరిచయం చేసాడు.
“ఇక ఈయన కలిసారు కదా అంకుల్. నేను కానీ అభిమన్యు కానీ రెండింటికి మిమ్మలిని తీసుకెళ్ళటానికి వస్తాము. మీరు ఇంటికి వచ్చాక ఈ ట్రాన్స్పోర్ట్ సంగతి చూద్దాం” అని చెప్పి వెళ్ళిపోయింది శశి.
అర్జున్ చెప్పినట్లుగా ముందుగా సుభద్రను పోకర్ రూం కు తీసుకెళ్ళాడు పటేల్. అక్కడ ఒక టేబుల్ దగ్గర ఒకావిడకు సుభద్రను పరిచయం చేసాడు.
“హాయ్! నా పేరు షైనీ” అంది ఆవిడ.
“తనకు ఇంగ్లీష్ వచ్చుకానీ మీ ఆక్సెంట్ ఫాలో అవటం కష్టం. కొంచం చిన్నగా మాట్లాడగలరా ప్లీజ్” అడిగాడు అర్జున్.
“ఓకేనో ప్రాబ్లం. ” అని తన టేబుల్ దగ్గర కూర్చోమన్నట్లు చేయి చూపించింది షైనీ.
సుభద్రను అక్కడ వదిలి పటేల్, అర్జున్ బ్రిడ్జ్ రూం కు వెళ్ళారు.
“నీకు ఆడటము వచ్చా?” అడిగింది షైనీ.సుభద్రను
వచ్చు అన్నట్లు తలూపింది. మిగిలిన ఇద్దరు సుభద్ర వైపు కుతూహలంగా చూసారు. సుభద్రకు లోలోపల బెదురుగా ఉంది. కొంచం వాళ్ళ వైపు బెరుకుగా చూసింది. వాళ్ళు స్నేహంగా నవ్వుతూ వాళ్ళ పేర్లు చెప్పారు. కానీ ఆ బెదురులో వాళ్ళేమి చెప్పారో సుభద్రకు అర్ధం కాలేదు. సుభద్ర అని చెప్పిన పేరు వాళ్ళకు పలకటం రాలేదు. పూర్తి పేరు కాకుండా అందరూ పిలిచే పేరు “సుభా” అని చెపితే కాస్త తంటాలు పడి, ఓకే ఇది ఈజీగా ఉంది అని అందరూ నవ్వుతూ “సుబా, సుబ” అన్నారు. బా కాదు భ అని చెప్పలనుకుంది కానీ ఏదో ఒకటిలే అని విరక్తిగా అనుకుంది. తనకు మాత్రం షేనీ, హెలెన్ అన్నది వాళ్ళ ఆక్సెంట్ కు కాస్త ఇబ్బంది పడ్డాక అర్ధం అయ్యాయి. అమ్మయ్య హెలెన్ ఈజీగానే గుర్తు ఉంటుంది అనుకుంది. తెలిసిన పేరు కావటం తో హెలెన్ వైపు ఆసక్తిగా చూసింది. కొంచం వయసు ఎక్కువగానే ఉన్నట్లు ఉంది. మొహం ముడతలు పడింది. కానీ నవ్వు మొహం. గలగలా ఏదో మాట్లాడుతూనే ఉంది. హెలెన్ అని ఇండియాలో ఒక హిందీ సినిమా నటి ఉంది అని చెప్పాలనుకుంది కానీ వాళ్ళకు అర్ధం అయ్యేట్టుగా ఎట్లా చెప్పాలో తెలియలేదు. షైనీ మధ్య వయసుదానిలా ఉంది. తెల్లగా, చక్కగా ఉంది. నాలుగో ఆవిడ పేరేమిటో అర్ధం కాలేదు. ఆవిడ సన్నగా, నీరసంగా వాలిపోతున్నట్లుంది. ఏదో గొణుగుతున్నట్లుగా మాట్లాడుతోంది. ఓసారి చుట్టూ చూసింది. నలుగురు నలుగురు ఒకొక్క టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. అందరూ సుభద్ర వైపు ఆసక్తిగా చూస్తున్నారు. సుభద్ర వాళ్ళ వైపు చూడగానే స్నేహంగా నవ్వి, చేయి ఊపారు.తనొక్కతే ఇండియన్. ఇండియన్స్ ఎవరూ లేరు. అందరూ అమెరికన్స్ లాగే ఉన్నారు. అందరినీ చూస్తుంటే ఇంతవరకు అమెరికన్స్ ఎవరితో పరిచయము లేదేమో కాస్త వణుకు కూడా వచ్చింది. వాళ్ళు కూడా తన వైపే చూస్తుండటం తో ఇంక గమనించింది ఈ రోజు ఇంత వరకు చాలులే అని అనుకుంటూ కార్డ్స్ చేతిలోకి తీసుకుంది.
కార్డ్స్ ఆడుతూనే మిగితా ముగ్గురు మాట్లాడే మాటలను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మూడో ఆవిడ ఆడుతూనే మధ్యలో ఆపేసి హెలెన్ తో షైనీ తో ఏదో అంటోంది. వాళ్ళ మొహాలు చూస్తుంటే వాళ్ళేదో నచ్చ చెపుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏమిటో సమస్య పాపం అనుకుంది. అలాఅలా మాటలెక్కువ, ఆట తక్కువగా ఓ రెండు గంటలు గడిచాయి. అందరూ లేచి కార్డ్స్, టేబుల్ సద్దేసి వెళ్ళటానికి బాగ్స్ తీసుకున్నారు. ఓ… ఇక్కడ తమ క్లబ్ లోలాగా అన్నీ బల్ల మీద వదిలేసి వెళ్ళరన్నమాట అనుకుంది.సుభద్ర వాళ్ళకు బై చెప్పి బయటకు వస్తుంటే అర్జున్ ఎదురొచ్చాడు. ఇంతలో అభిమన్యు, పటేల్ కొడుకు షరీన్ కూడా వచ్చారు. వాళ్ళను పరిచయం చేసుకొని మళ్ళీ కలుద్దామని చెప్పి వచ్చేసారు.
“ఎట్లా ఉంది డాడ్?” అడిగాడు కార్ డ్రైవ్ చేస్తూ అభిమన్యు.
“బాగానే ఉందిరా. వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదో ఈ బుక్లెట్ ఇచ్చారు. ఇందులో ఉన్నాయి. సుభా నీకెట్లా అనిపించింది? వాళ్ళతో ఏమైనా మాట్లాడావా? పేర్లు అడిగావా?” అడిగాడు అర్జున్.
“బాగానే ఉంది కానీ ముచ్చట్లే ఎక్కువ చెప్పుకుంటున్నారు. మన దగ్గరలాగా ఫాస్ట్ గా ఆడలేదు. చాలా స్లో. పేర్లు అడిగాను. ఒకావిడ పేరు హెలెన్. అదొక్కటే గుర్తుంది. మన వెళ్ళినప్పుడు మాట్లాడినామే పేరుఆ… ఆ… షైనీ, మూడో ఆవిడ పేరు మర్చిపోయాను” జవాబిచ్చింది.
“ఇంటికెళ్ళగానే చిన్న డైరీ ఇస్తాను. ఈసారి వెళ్ళినప్పుడు అడిగి, రాసి పెట్టుకో” అన్నాడు అర్జున్.
“మళ్ళీ ఎప్పుడుంది డాడ్?” అడిగాడు అభి.
“శుక్రవారం రా. ప్రతి మంగళ వారం, శుక్రవారం ఉంది. మంగళవారం పొద్దున 10 నుంచి మధ్యహ్నం రెండు వరకు, శుక్రవారం మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 వరకు ఉంది. లక్కీగా పోకర్ కూడా అప్పుడే ఉంది. ఇంటి కెళ్ళగానే ట్రాన్స్పోర్ట్ లో రిజిస్టర్ చేయి. మీరు పని మానుకొని రానక్కరలేకుండా మేమే వెళుతాము” బుక్లెట్ చూస్తూ అన్నాడు అర్జున్.
“ముందు కొంచం అలవాటు పడండి. తరువాత చూద్దాంలే” అన్నాడు అభి.
మాటల్లోనే ఇంటికి చేరారు.
(సశేషం)