ముగ్ధ మనోహరంగా
రెండు చేతుల నిండా
రంగులు రంగులుగా
చిత్ర కాంతుల తోడుగా
చిరు సవ్వడులు
అతివల అందానికి
మెరుగులు దిద్దే
మెరుపుల లావణీయతలు
పర్వదినాల సంబరమంతా
హరివిల్లుగా మారి
చేతిపై గాజులై విరబూస్తుంది
వాటి హృదయం సుకుమారం
చిరు తాకిడికే భంగపడి
తనువును త్యాగం చేస్తాయి
ముత్తయిదువ చిహ్నానికి
మురిపెంపు సోయగాలు
గలగలల సంగీతాలు
అన్నింటా తమదైన
ఆధిపత్యపు ఆవాసాలు
పసుపు కుంకుమల జతకు
ప్రాణమిత్రులు
అమ్మకానికై
వయసువారీగా
అట్ట పెట్టెల్లో దాగి
తొంగి చూసే
జిలుగు వెలుగులు
సమన్యాయానికి
సమాజం వేసిన
అడ్డుతెర చిల్లులు పడి
దైన్యంగానే ఉంది ఇప్పటికీ
అంతరాలను పేర్చి
అవహేళన చేస్తోంది ఇంకా
శుభ క్షణాలను
కోల్పోయిందని తెలియడానికి
దూరంగా వెలివేయడానికి
ప్లాస్టిక్ వేసుకోవచ్చట!
తప్పొప్పుల నిర్ణయానికి
ఆది గురువెవరో ?
మనసు మాలిన్యాలకు
బోధకుడెవరో ?
కాలాలు మారినా
పెదవి విరుపుల
రంపపు కోతతో
గుండెలోతుల్లో గాయం
స్రవిస్తూనే ఉంటుంది
నెత్తుటి ఊటగా…!!