దశ -దిశ

కథ

దేవులపల్లి విజయ లక్ష్మి.

ఈ శీర్షిక నా స్వీయ సృజన.
ఇందులోని ప్రదేశాలు దర్శించి నవి.

“రత్తాలూ!ఓ రత్తాలక్కా !సీరలేమైనా.ఉన్నాయేందే” అంటూ గుడిసె ముందున్న సిమెంటు తొట్టి లో నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటూ కేకేసింది పోచమ్మ.

“అవు వున్నయిగనీ మూట ఇప్పలేదు అక్కా!ఉతకలే,ఇస్తిరీ సేయలా!రెండు రోజులసందె జొరం.”
అంటూ మూలిగింది రత్తాలు.

“అయ్యో సెప్పకపోతీవి.జరంతలోమంచిగా పప్పుసారు బువ్వ తెస్తా.కుసింతబువ్వతిని డోలో ఏసుకో తగ్గుద్ది. పొద్దుగాలే రోడ్లట్టకు తిరగాలాయే.ఛీ! రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాయెపో!” ఆప్యాయంగా అంటూ తన రేకుల షెడ్డు వైపు వడివడిగా అడుగులువేసింది పోచమ్మ.

ఆ బస్తీలో అన్నీ రేకులషెడ్డులే కాలవకి ఆనుకొని.అక్కడ ఆడమగా అందరూ ఏదో చిన్నాచితకా కూలిపనులు చేసుకుని పొట్ట పోసుకునే వారే.అందరూ ఒకరి కష్టం ఒకరు తెలుసుకుని ఒకరికొకరు ఆదుకునేవారే.అదే ఆ బస్తీ ప్రత్యేకత.
★★★

రత్తాలు చాలా తెలివైనది.కొడుకు రెండేళ్ళవాడని కనికరం లేకుండా యాదయ్య రత్తాలుని వదిలేసి ఓటక్కులాడిని చేసుకొని పోయాడు.ఇదంతా సర్వసాధారణం ఆ బస్తీలో.

యాదయ్య వెళ్లి పోతానన్నప్పుడు గుండెలు బాదుకొని ఏడవలేదు, గొడవపడలేదు రత్తాలు. పంచాయితీ అన్నారు బస్తీలో కొందరు.వద్దన్నది రత్తాలు.తనంటే ఇష్టం లేని మొగోనితొ కాపరం చేసినా చేయకపోనా ఒక్కటే అని మౌనంగా ఉంది.

“రెండేళ్ళ పిల్లోడిని సదివించాల.మంచికొలువులో ఎట్టాల.ఈ మురికికాలవకి దూరం పోవాల”ఇదే పగలూరాత్రి నల్లపోచమ్మ గుడిలో కూచొని ఆ తల్లికళ్ళలోకి చూస్తూ మౌనంగా మాట్లాడేది రత్తాలు.

ఆ సంకల్పంతో భర్త వెళ్ళాక ఇల్లంతా వెతికి అక్కడ ఇక్కడ దాచిన ఒక వెయ్యి పోగేసింది.పోచమ్మని తీసుకుని స్టీలు ఫేక్టరీకి పోయి స్టీలుసామాన్లు కొంది.మరుసటిరోజు ఒక గంపలో స్టీలు సామాన్లు సర్దుకొని.పిల్లవాడిని జోలెలో కూర్చోపెట్టుకొని,”పాత సీరలకు స్టీలు సామాన్లు ఇస్తామమ్మా”, అని అరచుకుంటూ అంటూ వీధి వీధి ఎండనక వాననక తిరిగేది.
మొదట్లో ఎవరోపిలిచి పాతచీరలిస్తే దానికి తగ్గ సామానిచ్చేది.రాను రాను గృహిణులకి రత్తాలు బాగా. అలవాటైంది.జోలెలోని పిల్లడు కూడా కొంత కారణం.పాతచీరలు నాలుగైదుండగానే రత్తాలు దగ్గిర సామాన్లు కొనే వాళ్ళు.కొంతమంది అయితే “ఒసే! రత్తాలు ఈసారి పులిహార పళ్ళెంతేవే అనో లేకపోతే బియ్యం పోసుకునే డబ్బా తెచ్చిపెట్టు” అంటూ డిమాండ్ చేసేవారు.వాళ్ళ డిమాండ్ కి తగ్గట్టు స్టీలు సామాన్లు తెచ్చేది.ఆ ఇళ్ళవాళ్ళు వాళ్ళ పాతబట్టలకి ఏదో ఒకటి వస్తోందని పెద్ద పట్టించుకునేవాళ్ళుకాదు.పైపెచ్చు రత్తమ్మ డిమాండ్ చేసినంత క్యాష్ పెద్దవస్తువులకి ముట్టచెప్పేవారు. అంతేకాదు నువ్వే ఏదో ఒకటి చేసుకో అంటూ బిగుతైన ప్యాంట్లు, చిన్నపిల్లల బట్టలు పడేసేవారు.
“ఓ!అమ్మో! సీరలకైతేనే సామానిత్తా. ఈ పాంటులకి,పిల్లోళ్ళ బట్టలకి నేనేమివ్వా.” అంటూ ఖరాఖండిగా చెప్పేది రత్తాలు .
” ఏదోఒకటి చేసుకోవే!ఇవన్నీ పెట్టే స్థళంలేదుఅన్నీ బిగుతైనవే మా వాళ్ళకి” అంటూ పడేసేవారు రత్తాలుకి.

అప్పడప్పుడూ షెడ్మీద సొరతీగకి కాసిన సొరకాయలు,తొట్టిదగ్గర మల్లెచెట్టుకి పూసిన మల్లెలు ఆఇళ్ళవాళ్ళకి బహుమానంగా ఇచ్చి,వాళ్ళపనిమనిషి రాకపోతె బాసాన్లు తోమి ఆ ఇళ్ళవాళ్ళకి సన్నిహితురాలయిందిరత్తాలు.

సామాన్ల బదులు వచ్చిన చీరలన్నీ తీసి అందులో ఫాల్ ఊడినవి,జరీ చీరలు,కొంచెం చిరిగిన చీరలు విడి విడిగా చేసి బస్తీలో మిషను కుట్టే సీతమ్మ చేత రిపేరు చేయించి వాటిని ఉతికి ఇస్త్రీ చేయించేది.ఆ చీరలు అమ్మకానికి పెట్టేది రత్తాలు.పిల్లల బట్టలు బస్తీలో పిల్లలకి ఉచితంగా ఇచ్చేది. జీన్స్ ప్యాంట్లు కుర్రకారుకి చవకగా ఇచ్చేది.ఈ విధంగా రత్తమ్మ బస్తీలో మంచిపేరు తెచ్చుకుంది. చీరలమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులకి కొంత ఉంచుకుని మిగిలిన దంతా స్టీలు సామాన్లు కని ఖర్చు పెట్టేది.
. ★★★

ఇలా రెండు సంవత్సరాలు కాలంలో కలసి పోయాయి.రత్తాలు కొడుకు సురేసు నాలుగేళ్ళ వాడయ్యాడు.రత్తమ్మకి అసలు కష్టం ఇప్పుడు మొదలైంది.పిల్లవాణ్ణి ఇంట్లో వదలలేదు తను ముందు లాగా పిల్లవాణ్ణి జోలెలో కూర్చోపెట్టుకొని నెత్తి మీద బుట్ట, బట్టల మూటతో మోయాలంటే చేతకావటంలేదు.పోచమ్మ గుడి ముందు కూర్చొని మౌనంగా కష్టం విన్నవించుకునేది.

ఒకరోజు ఒక పెద్ద. గేటుముందాగి “పాతబట్టలకి స్టీలు సామాన్లు ఇస్తా “అంటు గట్టిగా అరచింది రత్తాలు.

లోపలనించీ ఒక నడివయసు ఆయన వచ్చి.” ఇది అనాధాశ్రమం.మేమే వాళ్ళూవీళ్ళు ఇచ్చిన డబ్బు బట్టలు గిన్నెలు తీసుకుంటాం”అంటూ గేటు మూసేసాడు.
మరొకసారి రత్తాలు తిరిగి వస్తుంటే అదే గేటు నుండి చాలామంది పిల్లల సందడి వినిపించి నెమ్మదిగా గేటు తీసుకొని వెళ్ళింది.అక్కడ ఒక ఆజాను బాహుడయిన నలభై ఏళ్ళ వ్యక్తి ముప్పైఐదేళ్ళ స్త్రీ ఆరుబయట పిల్లలని చుట్టూర కూర్చోపెట్టుకునిచదువు చెప్పటం చూసింది.

“అమ్మా ‘అంటూ పిలిచిందిరత్తాలు నెత్తిమీద గంపనేలమీద పెడుతూ.
“ఎవరమ్మా!చెప్పు. ఏంకావాలి? అంటూ ఆప్యాయంగా అడిగింది ఆ స్త్రీ.
“అమ్మా ఈడ అమ్మా అయ్యా లేనోళ్ళేనా నాబోటోళ్ళ పిల్లలుకూడా ఉన్నారా?”అని అడిగింది రత్తాలు.
“నీకు భర్త ఉన్నాడా?ఉంటే ఏం చేస్తున్నాడు”అంటూ అడిగింది ఆస్త్రీ.
‘”లేడమ్మా!ఈ పిల్లగాడు రెండేళ్ళ సందె వదిలేసి ఏరే ఆమెను కట్టుకున్నాడు. ఈపిల్లగాని జోలెలో ఏసుకొని ఈ గంపనెత్తినెట్టుకొని గల్లీలంట తిరుగాడతూ స్టీలుసామాన్ల యాపారం సేసుకుంటున్నా.పోరడు నాలుగేండ్లు అయినాయి. ఎత్తుకోలేను.ఈడా నడసలేడు.మీరు దయెట్టి నా పోరడ్నికూడా ఈపిల్లగాళ్ళతో ఉంచుకుంటే నే సాయంమాపు పిల్లగాన్ని తోలుకు పోతా”అంటూ ఆశగా చూసింది రత్తాలు.

“రత్తాలు!నాపేరు శాంతి.ఈ సార్ నా భర్త.ఈ ఆశ్రమం కేవలం అనాధలకే కాదు. పిల్లలని పోషించుకోలేని ఆశ్రయం లేని మీలాంటి పేదలకి కూడా.ఇక్కడ రైల్వే స్టేషన్లలోనూ వీధుల్లో దిక్కులేక అడుక్కునే పిల్లలని పోలీసులు మాదగ్గర వదిలి పెడతారు.మేము వారికి భోజనం పెట్టి గవర్ననమెంటు స్కూలులో చదివిస్తాము. వాళ్ళు 12వక్లాసు కాగానే ఏదో ఉద్యోగం చూసుకుని బయటకు వెళ్ళిపోవాల్సిందే”. అంటూ చెప్పింది శాంతి.
అమ్మా శాంతమ్మా! నా బుడ్డోడిని జరంత పయోజకుణ్ణి సేయమ్మా బాంచను మీ కాళ్ళుమొక్కుతా” అంటూ ఎంతో దీనంగా శాంతి శాంతి భర్తకాళ్ళు పట్టుకుంది రత్తాలు.
“లే లే రత్తాలు మేమున్నది మీలాంటి వారిని ఆదుకోవటానికే.” అంటూ మేము గవర్నమెంటు వారి సహకారంతో పిల్లలని చదివిస్తాము.అందుకని కొన్ని వివరాలు నీ వేలి ముద్ర కావాలంటూ ఫారమ్ లు తెచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసింది శాంతి.

గుండెలమీద భారం తీరినట్టయింది రత్తాలుకి.
“రేపు తీసుకొచ్చి వదులుతానమ్మా!” అంటూ కాళ్ళకి మొక్కి బుట్టా, మూటా నెత్తిన పెట్టుకుని పిల్లాడిని నడిపించుకుంటూ ఇంటి బాట పట్టింది రత్తాలు. మధ్యలో పోచమ్మ గుడి దగ్గర కాస్సేపు కళ్ళనీళ్ళ”పోచమ్మ తల్లీ నీవే దిక్కు”అంటూ బాధ వెళ్ళపోసుకుంది.

“గేం రత్తాలు!ఇయాల గింత ఆలీసమైనాది?”అంటూ రావులమ్మ పలకరింపుతో ఆలోచనలతో నడుస్తున్న రత్తాలు కి ఇంటికి చేరువయ్యానని గ్రహించింది.

“గౌ అక్కా”అంటున్న రత్తలుని చూసి అమ్మా ఇద్దరొస్తోంందే,ఆకలౌతోందే అంటూ ఏడుపు లంకించుకున్నాడు.”సురేసు ఎక్కడ తల్లి రావులమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటుందో అని.
“ఉండయ్యా బుక్కెడు బువ్వతిని పండదుగాని” అంటూ వంట కుపక్రమించింది.
★★★
అమావాస్య చీకటిని పారద్రోలుతూ సూరీడు అరుణ కిరణాలు నీలిరంగు ప్లాస్టిక్ పరదాలగుండా రత్తాలు ముఖాన్ని తాకాయి.
“అమ్మో తెల్లారిందే!” అనుకుంటూ రాత్రి చద్ది పిల్లవానికి తినిపించి తానింతతిని బుట్ట సర్దుకొని పిల్లవాని చంకనవేసుకుని ఆశ్రమం బాట పట్టింది.

తోవలో కొడుకుని ప్రేమతో “సురేసా నీకు మంచి రోజులొచ్చినాయి పోచమ్మ తల్లి దయవల్ల.నిన్న పోయినాం సూడు ఆ ఆంటీ తావున ఉండు.నేను సామాన్లు అమ్ముకొని సందేళ వచ్చేటప్పుడు నిన్ను కొండుపోతా!”అంటూ రత్తమ్మ పిల్లవానికి సంజాయించింది.
వాడి చిన్న ప్రాణానికి వీధి వీధి ఎండనక వాననక తిరగాలంటే కాళ్ళు నొప్పులు.”అమ్మ అన్న తావున మస్తుమంది దోస్తులున్నారు.” అనుకున్నాడు సురేసు.
ఒక్కటే సురేసుకు అర్ధం అయింది.తల్లి తో నడవక్కరలేదు..
పెద్ద పేచీ లేకుండానే శాంతి దగ్గరున్నాడు సురేసు (సురేష్)
★★★
పిల్లవాడి భారం తగ్గటంతో రత్తాలుకి కొత్త కొత్త ఆలోచనలు ఉత్సాహం పెరిగింది.పక్కనే బండి మీద గాజులు, క్లిప్పులు అమ్ముకునే రాజయ్యని పిలిచింది ఒక చక్క మీద “చీరలు అమ్మబడును.”SAREES FoR SALE “అని రాయించిందితెల్ల పైంట్ మీద నల్లపైంట్ తో 7వక్లాసు వరకూ గవర్నమెంటు స్కూలులో చదివి చదువాపేసిన రాజయ్యతో.చాలా ఏళ్ళుగా రాయటం అలవాటు లేక బ్రష్ పెయింట్ తో రాయటం చాతకాక ఏదో కొక్కిరిగా రాసాడు.రత్తాలు తెలుగులో రాయమంటే తన ఆంగ్ల పాండిత్యం అంతా చూపించి పాపం sarees for sale అని కూడా రాసితన చదువు అక్కరకి వచ్చినందుకు తెగ మురిసి పోయాడు రాజయ్య.
రెండు కఱ్ఱలు పాతి ఆ కఱ్ఱలకు పెయింట్ చేసిన చక్కను మేకులతో కొట్టించింది. ఆ పని చేసినందుకు వద్దంటున్నా రాజయ్య చేతిలో 100 రూపాయలు పెట్టింది ఎవరి కష్టం ఉంచుకోవడం ఇష్టం లేని రత్తాలు.రాజయ్య పిల్లలకి తన దగ్గరున్న బట్టలు ఇచ్చింది.
శుక్రవారం నాడు ఆ కఱ్ఱలకు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరి కాయ కొట్టింది.
ఇంటిముందు తొట్టిలో నీళ్ళునింపింది.
గుడిసె లో మంచి చాప పరచింది.ఒక అట్టపెట్టెలో ఇస్త్రీ చేసిన మంచి చీరలుపెట్టింది.
పిల్లల బట్టలు ఉతికి మడత పెట్టింది.
అమ్ముకోవడానికి వేళ్ళేటప్పుడు ఆశ్రమానికి వెళ్ళి ఆ బట్టలన్నీ శాంతికి ఇచ్చి”అమ్మా నేను పేదదానిని కానీ నాకూ మనసుండాది.అయ్య,,అమ్మ లేని ఈ పోరలని సూత్తాఉంటే మనసు. నొచ్చుకుంటోంది. మీరేమనుకోనంటే ఈ డెస్సులన్నీ వ ఓరికి సరిపోతే ఆరికివ్వండమ్మా!” అంటూ చక్కగా మడతపెట్టిన బట్టల అట్టపెట్టె ఇచ్చింది రత్తాలు.

అన్నీ మంచి రెడీమేడ్ డ్రెస్సులు. ఒక్కటీ చినగలేదు.అన్నీ బిగుతై రత్తాలుకి ఇచ్చి నటువంటివి..శాంతి అభ్యంతరం చెప్పకుండా తీసుకుంది.
బీదరికంలోకూడా సహాయం చేయాలనే మానవతా ధృక్పదానికి శాంతి కళ్ళు చెమరించాయి.

మానవత్వం శాంతి రత్తాలుని మంచి స్నేహితుల్ని చేసాయి.సురేష్ శాంతి పర్యవేక్షణలో మంచి భాష,నడవడిక,తెలుగు ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకుంటున్నాడు.
ఒక్కొక్క రోజు శాంతి “సురేష్ ఇవాళ ఇక్కడే పడుకుంటాడని”ఉంచేసేది.
రత్తాలుది పల్లెటూరి అందం.పెద్దపెద్ద కాటుక కళ్ళు సూటైన ముక్కుకి ముక్కెర.మొరటుగా ఉన్నా తీర్చి దిద్దినపెదాలు.మంచి ఎత్తు ఎత్తుకు దగ్గబలమైన శరీరసౌష్టవం.తిన్నా తినకపోయినా మనిషిలో నీరసం ఉండేదికాదు.తల్లి పోలికలు పుణికి పుచ్చుకున్నాడు సురేష్.
రత్తాలు బోర్డు పెట్టిన వేళా విశేషం పాతచీరల అమ్మకం జోరుగా సాగింది.తొట్టె దగ్గర కాళ్ళు కడుక్కుని గాని ఎవరూ లోనికి రాకూడదు.వచ్చిన వాళ్ళు కూర్చున్నాక అట్టపెట్టెలో చీరలు చూపించేది.
రఫ్చేసిన చీరలు మాత్రం బేరమాడనిచ్చేది.యాభై నించీ వంద వరకూ.
మంచి చీరలు రెండువందలు నించీ రెండువందలయాభై.అన్నీ గార్డెన్సిల్క్ లేకపోతే ఫాన్సీ జరీచీరలు.షాపులో పదిహేను రెండువేలు పలికేవి.నూటయాభైకి షాపులో కొత్తచీరదొరికినా పలచగా ఉండటం ఒకనాలుగు ఉతుకులకి జాలీలయ్యేవి.అందుకని బస్తీలో అందరూ రత్తాలు దగ్గిర చీరలు కొనటానికి ఇష్టపడేవారు.అదీకాక డబ్బులు రెండునెలల్లో తీరిస్తేచాలు.

సాయంత్రాలు పెందలాడే వచ్చి చీరల వ్యాపారం చేసేది.

నెమ్మది నెమ్మదిగా సురేష్ శాంతి దగ్గర మాలిమయ్యాడు.ఇప్పుడు టెంత్ కి వచ్చాడు.ఎయిత్ నించీ తల్లితో బస్తీలోకి వెళ్ళటం మానేసాడు ఎప్పుడో తప్పించి.చదువు వాడికి ప్రాణం.తనకు తల్లి ఉంది.అక్కడ తల్లీ తండ్రి లేని వారంటే వాడికి ఎనలేని ప్రేమ.చిన్న పిల్లలకి స్నానం చేయించటం,అన్నం తినిపించటంతోపాటు వాళ్ళచేత హోంవర్క్ చేయించటం లాంటి పనుల్లో శాంతికి శాంతి భర్త ప్రకాష్ కి తలలలో నాలుకయ్యాడు.
★★★
ఒకరోజు శాంతి రత్తాలు వ్యాపారం గురించి తెలుసుకుంది.
“రత్తాలు! ఎన్నాళ్ళిలా రోడ్లు పట్టుకు తిరుగుతావు ఎండనక వాననక ఇంటిదగ్గిరే ఉండి వ్యాపారం చూసుకోకూడదు.”అందిశాంతి.
శాంతి మాటలు వినంగానే రత్తాలు పడీపడీ నవ్వటం
నవ్వుఎంతకీ ఆపక పోయేసరికి ఉక్రోషంతో శాంతికి కోపం వచ్చింది.
“ఎందుకు నవ్వుతావు? నేను నీవైపు ఆలోచిస్తుంటే.” అందికోపంగా శాంతి.
“అమ్మా!నేను చీరల వ్యాపారం చేయట్లేదు పాతబట్టలకి స్టీలు సామాన్ల వ్యాపారం. అలా అని స్టీలుసామాన్ల వ్యాపారం కాదు.స్టీలుసామాన్లు లేకపోతే బట్టలు రావు.బట్టలు అమ్మకపోతే పైసలు రావు.పైసలు రాకపోతే స్టీలుసామాన్లు గెట్లాకొనేది.ఇంట్లో కూర్చునే యాపారం కాదమ్మానాది.”అంటూ శాంతికి కోపం వచ్చిందని గ్రహించి విడమరచి చెప్పింది రత్తాలు.

ఇప్పుడు శాంతివంతైంది పడీపడీనవ్వటం. తలకొట్టుకుని”ఇంత చిన్న లాజిక్ తనేలా మిస్సయింది. అందుకేనేమో చదువుకున్నవానికంటే చాకలివాడు మేలంటారు”అనుకుందిశాంతి.
★★★
ఒకరోజు సాయంత్రం రెండు శుభవార్తలు వినిపించింది శాంతి రత్తాలుకి.
మొదటిది సురేష్ మంచి పర్సెంటేజ్ తో టెన్త్ పాసయ్యాడు.
రెండవది ఒక పెద్ద అట్టపెట్టె నిండా కొత్తచీరలు.అన్నీ 100,150 రూపాయలకి.హోల్సేల్ లో మంచి చీరలు అతి తక్కువ ధరలో శాంతి ఫ్రెండ్ సూరత్ నించీ తెప్పించుకుంటుంటే రత్తాలుకని శాంతి తెప్పించింది.
“రత్తాలు ఇక మీదట పాతబట్టలకు స్టీలు సామాన్లోయ్అంటూ గల్లీ గల్లీ తిరగద్దు.ఇందులో నాస్వార్ధం కొంచెం ఉంది.ప్రొద్దునే ఆశ్రమానికి వచ్చి బాసాన్లుతోమి ఆశ్రమం ఊడ్చి తుడిచి వాషింగ్ మషీన్లో పిల్లల బట్టలుతికి ఆరవేయి.మధ్యాహ్నం వెళ్ళి నీ వ్యాపారం చూసుకో.నీకు ఆరువేలు జీతం.” ఇప్పుడిచ్చిన బట్టలు ఎడ్వాన్స్ అనుకో”అంటూ ఆ బట్టల పెట్టె అందించింది.
“ఏమంటావు రత్తాలు?నీకు ఇష్టమేనా?అడిగింది శాంతి.
“ఏమంటానమ్మా! అడగకుండా వొరాలిస్తున్న దుర్గమ్మతల్లివి.”అంటూ కాళ్ళమీద పడింది.
★★★
బళ్ళు ఓడలు ఓడలు బళ్ళూ. అవుతాయన్నట్లు రత్తాలు రాత మారిపోయింది. పిల్లవాడు స్కాలర్షిప్ తో ఇంటర్ చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు.ఆశ్రమానికే ఆదర్శం అయ్యాడు. శాంతి వాడి పర్శనాలిటీకి పోలీసు ఉఉద్యోగం అయితే బాగుంటుందని రత్తాలుని అడిగింది.
“నాబిడ్డ కాడు వాడు మీ బిడ్డ.వాడి కి ఏది మంచిదైతే అది చేయండి.”అంది రత్తాలు.
“ఏమంటావు సురేష్?”అంటూ ప్రకాష్ సురేష్ ని అడిగేడు.
“అది చాలా కష్టం కద అంకల్.” అన్నాడు సురేష్.
“నువ్వేమీ ఆలోచించకు.నిన్ను పోలీస్ రిక్రూట్మెంటుకి ప్రిపేర్ చేసే బాధ్యత నాది.నేను ఎక్స్ సర్వీస్ మెన్ ని ” గర్వంగా అన్నాడు ప్రకాష్.
పట్టుదల ,సాధన ఉంటే సాధించలేనిది లేదంటూ ప్రకాష్ గైడేన్స్ లో రిక్రూట్మెంటు లో సెలక్ట్ అయి ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తిచేసుకుని కానిస్టేబుల్ అయ్యాడు సురేష్.
తల్లి కి చీరల వ్యాపారమంటే ఇష్టమని సామాన్యులుండే చోట ముందుషాపు వెనుక ఒకగది కిచెన్ అద్దెకు తీసుకొని చీరల షాపు ఓపెన్ చేయించాడు.
“బోర్డ్ నేనే రాస్తా రత్తాలక్కా!”అన్నాడు రాజయ్య.
“మామా!నీకోదండం.నీబోర్డువంకరటింకర ఒ వానితమ్మడు సొ లా ఉంటుంది”అంటూ ఎక్కిరించాడు సురేష్.
“ఆఁ ! మా సెప్పొచ్చినావు.నేరాసిన బోర్డుతోనే అమ్మ సీరల యాపారం సేసింది.నువ్వుబుడ్డోడుగా ఉన్న సందెనించీ”అంటూ అలిగాడు రాజయ్య.
షాపు ఓపెనింగ్ కి శాంతి ప్రకాష్ దంపతులు వచ్చారు.
రత్తాలు వారికి సురేష్ చేత పూలదండ వేయించింది వారికి బట్టలు పెట్టి కొడుకును “మొక్కరా సురేసు”అంది.
“అమ్మా!సురేసు కాదే సురేష్ అను.గింతమంచి పేరెట్టి గట్ల పిలుస్తవేంటి?”అంటూ తల్లిని కసిరి ముద్దుపెట్టుకున్నాడు.
రత్తాలు షాపుకి
“పోచమ్మ టెక్స్టైల్స్POCHAMMA TEXTILES”
అని పేరు పెట్టింది.
బస్తీని వదిలి షాపులోనే కాపరం పెట్టింది రత్తమ్మ.

పూర్వం రాజుల వైభవ చిహ్నంగా మిగిలిన శిధిలావస్తలో ఉన్నకోటలులా
“చీరలు అమ్మబడును.”SAREES FOR SALE” బోర్డ్ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రత్తాలు ఘన విజయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.

ఏడాది కొకసారి. బస్తీకెళ్ళి మునుపు తన దగ్గిరకొనే దోస్తులకి పసుపు కుంకం కొత్తచీరలిచ్చి తృప్తి చెందుతుంది .బోనాలెత్తి నల్లపోచమ్మకి కొత్తచీర కట్టిస్తుంది.తను చేసేది పెద్దవ్యాపారం కాకపోయినా గొడ్డుఖారం ఉల్లిపాయ నంజుకుని సద్దన్నంతిన్నరోజులు మరువలేదు.ఈ నాడు ఉడుకుడుకు బువ్వతినగలుగుతోంది.కొడుకుని కొలువులో చూడగలగటం అన్నది పోచమ్మదీవెనని గట్టి నమ్మకం రత్తాలుకి.
“దశ మారినా దిశ మరువలేదు “రత్తాలు, సురేష్.వారిచేతనైనంత సేవ ఆశ్రమానికి అందిస్తూ ఆశ్రమం నడిపించడంలో వారూ సభ్యులయ్యారు.
ఓం శాంతి

దెవులపల్లి విజయలక్ష్మి.

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆరుద్ర పురుగులు

బాట