దూది మబ్బుల సంబరం..
తళుకు మెరుపుల ఉత్సవం..
ఆరుద్రలో ఉరుములు
చినుకు పూల జల్లులు
మట్టి
సువాసనలు..
కనువిందుగా
ఆరుద్ర పురుగులు..
మట్టి పూసిన బొట్టు బిల్లలు..
రైతన్నలకు బలం బలగం..
ఆశలదారుల్లో సంబరంగా విత్తులు చల్లి,
హరిత కావ్యం రాస్తున్నడు రైతు
అది సృష్టి చైతన్యం..
జీవకళల ఆవాహనం..
మనసారా మట్టిని
ఆడిన నా చిట్టి పాదాలు..
ఆరుద్రల వెంట మెల్ల మెల్లగా నా
అడుగులు..
పెద్ద పెద్ద అడుగులై పరుగుల వేటలో పట్నం చేరినవి..
బతుకు బాటలో ఆరుద్రరాగం ఆగిపోయిందక్కడే..
ముని వేళ్లతో ఎత్తుకొని లేత బుగ్గకు హత్తుకున్నపుడు..
మెత్తని రాగమేదో నాలో లయమైన అనుభూతి
ఆ వర్ణం ఎంత కాంతివంతమో!
క్రియలెంత శక్తివంతమో!
ఆ జ్ఞాపకాలు ఎంత సుందరమో!
తెలిసిందిప్పుడే..
ఇప్పుడు నాలో
భావోద్వేగాలు
ఉవ్వెత్తున ఎగసిపడినా,
తీరం చేరకుండానే జారిపోతున్నాయి..
తలుపులెన్నో తలుపుకు వస్తున్నా,
తలుపులు బిగించుకుంటుంది నా మనసు..
నా బుజ్జి ఆరుద్ర నేస్తమా!
తొలకరి స్నేహంలో పగడమా!
విశ్లేషించలేను కారణాలు