ముళ్ళను అతికించుకుందేమో పగలు
నయమవ్వని గాయాలతో
కాయానికి వాయనాలిస్తోంది..
నలుపును పులుముకున్న రాతిరి
ఒక్కసారిగా ఒళ్ళు విదిల్చింది
రంగు తూలి బ్రతుకునలుముకుంది ..
సప్తవర్ణాలలో ఒక్కటైనా
లిప్త కాలం కానరావడం లేదు
మాటలతో చేష్టలతో అలసిన
మనసుకు
వెలిసిన క్షణాలు కనులలో నిలిచాయి
నీరై స్రవించేందుకు..
కాలం ఆవిరవుతూనే
నా తోడును తనలో కలుపుకుంది
మోడుగా నన్ను మిగిల్చింది
నిశ్చింత దూరమయ్యాక
జీవితమెంత శాంతినికేతనమైనా
రవి అస్తమించిన పశ్చిమమే..