మెడలో హారంలా ! అలరించే స్టెతస్కోపుతో
తెల్లని కోటుతో నడిచొచ్చే
అపర ధన్వంతరులు మీరు
విలువలు కలబోసిన వైద్యం నేర్చిన విషయ పారంగతులు మీరు
చదువు నేర్పిన సంస్కారంతో ఆదర్శాలు కలబోసిన వైద్య
వేల్పు మీరు
దేహపు దేవాలయాన్ని సదా
రక్షించే అర్చకులు మీరు
ఎక్కే సోపానంలో దిగజార్చే మెట్ల వరుసలుంటాయని నర నరంలో జీర్ణించుకున్న వివేకశూరులు మీరు
వైద్యం భారమై ఛిద్రమైన బతుకుల్లో ఊపిరులూదే ఆశా ప్రదీప్తులు మీరు
స్వస్థత కోసం తపించే
రోగులకు ఔషధాలతో ఊరట
ఇచ్చే సుశ్రుతులు మీరు
నైరాశపు చీకటిలో కుంగిన
మదిలో వెలుగు నింపే నిండు చందమామ మీరు
వ్యక్తిత్వం మూర్తీభవించిన
సేవా తత్పరాయణులు మీరు
హస్తవాసితో అందరినీ మెప్పించి మానవత్వపు శోభలతో అలరారే వైద్య నారాయణలు మీరు
( విలువలతో సేవలందించే
వైద్యులకు అభివాదంతో💐)
(డాక్టర్స్ డే సందర్భంగా)