దొరసాని

ధారావాహికం -36వ భాగం

ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సుధీర్ మొబైల్ రింగ్ అయింది….

ఫోన్ చేసింది తన చిన్నాన్న కూతురు సౌదామిని.

” హలో సౌదామిని!”

” హలో అన్నయ్య! ఎలా ఉన్నారు? వదిన, సౌందర్యలహరి బాగున్నారా!” అని అడిగింది.

“బాగున్నారు ..ఇలా ఫోన్లో అడగటమేనా వచ్చి చూసేది ఏమైనా ఉందా! మొన్న ఫంక్షన్ కి పిలిస్తే రాలేదు అంతకుముందు సీమంతం కోసం పిలిస్తే రాలేదు” అన్నాడు సుధీర్.

” నీకు తెలుసు కదా అన్నయ్య నాకు పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకని ఆ సమయంలో రాలేకపోయాను ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను అందుకే సౌందర్యలహరిని చూడడానికి రావాలనుకుంటున్నాను” అన్నది సౌదామినీ..

” ఎప్పుడొస్తావ్ వచ్చేవారమే బాలసదనం ప్రారంభోత్సవం ఉంది అలాగే మన సౌందర్యలహరి ఫంక్షన్ కూడా అక్కడే.. మీ అందరికీ అమ్మానాన్న ఆహ్వానం పంపిస్తా అన్నారు” అని చెప్పాడు సుధీర్.

” పంపించారు నీలాంబరి అత్తయ్య కూడా అందరికీ ఫోన్ చేసి చెప్పారు అందుకే నేను అక్కడికి రావాలి అనుకుంటున్నాను పెద్దమ్మ వాళ్ళతో వచ్చేస్తాను” అని చెప్పింది సౌదామిని.

” తప్పకుండా రా! బాలసదనం కూడా చూసి తీరాలి.. అలాగే నీలాంబరి అత్తయ్యను కలవాలి ఆమె వ్యక్తిత్వాన్ని చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు” అన్నాడు సుధీర్.

” అలాగే అన్నయ్య!

వదిన ఏం చేస్తుంది ఒకసారి ఫోన్ ఇస్తావా” అని అడిగింది సౌదామిని.

” ఇప్పుడే సౌందర్యను పడుకోబెట్టడానికి లోపలికి వెళ్ళింది రేపు చేయిస్తానులే ఫోన్” అన్నాడు సుధీర్.

” సరే అన్నయ్యా ఉంటాను” అని ఫోన్ పెట్టేసింది సౌదామిని.

అక్కడే ఉన్న నీలాంబరి అడిగింది

” ఎవరు సుధీర్ ఫోన్లో” అని అడిగింది.

” మాబాబాయ్ కూతురు అత్తయ్యా తను మొన్ననే పీజీ ఎగ్జామ్స్ రాసింది పీడియాట్రీషియన్” అని చెప్పాడు సుధీర్.

” అవునా తను ఇంకా ఎక్కడ జాబ్ చేయడం లేదు కదా” అని ఆత్రుతగా అడిగింది నీలాంబరి.

” మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయాయి ఇప్పుడిప్పుడే జాబ్ ప్రయత్నంలో ఉంది” అన్నాడు సుధీర్.

” నాకు ఒక ఆలోచన వచ్చింది సుధీర్ !మరి అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో తెలియదు.. మనకు ఎలాగూ పిల్లల డాక్టర్ అవసరం ఉంది కదా! వేరే ఎవరినో చూడడం ఎందుకు ఈ అమ్మాయి ఇక్కడే ఉండి బాలసదనంలోని పిల్లలందరినీ చూసుకుంటే బాగుంటుంది కదా! తనకి తగినంత ఆదాయం వచ్చేంతగా చూద్దాము” అని అన్నది నీలాంబరి.

” చాలా మంచి ఆలోచన.. సౌదామిని కూడా చాలా మంచి పిల్ల ఓపికస్తురాలు కూడా ..తనకి కూడా ఇలా ఊళ్ళల్లోనే ఉద్యోగం చేయాలని ఉంది” అన్నాడు సుధీర్.

” అయితే ఎప్పుడు మాట్లాడదాం మరి” అని అడిగింది నీలాంబరి.

” ఎప్పుడో ఎందుకు మన బాలసదనం ప్రారంభోత్సవానికి తను వస్తానని చెప్పింది సౌందర్యలహరిని చూడలేదు కదా అలాగే మిమ్మల్ని కూడా కలవాలని తనకు ఎంతో ఉంది అప్పుడు మాట్లాడదాం” అన్నాడు సుధీర్…

దాదాపు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి… దూరంగా ఊళ్ళ నుండి వచ్చే వాళ్ళకి కొందరి ఇళ్ల వాళ్ళను అడిగి వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేశారు…

రేపు ప్రారంభోత్సవం అనగా సుధీర్ తల్లిదండ్రులు వారితో పాటు సౌదామిని వచ్చింది….

వాకిట్లో కారు ఆగగాని వాళ్లు ముగ్గురు కార్ దిగి లోపలికి వస్తున్నారు అప్పుడే సాగర్ ఇంట్లో నుండి బాలసదనంకు వెళ్లడానికి బయటకు వచ్చాడు…

కారు నుండి దిగిన బావగారి తల్లిదండ్రులకు నమస్కారం చేశారు .సౌదామినినీ అలాగే ఆశ్చర్యంగా చూశాడు..

పింక్ కలర్ చుడిదార్ లో విరిసిన గులాబీల ఉంది.. సౌదామిని పెద్ద వాలు జడ ..మొహం నిండా కళ్ళే అన్నట్లుగా ఉన్నాయి .. కొలనులో కలువల్ల కదులుతున్నాయి కళ్ళు… చాలా సాధారణంగా కనిపిస్తుంది ఒక హుందాతనం ఉంది ఆ అమ్మాయి మొహంలో…

కళ్ళు తిప్పుకోలేకపోయాడు సాగర్ .. అది సంస్కారం కాదని తెలిసి తల పక్కకు తిప్పుకొని వాళ్ళను లోపలికి తీసుకొని వెళ్ళాడు…

” సాగర్ ఈ అమ్మాయి నీకు తెలియదు కదూ మా తమ్ముడి కూతురు మొన్ననే పీజీ ఎగ్జామ్స్ రాసి వచ్చింది పీడియాట్రిషన్” అని చెప్పాడు సుధీర్ తండ్రి..

” ఓ అవునా? హలో అండి” అన్నాడు సాగర్..

” నమస్తే” అన్నది మెల్లగా సౌదామిని..

వాళ్లందరూ లోపలికి వెళ్లే వరకు అక్కడే నిలబడి..

” నేను బాలసదనం వైపు వెళుతున్నాను ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూసి రమ్మని అమ్మ పంపిస్తున్నారు” అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు సాగర్.

నీలాంబరి భూపతి బయటకు వచ్చి వాళ్లను సాదరంగా లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు..

నీలాంబరి కాళ్లకు నమస్కరించింది సౌదామిని..

” సౌదామిని కదా! ఇష్టకామ్యాభిసిద్ధిరస్తు” అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంది నీలాంబరి..

చూడగానే ఆ అమ్మాయి అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది..” ఇంత చదువుకున్న ఎంత సంస్కారవంతంగా ఉంది” అని మనసులో అనుకుంది..

” మహీ! మంచినీళ్లు అలాగే కాఫీ తీసుకొని రా!” అని చెప్పింది.

లోపల నుండి అలేఖ్య బయటకు వచ్చి అత్తమామల కాళ్లకు నమస్కారం చేసింది..

” ఎలా ఉన్నావు తల్లి ఆరోగ్యం బాగుందా”! అని అడిగింది అలేఖ్య అత్తగారు.

” బాగుంది అత్తయ్యా! మీరు కాళ్లు కడుక్కోండి సౌందర్యలహరిని ఎత్తుకొందురు కానీ..” అన్నది అలేఖ్య.

సౌదామిని ముందే పరిచయం ఉండడం వల్ల “ఎలా ఉన్నావు సౌదామిని బాగున్నావా” అని అడిగింది..

” బాగున్నాను వదిన సారీ ఏమీ అనుకోవద్దు నేను సౌందర్యలహరిని చూడటానికి రాలేకపోయాను నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల కుదరలేదు” అన్నది సౌదామిని..

” పర్వాలేదులే ఇప్పుడు వచ్చావు కదా కొన్ని రోజులపాటు సౌందర్యలహరి దగ్గరే నువ్వు ఉండాలి” అన్నది నవ్వుతూ అలేఖ్య.

” ఉంటాను వదిన ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి వారం రోజుల పాటు ఉండి వెళతాను అమ్మవాళ్ళు రేపు ఫంక్షన్ టైం కి వస్తామని అన్నారు” అని చెప్పింది…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

మహిళలు క్రికెట్ – Cricketers Pride