(ఇప్పటివరకు: ఆసుపత్రిలో చేర్చిన మైత్రేయి కోలుకున్న తరువాత ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయలేదని తెలుసుకున్న ప్రసాద్ ఊపిరి పీల్చుకున్నాడు. కాంతమ్మ గారు మైత్రేయి ని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళమని సలహా చెబుతుంది. అందుకు అంగీకరించకపోవడంతో మైత్రేయిని తమ ఇంటి కి రమ్మని ఆహ్వానిస్తుంది.)
ప్రసాద్ టైం చూసాడు 10 కావస్తున్నది. రాంబాయమ్మ గారికి చెప్పి ప్రసాద్ హాస్పిటల్ కౌంటర్ కెళ్ళి డబ్బు కట్టేసి వచ్చాడు. ఆ రీసీట్ చూపించగానే హెడ్ నర్స్ డిశ్చార్జ్ ఫామ్ ఫిల్ చేసి డాక్టర్ చేత సైన్ చేయించి తెచ్చిచ్చింది. అది తీసుకొని మైత్రేయి రూమ్ కొచ్చాడు. అప్పటికే రాంబాయమ్మ గారు మైత్రేయిని సిద్ధం చేసేసింది. సెలైన్ ప్రభావం వలన ఆమె యాక్టీవ్ గానే లేచి బయలుదేరింది.
బయటికి రాగానే “ప్రసాద్ గారు ఇంటికెళదామండి, స్నానం చేసి బట్టలు మార్చుకోవాలని ఉంది,” అని అడిగింది.
“అయ్యో అలా ఎందుకమ్మా, నేరుగా కాంతమ్మ గారింటికి వెళదాము. అక్కడే స్నానం చేద్దువుగాని. బట్టలంటావా నా చీర కట్టు కుందువు గానిలే, మీ అమ్మ లాంటి దాన్ని, నీకేమయిన అభ్యంతరమా,”అని సూటిగా అడిగేసింది.
“అయ్యో అలా ఏమి లేదండి. అలాగే వెళదాము”అని తలూపింది.
ఇంతలోకే బయట గేట్ దగ్గర ఆగి ఉన్న ఆటో ని పిలిచాడు ప్రసాద్. రాంబాయమ్మ గారు గంగానమ్మ పేట మహంకాళి గుడి దగ్గరకు అని అడ్రెస్స్ చెప్పి ఆటో ఎక్కి కూర్చుని మైత్రేయి ని కూడా ఎక్కమన్నది. ఆటో బయలు దేరగానే, ప్రసాద్ తన బైక్ మీద ఆటో ని అనుసరిస్తూ కాంతమ్మ గారింటికి చేరుకున్నాడు.
వాళ్లిద్దరూ లోపలకెళ్ల గానే, అతను రాజ్యలక్ష్మి కి ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు. వీలయితే వాళ్ళింటి దగ్గరకు రమ్మని కూడా చెప్పాడు. తరువాత తాను లోపలకెళ్ళాడు. విశాలమయిన హాల్ , పొందికగా అమర్చి ఉన్న సోఫా సెట్ , దాని పక్కనే దివాన్ మంచం , ఒక పక్కనే ఇన్డోర్ ప్లాంట్ కుండి పెట్టి ఉన్నాయి. అక్క డే దగ్గరగా ఉన్న పెద్ద కిటికీ కి దగ్గరగా ఉన్న పడక కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ కనిపించారు ప్రభాకర్ గారు.
ప్రసాద్ ని చూస్తూనే , ”రావయ్యా ప్రసాద్! అంటూ సాదరం గ ఆహ్వానించి, ఆయన కూడా వచ్చి సోఫా లో కూర్చున్నాడు. “నమస్తే సార్! నా పేరు మీకె ల తెలుసు. నన్ను చాల బాగా గుర్తుపట్టేరు!” అంటూ కాస్త ఆశ్చర్యం చూపించాడు.
“అదా ! మా మేడం గారు నాకు ముందే ఫోన్ చేసి చెప్పారు లే, వీళ్ళ తో పాటు నువ్వు కూడా వస్తావని,” అంటూ నవ్వి భుజం తట్టారు. ఇవాళ ఎదో మ్యాచ్ ఉందనుకుంటా, చూద్దామా అంటూ టీవీ ఆన్ చేసారు.
“రమణి రెండు కాఫీ కలిపి పట్టుకురా. అలాగే ఆ అమ్మాయి , రాంబాయమ్మ గారు ఏంచేస్తున్నారో కూడా చూడు,” అంటూ కేకేసి చెప్పారు.
అప్పుడే స్నానం చేసి ఫ్రెష్ గా, హాఫ్ వైట్ నేత చీరలో అందమంటే తనదే అన్నంత అందం గ మైత్రేయి నెమ్మదిగా నడుచుకుంటూ హాల్లో కొచ్చి వాళ్ళకెదురుగా ఉన్న సింగల్ కుర్చీ లో కాస్త బిడియం గ కూర్చుంది.
రమణి మూడు కాఫీ కప్పులతో అక్కడకి వచ్చింది. అప్పుడే ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. “రమణి చూడు ఎవరో” అంటూ కాఫీ కప్పు అందుకున్నాడు ప్రభాకర్ గారు.
“అలాగే నమ్మ అయ్యగారికి చెబుతాను,”అంటూ ఫోన్ పెట్టేసి ”అయ్యా గారు, అమ్మగారు ఫోన్ చేసారు, మిమ్మల్ని ముక్కల పులుసు తయారు చేయమన్నారు, ఇంకో అరగంటలో ఇంటికొచ్చేస్తానని చెప్పామన్నారు.“ అంది కాస్త ముసి మూసి గ నవ్వుతూ.
“ఓహ్ అలాగా! మరి నువ్వు పప్పు, కూరముక్కలు ఉడికించి పెట్టు వచ్చేస్తా,”అన్నాడాయన ఉత్సాహంగా. పొద్దుటే అమ్మగారి చెప్పెల్లారండి. పప్పు కూరముక్కలు ఉడికించాను ,”అంది
“ అవునా ! సొరకాయ గా ని, గుమ్మడి కానీ వేశావా లేదా,” కాస్త దబాయింపుగా అడిగాడు.
“అవును అయ్యగారు, వాటి తో పాటు క్యారెట్ కొత్తిమీర కూడా కలిపి ఉడికించాను, చింతపండు కూడా నాన పెట్టుంచాను. మీరే రావాలి,” అంది.
“అయ్యో! మీరెందుకు సార్! నేను చేస్తాను,”అంటూ లేవ బోయింది, కానీ సంభాళించుకోలేక తూలీ పడబోయింది. వెంటనే ప్రసాద్ , రమణి ఆమెను పట్టుకొని కూర్చోబెట్టారు.
“నన్నే పెట్టమని మా ఆవిడా గారి ఆర్డర్, మీ కెవ్వరికి పర్మిషన్ లేదు, పైగా మా ఆవిడ అంత ప్రేమగా కోరితే చేసి పెట్టలేనా ఏంటి, మీరలా కూర్చొని టీవీ చూస్తుండండి పావుగంటలో వచ్చేస్తాను,”అంటూ “పద రమణి”అని వంటగది వైపుకి వెళ్ళిపోయాడు ప్రభాకర్ గారు.
అప్పుడు హల్లో మైత్రేయి ప్రసాదే మిగిలారు.
“మైత్రేయి నెమ్మదిగ లేచి వచ్చి ప్రసాద్ పక్కనే సోఫా లో కూర్చున్నది. “ప్రసాద్ గారు , నా వలన మీ అందరికి చాలా ఇబ్బంది కలుగుతున్నది . ఎం చేయాలో అర్ధం కావటం లేదు,”అంటూ కాస్త ఆవేదనగా అన్నది.
“అలాగని మీరెందుకనుకుంటున్నారు. మొదటి రోజే మీరు నాకు ఫోన్ చేసుంటే ఆ యోగరాజ్ ఆటలు ఇంతదూరం రానిచ్చేవాడిని కాదు కద . పోనీ మీకు హెల్ప్ చేస్తున్న లాయర్ గారి జూనియర్ రాజ్యలక్ష్మి గారి కయినా చెప్పాల్సింది. అలా ఎందుకున్నారు ఎవరికీ చెప్పకుండా?” నిష్టురంగా అన్నాడు.
“”నాకంత సమయం ఇవ్వలేదండి. వస్తూనే నా మొబైల్ తీసేసుకున్నాడు ఎసై. ఆ తరువాత అ లాగే స్టేషన్ లో రాత్రి దాక కూర్చో బెట్టాడు. ఎందు కు ఏమిటి అనే వివరం ఎవ్వరు ఇవ్వలేదు. నాకేం పాలుపోలేదు. తలకొట్టేసినట్లయింది. అలాగే రెండో రోజు , మూడో రోజు మరీ హద్దులు దాటాడు. ఆ లేడీ కాన్స్టేబులే నాకు కాస్త అండగా నిలబడింది, లేక పోతే ఏమయ్యే దో నేను ఊహించుకోలేక పోతున్నాను.” అంటూ చిగురుటాకులా వణికి పోయింది. అలా ఆమెను చూస్తుంటే మనసంతా జాలితో నిండి పోయిది ప్రసాద్ కి .
ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని సుతారంగ నొక్కి, ”భయపడకండి, ఇప్పుడు మీరు ఒక్కరే కాదు, “ అంటూ చెబుతుండగానే, రాజ్య లక్ష్మి , కాంతమ్మ గారు , సమంత్ లోపలికొచ్చారు,
“మేమంతా ఉన్నాము. నువ్వే మి కంగారు పడకు మైత్రేయి ,” అని అన్నారు కాంతమ్మ గారు ఆప్యాయంగా ఆమె తలనిమురుతూ.
“రమణి , అందరికి మంచినీళ్లు పట్టుకురా’,”అంటూ చెప్పి వాళ్ళ పక్కనే సోఫా లో కూలబడింది కాస్త అలసటగా.
“ఇదిగోండి మేడం,“ అంటూ మంచినీళ్ల గ్లాస్ అందించాడు ప్రభాకర్ ఆమెకి. మిగిలిన వాళ్లందరికీ రమణి ట్రెలో గ్లాస్ లు పెట్టి తెచ్చి ఇచ్చింది. ఆల్చిప్పలాంటి కళ్ళతో ఒక వింత అద్భుతం చూసినట్లుగా చూసింది మైత్రేయి ఆ దృశ్యాన్ని.
రాజ్యలక్ష్మి సుమంత్ ని మోచేతితో పొడుస్తూ, “సుమంత్, నువ్వు కూడా చూసి నేర్చుకో, అలాగయితే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను,” అంది పెద్దగా. అందరు నవ్వేశారు.
“అంటే ! ఇలా మంచినీళ్లు అందిస్తే సరిపోతుందా లేక ఇంకా ఏమైనా చేయాలా,”అంటూ అట పట్టించారు ప్రభాకర్ గారు రాజ్యలక్ష్మి ని.
“అంటే సార్! ఇలా అన్ని రకాలుగా తానూ మగాడిని అన్న ఇగో ని మరిచి , నన్ను తన జీవిత భాగస్వామిగా చూస్తూ , గౌరవించాలి కూడా,అలాగా అయితేనే ఆలోచిస్తాను. మీరేమంటారు మేడం!” అంటూ కాంతమ్మ గారి వంక చూసింది రాజ్యలక్ష్మి.
“అవును! భార్య భర్త అంటే అదే కదా మరి. నేను భర్త ని అన్న అహంకారం అస్సలు ఉండకూడదు.” అన్నారు కాంతమ్మ గారు.
“అలాగే , నేను భార్యని అని ఎప్పుడు తన హక్కుల పోరాటం చేస్తూ, మొగుడి చేత పులుసు పెట్టించే పని మాత్రం చేయకూడదు, ఏమంటారు,” అంటూ కాస్త చిలిపిగా కాంతమ్మ గారి వంక చూసాడు ప్రభాకర్ గారు.
“చెబుతా! పులుసు బాగాలేక పొతే అప్పుడు చెబుతా!,” అంటూ నాటకీయంగ ఆమె కూడా జవాబిచ్చారు. అందరు వాళ్ళిద్దరి మాటలకి మనసారా నవ్వుకున్నారు. ప్రసాద్ కనిపించింది’ఒక పవిత్రమయిన అరమరికలు లేని ప్రపంచంలో ఉన్నట్టుగా. మైత్రేయి అనుకుంది “అమ్మ నాన్న ల మధ్య ఇలాటి ఆప్యాతతో కూడిన సంభాషణ తానెప్పుడూ వినలేదని.”
“కాంతం లేలే! ఆకలి దంచేస్తోంది, భోజనాలు పెట్టు అందరికి ,” అన్నాడు ప్రభాకర్ .“మీరు కూడా రండి,”అంది ఆమె. “నేను పులుసు పెట్టేసాను. డ్యూటీ దిగేసాను. ఇప్పుడు నువ్వే పెట్టాలి మరి. అయినా కాంతం నువ్వే దగ్గరుండి వడ్డిస్తే ఆ రుచే వేరు మరి,” అంటూ “లేవండి అందరు. భోజనం చేద్దాం. ప్రసాద్ , సుమంత్, రాజ్యలక్ష్మి, మీరందరు చేతులు కడుక్కొని రండి. లేకపోతే మీ మేడం, భోజనం వడ్డించరు, అంత డిసిప్లేన్, గెట్ అప్ ..గెట్ అప్ ,” తొందరచేసాడు ప్రభాకర్ .
ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
(ఇంకావుంది )