ఎడారి కొలను 

ధారావాహికం-24 వ భాగం

( ఇప్పటివరకు: మైత్రేయి పూర్తిగ స్పృహకోల్పోయే స్థితిలో ఉండగా, ఆమెను ఆసుపత్రిలో చేరుస్తాడు ప్రసాద్. అది   సూయిసైడేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తాడు డాక్టర్. ప్రసాద్ ఆ మాటని నమ్మలేక పోతాడు. రాజ్యలక్ష్మి, సుమంత్  కూడా ఆసుపత్రికి వస్తారు. రాజ్యలక్ష్మి కాంతమ్మ గారికి మైత్రేయి ఆసుపత్రిలో ఉన్న విషయం చెబుతుంది. కాంతమ్మ గారు తనతో వారి సొసైటీ కార్యకర్త రాంబాయమ్మ గారిని కూడా వెంట తీసుకొచ్చి ఆ రాత్రికి మైత్రేయి ని  చూసుకోమని ఆమెని అక్కడే ఉంచి పోతుంది. ప్రసాద్ పదే  పదే  డాక్టర్ అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ రాత్రంతా.)

ఉదయాన్నే లేచి త్వరగా తయారయి ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళాడు ప్రసాద్. ఎదో ఆందోళన మనసంతా. ఆసుపత్రి ప్రాంగణం లోకి వెళ్ళగానే  కాంటీన్ నుండి కాఫీ కప్ పట్టు కొని వస్తున్న రాంబాయమ్మ గారు కనిపించారు. ప్రసాద్ అటువైపుగా వెళ్లి ఆమెని పలకరించాడు.

“నమస్తే రాంబాయమ్మ గారు. మైత్రేయి గారు ఎలా ఉన్నారు. మెళకువచ్చిందా ఆమెకి?” అంటూ.

“”ఆమెకు తెల్లవారు జాముకల్లా మెలుకువొచ్చింది. డ్యూటీ నర్స్ కూడా చూసింది. ఇప్పుడు సెలైన్ అవసరం లేదని చెప్పారు.  బెడ్ అవసరమయి ఆమెను స్పెషల్ రూమ్ లోకి మార్చారు. ఆ రూమ్స్ కూడా ఎమర్జెన్సీ వార్డ్ పక్కనే. కాస్తంత బలహీనంగా ఉంది. ఏదైయినా తినిపించమన్నారు. ఆమెమొ నాకేమి వద్దు ఒక కప్పు కాఫీ తెచ్చిపెట్టండి, అని అడిగితేనూ నేను ఇలా వచ్చాను.” అని చెప్పింది.

“ఓ, అలాగా!” అంటూ ఆమెను వార్డ్ దగ్గర దింపి , నేను ఆమెకోసం టిఫిన్ తీసుకొస్తాను,” అంటూ పార్కింగ్ వైపు వెళ్ళిపోయాడు. అరగంటలో రెండు ప్యాకెట్ల ఇడ్లీలు , వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేసాడు. ఇంతసేపట్లో రాంబాయమ్మ గారు మైత్రేయి చేత కాఫీ తాగించి కొంచం దిండ్ల సపోర్ట్ తో కూర్చోబెట్టింది.

“హలో మైత్రేయి గారు, గుడ్ మార్నింగ్ , శుభోదయం” అంటూ చిరునవ్వుతో దగ్గరికి వచ్చిన ప్రసాద్ ని చూస్తూనే మైత్రేయికి  ఒక ఆత్మీయుడిని చూసినట్లనిపించింది.

“త్వరగా వేడి వేడి ఇడ్లి లాగించేయండి. మీ కోసం నేను స్పెషల్ గ ఆఫీసర్స్ కాంటీన్ నుండి తెచ్చాను. బాగా నెయ్యి వేసి , కారంపొడి తో తింటేనా ! ఆ రుచే వేరులెండి.” అంటూ గల మాట్లాడేస్తూ ఇడ్లి ప్యాకెట్టు ని తెరిచే ఆమె చేతులో పెట్టేసాడు.

“రాంబాయమ్మ గారు, మీరు కూడా ఆ రెండో పాకెట్ తెరిచి తినండి,” చెప్పాడు.

“అయ్యో నాయన ! నేనట్లా తినలేను. ఇంటికెళ్లి , ఈ ఆసుపత్రి బట్టలు మార్చుకొని స్నానం చేసిన తరువాత గాని నేను తినలేను. కాఫీ తాగానులే నాయన, కాసేపాగి మళ్లి  తననే తినమను . కాస్తంత ఓపిక వస్తుంది.”  అంటూ లేచి నిలబడి,  “ప్రసాదు బాబు, నేను ఒకటికి, రెంటికి పోయొస్తాను గా ని, కాసేపు ఇక్కడే కూర్చో, డాక్టర్ గారు వచ్చే సమయమైంది” అని వెళ్ళిపోయింది.

మైత్రేయిని అలా చూస్తూనే ఉన్నాడు. ఆమె చాలా మౌనంగా తింటున్నది. చక్కనమ్మ చిక్కిన అందమే అనిపించింది అతనికి.

ఆ మౌనం భరించలేక, “ఏంటి మైయిత్రేయి గారు, ఇలా అడ్వెంచర్ మీద అడ్వెంచర్ చేసేస్తున్నారు. ఈసారి చాలా  పెద్ద ప్రమాదమే తప్పి పోయింది. అలా ఎలా చేస్తారు మీరూ?”అంటూ చిరుకోపం చూపించాడు.

“అదే ఎం చేశాను? స్పృహ లేకుండా పడిపోవడమా ?” అంటూ ఎదురుప్రశ్న వేసింది.

“కాదు అన్ని రోజులు ఏమి తినకుండా నిరాహార దీక్ష చేపట్టారు కదా, ప్రాణాలు పోయుండేవి ఇంకొన్ని గంటలు మేమెవరమూ చూడకపోయుంటే..”

“అయ్యో ! నేనేమి  కోరి చేయలేదండి. మనసంతా భారమయిపోయింది. తినాలనిపించలేదు. ఏమైనా తిందామన్న చేసుకోవాలనిపించలేదు. అక్కమ్మ ఉంటె కాస్త కనిపెట్టుకొని ఉండేది. నన్ను నేనే నిర్లక్ష్యం చేసుకున్నాను. రెండో రోజు  ఒకటే మగత. అంతే పడుకుండి  పోయాను. ఆలా ఎంత సేపు పడుకున్నానో తెలియదు. కానీ నాకు ప్రాణం హాయిగా అనిపించసాగింది. ఏ బాధలు, బంధాలు లేని ప్రపంచంలోకి నేను వెళ్ళిపోతున్నట్లనిపించి, లేవాలనిపించలేదు. మీరు తలుపు కొట్టిన శబ్దం ఎక్కడినుంచో వినిపించింది. తరువాత కాస్త లీలగా నా ఇంటి తలుపు ఎవరో కొడుతున్నట్లనిపించి బలవంతంగా లేచాను, తలుపు దాక కూడా ఎలా వచ్చానో మరి!”   అంది బాధగా.

“అమ్మయ్య ! బతికించారు.” అన్నాడు. “మేమందరం హడలి చచ్చాం  కదండీ. మీరోదో ఆత్మ హత్య ప్రయత్నం చేశారని.” అన్నాడు సూటిగా.

“అలా జరిగిన బాగుండేదేమో, ప్రసాద్ గారు,ఎవ్వరికి ఏ సమస్యలు ఉండేవి కావు,”అంది గంభీరంగా.

“అంటే అర్ధమేంటి  మైత్రేయి గారు! మనం పోతేనే సమస్య తీరిపోతుందనుకుంటే ఎలా. ఇలాటి సమస్య మీ ఒక్కరి సమస్య కాదు. ఎక్కడో అక్కడ ఇలాటిదే  కాకపోతే ఇంకోరకమయిన సమస్య కొంచం ఇలాటిదే మరెవరికో ఉంటూనే వుంటుంది. సమస్యకి పరిష్కారం మరణం కాకూడదు కదా. ఎందుకంటే ఏ ఒక్కరి మరణం తోనో ఆ సమస్య తీరిపోదు. కానీ ఎదో ఒక పరిష్కారం కోసం  ప్రయత్నిస్తాం చూడండి అది శాశ్వతం. ఎప్పటికయినా ఎదో ఒక పరిష్కారానికి మార్గమవుతుంది మన ప్రయత్నం. మనం విఫలం కావచ్చు. అయినా  అది పది మంది జీవితాలకి స్ఫూర్తిదాయకమవుతుంది.” అంటూ చెపుతున్నాడు ఆవేశంగా.

ఎప్పుడు రూమ్ లోకి వాచ్ఛారో కాంతమ్మ గారు , పక్కనే  డాక్టర్ కాత్యాయని గారు, వాళ్ళ వెనకాలే రాంబాయమ్మ గారు కనిపించారు. డాక్టర్ కాత్యాయని కి రాజ్యలక్ష్మి  చెప్పటంతో  మైత్రేయి ని చూడటానికి అక్కడకి వచ్చింది.

“వెల్ సేడ్  మై బాయ్! చాలా బాగా చెప్పావు. సమస్యకు చావు పరిష్కారం కాదు. ఆ సమస్యకు సమాధానం  దొరికే వరకు పోరాడవలిసిందే,”అంటూ  మైత్రేయి దగ్గరికి నడిచింది డాక్టర్ కాత్యాయని. కాంతమ్మ గారు అనుసరించారు.

“ హార్ట్ బీట్, పల్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఫుడ్ లేక పోవడం వలన బలహీనం గ ఉన్నది. ఈ వీక్నెస్ ఒక వారం పదిరోజుల దాకా ఉంటుంది. మంచి ఆహరం తింటే నార్మల్ అయిపోతుంది,” అంటూ కొన్ని మల్టి విటమిన్ టాబ్లెట్స్ తన కిట్ లోంచి  తీసి మైత్రేయి కిచ్చింది.

డ్యూటీ డాక్టర్ కూడా వచ్చి ఆమెను చూసి , “కొంచం రికవర్ అయ్యారుకదా మేడం, ఇంటి కేళ్ళి  బాగా విశ్రాంతి తీసుకోండి, మధ్యానానికల్లా డిశ్చార్జ్ చేస్తాను,” అని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్  కాత్యాయని ని గారు కూడా వెళ్లిపోయారు డ్యూటీ టైం అయిందని.

కాంతమ్మ గారు కల్పించుకొని, “మైత్రేయి ఇప్పుడు ఎలాగూ  వెకేషన్ కాబట్టి , మీ ఇంటికెళ్ళరాదు? అమ్మ దగ్గరుంటే ధైర్యం గ కూడా ఉంటుంది ,” అని అన్నది.

“లేదు మేడం, నన్ను ఇంట్లో ఉంచుకుంటే పరువు పోతుందనే భయం తో మా అమ్మ ఇంటికి రావద్దని చెప్పింది. మరి ఇప్పుడెలా వెళ్లి వాళ్ళని బాధపెట్టమంటారు.”

“అది నీ భ్రమ కావచ్చు మైత్రేయి, ఏ  తల్లితండ్రులు కూడా అలా తమ బిడ్డల్ని వదిలేసి ఉండలేరు. ఎదో క్షణిక ఆవేశంలో మాట్లాడతారు తప్ప. ప్రతిదీ తప్పుపట్ట కూడదు. ఒక సారి మీ నాన్నగారికి ఫోన్ చేసి చూడు.” అంటూ నచ్చ చెప్పబోయింది ఆమె.

“ఇప్పుడు కాదు మేడం,” అంటున్న మైత్రేయిని సాలోచనగ చూసి “సరే అయితే, ఒక నాలుగురోజులపాటు మా ఇంట్లో ఉండు. నీకేమి ఇబ్బంది ఉండదు, మాది డూప్లెక్స్  హౌస్. నీకొక సపరేట్ గది  ఏర్పాటు చేస్తాను. ఇంట్లో కూడా ఉండేది మేమిద్దరమే. మాతో పటు రాంబాయమ్మ గారు,” అన్నది.

“మీకెందుకు ఇబ్బంది మేడం,” అంది మొహమాటంగా.

“నాకేమి ఇబ్బంది లేదమ్మా!  ఇంకేమి మాట్లాడకు. పెద్దదాన్ని చెబుతున్నాను విను,” అంటూ  కాస్త గట్టిగానే అనటంతో మైత్రేయి ఎదురు చెప్పలేక అంగీకారంగా తలూపింది.

సంతోషంగ, “రాంబాయమ్మ గారు, మీరు  మైత్రేయి ని తీసుకొని ఇంటికి వెళ్ళండి. నేను ఒక మీటింగ్ అటెండవ్వాలి. అది చూసుకొని వచ్చేస్తాను.”అంటూ  ప్రసాద్ వైపు తిరిగి, “ప్రసాద్ ! ఫార్మాలిటీస్ పూర్తి చేసి వీళిద్దరిని మా ఇంటి దగ్గర దింపాలి.  ఈ రోజు మీరు కూడా మాతో పాటె లంచ్ చేద్దురు గాని,” అని చెప్పి కాంతమ్మ గారు  వెళ్లిపోయారు.

(ఇంకా ఉంది)

 

 

 

 

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“పిల్లలు – ఆర్థికపరిస్థితులు”

కబుర్లు చెప్పే పుస్తకాలు