బాలసదనం ప్రారంభోత్సవానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది… ఏర్పాట్లు అన్ని దాదాపు పూర్తి కావచ్చాయి… చుట్టుపక్కల గ్రామస్తులు మరియు బంధుమిత్రులు అందరూ రావడానికి ఆహ్వానం పంపించారు… రాజకీయపరంగా కొంతమందికి ఆహ్వానం పంపించారు….
రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వారి రక్షణ దృష్ట్యా ఎక్కువ జనం గుమి గూడ కుండా తగిన ఏర్పాట్లు చేశారు…
ప్రార్థన గీతం పాడడానికి ఊళ్లోనే ఉన్న పిల్లలను పిలిపించారు…
కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు
శాస్త్రీయమైన నృత్యాలే కాకుండా ఆధునిక నృత్యాలు కూడా ఏర్పాటు చేశారు… అశ్లీలత లేనిది ఏదైనా కూడా ఆస్వాదించవచ్చు సంగీతమైన నృత్యమైనా! అదే నీలాంబరి ఆలోచన.
తన కుంచెతో స్వయంగా కొన్ని చిత్రాలను గీసింది నీలాంబరి… బోసి నవ్వులతో ఉన్న పిల్లల చిత్రాలు మరియు అమ్మ ఒడిలో సేదతీరుతున్న చిన్నారుల చిత్రాలను లిఖించింది…
అందరికీ ఆరోగ్యకరమైన భోజనం తయారు చేసేలా ప్లాన్ చేసుకున్నారు…
సాయంత్రం నీలాంబరి ,భూపతి అలేఖ్య, సుధీర్ మరియు సాగర్ కూర్చొని సౌందర్యలహరి ఫంక్షన్ కూడా చేయాలని అనుకున్నారు..
అప్పుడే సుధీర్ అన్నాడు..
” మీరు బాలసదనం పిల్లల కోసం నిర్మిస్తున్నారు కదా అందులో ఎందరో పిల్లలు నడకలు నేర్చుకుంటారు అలాగే మన సౌందర్యలహరి ఫంక్షన్ కూడా అక్కడే చేద్దాం !బాలసదనం ప్రారంభోత్సవం మరియు సౌందర్యలహరి ఫంక్షన్ అన్నీ ఒకేసారి జరిగితే మీ సంకల్పం పూర్తిగా నెరవేరినట్లే ఏమంటారు మీరు అత్తయ్యా!” అన్నాడు సుధీర్.
ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి నీలంబరికి…
” నిజమా సుధీర్ నేను వింటున్నది నిజమేనా !నిజంగా నేను ఆలోచించిన విధానంలాగే ఉన్నది నాకు చాలా సంతోషంగా ఉన్నది మరి మీరందరూ ఏమంటారు” అని మిగతా అందరి వైపు చూసి అడిగింది నీలాంబరి.
” మీరు నిర్ణయించడం మేము కాదనడమా! అయినా సుధీర్ ఇంత బాగా ఆలోచించాడు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నాడు భూపతి.
సాగర్ మరియు అలేఖ్య అయితే ఎగిరి గంతేసినంత పని చేశారు..
అయినా కూడా అక్కను ఉడికించడానికి…
” ఏంటక్కా ఫంక్షన్ బాలసదనం ప్రారంభోత్సవంతో కలిపి చేస్తున్నామని ఏమైనా అనుకుంటున్నావా… నీ ఇష్టం నీకు అలా నచ్చకుంటే మన ఇంట్లోనే చేద్దాం” అన్నాడు నవ్వుతూ సాగర్.
” పోరా నీకు ఎప్పుడు వేళాకోళమే నాకు కూడా చాలా ఇష్టంగానే ఉంది నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను” అన్నది అలేఖ్య.
” ఊరికే అన్నాను అక్క నీ గురించి నాకు తెలియదా ఏంటి!” అని అక్క భుజం మీద చేయి వేసి నవ్వాడు.
నీలాంబరికి అనిపించింది “నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంట్లో అందరూ నాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు” అని అనుకున్నది.
ఆరోజు రాత్రి ఉన్నట్టుండి సౌందర్య లహరికి కడుపునొప్పి వచ్చింది.. ఎప్పుడు ఏడుపు ఎరుగని చిట్టితల్లి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది…
అందరికీ భయం వేసింది అలేఖ్య అయితే ఏడవ సాగింది…
నీలాంబరి పాపను ఒడిలోకి తీసుకొని…
” ఒక్కసారి నేను చూస్తాను తర్వాత కూడా పాప ఏడుపు ఆపకుంటే ఊళ్లో ఉన్న పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్దాం” అని చెప్పింది.
సౌందర్యలహరిని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని కడుపు మీద ఇంగువను పొంగించి నూనెలో కలిపి పొట్ట పైన వేసి మెల్లగా మర్దన చేసింది… అలా పొట్ట మీద గుండ్రంగా మర్దన చేస్తుంటే కడుపులో ఉన్న గ్యాస్ బయటకు వెళ్ళిపోయి మెల్లమెల్లగా ఏడుపు ఆపేసింది…
చనుపాలలో ఒక చుక్క జిందా తిలిస్మాత్ వేసి తాగించింది…
కాసేపటికి కడుపు నొప్పి తగ్గి పాప నవ్వుతూ ఆడుకో సాగింది…
ఒక్కసారిగా హమ్మయ్య అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు…
“ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు పిల్లలకు వస్తాయి అలాంటప్పుడు మనము ఇంట్లో పరిష్కరించుకోవచ్చు అలాగే జలుబు చేసినప్పుడు కూడా మందులు వేయకుండా చిన్న చిన్న చిట్కా వైద్యాలతో తగ్గించుకోవచ్చు నీళ్లు మరిగించి అందులో వాము వేసి పిల్లలను గదిలో ఒక మూలన పెడితే ఆ గాలి అంతా వ్యాపించి పిల్లలు పీల్చుకొని శ్వాసకోషాలు శుభ్రపడతాయి ప్రతిదానికి మనము ఇంగ్లీష్ మందులు వేయనవసరం లేదు వాటి వల్ల ఎంతో అనర్థం కూడా జరుగుతుంది” అని చెప్పింది నీలాంబరి.
” అవునమ్మా చిన్నప్పటినుండి ఇంట్లోనే ఒక మెడికల్ షాప్ ఉంది కదా !జలుబు చేస్తే కషాయం కడుపునొప్పి వస్తే మరో కాషాయం ఇలాంటివే కదా నువ్వు ఇచ్చే దానివి మొదటి డాక్టరువు నువ్వే ఇంట్లో” అని చిలిపిగా నవ్వాడు సాగర్..
” ఏంట్రా నా వైద్యాన్ని వెక్కిరిస్తున్నావా!” అన్నది నీలాంబరి.
“మాతా! నీ వైద్యాన్ని నేను వెక్కిరిస్తే బతికి ఇంతోడినై బట్ట కట్టే వాడిని కాదు కదమ్మా మా మంచి అమ్మ కోపం వద్దు తల్లి” అన్నాడు తల్లి దగ్గరికి వచ్చి.
” అందుకే రా నువ్వు ఇంట్లో ఉంటే సందడిగా ఉంటుంది అందరితో ఆడుకుంటావు.. నిన్ను ఆడుకునే ఒక అమ్మాయి వస్తే కానీ నువ్వు చక్కబడవు” అన్నది అలేఖ్య..
” మరి మంచి అమ్మాయిని వెతకొచ్చు కదా!” అన్నాడు సాగర్.
” మంచి అమ్మాయి అంటే పెద్ద లిస్టు రాసుకున్నావా ఏంటి క్వాలిటీస్ గురించి” అన్నది అలేఖ్య.
” అలా ఏం లేదు తల్లులూ! అమ్మ లాగా నీలాగా ఉంటే చాలు… అమ్మో !నువ్వు గయ్యాలివి బావ ఎలా తట్టుకుంటున్నాడో” అన్నాడు సాగర్…
అలేఖ్య లేచి తమ్ముడిని కొట్టడానికి వచ్చింది. ఇల్లంతా ఇద్దరు పరుగులు తీస్తున్నారు…
సుధీర్ అన్నాడు” అలేఖ్య నువ్వు చిన్న పాపవా? నీకు పాప కూడా ఉంది”
వెంటనే నీలాంబరి చెప్పింది “వద్దమ్మా ఇప్పుడే అలా పరుగులు తీయొద్దు శరీరం ఇంకా పచ్చిగా ఉంటుంది కనీసం మూడు నాలుగు నెలలు జాగ్రత్తగా ఉండాలి ”
అలా సరదాగా గడుస్తున్నాయి రోజులన్నీ