టి. యస్. సదాలక్ష్మి

నుదుట సిందూరం ,తెల్ల ఖద్దరు చీర, నిండుగా, హుందాతనం కలగలిసిన స్త్రీమూర్తి . దళిత జాతి ఆశాకిరణమైన ఈమెను అందరూ సదక్క ,సదా లక్ష్మమ్మ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే తొలి తరం తెలంగాణ ఉద్యమకారిణి.

వీరు,1928 డిసెంబర్ 25న బొల్లారం కంటోన్మెంట్ లోని ‘పెన్షన్ పురా’లో దళిత కుటుంబంలో జన్మించారు. గోపమ్మ , కొండయ్య లు ఈమె తల్లిదండ్రులు .మాదిగ ఉపకులమైన మెహతర్ తెగ వీరిది. తండ్రి సఫాయీ కర్మచారి , వైద్యుడు కాగా తల్లి వడ్డీ వ్యాపారి. ఆర్థికంగా కలిగిన కుటుంబంలో ఏడవ సంతానంగా జన్మించారీమె.ఆడపిల్ల అనే లింగ వివక్ష లేకుండా పెరిగారు, చదువు విలువ తెలిసిన తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పించారు . భాగస్వామి తక్కెళ్ళ వెంకటనారాయణ . ఈ దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు.

ఉన్నత విద్యను పూర్తి చేసుకుని నిజాం కళాశాలలో చదివే రోజుల్లో రజాకార్ ల ఆగడాల కారణంగా బొడ్లో కత్తి పెట్టుకొని రోజూ కాలేజీకి వెళ్లేవారట. కో- ఎడ్ అన్న కారణంతో సోదరుడు చదువు మాన్పిస్తే కొంత విరామం అనంతరం మద్రాస్’ క్వీన్ మేరీస్’ మహిళా కళాశాలలో యఫ్.ఏ. చదివారు. తక్కెళ్ళ వెంకటనారాయణ అనే ఉద్యమ నేత తో వివాహం అనంతరం 1944లో మద్రాసులో వైద్య విద్యలో చేరారు. “జీరా కాంపౌండ్” వద్ద షడ్యూల్ కులాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో బి.ఆర్.అంబేద్కర్ ప్రసంగం ప్రభావంతో వైద్య విద్యను వదిలి క్రియాశీల రాజకీయాల్లో చేరారు. బాబు జగ్జీవన్ రాం తో కలిసి పనిచేశారు. స్వ శక్తితో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన నాయకురాలు. కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీ స్పీకర్ గా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఈమెది కీలకపాత్ర . ‘తెలంగాణ ప్రజా సమితి'( టిపిఎస్ )స్థాపించి తనవంతు కృషి చేసిన యోధురాలు. ఉద్యమంలో అన్ని స్థాయిల వారికి ప్రేరణగా నిలిచి ముందుకు నడిపించిన ధీశాలి. “వీర వనితలు – వీర తిలకం దిద్దండి” అనే నినాదంతో ఉద్యమాన్ని ఉధృత స్థాయిలోకి తీసుకు వెళ్లారు. 1969 ఉద్యమ సమయంలో ముఖ్య నాయకులంతా జైళ్ళలో ఉంటే తన బంగారం అమ్మిన డబ్బుతో ఉద్యమాన్ని నడిపించిన సాహసి. ఉద్యమం నాటకీయ పరిణామాల మధ్య ఆగిపోవడంతో విద్యార్థుల బలిదానాలు ఈమెను తీవ్రంగా బాధించాయి.సామాజిక తెలంగాణా ఆవశ్యకతను పలు సందర్భాల్లోగా అభివ్యక్తీకరించేవారు.
దళిత ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమాల్లో వీరిది ప్రధాన పాత్ర .

సదా లక్ష్మి గారు మొదటి అసెంబ్లీలో దేవదాయ శాఖ మంత్రిగా నియమింపబడ్డారు . సనాతన సాంప్రదాయాల్ని నర నరంలో జీర్ణించుకున్న వ్యవస్థలో దళితురాలు ఆ పదవిని అలంకరించడం ఓ సవాలు.ఒక మంత్రిగా ఉండి గుడిలో ప్రవేశం లేక అవమానించబడ్డ సందర్భాలూ ఉన్నాయి. ఎన్ని కష్టాలనైనా భరించి దళితులకు కోసం అహరహం పోరాడుతూ దేవాదాయ శాఖలో రిజర్వేషన్లు ,పురోహితులుగా వారిని ఆలయాల్లో నియమించడం, ఆలయ కమిటీల్లో దళితుల భాగస్వామ్యానికి ఎంతో కృషి చేశారు .

తొలిసారి కామారెడ్డి నియోజకవర్గం నుండి బి. సి. రిజర్వుడ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రెండవ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి దళిత మహిళ.

1974 నుండి 80 వరకు ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్తు సభ్యురాలిగా ఉండి,1982లో తెలుగుదేశం పార్టీ లో చేరి, 2000 సంవత్సరం వరకు కొనసాగి పార్టీ నుండి బయటకు వచ్చి’ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ’ ఏర్పాటు చేశారు. ‘బాబు జగ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్’ వ్యవస్థాపకురాలు.సాంఘిక సంక్షేమం, రెవెన్యూ శాఖల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.’

‘నా జాతి కోసం ఎన్ని బాధలైనా అవమానాలైనా భరించే శక్తి నాకుంది’ అనడంలో అణచివేతపై ఆమె అభిప్రాయం స్పష్టంగా గోచరమౌతుంది. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ, మహిళా సాధికారత ,ఆస్తిత్వ సాధనకై తపించిన అభ్యుదయవాది. దళితుల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేసిన స్త్రీ మూర్తి. సదాలక్ష్మి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయాలని, ఆమె విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కోరారు .
అలాగే సదా లక్ష్మి దైర్యశాలి అంటూ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వెలిబుచ్చారు.

చైతన్యస్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యమైన ఈ స్త్రీ మూర్తిని ముందు తరాల గుర్తుంచుకోవాలంటే ప్రభుత్వాలు ఆమె చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి, ఆమె విగ్రహాల్ని పలు ప్రదేశాల్లో ఏర్పాటు చేసి ప్రాచుర్యం కల్పించడం అవసరం. సదాలక్ష్మి గారి జీవిత చరిత్రకు, శ్రీమతి గోగు శ్యామల గారు పుస్తకరూపమిచ్చారు.

జూలై 24, 2004 సం.లో హృదయ సంబంధమైన వ్యాధితో స్వర్గస్తురాలైన ఈ దళిత
బాంధవికి అక్షరాభివాదమే
మనమిచ్చే నిజమైన నివాళి.

         రాధికాసూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేటి తరం

కొన్ని కాయకూరలుగురించి తెలుసుకుందాము