దొరసాని

దారావాహికం – 34 వ భాగం

తెల్లవారి చాలామంది బంధువులు వెళ్లిపోయారు అలేఖ్య అత్త మామ మరియు నీలాంబరి తల్లి తండ్రి మాత్రం ఉన్నారు…

” నీలాంబరీ! తొట్లె కింద పెట్టిన చెంబుల నీళ్లతో చంటి పిల్లకు స్నానం చేయించాలి. అవి విశేషమైన నీళ్లు” అని చెప్పింది అఖిలేశ్వరి.

” అవునమ్మా నాకు కూడా జ్ఞాపకం ఉంది స్నానానికి ఏర్పాటు చేశాను” అని పాపను తీసుకుని స్నానం చేయించడానికి తీసుకెళ్ళింది నీలాంబరి.

పెరట్లో వరండాలో పీట వేసుకుని కూర్చుని పాపని కాళ్లపై పడుకోబెట్టుకొని చక్కగా నూనెతో మర్ధన చేసి ఆ తర్వాత పిండితో నలుగు పెట్టి స్నానం పోసింది నీలాంబరి… ముందుగా పాపని కాళ్లపై బోర్లా పడుకోబెట్టుకొని ఐదు దోసిళ్ళ నీళ్లతో వీపు మీద అలా తట్టి తర్వాత స్నానం పోసింది తలకు చేయి అడ్డం పెట్టుకొని నీళ్లు పోసి చెవిలోకి నీళ్లు పోకుండా నీళ్లను ఊదేసి చక్కగా తెల్లటి నూలు తువ్వాలలో చుట్టేసి లోపలికి తీసుకొని వచ్చింది.

చక్కని ఎరుపు రంగు నూలు గౌను వేసి బొట్టు కాటుక దిద్ది దేవుడి దగ్గరకి తీసుకెళ్లి నమస్కారం చేయించి తీసుకొచ్చి ఊయలలో పడుకోబెట్టింది నీలాంబరి… తర్వాత మహేశ్వరి వచ్చి ఒక ఇనుప గరిటెలో నిప్పులు తీసుకుని వచ్చి అందులో సాంబ్రాణి వేసి ఉయ్యాల కింద పెట్టింది ఇవన్నీ పసిపిల్లలకు చేసే నిత్య కృత్యమైన పనులు.

ఆరోజు సాయంత్రమే అలేఖ్య అత్తమామలు మరియు నీలాంబరి తల్లిదండ్రులు ఊళ్లకి వెళ్ళిపోయారు…

సాగర్ కి సౌందర్యలహరిని ఎత్తుకొని ఆడించడమే పని అయ్యింది రోజూ మేనకోడలితో ముచ్చట్లు పెట్టుకుంటూ అక్కని ఏడిపిస్తూ సరదాగా ఉంటున్నాడు…

” అక్కా! ఇది అచ్చం నా పోలికే చూడు నన్ను చూసి ఎలా కేరింతలు కొడుతుందో” అన్నాడు సాగర్.

” నీ పోలికలా! వద్దు బాబు నీ అల్లరి భరించడమే చాలా కష్టమైపోయింది మళ్లీ దీన్ని కూడా గడుగ్గాయినీ చేస్తావా!” అన్నది అలేఖ్య.

” ఎంత అల్లరి చేస్తే అంత తెలివిగల వాళ్ళు అవుతారు నీకు తెలుసా” అన్నాడు సాగర్..

” వినే వాళ్ళు ఉంటే అన్ని చెప్తావులే” అన్నది అలేఖ్య.

అక్కడి నుండి అన్నీ వింటున్న నీలాంబరి “తెల్లారిందా ఇంకా మీ అల్లరికి” అన్నది నవ్వుతూ…

అలేఖ్య సుధీర్ మాట్లాడుకుంటున్నారు..

” లేఖా! నేను అమెరికా వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకోవాలి ఇప్పటికే సెలవులు అన్ని అయిపోయాయి వర్క్ ఫ్రొం హోమ్ అడుగుదాం అనుకుంటే ఇప్పట్లో సాధ్యపడదు అంటున్నారు కంపెనీ వాళ్ళు నాకేమో పాపని నిన్ను వదిలి వెళ్లాలని లేదు ఏం చేయమంటావు” అన్నాడు.

” అవునా వెళ్తారా అసలు నాకు ఆ ఆలోచన రాలేదండి.. ఏం ఆలోచిస్తున్నారు?” అని అడిగింది అలేఖ్య.

” అదే ఏమీ తోచడం లేదు ఒకసారి మళ్లీ ఆఫీస్ కి ఫోన్ చేసి ఇంకేదైనా ఆప్షన్ ఉందేమో అడుగుతాను” అన్నాడు సుధీర్.

” సరే అడగండి” అన్నది అలేఖ్య సౌందర్యను చేతిలోకి తీసుకొని…

సౌందర్య లహరి పేరుకు తగ్గట్టుగానే అందంగా ముద్దుగా తయారవుతుంది .
చురుగ్గా కూడా ఉంది అందరికీ పాపతో ఆడుకోవడమే పని… మహేశ్వరి ముందులా పనులు చేయకుండా చేతిలో పని వదిలేసి వచ్చి పాపని ఎత్తుకొని కూర్చుంటుంది..

నీలాంబరి కోప్పడ్డా కూడా భయపడటం లేదు…

” ఆగమ్మా పాప ఏడుస్తుంటే ఎత్తుకున్నాను” అని ఏదో ఒక సాకు చెప్తుంది.

అది అర్థమైన నీలాంబరి చిన్నగా నవ్వుకొని ఊరుకుంటుంది…

మరో రెండు నెలలు గడిచాయి.. సుధీర్ వాళ్ళ ఆఫీస్ వాళ్లు ఒక ప్రాజెక్టు ఇవ్వడం వల్ల అది భారతదేశంలోనే చేసుకోవచ్చు అని చెప్పారు హైదరాబాదు మరియు గోపాలపురం తిరుగుతున్నాడు సుధీర్… సాగర్ కూడా ఇక్కడినుండే పని చేసుకుంటున్నాడు.

బాలసదనం పూర్తి కావచ్చింది… దాని ప్రారంభోత్సవం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు…

ఆ బాలసదనంకి నీలాంబరి చాలా రోజులు ఆలోచన చేసి “నవ్వుల వొడి “అని పేరు నిర్ణయం చేసింది… అందరికీ ఆ పేరు నచ్చింది.

ప్రారంభోత్సవానికి రాజకీయ నాయకులను పిలువాలని అనుకున్నారు అందులో శిశు సంక్షేమ శాఖ మంత్రిని పిలిస్తే ఇలాంటివి చూసి వాళ్లు మరిన్ని నిర్మించడానికి అవకాశం ఇస్తారని ఒక ఆశ… అందులో భూపతి సర్పంచ్ కూడా కాబట్టి వారిని ఇన్వైట్ చేయడం సులభంగానే జరిగింది…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

భారతం యోగ శాల