ఎడారి కొలను 

దారావాహికం -23వ భాగం

(ఇప్పటివరకు: ఎసై యోగరాజు సాయంతో మైత్రేయిని వరుసగా మూడురోజులపాటు పగలంతా  పోలీస్  స్టేషన్ లో కూర్చునేలా చేస్తాడు సుబ్బారావు. ఆ విషయం తెలియక మైత్రేయి చాల కుంగి పోతుంది. క్యాంపునుండి వచ్చిన రోజున కూడా మైత్రేయిని పోలీస్ స్టేషన్ కి తీసికెళ్ళడంతో,రాజ్యలక్ష్మి, సంఘ సేవికురాలు కాంతమ్మ గారి సాయం తో సీఐ తో సహా కదిలించి, మైత్రేయి ని ఇంటికి తీసుకొస్తారు. మరునాడు మైత్రేయి పూర్తిగ స్పృహకోల్పోయే స్థితి లో ఉండగా , ఆమెను ఆసుపత్రిలో చేరుస్తాడు ప్రసాద్. అక్కమ్మ సాయం తో అసలు విషయం తెలుసుకుంటాడు ఒక వీడియో ద్వారా; దాన్నే రాజ్యలక్ష్మి, సుమంత్ కి కూడా చూపిస్తాడు.)    

రాజ్య లక్ష్మి  ఇంటికి ఫోన్ చేసి చెప్పింది “అమ్మ! నా ఫ్రెండ్ ఒకమ్మాయి కి సీరియస్ గ ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించారు. నాకు ఇంటికి రావడానికి లేటవుతుంది,నాకు సుమన్ తోడు ఉన్నాడు లే ఇక్కడ. నన్ను తను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తానన్నాడు. నువ్వేమి కంగారు పడకు ,” అంటూ చెప్పింది.

“అలాగే లేవే! వీలయినంత త్వరగా వచ్చేసేయి,”అంది.

“రాజ్యలక్ష్మి గారు, మీరేమి కంగారుపడొద్దు. అమ్మలందరికి ఇలాటి కంగారు సహజమే కూతుళ్ళ మీద,”   అంటూ ప్రసాద్  నవ్వవేసాడు.

“ప్రసాద్ గారు! మనమీ విషయం కాంతమ్మ గారికి కూడా చెబుదాము. ఎంతైనా పెద్దావిడ కదా ! అవసరమయితే ఆమె కూడా మైత్రేయి కి ఏదొక విధంగా సహాయం చేయొచ్చు. మనకు కాస్త దైర్యంగ ఉంటుంది,” అని వాళ్ళిద్దరి అభిప్రాయం కోసం చూసింది.

“అలాగే! చేయండి! అదే మంచిదనిపిస్తున్నది.” అంటూ తలను అంగీకారంగా తిప్పాడు ప్రసాద్.

రాజ్యలక్ష్మి ఫోన్ కలిపింది.  “హలో!” ఎవరిదో జెంట్ వాయిస్ వినిపించింది.

“నమస్తే సార్ ! నేను లాయర్ వసుంధర గారి అసిస్టెంట్ రాజ్యలక్ష్మి ని మాట్లాడుతున్నాను. మేడం గారితో మాట్లాడాలి. ”

ఆయన పెద్దగా కాంతమ్మ గారు మీకే ఫోన్ అంటూ పిలిచారు. “మీకెన్ని సార్లు చెప్పను నన్ను గారు అని పిలవద్దని. ఆ అలవాటు మానుకోరుకదా” చిరుకోపంతో అంటూ ఫోన్ తీసుకుంది అయన చేతులోనుండి. వారి సంభాషణ అంత  రాజ్యలక్ష్మి కి వినిపిస్తూనే ఉన్నది.

“హలో! ఎమ్మా రాజ్యలక్ష్మి ఇప్పుడు ఫోన్ చేస్తున్నావేమిటీ?” అదిగింది.

“మేడం! మీకొక విషయం చెప్పాలి.”

“చెప్పు. సందేహమెందుకు?”

“నిన్న మనం హెల్ప్ చేసిన  మైత్రేయి మీకు తెలుసుగదా. ఈ రోజు ఆమెను ఎమర్జెన్సీ లో ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఆమె కింకా స్పృహ రాలేదు. ఇరవై నాలుగు గంటల వరకు అబ్సర్వేషన్ లో ఉంచ్చాలని చెప్పారు. మీకీ విషయం చెప్పాలని ఫోన్ చేశాను.”

“ అయ్యో! అలాగా! ఆమెను ఎవరు చేర్పించారు అసుపత్రిలో?”

“ప్రసాద్ మేడం! నిన్న అతన్ని కూడా కలిశారు మీరు. అతను చెబితేనే నాకు మైత్రేయి విషయం తెలిసింది.”

“అలాగా! సరే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను,” అంటూ ఆసుపత్రి అడ్రెస్ అడిగి  ఫోన్ పెట్టేసింది.

అరగంటలో కాంతమ్మ గారి మారుతి కార్ ఆస్పత్రి ముందు ఆగింది. లోపల ఎంట్రీ లోనే లాంజ్ లో కూర్చొని కనిపించారు రాజ్యలక్ష్మి, సుమంత్ మరియు ప్రసాద్.

ఆమె చెకచెకా వాళ్ళ దగ్గరికి చేరింది. ఒక ఫ్లాస్క్  నిండా కాఫీ మరియు ఒక హాట్ కేసులో ఉప్మా పట్టుకొని ఆమె వెనకాతలే వచ్చింది  ఒక నడివయస్కురాలు .

“రాంబాయమ్మ  గారు, ఈ ముగ్గురికి టిఫిన్ పెట్టి కాఫీ ఇవ్వండి,” అని పురమాయించింది.

“మీరు టిఫిన్ చేయండి, మైత్రేయిని చూసొస్తాను,” అని ఎమర్జెన్సీ వార్డ్ లోకి వెళ్ళింది.

ఐదో నెంబర్ బెడ్ మీద శవం ల పడున్న  మైత్రేయి ని చూస్తుంటే ఆమెకు కడుపులో పేగులు మెలేసి నట్లయింది.  కాంతమ్మ గారిని చూడగానే, పరుగున ఆమె దగ్గరికి వచ్చింది నైట్ డ్యూటీ నర్స్,

”మేడం! మీరిక్కడా?”అంటూ.

“అమ్మాయి పరిస్థితి ఏంటి? “అడిగింది.

“పరవాలేదు మేడం! ఇప్పటికి కాస్త పల్స్ నార్మల్ అయ్యాయి. ఇంకా మత్తు గా నే ఉంది. రేపటికి గాని కోలుకోదు. డ్యూటీ డాక్టర్ చెక్ చేశారు కూడా. ఆమెకు ప్రమాదమేమి లేదని చెప్పారు”  అంటూ  వివరించింది.

“ఓహ్ అలాగా! రాత్రంతా కాస్త జాగర్తగా కనిపెట్టి ఉండండి ,”అని చెప్పి బయటికి వచ్చింది.

“ఈ రాత్రికి ఇక్కడ ఎవరు ఉంటారు?”అడిగింది ఆమె. ప్రసాద్ కల్పించుకొని “నేనుంటాను లెండి మేడం,”అన్నాడు.

“ప్రసాద్ నువ్వు  వెళ్ళిపో, ఉదయానికల్లా వచ్చేయి. మైత్రేయి కి ఇప్పుడు ప్రమాదమేమీ లేదు. సెలైన్ రాత్రంతా పెడుతూనే ఉంటామని చెప్పింది నర్స్. ఆమెకు రేపటికి గాని  స్పృహ  రాదని చెప్పింది. మనంకూడా  వెళదాము.  రాంబాయమ్మ గారు ఉంటారు ఈ రాత్రికి ఇక్కడ. ఈమె  మా సొసైటీ కార్య కర్త. తల్లిలాగే చూసుకుంటుంది.”

“రాజ్య లక్ష్మి నువ్వు  బయలుదేరు, ప్రసాద్ మీరు కూడా. నన్ను ఇంట్లో దింపమంటావా ,”అంటూ రాజ్య లక్ష్మి వంక చూసింది.

“పర్లేదు మేడం! నన్ను సుమంత్ దింపుతాడు,”అన్నది. రాంబాయమ్మ గారికి జాగర్తలు చెప్పి వాళ్ళందరి ఫోన్ నెంబర్స్ రాంబాయమ్మకు  ఒక కాయితం మీద రాసిచ్చి వెళ్లిపోయారు. ప్రసాద్ కి వెళ్లాలని లేకున్నా అక్కడ ఉండి  కూడా ఇప్పుడు చేసేదేమి లేదని తాను ఇంటికి బయకు దేరాడు.

వరండాలో లై ట్ వెలుగుతున్నది. గేట్ చప్పుడవగానే పంతులు గారు బయటి కొచ్చి ప్రసాద్ ని పలకరించాడు. “మైత్రేయి కి ఎలా ఉంది ప్రసాద్. ఏ ఆసుపత్రి? ఏ మయింది తనకి. కొద్దీ రోజులుగా చాల పరిస్థితులు ఆ  అమ్మాయిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు బయట పడుతుందో ఏమో?” అంటూ విచారం వెలిబుచ్చాడు.

అంతలోకే రమా దేవి ఊడిన జుట్టుని ముడేసుకుంటూ  బయటికొచ్చి,”ఇదుగో ప్రసాద్! ఈ నెలా కరు కల్లా ఇల్లు ఖాళీ చెయ్యి. నీ వాలకం నాకేమి బాగా లేదు. ఆ పిల్ల క్కూడా చెబుతాను. ఇంటికి రాని. ఇక్కడ అన్ని సంసారులుండే కొంపాయే,” అంటూ రుసరుసలాడి మళ్ళీ లోపలికెళ్ళిపోయింది ఆవలించుకుంటూ.

ప్రసాద్ మౌనంగా వింటూ నిలుచున్నాడు. ”దాని మాటలేమి  పట్టించుకోవద్దు  ప్రసాద్, రేపు మాట్లాడుకుందాము. నువెళ్ళి పడుకో,” అంటూ అయన కూడా ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

ప్రసాద్ కి వాళ్ళ మాటల మీద ధ్యాసే లేదు. కేవలం మైత్రేయి అలా ఎందుకు చేసింది ,”అనుకొంటూ రూమ్ లోకెళ్ళి తలుపేసుకున్నాడు. చాలా సేపు నిదర పట్టలేదు. అవే  ఆలోచనలు.

(ఇంకా ఉంది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కాలమా! వెనుదిరుగవూ !

దొరసాని