ఈరోజు అంతటా
ఎన్నెన్ని సంబరాలో?
ముద్దులు మురిపించి
పట్టుకొని నడిపించి
వ్యక్తిత్వ చిత్రణకు
ప్రేమరంగులు పులిమి
జీవనతీరం చేరికకు
ఎదురీతలను నేర్పి
అరిగిన భుజాల చాటున
మమకారాన్ని దాచిన
తండ్రి కోసం
అక్షరార్చనలు
దుఃఖపాతం
నా గుండె లోతుల్లోని
పసివయసు గురుతులను
ఎగిసి చిమ్ముతోంది
ఊహ కూడా సరిగా రాలేదేమో!
సరిగమలు పలికించిన
ఆ జంటస్వరం
సాగిపోయింది గాలివాటుగా
హార్మోనియం మరుగున దాగి
అటకెక్కింది ఒంటరి వేదనగా
తెగిన నా నాద తంత్రులు
గొంతులో దాక్కున్నాయి నిస్వనంగా
క్రమశిక్షణ సిద్ధాంతంగా
కర్తవ్యదీక్ష ప్రమాణంగా
విలువలు నేర్పిన బోధకుడు
గంభీర గాన స్వరయుతుడు
సంగీత సాహిత్య సంయోగంలో
నిరంతర చైతన్యశీలుడు
నా గాన కౌశలం కోసం
తపించిన పిపాసితుడు
ఓ నాలుగున్నర దశాబ్దాల కాలం
వెనక్కి మరలితే బాగుండు!
వడలిపోని ఆ దరహాసాన్ని
అందమైన ఆ అపురూపాన్ని
అరుదైన ఆ కళానిధిని
పట్టి బంధిస్తా
నా చేయి వీడకుండా
కాలునికి అందకుండా !!