నిష్కృతి

కథ

దేవులపల్లి విజయలక్ష్మి

“బావగారు! కొంచెం వ్యవధి ఇవ్వండి. వైశాఖం లో ముహూర్తాలు పెట్టుకుందాం.అప్పటికి రబీ పంట చేతికొస్తుంది. ఈ ఏడాది అకాల వర్షాలవల్ల పంటంతా నీటి పాలై పోయింది. కనీసం విత్తుల ఖరీదైన వచ్చేట్టులేదు.” అంటూ దీనంగా మొహం పెట్టి కాబోయే వియ్యంకుడు విశ్వనాధాన్ని బ్రతిమలాడాడు వాసుదేవ శాస్త్రి ఉరఫ్ఆడపిల్ల తండ్రి.

“చాలు చాల్లేండి! ప్రపంచంలోని కష్టాలన్నీ వినే ఓపిక ఆదర్శం నాకు లేవు. నా కష్టాలు నేను పడ్డాను.నాకొడుకు మెడిసిన్ పూర్తి చేయటానికి నేనెంతఖర్చుపెట్టాను,ఎన్ని కష్టాలు పడ్డానో మీకు చెప్పానా! చిటికవేస్తే క్యూ లో వస్తాయి మాకు సంబంధాలు. అయినా మా వాడిననాలి మీ అమ్మాయిలో ఏమి చూసాడో తనని తప్ప ఇంకొకరిని చేసుకోనని మంకు పట్టు పట్టటంతో రాజీ పడ్డాము.మేమేమన్నా కట్నం అడిగామా లాంఛనాలు జరపమన్నాం.ఘనంగా పెళ్ళి చేయమన్నాం.మాకు ఒక్కగానొక్క కొడుకు.మా బంధువర్గంలో మేము తలెత్తుకు తిరగాలంటే పెళ్ళన్నా ఘనంగా చేయాలి కదా! మీ అమ్మాయిని కించపరచాలని కాదు కాని మీరే ఆలోచించండి మీ అమ్మాయి మామూలు డిగ్రీ. మా అబ్బాయి ఆప్తమాలజిస్ట్.ఏదో మీ పిల్లకి చదువు పెద్దగా లేక పోయినా,మా అంతస్తుకు తగిన సంబంధం కాకపోయినా,శాఖాబేధం పట్టించుకోకుండా పిల్లబాగుందని సాంప్రదాయం బాగుందని సరే అన్నాము. ఇదే ఆఖరిమాట. అనుకున్న ముహూర్తానికి పెళ్ళి చేస్తారా సరే.లేదంటే మా సంబంధం వదులుకోండి. అందరికీ ఫలానా తేదీ పెళ్ళని చెప్పి ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం ఎన్నో సందేహాలకి అవకాశం అవుతుంది.అయినా ఆడపిల్లవారిని దేబిరించాల్సిన గతి మాకు పట్టలేదు.” అంటూ విశ్వనాధం ఘంటాపదంగా చెప్పాడు. అసలే స్కూలు ఇన్సపెక్టరు.

“అలాగే బావగారు ! ఈ ప్రకృతిని నమ్ముకున్న మాబోటి మధ్యతరగతి రైతుల కష్టాలు తీరుతాయన్న నమ్మకంలేదు.” అన్నాడు వాసుదేవశాస్త్రి.అప్పటికప్పుడు గబ గబా మనస్సులో ఏవో కూడికలు తీసివేతల లెక్కలు వేసుకుంటూ.
తండ్రి భుజానికి ఆనుకొని నుంచున్న శేఖర్ కి విషయం అర్ధం అయీ అవనట్లుంది.”అక్క శివాని నిశ్చితార్థం రోజున బావగారు తనను దగ్గరకు తీసుకొని ఏమి చదవాలనుకుంటున్నావంటే తను ఠకీమని నేను మీ లా డాక్టరు అవుతా అంటం,దానికి బావగారు ‘”వావ్ ! అయితే మనిద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం అంటం,అది వినిఅందరూ గొల్లున నవ్వటం.”ఇంతలోనే ఏమైందో తెలియకపోయినా తమని శాశించే తండ్రి ఇంకొకళ్ళ దగ్గర అంత దీనంగా మాట్లాడటం అస్సలు నచ్చలేదు శేఖర్ కి.
★★★
వాసుదేవశాస్త్రి. తండ్రి అవధానులు పౌరోహిత్యం చేసేవాడు. దానాల క్రింద వచ్చిన గ్రాసం దక్షిణ క్రింద వచ్చిన పది పరకలతో గుట్టుగా కాలంగడిపేవారు.

అవధానుల తండ్రికి 10 ఎకరాల పొలం ఉండేది.అందులో ఏతా వాతా 2ఎకరాలు పోగా మిగిలిన 8 ఎకరాలు నలుగురు కొడుకులకి తలో రెండెకరాలు పంచి కాలం చేసారు.

అవధానులు వృత్తి రీత్యా దానంగా సంక్రమించిన ఇంకొక రెండెకరాలు కలిపితే ఒక్కగానొక్క కొడుకైన వాసుదేవశాస్త్రి కి సంక్రమించింది.అవధాని పౌరోహిత్యం తో పాటు వ్యవసాయం చేసేవారు కూలీల సహాయంతో.
తండ్రి అడుగుజాడల్లో వాసుదేవశాస్త్రి గవర్నమెంట్ ప్రాధమిక పాఠశాలలో పని చేస్తూ వ్యవసాయం వదలక అంతో ఇంతో లాభం వచ్చినప్ఫుడు పరంపరగా వచ్చిన పొలానికి తోడు ఇంకో మూడెకరాలు జోడించాడు.
భార్య జానకి జీతగాళ్ళను కన్నబిడ్డల్లా చూసుకుంటూ వారి అన్నపానాలు సమకూర్చేది. దాంతో వాసుదేవశాస్త్రి కి స్కూలుకు వెళ్ళటం లో ఆటంకం ఉండేది కాదు.శని,ఆదివారాలలో పొలం పనులు చూసుకుంటూ మిగతా రోజుల్లో పొలం పనులు జీతగాళ్ళమీద వదిలేసేవాడు.
వాసుదేవశాస్త్రి కూతురు శివాని చదువులతల్లి.శివానికి IAS చేయాలని సంకల్పం.అందుకే టెంత్ డిస్ట్రిక్ట్ ర్యాంక్,ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వచ్చినా ఇంగ్లీష్ లిటరేచర్ మైన్ గా డిగ్రీలో చేరింది.డిగ్రీకి పట్నం పంపడానికి ఇష్టంలేక పక్క ఊరిలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చేర్చాడు. ఇంకొక రెండు నెలల్లో ఫైనల్ ఎక్జామ్స్.
ఇక పిల్లలు కలగరేమో అనుకునే సమయంలో శేఖర్ పుట్టేడు.శివానికి శేఖర్ర్ కి ఎనిమిదేళ్ళ వ్యత్యాసం.లేక లేక పుట్టడం అందునా తమ్ముడవటంతో అన్నీ తానే అయి చూసుకునేది శివాని శేఖర్ ని. శేఖర్ కి అక్క అంటే ప్రాణం.తనకు ఏంకావాల్సినా అక్కనే అడిగే వాడు.తల్లి వంటపనుల్లో తండ్రి స్కూలు ,పొలం పనుల్లో బిజీ అవటంతో అమ్మా!కంటే అక్కా అనే ఎక్కువగా వచ్చేది శేఖర్ కి.
★★★
రెగ్యులర్ గా జరిగే మెడికల్ కేంప్ కి ఈసారి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇవ్వటం ,చుట్టప్రక్కల చిన్న చిన్న గ్రామాలకి అదే సెంటర్ అవటంతో కళాశాల మూడురోజులు సెలవు ప్రకటించారు. రెండు అంబులెన్సులు,మెడికల్ ఎక్విప్మెంట్స్ తో డాక్టర్ల బృందం దిగింది కళాశాలలో.

రాకేష్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆప్థమాలజిస్ట్. ఇలా చిన్న చిన్న పల్లెల్లో మెడికల్ అవేర్నెస్ కల్పించి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైతే వారిని దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి రమ్మని కంటి ఆపరేషన్ చేసి వాళ్ళకి కళ్జజోడు ఇచ్చి వారిలో ఆనందం చూసి మురిసి పోతుంటాడు.
★★★
వాసుదేవశాస్త్రి వయసు నలభైఎనిమిది సంవత్సరాలు.ఈమధ్య. పిల్లల నోట్సులు దిద్దుతుంటే కళ్ళలో అదేపనిగా నీరు కారటంతో జానకమ్మ పట్నంవెళ్ళి కంటి పరీక్ష చేయించుకోమని ఎంతగొడవ పెట్టినా సమయం లేదంటూ అశ్రధ్ధ చేసాడు వాసుదేవశాస్త్రి.
“నాన్నా !నాన్నా!” అంటూ శివాని గుమ్మంలో అడుగు పెట్టటకుండానే పిలవడం చూసి,
ఏమైందిరాతల్లీ!అంటూ అడిగాడు వాసుదేవశాస్త్రి.

“నాన్నా మా కాలేజ్ కి మూడు రోజులు శెలవిచ్చారు.”అంది ఎంతో సంతోషంతో తండ్రిపక్కన ఉయ్యాల బల్లమీద కూర్చుంటూ.
“అయితే ఏమిటి? శెలవలకి ఏదైనా ప్లాన్ చేసావా?” అంటూ కూతుర్ని మురిపంగా చూస్తూ ముంగురులు సవరించి తల నిమిరాడు వాసుదేవశాస్త్రి.
శెలవ అనంగానే ఏదో ఒక పట్నం వెళ్లి ఆ తారు రోడ్లు, జనసందోహం,బజార్లు చూసి షాపింగ్ చేసి,హోటల్ లో ఏదైనా తినటం శివానికి చాలా ఇష్టం.దానికి తగ్గట్టుగా పిల్లల్ని ఎప్పుడూ నిర్భందించలా వాసుదేవశాస్త్రి.పిల్లలకి ప్రపంచం తెలియాలి.అప్పుడేవాళ్ళు సమాజంతో పాటు అభివృధ్ధి చెందగలరు,సమాజంలో ఇమడగలరని నమ్మినవాడు వాసుదేవశాస్త్రి.ఈ బురద మట్టిరోడ్లని పిల్లలు విసుక్కోకూడదు.అక్కడ జన సందోహం చూసి ‘అబ్బ మన ఊరెంత ప్రశాంతంగా ఉంది.’ అనుకోవాలని వారడిగినప్పుడల్లా చుట్టుపక్కల పట్టణాలన్నీ చూపెట్టాడు.
“నాన్నా!” కోపంతో అరచినంత పని చేసింది శివాని.
“నాన్నా! నేను మాట్లాడుతూనే ఉన్నా నువ్వు కళ్ళుమూసుకొని ఏదో ఆలోచిస్తున్నావు” నిష్టూరంగా అంది శివాని

“ఏం లేదమ్మా! ఆ ఏంచెప్పావు?”

“మాకాలేజీలో మూడురోజులు మెడికల్ కేంప్ ట.అందుకే మూడురోజులు శెలవిచ్చా‌రు.డాక్టర్లు రేపొస్తారుట.అంబులెన్స్ లు రెండు ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్స్, వచ్చాయి.చిన్నసైజు హాస్పిటల్ లా తయారు చేస్తున్నారు కాలేజీని బ్లూ కర్టెన్లతో.అసలు కాలేజీ కంటే కాలేజీ బిల్డింగ్ హాస్పిటల్ గా బాగుంది.అందరికి వైద్యం అందు బాటులో ఉంటుంది.ఆ అన్నట్టు అసలు విషయం మరచే పోయా ఉచితంగా కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తారుట.అవసరమైతే ఆపరేషన్ కూడా ఉచితంగా దగ్గరలో ఉన్న పట్నం హాస్పిటల్ లో చేస్తారుట.నాన్నా నీకెన్నాళ్ళనించో కంట్లో నీరు కారుతోంది పట్నం వెళ్ళి పరీక్ష చేయించు కోవడానికి కుదరటం లేదు.నేను నిన్ను తీసుకెళతా.ఇక్కడే టెస్ట్లు చేయించుకుందుగాని. తరవాత వెంకన్న,మల్లన్న, కర్రన్న తాతలకి కూడా చేయిద్దాం. పాపం వాళ్ళు మనని నమ్ముకునే కదా ఉన్నారు.”అని
గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతున్న కూతుర్ని రెప్పవేయకుండా చూస్తూ “సరే అన్నట్లు తలూపాడు.

జానకమ్మ కూడా సంతోషించింది.శివానిని పక్కకి పిలిచి నుదిటిమీద ముద్దుపెట్టకొని అక్కున చేర్చుకుంది.

మరుసటి దినం భోజనం చేసి కాలేజీ కి బయలుదేరారు తండ్రి కూతుళ్ళు. నేను వస్తానని వెంటపడ్డాడు శేఖర్. పోనీలే వాడికి అన్నీ తెలుస్తాయనికూడా తీసుకెళ్లారు.

“నాన్నా!మీరు ఇక్కడ కూర్చోండి. నేను టోకెన్ తెస్తా” అంటూ వెళ్ళింది శివాని.

టోకెన్ తీసుకొని నీరసంగా వచ్చింది శివాని.
“నాన్నా! మనది 58 నంబరు .ఇప్పుడు 35 నడుస్తోంది.మన నంబరు వచ్చేసరికి సాయంత్రం 5 అవుతుందో 6అవుతుందో.6.30 కల్లా ఆపేస్తారుట.మళ్ళీ రేపేట చూడటం”నీరసంగా అంది శివాని.

మళ్లీ రేపంటే తండ్రి స్కూలుకు శలవు పెట్టడని భయం.

శేఖర్ నాన్న,అక్కలతో వచ్చాడుకాని తోచడం లేదు. విసుగ్గా ఉంది.లోపల ఏంచేస్తారు?ఏమిటి అనే ఉత్సుకతని ఆపుకోలేక
“అక్కా!అలాతిరిగి వస్తాను.” అన్నాడు.

శివానిది కూడా అదే పరిస్థితి.

“పదరా పద ఇద్దరం వెళ్దొద్దాం!నా క్లాస్ రూమ్ ,లైబ్రరీ,ప్లే గ్రౌండు చూపెడతా! ఏం నాన్నా వెళ్లి రామా!”అంది శివాని

“సరే” అన్నాడు వాసుదేవశాస్త్రి.
తమ్ముడికి తన క్లాస్ రూమ్, ప్రిన్సిపాల్ రూమ్,లైబ్రరీ,అన్నీ చూపెడుతూ కంటి పరీక్ష జరుగుతున్న రూమ్ దగ్గరకొచ్చారు.ఏవేవో మషిన్లు,పేషన్ట్స్ ని వాటిముందుకూర్చోపెట్టి అటువైపు డాక్టరు ఏదో అడుగు తున్నాడు వాళ్ళు సమాధానం చెపుతున్నారు.

“అక్కా వాళ్ళు స్కౄ తిప్పుతూ కంట్లోకి ఏదో పంపుతున్నారక్కా!ఇంజెక్షన్ అనుకుంటా!నాన్నకి నొప్పి పుట్తుంది.” అంటూ అమాయకంగా,భయంగా బిక్కమొహం వేసుకొని అక్క వంక చూసాడు శేఖర్.

ఎందుకైనా మంచిదని ఆ టెస్ట్స్ ఎలా ఉంటాయో టెస్ట్స్ అయి వస్తున్న వాళ్ళని అడగాలని బయటకు వస్తున్న పేషంట్స్ దగ్గరకి రెండడుగులు వేసింది శివాని.

“జరుగమ్మా !జరుగు! పేషంట్స్ వస్తుంటే అడ్డంగా వస్తారేం.ఒరేయ్!బుడతోడా ఇక్కడ నీకేం పని?” అంటూ శివానిని, శేఖర్ ని చూసి అరిచాడు అటెండరు.
ఆ అరుపుకి ప్రాధమిక పరీక్ష చేస్తున్న డాక్టర్ రాకేష్ తలెత్తి చూసాడు. ఆ అరుపుకి లోనైనవాళ్ళని చూసి ఒక్కక్షణం కనురెప్ప వేయడం మరచాడు.

“ఈ పల్లెటూళ్ళో ముద్దబంతి పువ్వులాంటి ఈ అమ్మాయి ఎవరు?గంధంరంగు పరికిణీజాకిట్టు మేనిరంగుతో పోటీపడుతున్నాయి.ఆకుపచ్చ వోణీ వదిలేసిన గిరజాల జుట్టు, ఆల్చిప్పల్లాంటి కళ్ళు పట్టుదల సూచించే ముక్కు,నిండైన చిన్ని పెదవులు” వెంటనే తమాయించుకుని , వీర్రాజు!ఎందుకలా అరుస్తావు?నెమ్మదిగా చెప్పవచ్చు కదా” అంటూ మందలించాడు డాక్టర్ రాకేష్.

రాకేష్ చూసిన చూపులకి శివాని భయపడింది.
“అయ్యో!డాక్టరుగారికి కూడా కోపం వచ్చిందేమో!”గబగబా తమ్ముడి చేయిపట్టి లాక్కుంటూ తండ్రి దగ్గరకి వచ్చి కూర్చుంది.

“ఏం అమ్మా !తమ్ముడికి మీ కాలేజీ అంతా తిరిగి చూపించావా?”
“ఆ ! చూపించా నాన్నా!”
“నాన్నా! మరేమో అక్కని” అంటుంటే తమ్మడి నోరు మూసింది మాట్లాడద్దన్నట్లు శివాని.

5గంటలకల్లా వాసుదేవ శాస్త్రి నంబరు రానే వచ్చింది.
తండ్రిని తీసుకుని బిడియం గా తండ్రి పక్కన నుంచుంది శివాని.
“ఎప్పటినుండీ కళ్ళలో నీరు వస్తోంది?”
“చదువుతుంటే వస్తోందా?”
” ఏమైనా డ్రాప్స్ వాడుతున్నారా?”
“డయాబెటిక్కా?” అంటూ ప్రశ్నలు వేసాడు.
“కంట్లో డ్రాప్స్ వేస్తా.ఒక్క అరగంట అలా కూర్చోండి.మిమ్మల్ని పిలుస్తాము. కంటి పరీక్ష చేయాలి అంటూ కంట్లో డ్రాప్స్ వేసి శివాని వైపు తిరిగి” ఒక్క అరగంట కూర్చోండి .” అని
“నెక్స్ట్” అంటూ తనపనిలో నిమగ్న మయ్యాడు డాక్టర్ రాకేష్.

అరగంట తరువాత ‘రండి ‘అంటూ వాసుదేవశాస్త్రి కి సీటు చూపించి మషిన్ సరిచూసుకుంటున్నాడు రాకేష్.
“ఆమషిన్ తో కళ్ళలో ఇంజెక్షన్.ఇస్తారా!” అమాయకంగా అడిగేడు అమర్.

ఒక్కసారిగా.నవ్వాడు రాకేష్.”ఏం చదువుతున్నావు మాస్టర్”
“సెవెంత్ స్టాన్డర్డ్”

“నీ పేరేంటి?” అడిగాడు రాకేష్ వాసుదేవశాస్త్రి గారి కళ్ళను లెన్స్ కి ఎడ్జస్ట్ చేస్తూ.
“శేఖర్”
“ఒ.కె శేఖర్.ఇప్పుడు నాన్న గారి కళ్ళు ఈ మషిన్ ద్వారా టెస్ట్ చేస్తాను. చూడు.
అంటూ టెస్ట్ చేసి లెన్స్ లు మారుస్తూ ఆ మషిన్ గురించి చెప్పాడు.
ఈ మషిన్ ని ‘ఆప్థాలమోస్కోప్’ అంటారు.
ఇది కంటి లోపలి భాగాన్ని పరిశీలించటానికి వాడుతారు.ఇది ట్రీట్మైంటు కాదు. దీని వల్ల కంటి కండిషన్ తెలుస్తుంది.అంటూ తలెత్తిన రాకేష్ అత్యంత శ్రధ్ధతో వింటున్న శివానిని చూసి
“మీరేం చేస్తున్నారు?”అని అడిగాడు

“బి.ఏ. ఇంగ్లీష్ లిటరేచర్ ఫైనల్”అంది శివాని.

“గుడ్ గుడ్” అంటూ వాసుదేవశాస్త్రి వైపు తిరిగి”వాసుదేవశాస్త్రి గారు కళ్ళలో స్లైట్ ఇన్ఫెక్షన్లు ఉంది. కేటరేక్ట్ కూడా రెండు కళ్ళలో ముదిరింది.అందుకే ఆ మసక కళ్ళలో నీళ్ళు.
ఇన్ఫెక్షన్ కి డ్రాప్స్.రాసిస్తాను.త్రీ డేస్ లో నేను కర్నూలు హాస్పిటల్ కి వెళ్తా . ఇది నా నంబర్. మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా సర్జరీ చేయించుకోవటం మంచిది.మీరు ప్లాన్ చేసుకొని ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ అంతా కర్నూలు లోనే ఉంటా. సర్జరీ చేసేద్దాం. యు విల్బి ఆల్రైట్.ఒకరోజు హాస్పిటల్ లో ఉండేట్లు ప్లాన్ చేసు కోండి.ఎందుకంటే ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుంది.లేకపోతే ఒక టు అవర్స లో వెళ్ళి పోవచ్చు.” అన్నాడు డాక్టర్ రాకేష్.

“సీ యు” అంటూ చిలిపిగా. నవ్వుతూ శివాని కి చేయి ఊపాడు రాకేష్.
“మెస్మరైజింగ్ స్మైల్. ఎంత చక్కగా విసుక్కోకుండా అన్నీ వివరంగా చెప్పాడు.డాక్టరు అంటే ఇలా ఉండాలి అనేట్టు ఉన్నారు. మనసులోరాకేష్ ముద్రని విదిలించుకో ప్రయత్నిస్తూ” అనుకుంది శివాని.

★★★

వాసుదేవశాస్త్రి ఇక ఆలస్యం చేయకుండా స్కూలుకు సెలవు పెట్టి కుటుంబాన్ని తీసుకుని కర్నూలు బావ మరది ఇంటికెళ్ళాడు.
స్వంత మనిషన్నట్లు వాసుదేవశాస్త్రిగారి కేటరాక్ట్ ఆపరేషన్ సక్సైసఫుల్ గా చేసాడు రాకేష్.

“చెకప్ కి వారం తరవాత రండి.మూడు నెలల.తరువాత రెండో కన్నుకి చేద్దాం.కంటి డ్రాప్స్! క్రమం తప్పకుండా వేయండి.క్లీనింగ్ కి స్టెరిలైజ్డ్ కాటన్ మాత్రమే వాడండి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కాల్ చేయండి అంటూ ఇంకో నంబరు ప్రిస్క్రిప్షన్ మీద రాసిచ్చాడు. అన్ని జాగ్రత్తలూ శివానికి చెప్పాడు .”డాక్టర్ రాకేష్.
మధ్యలో.చెకప్ కి తండ్రి తో వెళ్ళడంతో రాకేష్ అంటే ముందున్న బిడియం భయం పోయి స్నేహంగా మాట్లాడేది శివాని.
“డాక్టర్ ! మాజీతగాళ్ళు వెంకన్న,మల్లన్న,కర్రన్న లను చెకప్ కి తీసుకుని రానా! అంది. శివాని

“నా టార్గెట్ ఇప్ఫటికి పూర్తి అయింది నెక్సట్ టార్గెట్ లో అందరి నీ తీసుకురండి. జంతువులని తప్పించి ” అంటూ నవ్వాడు రాకేష్. వాసుదేవశాస్త్రి కూడా మనస్ఫూర్తిగా నవ్వారు.
“ఏమనుకోకు బాబు!దానికి మనసులోనిది ఉన్నదున్నట్లు మాట్లడటమే గాని ఎలా మాట్లాడాలో తెలియదు. పల్లెటూరి వాతావరణంలో పెరిగింది.” అంటూ సర్ది చెప్పబోయారు. వాసుదేవశాస్త్రి .
” నొ నో ఐ లవ్ ఇట్, ఐలవ్ ఇట్. ” అంటూ వాసుదేవశాస్త్రి కి షేక్ హేండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.

“ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇట్”గోణుక్కున్నట్టు గా నెమరు వేసుకుంది శివాని.
మూడు నెలలు కావొస్తుందనగా రాకేషే కాల్ చేసాడు వాసుదేవశాస్త్రి గారికి.

“సర్! ఐయామ్ డాక్టర్ రాకేష్ ఆప్థమాలజిస్ట్ స్పీకింగ్”

“నమస్కారం డాక్టరు గారు.ఎంత మాట మీరే చేసారు.నేనే చేద్దామనుకున్నా!”అన్నారు తడబడుతూ వాసుదేవశాస్త్రి.
“నో ప్రోబ్లమ్. నేను ఈ.నెలంతా కర్నూల్ హాస్పిటల్ లో ఉంటా.మీ ఆపరేషన్ అయి త్రీ మంత్స్ అయింది కదా! ఏమైనా ప్రోబ్లమ్ ఉందా!”

“ఏమీ లేదు.కానీ స్ఫైక్ట్స్ తేడాగా ఉండి చాలా ఇబ్బందిగా ఉంది.”
“నో వర్రీస్!రెండో కన్ను ఆపరేషన్ తరువాత కరెక్ట్ స్పెక్ట్స్ ఇస్తాం.ఇప్పుడు మీరు వాడుతున్నవి టెంపరరీ.డేట్ ఫిక్స్ చేసుకోండి.నమస్తె.”అంటూ ఫోన్ పెట్టేసాడు.

“ఎవరండీ” అంది జానకి.
“మన కంటి డాక్టర్ గారు.రెండో కన్నుకు కూడా కేటరాక్ట్ ఆపరేషన్ చేయాలికదా! మళ్లీ కర్నూలు వచ్చారట.ఎప్పుడో చెప్పమన్నారు.” ఏమంటావన్నట్లు చూసాడు జానకి వైపు.

“”చేయించుకోండి.ఇంత మంచి డాక్టరు మనకు దొరకటం చాలా అదృష్టం.”అంటూ రాకేష్ మంచితనాన్ని పొగిడింది జానకి.

ప్రక్క గదిలో ఉన్న శివాని కి తల్లి, తండ్రి డాక్టరు అనంగానే గుండె బరువెక్కింది.ఏదో అలజడి. వాళ్లు రాకేష్ ని పొగుడుతూ ఉంటే ఏదో ఆనందం.

డేట్ నిర్ణయించుకొని రెండవ కంటి ఆపరేషనుకు
కర్నూలు బయలు దేరారు.శేఖర్ కి పరీక్షలు ఉండటంతో జానకి ఉండి పోవలసి వచ్చింది.

అన్నగారికి ఫోన్ చేసి” మీబావ శివాని వస్తున్నారు ఆపరేషను చేయించుకోవటానికి

దగ్గరుండి చూసుకోరా “అని చెప్పి బాధ్యత తీర్చుకుంది.
ఆపరేషన్ అయి వస్తుంటే రాకేష్ వాసుదేవశాస్త్రి ని నడిపించకుంటూ వచ్చి లాంజ్ లో కోర్చోపెట్టాడు.

“అంకల్! ఒక చిన్నమాట మా ఫాదర్ మీతో మాట్లాడలనుకుంటున్నారు”అన్నాడు రాకేష్.

“అంకల్!”అన్న పిలుపుకి గతుక్కుమన్నాడు వాసుదేవశాస్త్రి.ఏదో శంకించింది మనస్సు.కానీ పట్టించుకోలేదు.
వారం తరువాత మరల చెకప్ కి వెళ్ళి నప్పుడు,
“అంకల్! నేను మీ అమ్మాయి శివానిని ఇష్టపడుతున్నా!మీకభ్యంత‌రం లేక పోతే మ్యారేజ్ చేసుకుంటా!ఎంతో ఆలోచించి మీతో చెపుతున్నా”అని రాకేష్ ఆదుర్దాగా వాసుదేవశాస్త్రి వైపు చూసాడు రాకేష్.

వాసుదేవశాస్త్రి గారు షాక్ లోంచి తేరుకొని,”అతి కష్టం మీద అంతస్తులు,మీతల్లితండ్రుల ఆంత‌ర్యం తెలుసుకో బాబు.అమ్మాయి ఇష్టా ఇష్టాలు కూడా తెలుసుకోండి బాబు.”అన్నారు.

తలతిప్పిచూసిన వాసుదేవశాస్త్రి కి సిగ్గుతో తల వంచుకున్న చిట్టి తల్లి శివానిని చూసి ఒక నిట్టూర్పు వదిలారు.

★★★

అసలు కధ ఇప్పుడు మొదలైంది.
రాకేష్ శివాని గురించి తండ్రి విశ్వనాధంతో చెప్పినప్పుడు రంకెలు వేయలేదు సరికదా మూడు రోజులు మాట్లాడ లేదు.
మూడవ రోజు,”నీ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందా రాకేష్!”అన్నారు గంభీరంగా. ” నీతో సమానంగా చదువుకున్నవాళ్ళు ఎవరైనా నాకభ్యంతరం లేదు.” అన్నారు విశ్వనాధం.

“నాకు ఆమె నచ్చింది”ఇంకో ఆలోచనకి అవకాశం లేదు.అంటూ గది లోంచి వెళ్ళి పోయాడు.

చిన్నప్పటినించీ రాకేష్ పట్టుదల తల్లిదండ్రుల కి
తెలుసు.అనుకున్నది సాధించడం అతని లక్ష్యం.

చేసేది లేక విశ్వనాధం పెళ్ళి చూపులకి వస్తున్నామని ఫోన్ చేసాడు.
రాకేష్ తల్లి శారదకి ఇప్పుడే పెళ్ళొద్దు అన్న బాబు ని ఆకట్టుకున్న ఆ అదృష్టవంతురాలని చూడటానికి మనస్సు ఉవ్వీళ్ళూరుతున్నది.

★★★

ఎంతో హడావుడిగా మండువా ఇల్లు ని అందంగా సర్దారు అందరూ కలసి. శేఖర్ కిఆనందం అంతా
ఇంతా కాదు.అక్క చెప్పినట్టు అన్నీ చేస్తున్నాడు.

(సశేషం)

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శతక పద్యాలు. జీవన మా ర్గ సూచికలు.

మన మహిళామణులు