ఫలములనిచ్చే పచ్చని చెట్టై
నీడగ నిలుచును నాన్న
ప్రకృతి మురిసే చల్లని చినుకై
నిండుగ సాగును నాన్న
అలలతో ఎగిసే
నదుల రీతిగ
జీవం పోసును నాన్న
ప్రాణ వాయువే తానై వచ్చి
జీవితమిచ్చును నాన్న
జీవిత నౌకను ఒడ్డుకు చేర్చే
జీవన సారథి నాన్న
చీకటి వెలుగుల దారులందున
వెన్నెల నింపును నాన్న
అమృతమంతా
మనసున నింపి
ప్రేమగ మార్చును నాన్న
అడుగడుగున
నడిచే నడతను దిద్దే క్రమశిక్షణ రూపం నాన్న
లోకం తెలియని
పిల్లల లోకం నాన్న
లోకం పోకడ తెలిపే
జ్ఞానపు
దారులు చూపును నాన్న.
శ్రమ యంత్రం తానై
బ్రతుకు పంటకు
స్వేదపు చినుకును
సాగుగ మార్చే
అభినవ రైతే నాన్న