నాన్న… నాన్నే

కవిత

  1. ఆకాశం కన్నా ఎత్తైనది

సముద్రం కన్నా లోతైనది
భూగోళం కన్నా బరువైనది
నాన్న పదవి…

కొడుక్కి తండ్రికి
మధ్యలో
దరహాసాలే ఇతిహాసాలు…

అన్నీ ఇచ్చేవాడు దేవుడు
ఆ దేవుడే నాన్న…

నాన్న ఓ భగవద్గీత
నాన్న ఓ రామాయణం
నాన్న ఓ భారతం
నాన్నే అన్నీ తెలిపే గురు స్వరూపం…

నాన్నే కదా
కష్టాల రాళ్ళను లోపలదాచి
పైకి నవ్వుల ఒరవడితో పరుగెత్తే నది…

నాన్నే కదా
కన్నీళ్ళ సముద్రాలను
మనసులోయలో దాచి
కళ్ళతీరంతో ఆకర్షించే మది…

నాన్నే కదా
అవరోధాల చీకట్లో నలుపును భరించి
అన్ని రంగుల హరివిల్లు బ్రతుకును ప్రసాదించే భారాల గది…

నాన్న…
అమ్మ కొంగుచాటు కొంగుబంగారమై
ప్రతి కొడుకు చాటు
కష్టపు మెరుపై
మిగిలిపోయే మమకారపు గౌరవం…

క్షణం క్షణం
మరణందాక నిత్య రణం చేసే
నాన్నకు పాదాభివందనం
నాన్న ఆకాంక్ష ఆరాటమే
పిల్లల అభివృద్ధి తోరణం..

Written by Y.Sujatha Prasad

వై. సుజాత ప్రసాద్,
ఊరు - లచ్చపేట,
జిల్లా సిద్దిపేట,
చరవాణి - 9963169653.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాన్న

నేరమూ – శిక్ష – The Court