మధురమైన అనుభూతి నాన్న ఆరడుగుల గాంభీర్యం నాన్న నడిచొచ్చే మేరునగం నాన్న మనసున్న కరుణరసం నాన్న ప్రేమించే ప్రియనేస్తం నాన్న
ఊహ తెలిసిన నాకు
ప్రపంచాన్ని చదవమంటూ
పుస్తకాల దొంతరలు
నా ముందు ఉంచి
చదవడంపై ఆసక్తిని పెంచిన
నాన్నే నా సాహిత్యభిలాషుకు వారధి
నాన్న ముందు అలగడం
నాకెంతో ఇష్టం…
బతిమాలి అలక తీర్చి
అన్నం ముద్దలు నోటికి అందించి తల నిమరడం ఓ తీపి జ్ఞాపకం…
ప్రేమించే గుణం అతని బలహీనత ఐనప్పుడు దాన్ని ఆయుధంగా మలుచుకుని కోరినవి దర్జాగా సాధించుకున్న సందర్భాల
చిట్టాలు బోలెడు
నాన్నతో పడే చిరుగొడవల్లో
తను ఓడే సమయాన చిన్నబోయిన నాన్న ముఖాన్ని చూసి ఆట పట్టిస్తూ అల్లరి చేష్టలతో నవ్వించడం నాకు ఇంకా గుర్తే…
అలగడంలో నాన్న కూడా దిట్టే! తనకు నచ్చని విషయాలపై చర్చలకు తావిచ్చామా అలకబూని మంచం ఎక్కేస్తాడు నిష్టూరంగా పాపం నాన్న!ఎంతైనా భోజన ప్రియుడు కదా అలరించే అధరువుల పళ్ళెం ముందుంచితే నవ్వేసి ఆరగిస్తాడు ఆనందంగా
నాన్న పోలికే నేను నన్ను నాన్నా! అంటూ వాళ్ళ నాన్నను రోజూ తలుచుకోవడం నాన్నకెంతో ఇష్టం
నాకు జ్ఞాపకంగా మిగలడం
నాన్నకు నచ్చలేదేమో!
తాను కనుమరుగై
నా కంటిపాపగా మారి
నా ఒళ్ళో చంటిపాపగా
కేరింతలతో కొత్తగా అమ్మా! అంటూ పిలుపు మార్చాడు నాన్న తృప్తిగా…
ఐనా నాన్నా! నా తలపుల్లో నువ్వెప్పటికీ వాడని సుమగుచ్ఛానివి